శరీరానికి ఎంత సూర్యరశ్మి అవసరం? ఎంతసేపు ఎండలో ఉండాలి.. ఎక్కువ సమయం ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలగొచ్చు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్లాడియా పొసాడా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
మనిషికి సూర్యరశ్మి ఎంత మేర అవసరం?
కొంతమందికి వేసవిలో రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే సరిపోవచ్చు.. మరికొందరికి చాలా ఎక్కువ సమయం అవసరం ఉండొచ్చు.
1923లో మధ్యధరా సముద్ర విహార యాత్ర తర్వాత రాగి రంగులో కనిపించిన ‘కోకో షానెల్’(ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్) ఫోటోల వల్ల ట్యానింగ్, సన్ బాతింగ్ పాపులర్ అయ్యాయి.
గోధుమ రంగులోకి మారిన ఆమె చర్మం స్టేటస్ సింబల్‌గా మారి సూర్యకాంతి పట్ల పాశ్చాత్య దేశాల ఆలోచనా ధోరణిని మార్చేసింది.
1990ల ప్రారంభం నుంచి మధ్య కాలం వరకు హీలియో థెరపీ, సూర్యకాంతిని వైద్య పరంగా ఆరోగ్య కేంద్రాలలో రికెట్స్, క్షయ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించేవారు.
వందేళ్ల తర్వాత సూర్యుడితో మనుషుల సంబంధం మరింత సంక్లిష్టంగా మారింది.
గత 50 ఏళ్లలో చర్మ క్యాన్సర్ కేసులు పెరగడంతో వైద్యుపరమైన ఆలోచనల్లో మార్పు వచ్చింది.
మరోవైపు ఎండ వేడిమి తగలకుండా శరీరాన్ని కాపాడుకోవడంతో పాటు ఎండలోకి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవడం వంటి ప్రజారోగ్య సూచనలు పెరిగాయి.


ఫొటో సోర్స్, LightRocket via Getty Images
ఎక్కువగా ఎండ తగలడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే రావచ్చని వివిధ పరిశోధనలు సూచిస్తున్నాయి.
అయితే పరిమితంగా ఎండ తగలడం, మధ్యాహ్నం పూట కాసేపు ఎండలో ఉండటం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు విటమిన్ డి పెరగడం, రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతున్నట్లు గుర్తించారు.
ఇది కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని, గుండె ఆరోగ్యాన్ని, నిద్రను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
సూర్యరశ్మి సోకడం వల్ల లాభం, నష్టం రెండూ ఉంటాయంటున్న పరిస్థితుల్లో నష్టాలను తగ్గించుకుని మనమెలా లాభపడవచ్చు? మనకు ఎంత సూర్యరశ్మి అవసరం?

ఫొటో సోర్స్, Getty Images
మనకు సూర్యరశ్మి ఎందుకు కావాలి?
శరీరానికి పరిమిత స్థాయిలో ఎండ తగిలినప్పుడు విటమిన్ డి లభిస్తుంది.
ఎముకల ఆరోగ్యం, కండరాల పని తీరుకు ఈ విటమిన్ అవసరం.
విటమిన్ డి అధికంగా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.
మరణాల రేటుతో పాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
సూర్య రశ్మి రక్తపోటును కూడా తగ్గిస్తుంది. అతి నీల లోహిత కిరణాలను మన చర్మాన్ని తాకినప్పుడు అవి నైట్రిక్స్ ఆక్సైడ్ విడుదలను ప్రేరేపిస్తాయి. దీని వల్ల రక్తనాళాలు విస్తరిస్తాయి. ఇది గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
29,518 మంది స్వీడన్ మహిళలపై 20 ఏళ్ల పాటు నిర్వహించిన కీలక అధ్యయనంలో ఎండ తగలనివారిలో మరణాల రేటు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
ఎండ తగిలిన వారితో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
దీనికి విరుద్ధంగా సన్‌బెడ్( బీచ్‌లలో ఎండలో పడుకోవడం) వాడిన వారిలో క్యాన్సర్ మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
2011లో స్వీడన్‌లో చేసిన ఓ అధ్యయనంలో పదేళ్ల పాటు నెలకొకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు సన్ బెడ్ ఉపయోగించిన మహిళల్లో అన్ని కారణాల వల్ల మరణాల రేటు 90శాతం పెరిగినట్లు గుర్తించారు.
