‘హార్ముజ్ జలసంధి’ నుంచి ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ వరకు.. ఇరాన్-అమెరికా మధ్య చర్చల ప్రతిష్టంభనకు 5 ప్రధాన కారణాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, బీబీసీ ఉర్దూ
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
ఇరాన్-అమెరికా సంబంధాలు గత కొన్ని దశాబ్దాలలో అత్యంత క్లిష్టమైన ప్రతిష్టంభనలో చిక్కుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వైపు నుంచి ఇరాన్‌పై దాడులు ప్రారంభమై, సున్నితమైన కాల్పుల విరమణ ఒకటి అమలులోకి వచ్చిన పది వారాల తర్వాత కూడా ఇరుపక్షాలు ఎటువంటి ముగింపునకు రాలేకపోయాయి.
ప్రతిపాదనల దశలోని ఐదు పెద్ద అంశాలు ఇరాన్, అమెరికా మధ్య విభేదాలకు ప్రధాన కారణంగా నిలిచాయి.
వీటిలో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ కార్యక్రమం, ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వల భవిష్యత్తు, హార్ముజ్ జలసంధిపై నియంత్రణ - రవాణా పునరుద్ధరణ, ఈ ప్రాంతంలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు, బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమం ఉన్నాయి.
ఇటీవలి అమెరికా ప్రతిపాదనలపై ఇరాన్ స్పందనను 'పూర్తిగా అంగీకరించలేనిది' అని డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా ప్రతిపాదిత 14 సూత్రాల ప్రణాళికలో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ కార్యక్రమాన్ని నిలిపివేయడం, 60 శాతం ఎన్‌రిచ్ చేసిన యురేనియం నిల్వలను ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టడం లేదా పరిమితం చేయడం, హార్ముజ్ జలసంధిని ఎటువంటి షరతులు లేకుండా తెరవడం వంటివి ఉన్నాయి.
ఇతర అంశాలపై చర్చలకు మార్గం సుగమం చేసేందుకు గానూ ఈ ప్రణాళికలో 30 రోజుల కాలపరిమితిని కూడా చేర్చారు. వీటిలో ఈ ప్రాంతంలోని ఇరాన్ మద్దతు గల గ్రూపులు, ఇరాన్ క్షిపణి కార్యక్రమం అంశాలు కూడా ఉన్నాయి.
మరోవైపు, ఈ ప్రతిపాదనలను అంగీకరించడం అంటే యుద్ధంలో లొంగిపోవడంతో సమానమని ఇరాన్ భావిస్తోంది.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద సైనిక శక్తులకు వ్యతిరేకంగా తాము బలంగా నిలబడగలిగామని ఇరాన్ భావిస్తోంది.
ఈ కారణంగానే ఇరాన్ కొన్ని మినహాయింపులను పొందేందుకు ప్రయత్నిస్తోంది. నివేదికల ప్రకారం, ఇరాన్ తన సమాధానంలో.. తక్షణ కాల్పుల విరమణ, అన్ని ఆంక్షల తొలగింపు, నష్టపరిహారం చెల్లింపు, హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించడం, అణు చర్చలను తర్వాత చేపట్టడం వంటి డిమాండ్లను ముందుంచింది.
తాము సేకరించిన యురేనియంలోని కొంత భాగాన్ని తక్కువ స్థాయికి తీసుకురావడానికి లేదా ఏదైనా మూడో దేశానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ తెలిపింది. అయితే, మొత్తం నిల్వలను అప్పగించడానికి మాత్రం అది నిరాకరించింది.
ఈ ఐదు పెద్ద వివాదాస్పద అంశాలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ప్రభావం కేవలం ఇరాన్, అమెరికాలపైనే కాకుండా ప్రపంచ ఇంధన భద్రత, చమురు ధరలు, మిడిల్ ఈస్ట్‌లో సుస్థిరతపై కూడా పడుతోంది.

ఫొటో సోర్స్, Press Association
1) యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్రోగ్రామ్
ఇరాన్, అమెరికా మధ్య చర్చల్లో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ అనేది అత్యంత కీలకమైన, పాత వివాదాస్పద అంశం. ఎందుకంటే, అమెరికా కోణంలో ఇది అణ్వాయుధాన్ని తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక సామర్థ్యానికి ఇరాన్ ఎంత దూరంలో ఉందనే ప్రశ్నతో ముడిపడి ఉంది.
