భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?

నేపాల్‌, వరదలు
ఫొటో క్యాప్షన్, నేపాల్‌లో ఇటీవల వచ్చిన వరదలు హిమాలయ ప్రాంతంలో సరిహద్దు సహకారం ఆవశ్యకత నొక్కి చెప్పాయి.
    • రచయిత, నవిన్ సింగ్ ఖాడ్కా
    • హోదా, ఎన్విరాన్‌మెంట్ కరెస్పాండెంట్, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తన ప్రసంగంలో ఎక్కువ భాగాన్ని హిమాలయాల్లో పెరుగుతున్న వాతావరణ సంబంధిత విపత్తుల గురించి హెచ్చరించడానికే ఉపయోగించారు.

ఆగస్టులో నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక విధ్వంసక వరదలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అయితే, ఈ ఉమ్మడి వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు నేపాల్‌తో పాటు ప్రాంతీయ ప్రత్యర్థులైన భారత్, చైనాలను ఒకే తాటిపైకి తీసుకు వచ్చేందుకు ఆయన చేసిన ప్రతిష్టాత్మకమైన ప్రతిపాదన అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రపంచంలోనే పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటిగా, భౌగోళిక రాజకీయాల పరంగా ఎంతో కీలకమైన ఈ హిమాలయ ప్రాంతంలో సరిహద్దు విపత్తుల నిర్వహణను బలోపేతం చేయడానికి, శాస్త్రీయ సమాచారాన్ని, నైపుణ్యాలను పంచుకోవడానికి ' హిమాలయ వాతావరణ మార్పులను తట్టుకునే యంత్రాంగాన్ని’ ఏర్పాటు చేయాలని షా పిలుపునిచ్చారు.

‘హిమాలయాలు అతుకులబొంత లాంటి సమాచార సరిహద్దుగా కాకుండా, అంతర్జాతీయ సహకారానికి ప్రయోగశాలగా మారాలి" అని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలో ఉందని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

"ప్రధాని చేసిన ఈ ప్రతిపాదన ఒక రాజకీయ దిశను చూపించింది. దీనిపై ఉమ్మడి అవగాహన ఏర్పడేలా ఓ ప్రాథమిక కార్యాచరణ ప్రణాళికను (ఫ్రేమ్‌వర్క్‌ను) రూపొందించేందుకు మా మంత్రిత్వశాఖ ఇతర సంబంధిత సంస్థలతో కలిసి పని చేస్తోంది" అని ఆ అధికారి అన్నారు.

ఈ ప్రతిపాదనపై భారత్ గానీ, చైనా గానీ అధికారికంగా స్పందించలేదు. దీనిపై వారి అభిప్రాయం కోసం బీబీసీ ఆయా దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలను సంప్రదించింది.

భారత్, చైనాల మధ్య దీర్ఘకాలికంగా తీవ్రమైన ప్రాదేశిక వివాదాలు ఉన్నప్పటికీ, ఉమ్మడి వాతావరణ ముప్పును ఎదుర్కోవడానికి నేపాల్ నిజంగా ఆ రెండు ప్రాంతీయ దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకురాగలదా?

నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా
ఫొటో క్యాప్షన్, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా, సెప్టెంబర్ 24న అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు.

భారత్, చైనా మధ్య సుమారు 3,500 కిలోమీటర్ల (2,175 మైళ్ల) పొడవైన వివాదాస్పద సరిహద్దు ఉంది. దీనిలో ఎక్కువ భాగం హిమాలయ పర్వత శ్రేణుల మీదుగానే విస్తరించి ఉంది.

ఈ సరిహద్దు విషయంలో రెండు దేశాల మధ్య యుద్ధాలు, ప్రాణ నష్టంతో కూడిన ఘర్షణలు, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సైనిక ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

అయితే, రెండు దేశాల మధ్య వివాదాలకు మూలంగా ఉన్న ఈ పర్వతాలు తక్షణ వాతావరణ ముప్పును కూడా ఎదుర్కొంటున్నాయి.

హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో హిమానీనదాలు (గ్లేసియర్స్), గడ్డకట్టిన నేల కూడా వేగంగా కరుగుతోంది. ఫలితంగా కొండచరియలు విరిగిపడటం, రాళ్లు జారిపడటం, హిమానీనద సరస్సుల ఆకస్మిక వరదల ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది.

ఇలాంటి ప్రకృతి విపత్తులు దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతాయి. దీంతో దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రాణాలు, మౌలిక సదుపాయలు, జీవనోపాధులకు ముప్పు కలుగుతుంది. దీంతో, హిమాలయాలను పంచుకుంటున్న దేశాలు పరస్పరం సహకరించుకోవడం అత్యంత ఆవశ్యకంగా మారుతోంది.

హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు గతంతో పోలిస్తే చాలా వేగంగా కరుగుతున్నాయని మార్చిలో విడుదలైన ఇంటర్‌నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ నివేదిక పేర్కొంది. 2000 సంవత్సరం తర్వాత నుంచి మంచు కరిగే రేటు 1974-1999 కాలంతో పోలిస్తే రెట్టింపు అయిందని ఈ నివేదిక వెల్లడించింది.

తూర్పున ఉన్న క్వింగ్‌హై-టిబెట్ పీఠభూమిలో గత ఆరు దశాబ్దాలుగా హిమానీనదాల విస్తీర్ణం 24 శాతం మేర తగ్గిపోయిందని చైనా పీపుల్స్ డైలీ ఆన్‌లైన్‌కు చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెన్ హజార్డ్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ కాంగ్ షిచాంగ్ తెలిపారు.

హిమానీనదాలు కరగడం వల్ల హిమానీనద సరస్సులు విస్తీర్ణం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆకస్మిక, అత్యంత వినాశకరమైన వరదల ప్రభావం నేపాల్, భారత్, భూటాన్ వంటి దేశాల సరిహద్దులను దాటి పెరుగుతుందని అన్నారు. ఈ దేశాల గుండా ప్రవహించే అనేక ప్రధాన నదులు టిబెట్ పీఠభూమిలోనే పుడుతున్నాయి.

ప్రస్తుతం టిబెట్ పీఠభూమిలో 1,100 చదరపు కిలోమీటర్లకు పైగా ప్రాంతంలో విస్తరించిన 14,000 కంటే ఎక్కువ హిమానీనద సరస్సులు ఉన్నాయని పీపుల్స్ డైలీ తెలిపింది.

అంతేకాకుండా వీటి వల్ల ప్రమాదాలు వరదలకే పరిమితం కావడం లేదు.

పెరిగిన వర్షాల కారణంగా రాబోయే దశాబ్దాలలో హిమాలయాలు, టిబెట్ అంతటా కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరుగుతాయని అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ప్రచురించిన 2024 నాటి అధ్యయనం అంచనావేసింది.

ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలైన భారత్‌లోని గఢ్వాల్, కుమావూలు, నేపాల్‌లలో హిమానీనద సరస్సుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితితో పోలిస్తే అత్యధిక శాతం పెరుగుదల మాత్రం టిబెట్ పీఠభూమిలోనే నమోదవుతోందని అంచనా వేస్తున్నారు.

ప్రమాదాలు పెరుగుతున్నందున దేశాల మధ్య సహకారం మరింత ముఖ్యమైంది. కానీ, హిమాలయ పర్యావరణ సమస్యలపై కలిసి పనిచేయడానికి భారత్‌, చైనా గతంలో చేసిన ప్రయత్నాలు పెద్దగా పురోగతి సాధించలేదు.

"ఈ రెండు ఆసియా దిగ్గజాలు ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చలలో తరచుగా ఒకే తాటిపై నిలిచాయి. ఉద్గారాల తగ్గింపు విషయంలో పాశ్చాత్య దేశాల డిమాండ్లను వ్యతిరేకిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామిక దేశాలతో సమానంగా భారాన్ని మోయకూడదని ఇవి వాదిస్తూ వస్తున్నాయి."

