‘‘మాకు సముద్రమే ఇల్లు’’- నెలల తరబడి నౌకల్లోనే ఉండే నావికుల జీవితాలు ఎలా ఉంటాయి?

నౌకలో పనిచేయడం

ఫొటో సోర్స్, N.Srinu

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ప్రపంచ దేశాల మధ్య సరుకులను రవాణా చేసే నౌకల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిని సీఫేరర్లు, లేదా మెరైనర్లు అంటారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నౌకలలో 3 లక్షలమంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు.

ప్రపంచ నౌకా సిబ్బందిలో 17 శాతం మంది భారతీయులే. ప్రపంచంలోని ప్రతి ఐదుగురు నావికుల్లో ఒకరు భారతీయులే.

జూన్ 9న ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక సెట్టెబెల్లోపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు మరణించారు. అందులో విశాఖకు చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేశ్ కూడా ఉన్నారు. దీంతో అసలు సముద్ర నావికుల జీవితం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది

ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముకగా నిలిచే ఈ ఉద్యోగం వెనుక ఎలాంటి జీవితం ఉంటుంది? దీనిపై కొంతమంది తెలుగు సీఫేరర్లతో బీబీసీ మాట్లాడింది.

మర్చంట్ నేవీలో ఉద్యోగం "యుద్ధానికి వెళ్లినట్టే" ఉంటుందని రిటైర్డ్ సీఫేరర్ షావుకారి నాగేశ్వరరావు బీబీసీతో అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నౌకలో జీవితం

ఫొటో సోర్స్, N. Srinu

తొమ్మిది నెలలు సముద్రంలోనే

మంచి ఆదాయం, ప్రపంచాన్ని చూసే అవకాశం, కుటుంబానికి ఆర్థిక భరోసా...ఇవే చాలా మందిని ఈ రంగం వైపు ఆకర్షిస్తాయి.

''ట్రైనీ స్థాయిలో నెలకు 40 వేలరూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ అది లక్ష రూపాయలు దాటొచ్చు. కొన్ని పోస్టుల్లో నెలకు రూ.2,35,000కుపైగా సంపాదించే అవకాశం ఉంది'' అని సీఫేరర్లు చెబుతున్నారు.

అయితే ఈ ఆదాయం కోసం ఒకసారి నౌక ఎక్కితే ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు సముద్రంలోనే గడపాల్సి ఉంటుంది.

అర్జాల చంటి
ఫొటో క్యాప్షన్, అర్జాల చంటి

సముద్రమే ప్రపంచం...

"సీఫేరర్లకు సముద్రమే ఇల్లు" అని అర్జాల చంటి బీబీసీతో అన్నారు.

చంటిది శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలంలోని కొత్తరేవు గ్రామం. ఇది తీర ప్రాంత గ్రామం. ఇంటర్ వరకే చదువుకున్న చంటి...మర్చెంట్ నేవీ వల్ల తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వగలిగానని చెప్పారు.

ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించే క్రమంలో వారాలు, నెలల తరబడి సముద్రంలోనే ఉంటారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోడానికి ఇంటర్‌నెట్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది.

"బయట ఏం జరుగుతుందో మాకు ఇంటర్‌నెట్ ద్వారానే తెలుస్తుంది. 24 గంటలూ షిప్‌లోనే ఉంటాం" అని మర్చెంట్ నేవీ నౌకలలో సీఫేరర్‌గా పని చేస్తున్న అర్జాల చంటి బీబీసీకి చెప్పారు.

చాలా నౌకల్లో శాటిలైట్ ఇంటర్‌నెట్ ఉంటుంది. కానీ దానికీ పరిమితులుంటాయి. కొన్ని కంపెనీలు ‘‘నెలకు 8 నుంచి 20 జీబీ వరకు మాత్రమే డేటా ఇస్తాయి’’ అని సీఫేరర్లు చెబుతున్నారు.

"అందుకే ఇంటర్‌నెట్‌ను చాలా పరిమితంగా, జాగ్రత్తగా వాడుకుంటాం. పరిమితికి మించి వాడేస్తే మళ్లీ దొరకదు. అవసరమైనా పక్కోడు ఇవ్వడు. నీ డేటాని బంగారంలా వాడుకోవాలి" అని చంటి చెప్పారు.

సముద్ర జీవితం

ఫొటో సోర్స్, N. Srinu

తుఫాన్లు, అలలు, ప్రమాదాలు...

సముద్ర జీవితం అంటే కేవలం ప్రయాణం కాదు. తుఫాన్లు, భారీ అలలు, అనిశ్చిత పరిస్థితులు కూడా దానిలో భాగమే.

ఒకసారి 18 రోజుల పాటు భారీ అలల మధ్య చిక్కుకుపోయామని రిటైర్డ్ సీఫేరర్ నాగేశ్వరరావు తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పారు.

"ఆ సమయంలో సరిగా తినలేకపోయాం. పాత్రలు కూడా ఒకచోట నిలవలేదు. క్యాబిన్‌లో ఉన్నా పడిపోతామేమో అనిపించేది" అని ఆయన చెప్పారు.