సహజ సిద్ధమైన యురేనియం ఒక్కటే అంత ప్రభావవంతంగా ఉండదు. ఎన్‌రిచ్‌మెంట్ ప్రక్రియ అనేది యురేనియంలోని శక్తిమంతమైన భాగం 'ఐసోటోప్ 235' పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా దీనిని అణు రియాక్టర్లలో ఉపయోగించగల ఇంధనంగా మార్చవచ్చు. అయితే, యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ నిష్పత్తి పెరిగేకొద్దీ, దానిని సైనిక అవసరాలకు ఉపయోగించే ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఇరాన్ అణు నిరోధక ఒప్పందం (న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ - ఎన్‌పీటీ) కింద విద్యుత్ ఉత్పత్తి, పరిశోధన, వైద్య అవసరాల వంటి శాంతియుత ప్రయోజనాలకు యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ చేపట్టే తన హక్కును గట్టిగా సమర్థించుకుంటోంది.
మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ కార్యక్రమాన్ని ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి సాకుగా భావిస్తున్నాయి.
సాధారణంగా మూడు నుంచి ఐదు శాతం ఎన్‌రిచ్‌మెంట్ స్థాయిని విద్యుత్ ప్లాంట్ల కోసం ఉపయోగిస్తారు. కాగా 20 శాతం ఎన్‌రిచ్‌మెంట్ చేసిన యురేనియాన్ని పరిశోధనల కోసం ఉపయోగిస్తారు.
కానీ, అంతకు మించిన ఎన్‌రిచ్‌మెంట్ స్థాయి అణ్వాయుధాల తయారీ కోసం యురేనియాన్ని ఉపయోగించే మార్గాన్ని తెరుస్తుంది.
గత వేసవిలో జరిగిన 12 రోజుల యుద్ధం నాటికి ఇరాన్ 60 శాతం ఎన్‌రిచ్‌మెంట్ స్థాయికి చేరుకుంది.
అమెరికా, ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం.. దీనివల్ల ఇరాన్ 'న్యూక్లియర్ బ్రేక్‌అవుట్' (అణ్వాయుధాన్ని తయారు చేసే) సమయం కేవలం కొన్ని వారాలకు తగ్గిపోయింది.
ఇదే సమయంలో, ఇరాన్ వేలాది అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేసిందని, భారీ నిల్వలను సమకూర్చుకుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ప్రకటించింది.
అయితే నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల తర్వాత ఎన్‌రిచ్‌మెంట్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి, అనేక పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
యుద్ధాన్ని ముగించడానికి ఇటీవలి చర్చల్లో డోనల్డ్ ట్రంప్ ఇరాన్ దీర్ఘకాలం పాటు, అంటే దాదాపు 20 సంవత్సరాలు లేదా శాశ్వతంగా యురేనియం సుసంపన్నత కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందకూడదు అని అన్నారు.
మరోవైపు, ఇరాన్ శాంతియుత ప్రయోజనాల కోసం తాత్కాలిక ఆంక్షలను, తక్కువ సుసంపన్నత స్థాయిని, అంతర్జాతీయ పర్యవేక్షణను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడాన్ని లేదా కార్యకలాపాలను విదేశాలకు తరలించడాన్ని తమ సార్వభౌమాధికార ఉల్లంఘనగా భావిస్తూ తిరస్కరిస్తోంది.
ఈ వ్యత్యాసం నిజానికి లోతైన చారిత్రక అవిశ్వాసంపై ఆధారపడి ఉంది. గతంలో ఇరాన్ రహస్యంగా సాగించిన కార్యకలాపాలపై పాశ్చాత్య దేశాలకు అనుమానం ఉంది, కాగా అమెరికా అణు ఒప్పందం (జేసీపీఓఏ) నుంచి వైదొలగడం, డోనల్డ్ ట్రంప్ మొదటి పదవీకాలంలో జరిగిన యుద్ధాలను ఇరాన్ తన అవిశ్వాసానికి కారణంగా చూపుతోంది.

ఫొటో సోర్స్, Planet Labs PBC
2) యురేనియం నిల్వల భవిష్యత్తు
రెండవ అతిపెద్ద వివాదాస్పద అంశం ఇరాన్‌కు సంబంధించిన ఎన్‌రిచ్డ్ యురేనియం నిల్వల భవిష్యత్తుకు సంబంధించినది. 12 రోజుల యుద్ధానికి ముందు, ఇరాన్ వద్ద 60 శాతం ఎన్‌రిచ్‌మెంట్ చేసిన యురేనియం దాదాపు 440 కిలోలు ఉన్నట్లు ఐఏఈఏ పేర్కొంది.
ఇది ఆయుధ తయారీ స్థాయికి చాలా సమీపంలోనే ఉన్నట్లు పరిగణిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనిని మరింత ఎన్‌రిచ్ చేస్తే, దీని ద్వారా అనేక అణ్వాయుధాలకు అవసరమైన మెటీరియల్ సిద్ధం చేయవచ్చు.
నివేదికల ప్రకారం.. ఇరాన్ వ్యూహాత్మక యురేనియం నిల్వలలో ఎక్కువ భాగం ఇస్ఫహాన్ అణు సముదాయంలోని భూగర్భ స్థావరాలు, లోతైన సొరంగాల్లో దాచారు.
నిఘా నివేదికల ప్రకారం, కొంత ఎన్‌రిచ్డ్ యురేనియం ధ్వంసమైన సొరంగాల శిథిలాల కింద కూరుకుపోయింది.
పర్యవేక్షణ పరికరాల లభ్యత లేకపోవడం, యుద్ధం వంటి పరిస్థితుల కారణంగా, ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఈ నిల్వల పరిమాణాన్ని లేదా ప్రస్తుత పరిస్థితిని సంస్థ ఆచరణాత్మకంగా ధ్రువీకరించలేకపోయిందని ఐఏఈఏ అధినేత రాఫెల్ గ్రాస్సీ చెప్పారు.
అమెరికా, ఇజ్రాయెల్ ఈ నిల్వలను అతిపెద్ద ముప్పుగా భావిస్తున్నాయి.
ఈ పరిమాణం గనుక నశించిపోతే ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవడానికి చాలా సమయం పడుతుంది, అలాగే దాని 'న్యూక్లియర్ బ్రేక్‌అవుట్' సమయం గణనీయంగా పెరుగుతుంది.
డోనల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో అమెరికా ఈ నిల్వలను 'ఏ రూపంలోనైనా' తన ఆధీనంలోకి తీసుకుంటుందని చెప్పారు.
నివేదికల ప్రకారం.. అమెరికా ప్రతిపాదనలలో ఈ పదార్థాన్ని పూర్తిగా అమెరికాకు లేదా ఏదైనా మూడవ దేశానికి అప్పగించడం, పూర్తిగా నిర్వీర్యం చేయడం లేదా ఇరాన్ భూభాగం నుండి పూర్తిగా తొలగించడం వంటి అంశాలు ఉన్నాయి.
అయితే, వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం.. ఇరాన్ తన ఇటీవలి సమాధానంలో తన నిల్వలను కొంత తక్కువ స్థాయికి తీసుకురావడానికి, కొంత భాగాన్ని మూడవ దేశానికి పంపడానికి సుముఖత వ్యక్తం చేసింది.
అయితే, ఒకవేళ చర్చలు విఫలమైతే లేదా అమెరికా మళ్లీ ఒప్పందం నుంచి వైదొలిగితే, ఆ మెటీరియల్ ఇరాన్‌కు అప్పగించాలనేది దీనికి ఉన్న నిబంధన.

ఫొటో సోర్స్, AFP via Getty Images
3) హార్ముజ్ జలసంధిపై నియంత్రణ
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన సముద్ర మార్గంగా పరిగణించే హార్ముజ్ జలసంధి ఇరాన్, అమెరికా మధ్య మూడవ అతిపెద్ద వివాదాస్పద అంశంగా మారింది. వ్యూహాత్మకమైన ఈ సముద్ర మార్గం మీదుగా ప్రపంచంలోని 20 శాతానికి పైగా ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణా జరుగుతుంది.
గత రెండు నెలల పరిణామాలు హార్ముజ్ జలసంధిపై నియంత్రణను ఇరాన్ ఒక వ్యూహాత్మక ఆయుధంగా మార్చుకోగలదని చూపుతున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా సంభావ్య ఒప్పందానికి ఈ మార్గం పూర్తిగా, పర్యవేక్షణతో తెరిచి ఉండటాన్ని అమెరికా ఒక ముందస్తు షరతుగా భావిస్తుండగా, ఇరాన్ దీనిని తన చివరి ఒత్తిడి ఆయుధంగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ కీలక మార్గం నిరంతరం మూతపడటం లేదా అంతరాయం కలగడం, ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భారీ ముప్పు వాటిల్లవచ్చు.
హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడాన్ని 'అంతర్జాతీయ షిప్పింగ్ స్వేచ్ఛ'కు ఉదాహరణగా అమెరికా పరిగణిస్తోంది. ఇరాన్ వైపు నుంచి వచ్చే ఎలాంటి ముప్పు లేదా ఆంక్షలనైనా ఆమోదయోగ్యం కానిదిగా పేర్కొంటోంది.
ఈ సమస్య పరిష్కారాన్ని సైనిక, అంతర్జాతీయ హామీలతో, అణు చర్చల నుంచి వేరుగా ఉంచాలని అమెరికా వైఖరిగా ఉంది.
ఇరాన్ మీడియా ప్రకారం, అమెరికా ప్రతిపాదనకు సమాధానంగా ఇరాన్ "యుద్ధాన్ని ముగించడం, పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో సముద్ర భద్రతను నిర్ధరించడం" పై పట్టుబట్టింది.
అదే సమయంలో, ఇరాన్ రాజకీయ, సైనిక నాయకత్వం హార్ముజ్ జలసంధిపై నియంత్రణను తమ 'రెడ్ లైన్'గా పేర్కొంది. ఒత్తిడి, ఆంక్షలను తొలగించడానికి బదులుగా వాణిజ్య నౌకల సురక్షిత రవాణాకు హామీ ఇస్తామని తెహ్రాన్ ప్రతిపాదించింది. అయితే నియంత్రణను, ముప్పులకు సమాధానం ఇచ్చే హక్కును మాత్రం తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది.
అమెరికాతో ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఆంక్షలతో తీవ్రమైన ముప్పు ఏర్పడితే హార్ముజ్ జలసంధి నుంచి చమురు సరఫరాను నిలిపివేయగలమని ఇరాన్ పలుమార్లు హెచ్చరించింది.
అయితే, గతంలో ఇలాంటివి ఎక్కువగా ఒత్తిడిని పెంచడానికే చెప్పేది. ఆ మార్గాన్ని పూర్తిగా మూసివేసేంత వరకు పరిస్థితి ఎప్పుడూ వెళ్లలేదు. కానీ, ఇటీవలి యుద్ధం తర్వాత పరిస్థితి మరింత సున్నితంగా మారింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
4) 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్', ఇరాన్ పాత్ర...
ఆ ప్రాంతంలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు కూడా తెహ్రాన్, అమెరికా మధ్య ఒక పెద్ద వివాదాస్పద అంశంగా మారాయి. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా, యెమెన్‌కు చెందిన హూతీలు, ఇరాక్‌కు చెందిన కొన్ని షియా మిలిషియా గ్రూపులకు ఇరాన్ ఆర్థిక, సైనిక, శిక్షణ సహాయాన్ని అందిస్తోందని అమెరికా పేర్కొంటోంది.
అమెరికా అభిప్రాయం ప్రకారం, ఈ నెట్‌వర్క్ ద్వారా తన ప్రభావాన్ని పెంచుకుంటూ ఇరాన్.. ఇజ్రాయెల్, అమెరికా ప్రయోజనాలతో పాటు వారి సైన్యానికి కూడా తీవ్రమైన ముప్పును సృష్టించింది.
మరోవైపు, తెహ్రాన్ ఈ గ్రూపులను 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్'లో భాగంగా పేర్కొంటుంది. ఇవి స్వతంత్ర శక్తులని.. ఇజ్రాయెల్, ఆ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికికి వ్యతిరేకంగా ఇవి పోరాడుతున్నాయని ఇరాన్ చెబుతోంది.
