You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మనసు సృష్టించే ‘మరో ప్రపంచం’: పగటి కలలు ఎందుకు కంటారు, అది వ్యసనమా?
- రచయిత, మోలీ గోర్మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
నేను అమెరికాకు చెందిన మానసిక వైద్యుడు, పరిశోధకుడు అయిన కోలిన్ రాస్‌తో మాట్లాడినప్పుడు... నాకు ఎంత స్పష్టమైన, లీనమైపోయే పగటి కలలు వస్తాయో చెప్పాను. వాటి వల్ల నేనే స్వయంగా ఏడవడం, లేదా గట్టిగా నవ్వుతానని ఆయనకు వివరించాను.
నాకు నచ్చినప్పుడు వాటిలోకి వెళ్లగలనని, బయటకు రాగలనని, వాటిని నేను ఎంతో ఆస్వాదిస్తానని కూడా చెప్పాను. నా ఈ "విశిష్ట ప్రతిభ"కు ఆయన ముగ్ధుడై, నన్ను నటనను కెరీర్‌గా ఎంచుకోమని సూచించారు. దానిపై నాకు అంతగా నమ్మకం లేకపోయినా, ఆయన ఇచ్చిన ప్రశంసను సంతోషంగా స్వీకరించాను.
కానీ, మీ మనసులోని ఈ సినిమా ప్రపంచం నుంచి మీరు బయటకు రాలేకపోతే పరిస్థితి ఏంటి?.
'మాలడాప్టివ్ డేడ్రీమింగ్' ( క్లుప్తంగా ఎమ్‌డీ అంటారు) అనే సమస్య ఉన్నవారి పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంటుంది.
వీరు తాము మేల్కొని ఉండే సమయాల్లో సగానికి పైగా.. మనసులోనే పాత్రలు, కథలతో కూడిన సంక్లిష్టమైన, అత్యంత వివరణాత్మకమైన ఊహాలోకాలను సృష్టించుకోవడానికే కేటాయిస్తారు. తీవ్రమైన కేసులలో ప్రజలు రోజుకు 12 గంటల వరకు పగటి కలలు కనవచ్చని రాస్ చెబుతున్నారు.
వారి కథల ప్లాట్‌లైన్లు దశాబ్దాల తరబడి సాగుతూనే ఉంటాయి. ఇది వినడానికి ఎంతో అద్భుతంగా, స్ఫూర్తిదాయకంగా అనిపించవచ్చు. కానీ, ఈ వ్యక్తులు తమ అంతర్గత ప్రపంచంలో ఎంతగా లీనమైపోతారంటే... అది వారి దైనందిన జీవితానికి పెద్ద ఆటంకం కలిగిస్తుంది, తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తుంది.
ఇది మనం అనుకున్నంత అరుదైన సమస్యేమీ కాదు.
"ఇది వయోజన జనాభాలో దాదాపు 2 నుంచి 4 శాతం మందిలో ఉండే అవకాశం ఉంది" అని రాస్ అంటున్నారు.
మరి, మీ పగటి కలలు ఎప్పుడు సమస్యగా మారుతున్నాయో మీకు ఎలా తెలుస్తుంది? దీనికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?.
'పూర్తిగా లీనమైపోవడం'
పగటి కలలు కనడం సహజంగా చెడ్డ విషయమేమీ కాదు.
"మీరు అస్సలు పగటి కలలు కనకపోతే, మీ పరిస్థితి చూసి నేను బాధపడతాను" అని రాస్ అన్నారు.
పగటికలలను సాధారణ మానసిక ప్రక్రియగానే విస్తృతంగా పరిగణిస్తుంటారు. ఈ విషయంలో ప్రజలు స్వయంగా ఇచ్చిన సమాధానాల ఆధారంగా పరిశోధకులు ఒక అంచనాకు వచ్చారు. మనం మేల్కొని ఉన్నపుడు చేసే ఆలోచనలలో 30 నుంచి 50 శాతం వరకు... ఆ క్షణంలో మనం చేస్తున్న పనికి సంబంధం లేని విషయాల గురించే ఉంటాయని వారు చెబుతున్నారు.