"మన చుట్టూ సముద్రం తప్ప ఇంకేమీ ఉండదు. అందుకే భయం కూడా ఉంటుంది" అని అర్జాల చంటి అన్నారు.

సముద్రం, వాణిజ్య నౌక, ప్రమాదాలు, అలలు, మెరైనర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షిప్పునుంచయినా, సముద్రంనుంచయినా ప్రమాదం రావొచ్చని సీఫేరర్లు అంటున్నారు.

సముద్రం కంటే షిప్పే ప్రమాదకరం...

ప్రమాదం ఎప్పుడూ సముద్రం నుంచే రావాల్సిన అవసరం లేదు.

ఒకసారి నౌకలోని ట్యాంక్‌లో పడిపోయిన ఘటనను నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. మరోసారి మరమ్మతుల సమయంలో మంటలు చెలరేగడంతో తృటిలో ప్రమాదం తప్పిందని చెప్పారు.

అందుకే ఈ రంగంలో చేరే ముందు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అగ్నిప్రమాదాలు, మునిగే పరిస్థితులు, అత్యవసర రక్షణ చర్యలపై శిక్షణ తప్పనిసరి అని చెప్పారు.

సముద్రం, వాణిజ్య నౌక, ప్రమాదాలు, అలలు, మెరైనర్లు

ఫొటో సోర్స్, M. Vasudevarao

అనారోగ్యం బారిన పడితే?

నెలల తరబడి సముద్రంలో ఉండే సీఫేరర్లకు ఆరోగ్య సమస్యలు వస్తే ప్రత్యేక వ్యవస్థలుంటాయి.

నౌకలోని అధికారులు కంపెనీ వైద్యులతో సంప్రదిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా రోగిని తరలించే ఏర్పాట్లు కూడా ఉంటాయని సీఫేరర్లు చెబుతున్నారు.

"కంపెనీ డాక్టర్స్ ఉంటారు. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే షిప్ లోని సెకండ్ ఆఫీసర్‌కి చెప్తాం. ఫలానా ర్యాంక్ ఆఫీసర్‌కి హెల్త్ బాగోలేదని ఆయన కంపెనీకి మెయిల్ పెడతారు.. ఏదైనా సరే కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఏదీ సొంతంగా నిర్ణయం తీసుకోకూడదు. ఒకవేళ అత్యవసరం అయితే హెలికాప్టర్ రప్పిస్తారు. షిప్ నుంచి సమీప పోర్టుకు తరలించి...అక్కడ నుంచి ఆసుపత్రులకు తరలిస్తారు" అని సీఫారర్ అర్జాల చంటి బీబీసీతో చెప్పారు.

షిప్పులు

ఫొటో సోర్స్, N. Srinu

పైరేట్ల భయం ఉందా?

ప్రపంచంలోని అనేక సముద్ర మార్గాల్లో పైరేట్ల ముప్పు ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు.

''కొన్ని ప్రాంతాల్లో పైరేట్లు నౌకలను చేరుకునేందుకు ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో అదనపు భద్రతా చర్యలు తీసుకుంటారు'' అని నాగేశ్వరరావు చెప్పారు.

ప్రపంచంలోని అనేక సముద్ర మార్గాల్లో పైరేట్ల ముప్పు ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు. ముఖ్యంగా ఆఫ్రికా తీర ప్రాంతాలకు సమీపంలోని కొన్ని జలాల్లో గతంలో పైరేట్ల దాడులు తరచూ జరిగేవని సీఫేరర్లు చెబుతున్నారు.

నౌకలను చేరుకునేందుకు పైరేట్లు చిన్న పడవలను ఉపయోగించే సందర్భాలు ఉండేవని నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు.

"అలాంటి ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో నౌకలపై అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తారు. డెక్ చుట్టూ ప్రత్యేక అడ్డంకులు ఏర్పాటు చేయడం, 24 గంటల నిఘా నిర్వహించడం, భద్రతా సిబ్బందిని నియమించడం వంటి చర్యలు తీసుకుంటారు. ప్రమాద సూచనలు కనిపించిన వెంటనే సమీప దేశాల కోస్ట్ గార్డులు, నౌకాదళాలకు సమాచారం అందించే వ్యవస్థలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, సముద్ర మధ్యలో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో పైరేట్ల ముప్పు గురించి ఆలోచిస్తే భయం సహజమే" అని సీఫారర్లు చెబుతున్నారు.

"భయమనిపిస్తుంది. కానీ భద్రతా ఏర్పాట్లు కూడా ఉంటాయి" అని షావుకారి నాగేశ్వరరావు తెలిపారు.

చాలా నౌకల్లో జిమ్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉంటాయి. బార్బెక్యూ పార్టీలు, చిన్న చిన్న వేడుకలు కూడా నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, N.Srinu

ఫొటో క్యాప్షన్, చాలా నౌకల్లో జిమ్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉంటాయి. బార్బెక్యూ పార్టీలు, చిన్న చిన్న వేడుకలు కూడా నిర్వహిస్తారు.

నౌకలో జీవితం ఎలా ఉంటుంది?