శరీరంలో తగినంత డి విటమిన్ ఉంటే "గాయాలైనప్పుడు వాపును తగ్గించడం, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని" ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయంలో ఫిజియాలజీ ప్రొఫెసర్ రెబెక్కా మేసన్ చెప్పారు.
శరీరానికి సూర్యరశ్మి తగలడం వల్ల నిద్ర, మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయని తేలింది.
ఉదయపు సూర్యకాంతిలోని నీలి కిరణాల తరంగదైర్ఘ్యాలు తాకిన తర్వాత మెదడు తెల్లారినట్లు భావించి కార్టిసాల్‌ను పెంచి నిద్రను కలిగించే హార్మోన్ మెలటోనిన్‌ను అణచివేస్తాయి.
దీనివల్ల మనం ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ఉదయపు ఎండ శరీరానికి సోకడం వల్ల జ్ఞానశక్తి, స్పందించే తీరు మెరుగుపడుతుంది.
ఎండ తగలడం వల్ల దిమెన్షియా వచ్చే ప్రమాదం తక్కువని 3.60 లక్షల మందికి పైగా పాల్గొన్న ఒక అధ్యయనంలో వెల్లడైంది.
ఎండ తగడలం వల్ల మెదడులోని సెరటోనిన్ స్థాయిలు ప రుగుతాయి. దీని వల్ల మనం మరింత ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండవచ్చు. డిప్రెషన్‌కు చికిత్స తీసుకున్న వాళ్లు ఎండ ఉండే గదుల్లో త్వరగా కోలుకున్నట్లు తేలింది. ఎండ తగలకపోవడం వల్ల డిప్రెషన్, కల్లోల మానసిక స్థితి, నిద్ర లేమి పెరిగాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఎంత సూర్యరశ్మి కావాలి?
భౌగోళికంగా మనం నివసించే ప్రాంతం, వయసు, చర్మ రకాన్ని బట్టి రకరకాల మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, తక్కువ సమయంలో తరచుగా ఎండ తగలడం మేలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
విటమిన్ డి కావాలంటే అతి నీల లోహిత కిరణాలు అత్యధికంగా ఉండే మధ్యాహ్న సమయంలో తరచుగా కాసేపు ఎండ తగలడం మంచిదని మేసన్ చెబుతున్నారు.
లేత చర్మం ఉన్న వారు క్రమం తప్పకుండా కాసేపు ఎండలో ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ఎండలోకి వెళ్లినప్పుడు కొన్ని నిముషాలపాటు చేతులు, భుజాలు, కాళ్లు కప్పకుండా ఉంచాలి.
ముదురు చర్మం ఉన్న వారికి ఎండ ఎక్కువగా తగలాలి. ఎందుకంటే మెలనిన్ అధిక స్థాయిలో ఉండటం వల్ల సూర్యరశ్మి నుంచి విటమిన్ డి ఉత్పత్తి కావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.
చాలా లేత చర్మం ఉన్నవారు, వ్యక్తిగతంగా లేదా కుటుంబంలో మెలనోమా చరిత్ర ఉన్నవారు లేదా శరీరంపై చాలా పుట్టుమచ్చలు ఉన్నవారు చర్మ క్యాన్సర్లు అభివృద్ధి చెందే అధిక ప్రమాదంలో ఉంటారని అందువల్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని మేసన్ చెబుతున్నారు.
చర్మ క్యాన్సర్‌కు అల్ట్రా వయోలెట్ బి ప్రధాన కారణమైనప్పటికీ, విటమిన్ డి తయారీలో ఇది అవసరం. రోజులో ముందుగా లేదా తరువాత మీకు అంత యూవీబీ లభించదు.
