బంగ్లాదేశ్: ‘షేక్ హసీనాను స్వదేశానికి రానివ్వాలి’ అంటూ హింసకు దిగిన ఆందోళనకారులు.. అసలేం జరిగింది..

ఫొటో సోర్స్, AFP via Getty Images
బంగ్లాదేశ్‌లోని గోపాల్‌గంజ్‌లో ఆదివారం జరిగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్, పోలీసు సూపరింటెండెంట్‌ను ఆ పదవుల నుంచి తొలగించింది ప్రభుత్వం.
భారత్‌లో ఉంటున్న షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ నాయకులు, మద్దతుదారులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌పై నిషేధం ఉంది.
అంతకుముందు అవామీ లీగ్‌కు చెందిన నిరసనకారులు ఆ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద విధ్వంసానికి దిగారు. నగరంలోని లాంచ్‌ఘాట్ ప్రాంతంలో ఉన్న జులై స్మారకాన్ని కూడా తగలబెట్టారు. పోలీసు వాహనానికి నిప్పంటించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ విధ్వంసం జరిగినట్లు సమాచారం. పోలీసు వాహనంపై 'జై బంగ్లా' అని రాసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనకారులు టైర్లను తగలబెట్టి కొన్ని స్థానిక రహదారులను కూడా దిగ్బంధించారు.

నిరసనల సందర్భంగా గోపాల్‌గంజ్ ప్రభుత్వ కళాశాల నేమ్‌ప్లేట్‌ను తొలగించి, దాని స్థానంలో కళాశాల పాత పేరైన 'గవర్నమెంట్ బంగబంధు కాలేజ్' అనే బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కాలేజీ పేరును గోపాల్‌గంజ్ గవర్నమెంట్ కాలేజ్‌గా మార్చారు.
ఆదివారం రోజంతా నిరసనలు కొనసాగిన అనంతరం గోపాల్‌గంజ్ డిప్యూటీ కమిషనర్ మొహమ్మద్ ఆరిఫ్-ఉజ్-జమాన్, పోలీసు సూపరింటెండెంట్ మొహమ్మద్ హబీబుల్లాలను వారి పదవుల నుంచి ప్రభుత్వం తొలగించింది.

ఫొటో సోర్స్, Chowdhury Hasan Mahmud
భారత్‌లో ఉంటున్న షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు రప్పించే అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిరసనలు జరిగాయి.
2024 ఆగస్ట్‌లో విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో తన ప్రభుత్వం కూలిపోవడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వదిలి భారత్ వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు.
నిరసనకారులపై ఆమె ప్రభుత్వం చేపట్టిన అమానుష చర్యలను నేరాలుగా పరిగణించిన బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్, 2025 నవంబర్‌లో హసీనాకు ఆమె గైర్హాజరీలో మరణశిక్ష విధించింది.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను, మొత్తం న్యాయ ప్రక్రియను హసీనా తిరస్కరించారు.
డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నానని, మరణశిక్ష విధించినప్పటికీ న్యాయపరమైన విచారణను ఎదుర్కొంటానని జులై నుంచి హసీనా పలుమార్లు చెబుతూవస్తున్నారు.