పగటి కలలు కనడం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవడం, సానుభూతి చూపడం, సృజనాత్మకత పెరగడం వంటి ప్రయోజనాలే కాకుండా... బోర్ కొట్టకుండా చూసుకోవచ్చు. అలాగే జీవిత అనుభవాల వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడానికి కూడా ఇవి సహాయపడతాయి.
అయితే, మాలడాప్టివ్ డేడ్రీమింగ్ అనేది మనిషిని "పూర్తిగా తనలో లీనం చేసుకుంటుంది" అని రాస్ అంటున్నారు.
"ఇది మానసిక వేదనను కలిగిస్తుంది, మీ దైనందిన పనులను సరిగ్గా చేసుకోనివ్వదు... అయినప్పటికీ దీనికున్న వ్యసన స్వభావం వల్ల మీరు దీనిని ఆపకుండా చేస్తూనే ఉంటారు" అన్నారు.
ఇదే దీనిని ఒక మానసిక రుగ్మతగా మారుస్తుంది. పగటి కలల ప్రపంచం నుంచి ఎట్టకేలకు బయటకు వచ్చినప్పుడు, ఈ సమస్యతో బాధపడేవారు తమ ఊహలన్నీ వ్యర్థమని, సమయం వృథా అయిపోయిందని భావిస్తుంటారు.
అయినప్పటికీ, దీనికున్న వ్యసన గుణం వల్ల ఆ చక్రం అలా కొనసాగుతూనే ఉంటుంది. దీనిని తెంచుకుని బయటకు రావడం చాలా కష్టం.
కైలా బోర్షర్డ్స్ అనే మహిళ అనుభవాన్ని గమనిస్తే... తనకు కేవలం నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే మనసులో 'మరో ప్రపంచాన్ని' సృష్టించుకోవడం ఆమెకు గుర్తుంది.
ఆమె ఒక కొత్త పాఠశాలకు మారినప్పుడు, అక్కడ మిగతా పిల్లలు ఆమె ప్రాంతీయ యాసను చూసి ఎగతాళి చేయడంతో ఈ అలవాటు మరింత ఎక్కువైంది. ఆ ఊహాత్మక కథలే ఆమెకు ఒక "సురక్షితమైన స్థావరం"గా మారాయి. అక్కడ "నన్ను ఎవరూ ఎగతాళి చేయరు, పైగా అందరూ నన్ను ఇష్టపడతారు" అని ఆమె చెప్పారు.
బోర్షర్డ్స్‌కు పగటి కలలు రానురాను ఒక వ్యసనంగా మారి, గంటల తరబడి సాగేవి.
"చాక్లెట్లు విపరీతంగా తినాలనో, లేదా సోషల్ మీడియా చూడాలనో ప్రజలకు ఎలాంటి బలమైన కోరిక కలుగుతుందో, నాకు కూడా ఇది అలాంటి ఒక శక్తిమంతమైన కోరికలాగే అనిపించేది" అని ఆమె అన్నారు
ఒక ఆరోగ్యకరమైన అలవాటు హానికరంగా మారేది సరిగ్గా ఇక్కడే.
"వ్యక్తి తన ఊహలను నియంత్రించడం మానేసి, ఆ ఊహలే సదరు వ్యక్తిని నియంత్రించడం ప్రారంభించినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది" అని ఇజ్రాయెల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైఫాకు చెందిన ఎమెరిటస్ క్లినికల్ సైకాలజీ ప్రొఫెసర్ ఎలీ సోమర్ చెబుతున్నారు.
ఆయనే మొదటిసారిగా "మాలడాప్టివ్ డేడ్రీమింగ్" అనే పదాన్ని ప్రతిపాదించారు. రెండు దశాబ్దాలుగా ఈ సమస్యపై పరిశోధనలు చేస్తున్నారు.
సంగీతం వినడం లేదా పదే పదే అటు ఇటు నడవడం లాంటి శారీరక పనుల వల్ల ఈ పగటి కలల అలవాటు మరింత ఎక్కువవుతుంది, అలాగే కొనసాగుతుంది. ఈ ఊహాలోకంలో లీనమైనప్పుడు తమ ఏకాగ్రతను చెదరకుండా ఉంచుకోవడానికి దాదాపు 80 శాతం మంది ప్రజలు తమకు తెలియకుండానే శారీరక కదలికలను ప్రదర్శిస్తారు.