అల్బినిజం ఉన్నవారు అరుదైన సందర్భాల్లో అసలు రక్షణ లేకుండా ఎండలో ఉండటం సరికాదు.
శీతాకాలంలో తగినంత డి విటమిన్ కోసం ప్రజలు ఎక్కువ సేపు బయట గడపాల్సి ఉంటుంది. ది మీరు ఏ ప్రాంతంలో ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
మెల్‌బోర్న్, హోబార్ట్ వంటి నగరాల్లో శీతాకాలంలో శరీరానికి అవసరమైనంత డి విటమన్ అందించే అల్ట్రావయోలెట్ బి ఉండదని మేసన్ చెబుతున్నారు.
"మంచి ఆరోగ్యం కోసం మనకు కాసేపు ఎండలో ఉంటే చాలు" అని బోస్టన్‌లోని బ్రిగమ్ అండ్ విమెన్స్ హాస్పిటల్‌లో వైద్యశాస్త్ర ప్రొఫెసర్ జోఆన్ మాన్సన్ చెబుతున్నారు.
ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి 4 గంటల మధ్య తగిన రక్షణ లేకుండా ఎక్కువ సేపు ఎండలో ఉండవద్దని ఆయన సూచిస్తున్నారు.
అయితే ఈ సమయంలో ఎండలో పనులు చేసుకునేటప్పుడు అనుకోకుండా తగిలే సూర్యరశ్మి ప్రభావవంతంగా ఉంటుందని చెప్పారు.
"ఎండ తగలడం వల్ల కలిగే లాభనష్టాలు వ్యక్తుల చర్మ రకం, రంగును బట్టి మారుతుంది" అని బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో డెర్మటాలజీ ప్రొఫెసర్ లెస్లీ రోడ్స్ చెప్పారు.
ప్రపంచంలో తొలిసారి ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ 2024లో ఎండలో ఎంత సేపు ఉండాలనే దానికి సంబంధించి మార్గదర్శకాలను అప్‌డేట్ చేశాయి. చర్మ రకం, చర్మ క్యాన్సర్ ప్రమాదం ఆధారంగా తమ జనాభాను మూడు సమూహాలుగా విభజించాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కువగా ఎండలో ఉండటం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి?
ఎండలో ఎక్కువ సమయం ఉండటం వల్ల శరీరానికి అందే డి విటమన్ పెరగదు.
వడదెబ్బ తగలవచ్చు. చర్మంలో పిగ్మెంటేషన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
బ్రిటన్‌లో ఒక ఏడాదిలో కొత్తగా నమోదయ్యో మెలనోమా( చర్మ క్యాన్సర్‌లో ప్రమాదకరమైన రకం) కేసుల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగింది. తొలిసారి 20 వేలు దాటింది.
ఎక్కువగా అతి నీల లోహిత కిరణాలు సోకడం, సన్ బెడ్ ఉపయోగించడం దీనికి కారణని లాభాపేక్ష లేని ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఇందులో ప్రతి 10 కేసుల్లో 9 నివారించగలిగినవేనని అంచనా.
బాల్యం, యుక్త వయసులో ఎండ తక్కువగా తగలడం మంచిది.
ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలోని మొదటి 20 ఏళ్లలో పొందే సూర్యరశ్మి పరిమాణం చర్మ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాన్ని , కొంతవరకు నిర్ణయిస్తుందని పరిశోధనలు చూపిస్తున్నాయి.
అధికంగా సూర్యరశ్మికి గురికావడం వల్ల కంటిశుక్లాలు కూడా ఏర్పడవచ్చు.
కంటి లెన్స్‌పై ఏర్పడే ఈ మసక మచ్చలకు సాధారణంగా శస్త్రచికిత్సతో సులభంగా చికిత్స చేయవచ్చు.
చికిత్స చేయకుండా వదిలేస్తే చివరికి అంధత్వానికి దారితీయవచ్చు.
