ప్రపంచ పర్యటనకు క్రూయిజ్‌లో తీసుకెళ్లారు.. చమురు ధరలను భరించలేమంటూ సముద్రంలోనే నిలిపేశారు

నౌక, ప్రయాణం, ఇంధన ధరలు
ఫొటో క్యాప్షన్, క్రూయిజ్ నౌక 750 రోజుల పాటు ప్రయాణించింది.
    • రచయిత, కోహ్ ఎవె
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లపాటు ప్రయాణించాల్సిన ఒక విలాసవంతమైన క్రూయిజ్ నౌక తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. చమురు ధరలు విపరీతంగా పెరగడమే దీనికి కారణమని తెలిపింది.

దీంతో ఆ నౌకలోని ప్రయాణికులు కంబోడియాలో చిక్కుకుపోయారు.

ఈ నౌకను అమెరికాకు చెందిన విల్లా వీ ఒడిస్సీ సంస్థ నిర్వహిస్తోంది. నౌకను ఖాళీ చేయించడం, తాత్కాలికంగా ఉండేందుకు వసతి సదుపాయాలు కల్పించడంపై ప్రయాణికులుతో చర్చిస్తున్నట్టు సంస్థ తెలిపింది.

నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో స్పష్టంగా తెలియదు.

అయితే 656 అడుగుల పొడవున్న ఈ నౌకలో 650 మంది ప్రయాణించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే లక్ష్యంతో ఈ నౌక 2024 అక్టోబర్‌లో బెల్‌ఫాస్ట్ నుంచి బయలుదేరింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి.

ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నౌకలోని ఒక్క క్యాబిన్‌కు ఆసియాలో నెలవారీ ఇంధన ఖర్చు 8,000 డాలర్లు(సుమారు రూ. లక్షా 71 వేల) నుంచి 1800 డాలర్లు (సుమారు రూ. 7 లక్షల 62 వేలు)కు పెరిగిందని నౌకను నిర్వహించే సంస్థ తెలిపింది.

ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు తాము గణనీయమైన చర్యలు తీసుకున్నామని సంస్థ చెప్పింది. ఇందులో భాగంగా నౌక ప్రయాణ వేగాన్ని తగ్గించడం, పోర్టుల్లో ఎక్కువ సమయం గడపడం వంటి చర్యలు చేపట్టినట్టు తెలిపింది. అయితే ఇంధన ఖర్చులు అసాధారణంగా పెరిగిపోవడంతో ఆ భారాన్ని తగ్గించడానికి ఈ చర్యలు సరిపోలేదని పేర్కొంది.

"పెరిగిన ఇంధన ఖర్చులు మొత్తాన్ని పూర్తిగా ప్రయాణికులపై వేయడం ఆచరణ సాధ్యం కాదు" అని సంస్థ తెలిపింది.

నౌక, ప్రయాణం, ఇంధన ధరలు
ఫొటో క్యాప్షన్, పెరిగిన ఇంధన ధరలు భరించలేక నౌక ప్రయాణాన్ని నిలిపివేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

రాబోయే 60 రోజుల పాటు పునర్వ్యవస్థీకరణ, అదనపు మూలధనాన్ని సమీకరించడం వంటి చర్యలపై దృష్టి పెడతామని అయితే ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో ఇప్పుడే చెప్పలేమని సంస్థ పేర్కొంది.

విల్లా వీ ఒడిస్సీ ప్రయాణం మూడున్నర సంవత్సరాల పాటు కొనసాగాల్సి ఉంది. ఈ సమయంలో దాదాపు 150 దేశాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ వెబ్‌సైట్ తెలిపింది.

అయితే ఈ నౌక ప్రయాణం మొదట్లోనే చాలాసార్లు షెడ్యూల్ ప్రకారం జరగలేదు. నౌకకు మరమ్మతులు చేయాల్సి రావడంతో ప్రయాణికులు బెల్‌ఫాస్ట్‌లో నెలల తరబడి చిక్కుకుపోయారు. ఈ పరిణామం వల్ల సంస్థకు కోట్లాదిరూపాయల నష్టం కూడా వాటిల్లింది.

ప్రపంచాన్ని చుట్టివచ్చే ప్రయాణాన్ని నిలిపివేస్తున్నట్టు మంగళవారం(అక్టోబర్ 27) ప్రకటించే సమయానికి ఈ నౌక తన ప్రయాణంలో 750 రోజులకు పైగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రయాణికులు కంబోడియాలో చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

కంబోడియాలో నౌకను ఆపేసే సమయంలో అందులో సుమారు 200 మంది ప్రయాణికులు ఉన్నారని సంస్థ వ్యపస్థాపకులు చెప్పినట్టు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ తెలిపింది.

విల్లా వీ ఒడిస్సీలో అనేక బార్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్ ఉన్న డెక్, పికిల్‌బాల్ ఆడేందుకు కోర్టు వంటి సదుపాయాలు ఉన్నాయని వెబ్‌సైట్‌లో ఉంది.

ఈ నౌకలో శాశ్వత నివాసం కోసం క్యాబిన్ల ధరలు సుమారు రూ. కోటి 14 లక్షల నుంచి 4 కోట్ల 19 లక్షల రూపాయల వరకు ఉన్నాయి.

వీటిని నెలకు రూ. 3 లక్షల 33 వేల రూపాయలు చెల్లించి అద్దెకు కూడా తీసుకోవచ్చు.

పదవీ విరమణ తర్వాతి జీవితాన్ని సముద్రంలోనే గడపాలనుకునే వారి కోసం సంస్థ జీవితకాల నివాస పథకాన్ని గత ఏడాది ప్రారంభించింది.

2024లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన కొన్ని రోజుల తర్వాత విల్లా వీ రెసిడెన్సెస్ సంస్థ "స్కిప్ ఫార్వర్డ్" పేరుతో నాలుగేళ్ల ప్రయాణ ప్యాకేజీని ప్రకటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)