అయినా, హిమాలయాల్లో వాతావరణ మార్పులపై ఉమ్మడిగా పని చేసేందుకు వారి మధ్య ప్రత్యేకంగా ఎలాంటి ఒప్పందం లేదు.

నేపాల్‌, వరదలు
ఫొటో క్యాప్షన్, ఆగస్టులో చైనా-నేపాల్ సరిహద్దును అతలాకుతలం చేసిన ఘోరమైన వరదలో వందలాది మంది మరణించారు.

హిమాలయాలు, టిబెట్‌లోని హిమానీనదాలపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై ఉమ్మడి పరిశోధన చేపట్టేందుకు భారత్, చైనాలు 2009లో అంగీకరించాయి.

ఈ ప్రాజెక్టుపై వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, చైనా కోల్డ్ అండ్ ఆరిడ్ రీజియన్స్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కలిసి పనిచేస్తాయని బీజింగ్ పర్యటన తర్వాత అప్పటి భారత పర్యావరణ మంత్రి జైరామ్ రమేశ్ ప్రకటించారు.

అయితే, ఆ ప్రయత్నం ముందుకు వెళ్లలేదని ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఒక శాస్త్రవేత్త అన్నారు.

"మాకు, చైనాకు మధ్య ఒక సమావేశం జరిగింది, అంతే. అంతకు మించి ముందుకు కదల్లేదు" అని ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన వాడియా ఇన్‌స్టిట్యూట్‌ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ డి.పి. దోభాల్ అన్నారు.

"ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు," అని ఆయన అన్నారు.

భారత్‌, చైనా మధ్య 2000వ దశాబ్దం ప్రారంభం నుంచి కొన్ని ఒప్పందాలు జరిగాయి. వీటి ప్రకారం టిబెట్‌లో పుట్టే రెండు ప్రధాన నదులైన బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ల వరదకు సంబంధించిన హైడ్రోలాజికల్ సమాచారాన్ని చైనా అందిస్తూ వచ్చింది.

అయితే, రెండు ఒప్పందాల గడువు ముగిసిందని 2025 ఆగస్టులో, భారత విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పార్లమెంటుకు తెలిపారు. చైనా 2023 జూన్‌ నుంచి బ్రహ్మపుత్ర నది డేటా పంచుకోవడం మానేయగా, 2022 నుంచి సట్లెజ్ నది సమాచారం అందించడం లేదు.

దీనిపై చైనా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ, 2017లో భారత్‌తో సైనిక ఉద్రికత్తల సమయంలో కూడా ఇలా సమాచారాన్ని నిలిపివేసిన బీజింగ్, సాంకేతిక సమస్యలు కారణమని పేర్కొందని సింగ్ చెప్పారు.

హిమాలయ పర్వతాలు, మంచు, తాత్కాలిక జలాశయం
ఫొటో క్యాప్షన్, హిమాలయ మంచు వేగంగా కరిగిపోతుండటంతో, వాతావరణ సంబంధిత ప్రమాదాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విపత్తులను ఎదుర్కోవడానికి అడ్డంకిగా ఉద్రిక్తతలు

భారత్, చైనా మధ్య ఇటీవల నెలకొన్న సయోధ్య కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. ఉన్నత స్థాయి రాజకీయ సంప్రదింపులు, హిమాలయ మార్గాల ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలే దీనికి నిదర్శనం.

"ఈ పరిణామాలు వాతావరణ సంబంధిత సహకారాన్ని పెంపొందించే అవకాశం ఉండొచ్చని సూచిస్తున్నాయి" అని ఇంటర్‌నేషనల్ క్రైసిస్ గ్రూప్‌ ఈశాన్య ఆసియా సీనియర్ విశ్లేషకుడు విలియం యాంగ్ అన్నారు.