హానికరమైన కిరణాల నుంచి కళ్లను రక్షించుకోవడానికి ప్రజలు యూవీ 400 లెన్స్ సన్‌గ్లాసెస్ ధరించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తగినంత ఎండ తగలకపోతే ఏమవుతుంది?
మీరు నివసిస్తున్న ప్రాంతంలో సూర్యకాంతి తక్కువగా ఉంటే, శీతాకాలంలో మీలో విటమిన్ డి స్థాయి తక్కువగా ఉండే అవకాశం ఉందని రోడ్స్ చెబుతున్నారు.
ముదురు చర్మం ఉన్నవారు బయటకు వెళ్లే అవకాశం పరిమితంగా ఉన్నవారు, ఫోటోసెన్సిటివిటీ సమస్యలు ఉన్నవారు లేదా తమ చర్మాన్ని కప్పుకునే వారు విటమిన్ D లోపానికి గురయ్యే ప్రమాదంలో పడవచ్చు.
ఎక్కువ కాలం విటమిన్ డి లోపం ఉంటే రికెట్స్ లేదా ఆస్టియోమలేసియా వంటి ఎముకల వైకల్యాలు ఏర్పడవచ్చు.
17వ శతాబ్దంలో బ్రిటన్‌లో తొలిసారి ఒక పట్టణం రికెట్స్ బాధిత ప్రాంతంగా మారింది.
ఆ సమయంలో విస్తృతంగా బొగ్గు వినియోగించడం వల్ల లండన్ వంటి నగరాలు పొగతో నిండిపోవడంతో నీల లోహిత కిరణాలు ప్రజల చర్మానికి చేరలేదు.
విటమిన్ డి లోపాలను సప్లిమెంట్లతో సులభంగా సరిచేయవచ్చు.
పెద్దలందరూ విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయంపై చర్చ మాత్రం వివాదాస్పదంగా ఉంది.
శీతాకాలంలో సూర్యకాంతి పరిమితంగా ఉండే కొన్ని దేశాలు ఉదాహరణకు అమెరికా, కెనడాలో, పుట్టగొడుగులు, ధాన్యాలు పాల ఉత్పత్తులు వంటి ఆహారాల ద్వారా విటమిన్ డి పొందవచ్చు.
విటమిన్ డి అధికంగా తీసుకోకపోవడం ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు100 మైక్రో గ్రాములు కంటే ఎక్కువ తీసుకోవడం హానికరమని పరిగణిస్తున్నారు.
ఎందుకంటే విటమిన్ డి ఎక్కువైతే అది హైపర్‌కాల్సీమియాకు దారితీస్తుంది.
ఇది ఎముకలను బలహీనపరచడంతో పాటు మూత్రపిండాలు గుండెకు హాని కలిగించవచ్చు.
కోకో షానెల్ ట్యానింగ్ ప్రభావం మొదలై వందేళ్లు దాటింది. శరీరానికి సూర్యరశ్మి ఎంత అవసరం, ఎంత ప్రమాదకరం అనే దానిపై మానవాళి అవగాహన ఈ వందేళ్లలో మారుతూ వచ్చింది.
తరచుగా, పరిమితంగా ఎండ తగడలం అనే మేసన్ సూచన ఉత్తమంగా కనిపిస్తోంది.
మధ్యాహ్న సమయంలో తక్కువ వ్యవధిలో తరచుగా ఎండలో ఉండటం మేలు.
ఎండ తీవ్రంగా ఉన్న రోజుల్లో ఎండలో ఉండటాన్ని నివారించడం ద్వారా చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకుంటూనే సూర్యరశ్మి వల్ల వచ్చే ప్రయోజనాల్ని పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలోని అంశాలు కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఇది డాక్టర్లు లేదా వైద్య నిపుణుల సలహా కాదు. మీ ఆరోగ్యం గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్యుడిని సంప్రదించండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























