‘ఏఐ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం’: కృత్రిమ మేధపై హెచ్చరికల వేళ ట్రంప్ ప్రకటన

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, నార్డిన్ సాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
కృత్రిమ మేధ వల్ల తలెత్తే ప్రమాదాలపై హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ‘‘ఏఐ ఫోర్స్’’ను ఏర్పాటు చేయడంతోపాటు, కృత్రిమ మేధకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికా ప్రభుత్వం ఏఐ పరిశ్రమ వృద్ధిని ఏ విధంగానూ అడ్డుకోదు,కట్టడి చేయదని శనివారం సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌లో ట్రంప్ తెలిపారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేసేవరకు ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేయాలన్న డిమాండ్లను ట్రంప్ తోసిపుచ్చారు.
ఏఐతో పొంచి ఉన్న ప్రమాదాలపై వరుస హెచ్చరికలు వస్తున్నందున, ఈ టెక్నాలజీ అభివృద్ధిపై సమన్వయ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో ఆయన ఈ పోస్ట్ చేశారు. అయితే తన ప్రణాళికకు సంబంధించిన వివరాలు గానీ, దాన్ని ఎప్పటిలోగా అమలు చేస్తారనే కాలపరిమితి గానీ ట్రంప్ వెల్లడించలేదు.
"ఏఐ తదుపరి పారిశ్రామిక విప్లవం లేదా ఇంటర్‌నెట్ లాంటిది. అయితే దాని ప్రభావం మరింత విస్తృతంగా, పెద్దదిగా ఉంటుంది.. బహుశా మన దేశ జీడీపీలో అది 25 శాతం వరకు ఉండొచ్చు" అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా అత్యాధునిక సాంకేతికతలో ఆధిపత్యానికి పోటీపడుతున్న నేపథ్యంలో, ఏఐ ఇప్పుడు ఇరు దేశాల మధ్య పోటీకి కేంద్రంగా మారింది. వచ్చే వారం ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

మరోవైపు, ఏఐని దుర్వినియోగం చేసేవారిపై చర్యలు తీసుకోవడానికి తన ప్రభుత్వం ప్రస్తుత క్రిమినల్, సివిల్ న్యాయ వ్యవస్థలను ఉపయోగిస్తుందని ట్రంప్ చెప్పారు. భవిష్యత్తుల్లో ఏఐ వల్ల ప్రమాదాలు తలెత్తవచ్చంటూ వస్తున్న విమర్శలు, ఆందోళనలన్నీ 'బూటకం' అంటూ ఆయన మరోసారి కొట్టిపారేశారు.
ఈ టెక్నాలజీతో మానవాళికి ముప్పు వాటిల్లుతుందని ప్రస్తుత, మాజీ పరిశోధకులు చేస్తున్న వాదనలతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇది 'మానవాళిని అంతం చేసే' ప్రమాదం 10 శాతానికి పైగా ఉందని కూడా ఒకరు హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'సూపర్ ఇంటెలిజెన్స్' రేసులో ఏఐ సంస్థలు
ప్రముఖ ఏఐ సంస్థలు మెరుగైన వ్యవస్థలఅభివృద్ధికి పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా మనుషుల కంటే తెలివైన సైద్ధాంతిక సాంకేతికతగా భావించే 'సూపర్ ఇంటెలిజెన్స్'ను రూపొందించే ప్రయత్నాలు కూడా ఉన్నాయి.
క్లాడ్, చాట్‌జీపీటీ, జెమినైల వెనుక ఉన్న ఏఐ దిగ్గజ సంస్థలు ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ, గూగుల్ సైతం భద్రతా ఉల్లంఘనలు లేదా తమ చాట్‌బాట్‌లను 'హానికరమైన కార్యకలాపాల' కోసం ఉపయోగించిన ఘటనలను వెల్లడించాయి.
ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని ఆంత్రోపిక్ అధిపతి డారియో అమోడై ఇటీవల పిలుపునిచ్చారు. ఏఐ రంగం మొత్తానికి వర్తించేలా అభివృద్ధి వేగాన్ని తగ్గించడం, నియంత్రణలు తీసుకురావడంతో పాటు ఏఐ మోడళ్ల అభివృద్ధిని స్వతంత్రంగా పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
ఓపెన్‌ఏఐకి చెందిన సామ్ ఆల్ట్‌మన్, ఎక్స్ఏఐకి చెందిన ఎలాన్ మస్క్ ఇద్దరూ ఆయన సిఫార్సులతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
థర్డ్ పార్టీ తనిఖీ చేయగల 'కిల్ స్విచ్'ను ఈ పరిశ్రమకు తప్పనిసరి చేయాల్సి రావొచ్చని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ బీబీసీతో చెప్పారు.
నియంత్రణపై చట్టసభల కసరత్తు
ఈ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా చట్టసభ సభ్యులు ఏఐకి సంబంధించిన చట్టాలను ప్రతిపాదించారు.
అయితే, ఈ కొత్త టెక్నాలజీ వేగాన్ని అందుకోవడంలో, దానిని ఎలా నియంత్రించాలనే విషయంలో వాషింగ్టన్ ఇబ్బంది పడుతోందని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. ఏఐ సంస్థలు దాని భద్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాయనే నమ్మకం ప్రజలకు మరింత ఉండాలని ఆయన అన్నారు.
"మేం సరైన పనే చేస్తామని ప్రపంచం విశ్వసించాలి. ఎందుకంటే అది సరైన పని, దీని తీవ్రతను మేం గుర్తిస్తున్నాం" అని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక సదస్సులో ఆల్ట్‌మన్ పేర్కొన్నారు.
బ్రిటన్ ఎంపీలు, ఎగువ సభ సభ్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎదురయ్యే మానవ హక్కుల ముప్పులపై గళం విప్పారు. టెక్నాలజీ వేగవంతమైన ఎదుగుదలను ఎదుర్కోవడానికి ప్రస్తుత చట్టాలు సరిపోవని వాదించారు.
ఇలాంటి ముప్పుల పరిధిని, తీవ్రతను ఎదుర్కోవడానికి ఏఐపై కొత్త చట్టం తీసుకురావాలని కోరుతూ జాయింట్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ ఒక రిపోర్టు ప్రచురించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























