చైనాలో వచ్చేవారం ట్రంప్,పుతిన్, జిన్ పింగ్ సమావేశం కావచ్చంటున్న వైట్‌హౌస్, ఈ చారిత్రక సమావేశం దేనికోసం?

డోనల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, జిన్‌పింగ్‌, రష్యా, అమెరికా, చైనా
ఫొటో క్యాప్షన్, ట్రంప్, పుతిన్, షీ జిన్‌పింగ్ వచ్చే వారం చివర్లో సమావేమవుతారని వైట్ హౌస్ తెలిపింది.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

వచ్చే వారం చైనాలో జరిగే ఓ శిఖరాగ్ర సమావేశం సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశం కావడానికి యోచిస్తున్నారని శ్వేతసౌధం తెలిపింది.

అమెరికా, రష్యా, చైనా దేశాల అధినేతల మధ్య ఈ చారిత్రక సమావేశం, చైనాలోని దక్షిణ ప్రాంత నగరమైన షెన్‌జెన్‌లో ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సుకు ట్రంప్ హాజరైనప్పుడు జరగనుందని వైట్‌హౌస్ ప్రతినిధి ఒలీవియా వేల్స్ విలేకరులకు తెలిపారు.

"ఇతర అంశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్యను తగ్గించే అంశంపై కూడా చర్చిస్తానని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. అణ్వాయుధాల విస్తరణ చాలా ప్రమాదకరమని ఆయన భావిస్తున్నారు" అని ఆమె చెప్పారు.

ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు కలిగిన ఈ మూడు దేశాల మధ్య జరిగే ఈ సమావేశంలో ఇరాన్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అయితే యుక్రెయిన్ యుద్ధం గురించి చర్చించే అవకాశం లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సమావేశంపై రష్యా, చైనా ఇంకా స్పందించలేదు.

చర్చల తర్వాత ఎలాంటి ఒప్పందం కుదిరే అవకాశం లేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీనియర్ అమెరికా అధికారి చెప్పినట్టు అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ వార్తా సంస్థలు తెలిపాయి.

21 సభ్య దేశాలు పాల్గొనే రెండు రోజుల శిఖరాగ్ర సమావేశం కోసం ట్రంప్ బుధవారం(నవంబర్ 18) రాత్రి షెన్‌జెన్‌కు చేరుకుంటారు. షీ జిన్‌పింగ్‌తో గురువారం ద్వైపాక్షిక చర్చలలో కూడా పాల్గొంటారు.

కొత్త ఒప్పందం కుదుర్చుకోండి: ఐరాస

అమెరికా అధ్యక్షునిగా 2025లో రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ జిన్‌పింగ్‌తో సమావేశం కావడం ఇది నాలుగోసారి.

"చైనా పర్యటన ముగింపులో అమెరికా , చైనా , రష్యా అధ్యక్షులు పాల్గొనే త్రైపాక్షిక సమావేశం జరగనుంది" అని వేల్స్ తెలిపారు.

మంగళవారం ఫిలిప్పీన్స్‌లో జరిగే ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) శిఖరాగ్ర సమావేశంలో కూడా ట్రంప్ పాల్గొంటారని ఆమె చెప్పారు.

‘‘అమెరికా ప్రజలకు చరిత్రాత్మక విజయాలను అందించి ఇండో- పసిఫిక్‌‌ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడమే ఈ పర్యటన లక్ష్యం" అని ఆమె అన్నారు.

అమెరికా, రష్యాల మధ్య కుదిరిన అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది.

దీంతో ప్రపంచంలో అతిపెద్ద అణ్వాయుధాల నిల్వలు కలిగిన రెండు దేశాల మధ్య వాటి నియంత్రణకు సంబంధించిన కీలక పరిమితులు, నిబంధనలు లేకుండా పోయాయి.

