‘ది గాడ్ ఫాదర్‌‌’: బాస్‌లకే బాస్‌గా చెప్పే డ్రగ్ లార్డ్ 80 ఏళ్ల వయసులో మృతి.. ఎవరీ ఫెలిక్స్ గలార్డో

Miguel Ángel Félix Gallardo
ఫొటో క్యాప్షన్, ఫెలిక్స్ గలార్డో
    • రచయిత, విల్ గ్రాంట్
    • హోదా, బిబిసి ప్రతినిధి
    • నుంచి, మెక్సికో నగరం
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

మెక్సికన్ డ్రగ్ లార్డ్ మిగెల్ ఏంజెల్ ఫెలిక్స్ గలార్డో 80 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో మరణించారు.

చరిత్రలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల స్మగ్లర్లలో ఒకరిగా ఫెలిక్స్ గలార్డో పేరు చెబుతారు.

కొలంబియాలోని నేర ముఠాలకు, తన సొంత మెక్సికన్ కార్టెల్‌కు మధ్య పొత్తు ఏర్పరిచిన ముఠా నాయకుడిగా చెబుతారు.

ఫెలిక్స్ గలార్డోను 'ది గాడ్ ఫాదర్' అని.. 'బాస్ ఆఫ్ బాసెస్' అని పిలుచుకుంటారు. 1980లలో కొకైన్ విజృంభణ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మెక్సికన్ మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రపంచాన్ని ఏలిన శక్తిమంతమైన గ్వాడలాజరా కార్టెల్‌కు గలార్డో అధిపతిగా ఉండేవారు.

ఆ సమయంలో, అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంలో అది ఒక కొత్త పంథాను సృష్టించింది, అది నేటికీ కొనసాగుతోంది. ఆయన 1989 నుంచి ప్రభుత్వ అదుపులో ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చరిత్రలో ఫెలిక్స్ గలార్డోకు సమాన స్థాయిలో వినిపించే పేరు బహుశా పాబ్లో ఎస్కోబార్ తప్ప మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు.

ఆండీస్ పర్వత ప్రాంతాల్లో జరిగే మాదక ద్రవ్యాల ఉత్పత్తిని, మెక్సికో మీదుగా అమెరికాలోకి జరిగే అక్రమ రవాణాతో అనుసంధానం చేస్తూ గలార్డో తన సంస్థ కార్యకలాపాలను విస్తరించారు.

దీని కోసం కొలంబియా డ్రగ్ కార్టెల్స్‌తో, ముఖ్యంగా పాబ్లో ఎస్కోబార్ నేతృత్వంలోని మెడెలిన్ కార్టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు.

ఆ ప్రాంతంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థను ఈ వ్యూహం పూర్తిగా మార్చేసింది. ఈ మార్పులు తెచ్చిన సంస్థకు ఆయన నాయకత్వం వహించారు.

ఒక దశలో అమెరికాలోకి ప్రవేశించిన మొత్తం కొకైన్‌లో దాదాపు 80 శాతం మెడెలిన్ కార్టెల్ నుంచే వచ్చేదని అంచనా.

ఆ మాదక ద్రవ్యాలను అమెరికాలోకి అక్రమంగా తరలించడంలో ఫెలిక్స్ గలార్డో, ఆయన సంస్థ కీలక పాత్ర పోషించాయి.

ఈ వారం మిగెల్ ఏంజెల్ ఫెలిక్స్ గల్లార్డోను చేర్చిన కంట్రీ 2000 ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాన్ని, భారీగా ఆయుధాలు ధరించిన జైలు పోలీసు సభ్యులు కాపలాకాస్తున్నారు.
ఫొటో క్యాప్షన్, మిగెల్ ఏంజెల్ ఫెలిక్స్ గలార్డోను చేర్చిన ఆసుపత్రిని మెక్సికన్ జైలు పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

డీఈఏ హత్యతో సామ్రాజ్యం పతనం

ఫెలిక్స్ గలార్డో నేతృత్వంలోని కార్టెల్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో మెక్సికో రాజకీయాలు, చట్ట అమలు వ్యవస్థపై చాలా ప్రభావాన్ని చూపింది.

మొత్తం పోలీసు నెట్‌వర్క్‌లను, రాష్ట్ర గవర్నర్ పదవులను సైతం తన నియంత్రణలో ఉంచగలిగే స్థాయికి ఆ సంస్థ ఎదిగింది.

1985లో అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) ఏజెంట్ ఎన్రికే 'కికి' కెమరీనను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన తర్వాత, గ్వాడలాజరా కార్టెల్ నాయకులపై ఉచ్చు బిగుసుకోవడం ప్రారంభమైంది.

నేరస్థుల ముఠాకు చెందిన చిహువావాలోని ఒక భారీ గంజాయి తోటను కెమరీన కనుగొని, ధ్వంసం చేయడంతో కార్టెల్ నాయకులు ఆగ్రహించారు.

కెమరీన హత్యతో అమెరికా ప్రభుత్వం ఉత్తర అమెరికా చరిత్రలోనే భారీ ఆపరేషన్ చేపట్టింది.

హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు అధికారులు విస్తృత స్థాయిలో దర్యాప్తు, గాలింపు చర్యలు ప్రారంభించారు.

దీంతో 1989లో అధికారులకు ఫెలిక్స్ గలార్డో చిక్కారు.

దశాబ్దాలపాటు జైలు శిక్ష అనుభవించారు. అనారోగ్యంతో ఉన్న ఆయన్ను 2022 నుంచి గృహనిర్బంధంలో ఉంచారు.

జోక్విన్ 'ఎల్ చాపో' గుజ్‌మాన్‌కు ఫెలిక్స్ గలార్డోతో 1980వ దశకంలో పరిచయం ఏర్పడింది. తన మాదకద్రవ్యాల సంస్థకు సంబంధించిన లాజిస్టిక్స్ వ్యవహారాలను చూసుకునే బాధ్యతను ఆయనకు అప్పగించారు.

ఫెలిక్స్ గలార్డో అరెస్టు తర్వాత ఆయన నిర్మించిన సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడంతో, గుజ్‌మాన్ నాయకత్వంలో సినలోవా కార్టెల్ ఆవిర్భవించింది. ఇప్పుడు ఆయన కూడా భారీస్థాయి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మరో పర్యాయపదంగా మారారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ వంటి ఆరోపణలపై 2019లో గుజ్‌మాన్‌కు జీవిత ఖైదు విధించారు. అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైన విచారణలలో ఇది ఒకటి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)