ఫొటో సోర్స్, Chowdhury Hasan Mahmud
తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. ఆదివారం ఆ పార్టీ నాయకులు, మద్దతుదారులు గోపాల్‌గంజ్‌లో సమావేశమైనట్లు తెలిసింది.
నవంబర్ 19న మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి దేశానికి రావాలని డిమాండ్ చేస్తూ పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగానే ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు.
జిల్లాలోని వివిధ యూనియన్లు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆదివారం ఉదయం నుంచే వరుసగా ర్యాలీలు నిర్వహించారని స్థానిక పాత్రికేయులు, అవామీ లీగ్‌కు చెందిన కొందరు వ్యక్తులు తెలిపారు.
పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లు, వ్యాన్లు, బస్సులు, ట్రక్కుల్లో జిల్లా కేంద్రానికి చేరుకున్నట్లు వారు చెప్పారు.
నగరంలోని పాత లాంచ్‌ఘాట్ వంతెన సమీపంలో సమావేశమైన అనంతరం ర్యాలీ బాంక్పారా ప్రాంతంలోని జిల్లా కమిటీ కార్యాలయం వైపు సాగింది.
నిరసనకారులు కార్యాలయంలోకి ప్రవేశించి తలుపులు తెరిచారు. 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఈ కార్యాలయం మూతపడి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
హసీనాను అప్పగించే విషయంలో సాధించిన పురోగతిని, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత్‌లో పర్యటించే అవకాశంతో ముడిపెడుతోంది బంగ్లాదేశ్. హసీనాతో పాటు పరారీలో ఉన్న ఇతర వ్యక్తులను తిరిగి అప్పగిస్తే, ఈ పర్యటనకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని బంగ్లాదేశ్ భావిస్తోంది.
హసీనాను అప్పగించాలంటూ వచ్చిన అభ్యర్థనలను భారత్ ధృవీకరించింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
శుక్రవారం న్యూదిల్లీలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. హసీనా అప్పగింత అనేది చట్టపరమైన అంశమని, దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆ తర్వాత శనివారం బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి మొహమ్మద్ అసదుజ్జమాన్ మాట్లాడుతూ.. హసీనాను తిరిగి రప్పించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను బంగ్లాదేశ్ పూర్తి చేసిందని తెలిపారు.
ఆదివారం నిరసనకారులు 2024 ఆగస్ట్ 5న హసీనా ప్రభుత్వం అధికారం కోల్పోయిన ఘటనకు గుర్తుగా నిర్మించిన స్మారకాన్ని కూల్చివేశారు. పోలీసుల బారికేడ్లను ధ్వంసం చేసి గోపాల్‌గంజ్ నగరంలోని పలు రహదారులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
"మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా తిరిగి దేశానికి వచ్చే వరకు మా ఆందోళన కొనసాగుతుంది" అని అవామీ లీగ్ గోపాల్‌గంజ్ జిల్లా నాయకుడు ఇలియాస్ హక్ పార్టీ ర్యాలీలో చెప్పారు.

ఫొటో సోర్స్, Chowdhury Hasan Mahmud
విధ్వంసక చర్యలను అడ్డుకోవడానికి చట్టాన్ని అమలు చేసే భద్రతా సంస్థలు కట్టుబడి ఉన్నాయని బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ తెలిపారు.
అవామీ లీగ్‌కు కంచుకోటగా భావించే గోపాల్‌గంజ్ జిల్లాలో అల్లర్లను నియంత్రించే పోలీసులకు సాయంగా బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) దళాలను కూడా సిద్ధంగా ఉంచాలని అధికారులు ఆదేశించారు.
జిల్లాలో 1,350 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని మోహరించామని ఢాకా రేంజ్ డీఐజీ మొహమ్మద్ ముస్తఫిజుర్ రెహమాన్ మీడియా సమావేశంలో తెలిపినట్టు బీబీసీ బంగ్లా పేర్కొంది.
పరిస్థితిని అదుపులో ఉంచేందుకు జిల్లాలో బీజీబీకి చెందిన ఆరు ప్లాటూన్లను మోహరించినట్లు బీజీబీ జెస్సోర్ ప్రాంత కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మహమూదుల్ హసన్ మీడియా సమావేశంలో తెలిపారు.
"తగినంత మంది పోలీసు సిబ్బందిని మోహరించాం. ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే లేదా సామాన్య ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రయత్నాన్నీ సహించేది లేదు" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆదివారం బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో గోపాల్‌గంజ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
పార్లమెంటులో పార్టీ సీనియర్ నాయకులతోనూ ప్రధాని సమావేశమైనట్టు ‘ప్రథమ్ ఆలో’ పత్రిక కథనం పేర్కొంది.
పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండాలని రెహమాన్ సూచించినట్లు ఆ పత్రిక కథనం పేర్కొంది.
ప్రభుత్వం పరిస్థితిని అదుపు తప్పనివ్వబోదని బంగ్లాదేశ్ హోం శాఖకు చెందిన ఒక అధికారి ప్రథమ్ ఆలో పత్రికకు తెలిపారు.
పరిస్థితిని యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని, పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలను పరిరక్షించే సిబ్బంది సంఖ్యను పెంచుతామని ఆ అధికారి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