ప్రచ్ఛన్న యుద్ధం ముగియడానికి దోహదపడిన అణ్వాయుధ నియంత్రణ సహకారానికి కూడా ఈ పరిణామంతో ముగింపు పలికినట్టయింది.

ఆలస్యం చేయకుండా కొత్త ఒప్పందానికి రావాలని ఐక్యరాజ్యసమితి ఇరుదేశాలను కోరింది.

అయితే చైనాను కూడా భాగస్వామిగా చేర్చుకుని,ప్రస్తుత ఒప్పందం కంటే మరింత మెరుగైనది కుదుర్చుకోవచ్చని ట్రంప్ అన్నారు. చైనా తన అణ్వాయుధ నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది.

చైనా, రష్యాల సహకారాన్ని పొందాలనుకోవడం వల్ల అనేక అడ్డంకులు ఎదురుకావొచ్చని, ఈ ప్రక్రియకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని అప్పట్లో అమెరికా మాజీ ఉన్నతాధికారులు, విశ్లేషకులు బీబీసీకి చెప్పారు.

డోనల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, జిన్‌పింగ్‌, రష్యా, అమెరికా, చైనా
ఫొటో క్యాప్షన్, రష్యా విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరి మెతకగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరుస సమావేశాలతో ప్రయోజనమేంటి?

ఈ ఏడాది ఆరంభంలో కొద్ది రోజుల వ్యవధిలోనే పుతిన్, ట్రంప్ ఇద్దరికీ షీ జిన్‌పింగ్ వేర్వేరుగా ఆతిథ్యం ఇచ్చారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షునికి వాషింగ్టన్‌లో స్వాగతం పలికారు.

యుక్రెయిన్‌పై రష్యా 2022లో పూర్తిస్థాయి దాడిని ప్రారంభించినప్పటి నుంచి రష్యాకు చైనా ఒక కీలక వాణిజ్య భాగస్వామిగా మారింది.

ఈ యుద్ధం కారణంగా రష్యా అంతర్జాతీయంగా ఒంటరైంది. పాశ్చాత్యదేశాల ఆంక్షలను ఎదుర్కొంటోంది.

అయితే, రష్యా నుంచి డీజిల్‌ దిగుమతి చేసుకోడానికి అమెరికా కుదుర్చుకున్న వివాదాస్పద ఒప్పందం, చైనాతో సహా రష్యా చమురు, గ్యాస్‌లను అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలపై విధించిన ఆంక్షలను నిలిపివేయడం వంటి చర్యలు యూరప్ దేశాల్లో ఆందోళనను మరింత పెంచాయి.

రష్యా విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరి మరింత మెతకగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఏడాది బీజింగ్, వాషింగ్టన్‌లలో జరిగిన శిఖరాగ్ర సమావేశాల సమయలో తమ దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడుతున్నట్టు చూపించడానికి ట్రంప్, జిన్‌పింగ్ ప్రయత్నించారు.

అయితే వాణిజ్యం, ఏఐ రంగాల్లో ఆధిపత్యం కోసం పోటీ, తైవాన్ వంటి కీలక అంశాల్లో పెద్దగా పురోగతి కనిపించలేదు.

ఇరాన్ యుద్ధం కూడా అమెరికా, చైనా మధ్య విభేదాలకు కారణమైంది.

ఇరాన్ చమురును అత్యధికంగా కొనే దేశం చైనా. ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా చైనానే.

ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా షీ జిన్‌పింగ్ ఇతర దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధిని ఉటంకిస్తూ చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. కానీ త్రైపాక్షిక సమావేశం గురించి మాత్రం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు.

రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ నెల ప్రారంభంలో రష్యా ప్రభుత్వ మీడియాతో మాట్లాడారు.

ఏపీఈసీ సమావేశం సందర్భంగా ఈ ముగ్గురు నేతల చర్చలకు సంబంధించి ‘‘సానుకూల సంకేతాలు, సంసిద్ధతను తెలియజేసే సూచనలు ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)