నెలల తరబడి సముద్రంలో ప్రయాణించినా, సీఫేరర్లు తమకు తామే ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. పని గంటలు ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి నౌకల్లో వివిధ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

చాలా నౌకల్లో జిమ్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉంటాయి. బార్బెక్యూ పార్టీలు, చిన్న చిన్న వేడుకలు కూడా నిర్వహిస్తారు.

కొన్ని పెద్ద నౌకల్లో క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఆడుకుంటామని చంటి, నాగేశ్వరరావు చెప్పారు.

"షిప్పులో ఎవరి క్యాబిన్ వాళ్లిది. ఈవెనింగ్ జిమ్ చేసుకోవచ్చు. మెస్ రూంలో పార్టీలు చేసుకోవచ్చు. 15 రోజులకు, నెలకు ఒకసారి బార్బెక్యూ పార్టీలు కూడా ఉంటాయి" అని చంటి చెప్పారు.

ఖాళీ సమయాల్లో సహోద్యోగులతో కలిసి కబుర్లు చెప్పడం, సినిమాలు చూడడం, వ్యాయామం చేయడం వంటి పనులతో సమయం గడుపుతారు. ప్రత్యేక సందర్భాల్లో పుట్టినరోజు వేడుకలు, పండుగల సంబరాలు కూడా చేసుకుంటామని అన్నారు.

"మా పెద్ద షిప్‌లో ప్రతి శనివారం క్రికెట్ ఆడేవాళ్లం. స్విమ్మింగ్ పూల్, టేబుల్ టెన్నిస్, జిమ్ ఉండేవి. ఎక్కువ రోజులు సెయిలింగ్ ఉంటే ప్రతి 15 రోజులకు బార్బెక్యూ పార్టీ ఏర్పాట్లు ఉంటాయి" అని సీఫేరర్స్ చంటి, నాగేశ్వరరావులు చెప్పారు.

వందలాది కిలోమీటర్ల దూరంలో భూమి కనిపించకపోయినా...నౌకనే తమ రెండో ఇంటిగా మార్చుకుంటామని వారు చెప్పారు.

సముద్రం, వాణిజ్య నౌక, ప్రమాదాలు, అలలు, మెరైనర్లు
ఫొటో క్యాప్షన్, నాగేశ్వరరావు భార్య ఉషారాణి

సముద్రంలో సీఫేరర్, ఒడ్డున ఫ్యామిలీ ఎదురుచూపు

సముద్రంలో ఉన్న వ్యక్తి కథ ఎంత కఠినమో, ఒడ్డున ఎదురుచూసే కుటుంబ సభ్యుల కథ కూడా అంతే భావోద్వేగ భరితంగా ఉంటుంది.

గతంలో రెండు నెలలకు ఒకసారి మాత్రమే సమాచారం అందేదని సీఫేరర్ నాగేశ్వరరావు భార్య ఉషారాణి గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు వీడియో కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యాలతో పరిస్థితి మారినా...కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల వచ్చే ఒంటరితనం మాత్రం అలాగే ఉందని చెప్పారు.

"ఇంటికి పెద్దదిక్కైన యాజమాని ఇంటి వద్ద లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. కానీ అవన్నీ భరించాం" అని నాగేశ్వరరావు భార్య ఉషారాణి చెప్పారు.

ఉషారాణి, నాగేశ్వరరావు తమ ఇద్దరు కొడుకులకు సీఫేరర్లుగా శిక్షణ ఇప్పించారు. అందులో ఒకరు ఏడేళ్లుగా సముద్రంలో విధులు నిర్వహిస్తుంటే...మరో కుమారుడు సీఫేరర్‌గా జాయినైన మూడు నెలలకే ఆ ఉద్యోగం నచ్చక సాప్ట్ వేర్ రంగంలో స్థిరపడ్డారు.

నాగేశ్వరరావు
ఫొటో క్యాప్షన్, నాగేశ్వరరావు

డబ్బు ఎక్కువే కానీ...

రిస్క్, ఒంటరితనం, కుటుంబానికి దూరంగా నెలలు తరబడి గడపాల్సిరావడం వంటి పరిస్థితులున్నా వేలాదిమంది ఈ ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నారు. కారణం ఇది తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తోందని వారు చెబుతున్నారు.

"మర్చంట్ నేవీలో పనిచేశాను కాబట్టే ఈ రోజు సంతోషంగా ఉన్నాను" అని నాగేశ్వరరావు అంటారు.

నాగేశ్వరరావు తాను కట్టుకున్న రెండతస్థుల భవనాన్ని, ఆ భవనం ముందు పార్కు చేసిన కారు, ఎన్ ఫీల్డ్ మోటారు సైకిల్‌ను చూపిస్తూ...ఇవన్నీ మర్చెంట్ నేవీ వల్లే అని చెప్పారు.

ఒక్క వాక్యంలో ఆయన ఈ ఉద్యోగ సారాంశాన్ని చెప్పేశారు.

"ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. డబ్బులు ఎక్కువ వస్తాయి. ఈ రెండింటికీ బానిస అవ్వాలి" అని ముగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)