బోర్షర్డ్స్ విషయంలో ఇదెలా ఉండేదంటే... ఆమె తన ఇంటి ముందున్న దారిలో రోలర్-స్కేట్స్ వేసుకుని గంటల తరబడి అటు ఇటు తిరగడం లేదా గోడకు బంతిని విసిరి పట్టుకోవడం చేసేవారు.
పగటి కలల కోసమే ఎక్కువ సమయం కేటాయించడం వల్ల, ఈ సమస్య ఉన్నవారు సహజంగానే సామాజిక కార్యక్రమాలకు లేదా బంధాలకు దూరంగా ఉంటూ ఒంటరిగా మారిపోతారు. ఇది చివరికి వారిలో అవమాన భారాన్ని, పశ్చాత్తాపాన్ని పెంచి, ఒక దుష్పరిణామాల చక్రంగా మారుతుంది.
'నేనెప్పుడూ ప్రమోషన్ కోసం ప్రయత్నించలేదు'
కైలా బోర్షర్డ్స్ తన కెరీర్ ప్రారంభ దశలోనే... ఈ పగటి కలల అలవాటు తన ఎదుగుదలను ఎలా అడ్డుకుంటోందో గమనించారు.
"నాలో ఎలాంటి ఉత్సాహం ఉండేది కాదు. ఏ శ్రమా లేకుండా నా ఊహాలోకంలోనే నాకు సంతోషం లభిస్తున్నపుడు.. ఉద్యోగంలో ప్రమోషన్ తెచ్చుకోవడానికి అంత సమయాన్ని, శక్తిని ఎందుకు వృథా చేయాలి? పైగా ఆ ఊహలు నిజ జీవితంలో పొందే సంతోషానికి 95 శాతం సమానంగా ఉంటాయి" అని కైలా బోర్షర్డ్స్ అంటున్నారు.
"నాకు 40 ఏళ్లు పైబడినప్పుడు కూడా నేను ఎంట్రీ లెవెల్ (ప్రారంభ స్థాయి) ఉద్యోగమే చేస్తున్నాను, ఎందుకంటే నేనెప్పుడూ ప్రమోషన్ తెచ్చుకోవాలని ప్రయత్నించనే లేదు" అన్నారామె.
ఇది నిజమే అనిపిస్తుంది.
"మీకు అత్యంత ఇష్టమైన టీవీ షోను ఊహించుకోండి, అందులో మీరే హీరో. ఒకవేళ మీ ప్రస్తుత జీవితం అంత ఆసక్తికరంగా లేకపోతే, మీరు ఆ ఊహా ప్రపంచాన్ని ఎలా వదులుకోగలరు?" అని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మాలడాప్టివ్ డేడ్రీమింగ్ పరిశోధనా డైరెక్టర్, క్లినికల్ సైకాలజిస్ట్ వాండా ఫిషెరా ప్రశ్నిస్తున్నారు.
ఒక వ్యక్తికి జీవితంలో తీరని భావోద్వేగ అవసరాలు ఉన్నప్పుడు... మాలడాప్టివ్ డేడ్రీమింగ్ వాటిని నిజంగానే తీర్చుకున్నట్లు ఒక అనుభూతిని ఇస్తుంది. ఉదాహరణకు, ఈ సమస్య ఉన్నవారు సాధారణంగా తాము కనే పగటి కలలలో లీనమైపోయి, అందులో తామే అందరి ఆదరణ పొందే వ్యక్తులుగానో లేదా హీరోలుగానో ఫీలవుతుంటారు.
తన ఇంటి పేరు చెప్పడానికి ఇష్టపడని మరియా అనే మహిళ... తాను ఒక స్టేజీపై ఉన్నట్లు, ప్రజలందరూ తనవైపే చూస్తున్నట్లు తరచూ పగటి కలలు కనేవారు. అందులో ఆమె ఎంతో విజయవంతమైన, గుర్తింపు పొందిన వ్యక్తిగా కనిపించేవారు.
ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం, ఈ సమస్య ఉన్నవారిలో "నేను ఉన్నదున్నట్లుగా సరిపోనేమో, లేదా నన్ను ఇలాగే ఎవరూ ప్రేమించరేమో, లేదా నన్ను నాలా నేను ప్రదర్శించుకోలేనేమో" అనే ఒక రకమైన అవమాన భావన ఉండటమేనని ఫిషెరా చెబుతున్నారు.
"ఈ ఊహలన్నీ ఎప్పుడూ నలుగురితో సంబంధాలను కలిగి ఉండేలాగే ఉంటాయి. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి వారిలో ఉన్న తీవ్రమైన తపనను ఇవి చూపిస్తాయి" అన్నారామె.
తాను చిన్నప్పుడు ఎంతో ఒంటరితనానికి గురయ్యానని మరియా అంగీకరించారు. తన పగటి కలల లోకంలోకి వెళ్లడానికి వీలుగా ఆమె సంగీతం వింటూ గంటల తరబడి ముందూ వెనుకకు ఊగుతూ ఉండేవారు.
"ఇది మీ ఏకాగ్రతను నిరంతరం తనవైపే తిప్పుకుంటుంది. ఇది ఒక రకమైన సమాంతర ప్రపంచం" అన్నారామె.
ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆమె పడుతున్న ఈ మానసిక సంఘర్షణను అర్థం చేసుకోలేకపోయారు.
"ఇది నా చదువుకు చాలా ఆటంకం కలిగించేది. దాంతో నేను చదువుకోలేకపోయేదాన్ని. కానీ, నాకే చదువుకోవడం ఇష్టం లేదని, లేదా నేను బద్ధకస్తురాలినని అందరూ అనుకునేవారు."
మరియా రకరకాల కథలను, పాత్రలను సృష్టించేవారు. వాటిలో కొన్ని ఊహాజనితమైనవి అయితే, మరికొన్ని నిజ జీవిత వ్యక్తుల ఆధారంగా ఉండేవి. అలా ఒక కథపైనే ఏడాది పొడవునా ఆమె దృష్టి పెట్టేవారు.
ఇప్పుడు తన దగ్గర "10 సినిమాలకు సరిపడా కథలు" ఉన్నాయని మరియా అంటున్నారు. పగటి కలల లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఆ కథలతో ఏమీ చేసేవారు కాదు (కనీసం ఎక్కడా రాసి పెట్టుకునేది కూడా కాదు). పైగా సమయమంతా వృథా అయిపోయిందనే బాధపడేవారు.
ఈ సమస్య ఉన్న మిగతావారిలాగే, మరియా కూడా పెద్దయ్యాకే తనకు ఉన్నది 'మాలడాప్టివ్ డేడ్రీమింగ్' అనే సమస్య అని తెలుసుకున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నది తాను ఒక్కరినే కాదని తెలియడంతో ఆమె ఎంతో ఊరట చెందారు.
"నాలో ఏదో లోపం ఉందని, నేను అందరిలా కాకుండా వింతగా ఉన్నాననే భావనతోనే పెరిగాను" అని మరియా చెప్పారు.
మాలడాప్టివ్ డేడ్రీమింగ్ బారిన పడటానికి కారణాలు
మాలడాప్టివ్ డేడ్రీమింగ్ సమస్య తీవ్రత పెరగడానికి దారితీసే వివిధ రకాల ప్రమాదకర అంశాలను పరిశోధకులు గుర్తించారు.
ఉదాహరణకు, చిన్నతనంలో ఎదురైన మానసిక గాయాలు (నిర్లక్ష్యానికి గురికావడం, భావోద్వేగ పరమైన వేధింపులు, బంధాల పరమైన సమస్యలు) ఈ రుగ్మతకు కారణమవుతున్నట్లు కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. బాధాకరమైన జ్ఞాపకాలు, భావోద్వేగాల నుంచి తప్పించుకోవడానికి అటువంటి వ్యక్తులు ఈ పగటి కలలను ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు.
మెదడు పనితీరులో సహజమైన వైవిధ్యాలువల్ల తలెత్తే సవాళ్లను తట్టుకోవడానికి కూడా ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతోంది.
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న 235 మంది వయోజనులపై జరిపిన ