వారానికి కేవలం 2 గంటల స్ట్రెంత్ ట్రైనింగ్ హఠాన్మరణాలను తగ్గిస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డొమినిక్ హ్యూస్, లెస్లీ హిచెన్, జోమ్స్ గోవన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ప్రతి వారం 90 నిమిషాల నుంచి రెండు గంటల పాటు వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం (బరువులు ఎత్తడం, రెసిస్టెన్స్ వ్యాయామాలు) చేయడం వల్ల అకాల మరణం సంభవించే ప్రమాదం గణనీయంగా తగ్గించుకోవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
దశాబ్దాల పాటు కొనసాగిన అధ్యయనాల ఆధారంగా సేకరించిన సమాచారం ప్రకారం, క్రమం తప్పకుండా రెసిస్టెన్స్ లేదా వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలతో మరణించే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
అంతేకాదు, నరాల సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం కూడా తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
స్ట్రెంత్ ట్రెయినింగ్ వ్యాయామాలు ఆరోగ్య సమస్యలను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కేట్ హోగార్త్ వయసు కేవలం 28 సంవత్సరాలే. అయినప్పటికీ, భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటంపై ఆమె ఇప్పటి నుంచే ముందుజాగ్రత్తగా ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం వెయిట్ ట్రైనింగ్ వల్ల కలిగే ఆత్మవిశ్వాసాన్ని ఆస్వాదిస్తున్నప్పటికీ, దీనివల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా గుర్తించానని ఆమె అన్నారు.
"వయసు పెరిగాక కూడా నేను ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నాను. స్ట్రెంత్ ట్రెయినింగ్ వల్ల గుండె ఆరోగ్యం, కండరాలు, ఎముకలు, మానసిక ఆరోగ్య ప్రయోజనాలపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు ఉన్నాయి.
నేను 70, 80, 90 ఏళ్ల వయసులో కూడా ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటున్నాను. నా మనవళ్లు, మనవరాళ్లను ఎత్తుకుని వారితో ఆడుకోవాలనుకుంటున్నాను. అంత స్వేచ్ఛగా జీవించగలగడం నాకు చాలా ముఖ్యం" అని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, BBC/Lesley Hitchen
జాగింగ్, సైక్లింగ్ ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాల ప్రయోజనాలు ఇప్పటికే బాగా ప్రచారంలో ఉన్నవే.
బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవా సంస్థ ఎన్‌హెచ్‌ఎస్ ప్రకారం, క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అయితే, స్ట్రెంత్ ట్రెయినింగ్ వ్యాయామాలు అకాల మరణ ప్రమాదాన్ని ఎంతవరకు తగ్గిస్తాయన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సిన అవసరముంది. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోంది.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో, 30 సంవత్సరాల కాలంలో 1,47,374 మంది పురుషులు, మహిళలపై జరిగిన మూడు ప్రధాన పరిశోధనల డేటాను విశ్లేషించారు.
ప్రతి వారం 90 నిమిషాల నుంచి రెండు గంటల వరకు క్రమం తప్పకుండా వెయిట్ ట్రైనింగ్ చేసిన వారిలో ఏ కారణంతోనైనా సంభవించే అకాల మరణ ప్రమాదం 13 శాతం తగ్గినట్లు వారు గుర్తించారు.
గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి హృదయ సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 19 శాతం తగ్గింది.
డిమెన్షియా వంటి నరాల సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం 27 శాతం వరకు తగ్గినట్లు అధ్యయనం వెల్లడించింది.
అయితే, అత్యధిక ప్రయోజనాలు పొందినవారు ఏరోబిక్ వ్యాయామంతో పాటు స్ట్రెంత్ ట్రెయినింగ్ వ్యాయామాలను కూడా సమపాళ్లలో చేస్తున్న వారేనని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతి వారం కొన్ని గంటలపాటు ఏరోబిక్ వ్యాయామం చేస్తూనే వెయిట్ ట్రైనింగ్ కూడా చేసిన వ్యక్తుల్లో అకాల మరణ ప్రమాదం మొత్తం మీద 58 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు.
అయితే, ప్రతి వారం రెండు గంటలకంటే ఎక్కువ వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల అదనపు ప్రయోజనాలు పెద్దగా కనిపించలేదని కూడా పరిశోధకులు స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, BBC/Lesley Hitchen
ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌షైర్ ప్రాంతంలోని హారోగేట్‌లో పర్సనల్ ట్రెయినర్‌గా పనిచేస్తున్న బెవ్ విల్సన్ తన అనుభవంలో వెయిట్ ట్రైనింగ్ ప్రయోజనాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు.
"ప్రత్యేకంగా మహిళా క్లయింట్లు నా దగ్గరికి వచ్చినప్పుడు వారికి కీళ్ల నొప్పులు, నీరసంగా ఉండడం, మెటబాలిజం మందగించడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఉంటాయి.
వెయిట్ ట్రైనింగ్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు బలపడతాయి. వాళ్లు మరింత బలంగా, ఉత్సాహంగా, చురుగ్గా ఉన్నట్టు అనుభూతి చెందుతారు" అని ఆమ అన్నారు.
ఇది మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని ఆమె అంటున్నారు.
"మరింత శక్తివంతంగా, ఆరోగ్యంగా అనిపించడమే కాకుండా, వారి ఆలోచనా సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. "పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది" అని ఆమె వివరించారు.
స్పోర్ట్ ఇంగ్లండ్ సంస్థలో ఆరోగ్య, సంక్షేమ విధానాల విభాగానికి నాయకత్వం వహిస్తున్న టామ్ బర్టన్ ప్రకారం, శారీరక చురుకుదనం ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణానికి కీలకం.
"ప్రత్యేకంగా వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో స్ట్రెంత్ ట్రెయినింగ్ వ్యాయామాలు ఎంతో ప్రభావవంతమైన సాధనం. ఇవి అనారోగ్యాన్ని నివారించడంలో సహాయపడతాయి. మనల్ని చురుగ్గా, స్వతంత్రంగా ఉంచుతాయి" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