2023 అక్టోబర్‌లో గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత, వివిధ ఫ్రంట్‌లలో ఈ గ్రూపుల దాడులు పెరిగాయి. వీటిలో లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు, ఎర్ర సముద్రంలో హూతీల దాడులు, అలాగే ఇరాక్, సిరియాలోని అమెరికా స్థావరాలపై ఇరాకీ సాయుధ గ్రూపుల చర్యలు ఉన్నాయి.
ఈ గ్రూపులకు ఇరాన్ అందిస్తున్న సైనిక సహాయాన్ని తగ్గించాలని, అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వారి కార్యకలాపాలను అడ్డుకోవాలని అమెరికా నిరంతరం డిమాండ్ చేస్తోంది.
ఇటీవలి యుద్ధం, ఉద్రిక్తతల సమయంలో కూడా ఈ గ్రూపుల కార్యకలాపాల అంశం తెరపైకి వచ్చింది. అయితే అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి అంశాల వలె కాకుండా, ఈ సమస్య ప్రస్తుతానికి తక్షణ చర్చల పరిధిలోకి వచ్చినట్లు కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Majid Asgaripour/WANA via Reuters
5) ఇరాన్ ‘మిసైల్ ప్రోగ్రామ్’
ఇరాన్ క్షిపణి (మిసైల్) కార్యక్రమం రెండు దేశాల మధ్య అత్యంత కీలకమైన, సున్నితమైన వివాదాస్పద అంశాలలో ఒకటి.
గత రెండు దశాబ్దాలలో ఇరాన్ బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల భారీ నిల్వలను సిద్ధం చేసుకుంది. ఇందులో స్వల్ప శ్రేణి క్షిపణుల నుంచి దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి దాడి చేయగల క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ భూగర్భ స్థావరాలు, క్షిపణి నగరాల (మిసైల్ సిటీస్) నెట్‌వర్క్‌ను కూడా నిర్మించింది.
తన వైమానిక దళం, అత్యాధునిక రక్షణ వ్యవస్థలు అమెరికా, ఇజ్రాయెల్‌లతో పోలిస్తే చాలా పరిమితంగా ఉన్న తరుణంలో ఈ మిసైల్ ప్రోగ్రామ్‌ను ఇరాన్ తన రక్షణ, ప్రతిఘటన వ్యూహంలో ఒక మూలస్తంభంగా భావిస్తోంది.
మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు.. డ్రోన్ సాంకేతికత, మరింత ఖచ్చితమైన క్షిపణుల అభివృద్ధితో కూడిన ఇరాన్ క్షిపణి నిల్వలు.. ఇజ్రాయెల్, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అరబ్ దేశాలకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తున్నాయని పేర్కొంటున్నాయి.
ఇటీవలి యుద్ధ సమయంలో, ఇరాన్.. ఇజ్రాయెల్, ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు, గల్ఫ్ అరబ్ దేశాలపై, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పై వందలాది క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. వీటిలో కొన్ని దాడులను అడ్డుకున్నప్పటికీ, మరికొన్ని దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
ఇటీవలి యుద్ధంలో, అంతకుముందు జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్ సైనిక, క్షిపణి కేంద్రాలను పెద్ద ఎత్తున లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఇరాన్ వద్ద మిగిలి ఉన్న క్షిపణులు, మొబైల్ లాంచర్లు, నిల్వల గురించిన ఖచ్చితమైన సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఈ అస్పష్టతే అమెరికా, ఇజ్రాయెల్‌ల ఆందోళనకు కారణమైంది.
అయితే మీడియా నివేదికల ప్రకారం.. అణు కార్యక్రమంలా కాకుండా, ఈ క్షిపణి సమస్య ఇటీవలి అమెరికా ప్రతిపాదనలలో ప్రధానాంశంగా లేదు. మరోవైపు, క్షిపణి కార్యక్రమం తమ ఆత్మరక్షణ హక్కులో భాగమని, దీనిపై ఎలాంటి చర్చలు జరగవని ఇరాన్ స్పష్టం చేస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