అయితే, సరిహద్దు వివాదాలు ఇంకా పరిష్కారం కానందున, భారత్, నేపాల్‌లతో చేసుకునే ఏ ప్రధాన ఒప్పందం విషయంలోనైనా బీజింగ్ జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.

వాతావరణ ముప్పును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కీలకమైన సమాచారం, సైనిక పరంగా కూడా ముఖ్యమైనది కావడం ఒక ప్రధాన అడ్డంకిగా మారుతోంది.

"వాతావరణ శాస్త్రవేత్తలకు ఎంతో అవసరమైన పరిశోధనా సమాచారం, సరిహద్దుల్లో ఉన్న సైన్యాలకు మాత్రం వ్యూహాత్మక లేదా భద్రతా సమాచారంలా కనిపించవచ్చు" అని యూకే కేంద్రంగా ఉన్న డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇండో-పసిఫిక్ ప్రోగ్రామ్‌ అసోసియేట్ ఫెలో వాల్టర్ లాడ్విగ్ అన్నారు.

హిమాలయ సరిహద్దులు దాటి వచ్చే విపత్తులను ఎదుర్కోవడానికి గతంలో చేసిన ప్రయత్నాలకు కూడా ఇలాంటి ఉద్రిక్తతలు ఆటంకం కలిగించాయి.

వరద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలతో సహా పలు అంశాలపై ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి మూడు దశాబ్దాలకుపైగా కాఠ్‌మాండూ కేంద్రంగా పని చేస్తున్న ఇంటర్‌నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేడెట్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్ (ఐసీఐఎమ్‌వోడీ) కృషి చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో ఆశించినంత పురోగతి లేదు.

"సరిహద్దులు దాటి ప్రహహించే నదుల నీటి ప్రవాహాలకు సంబంధించిన సమాచారంలో చాలా సున్నితమైన అంశాలు ఉంటాయి. వాటిని దేశాలు, ముఖ్యంగా ఎగువన ఉన్న దేశాలు పంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు" అని ఐసీఐఎమ్‌వోడీ మాజీ సీనియర్ స్పెషలిస్ట్ అరుణ్ భక్త శ్రేష్ఠ అన్నారు.

దానికి బదులుగా, విపత్తు ప్రమాదాల గురించి తక్కువ సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడంపై దేశాలు దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.

ఇవి చిన్న చిన్న ఆచరణాత్మక చర్యలతో ప్రారంభించాలని భారత్‌లోని ఐఐటి మండికి చెందిన వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణా కేంద్రం అధిపతి డాక్టర్ ఉదయ్ కాలా సూచిస్తున్నారు.

ప్రమాదకరమైన హిమానీనద సరస్సులు, సరిహద్దులు దాటి ప్రభావం చూపే ముప్పులను కలిసి గుర్తించడం, సమాచార మార్పిడికి ప్రాథమిక నిబంధనలు, పర్యవేక్షణ ప్రమాణాలు రూపొందించుకోవడం, కీలకమైన హెచ్చరికలను ఆలస్యం లేకుండా పంచుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి.

"పరిస్థితులను వాతావరణ మార్పులు పూర్తిగా మార్చేస్తున్నాయి. గతంలో జరిగిన విపత్తుల నంచి కోలుకోవడం మాత్రమే ఇక సరిపోదు. భవిష్యత్తులో వచ్చే విపత్తులను ముందుగానే ఊహించగలగాలి" అని ఆయన అన్నారు.

భారత్, చైనా కనీసం ఈ చర్యలు తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాయో లేదో కూడా తెలియడం లేదు.

తమ విభేదాలను పక్కనపెట్టి, వాతావరణ ముప్పును ఎదుర్కోవడానికి కలిసి పనిచేసేలా రెండు శక్తిమంతమైన పొరుగు దేశాలను ఒప్పించడమే నేపాల్‌కు సవాలు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)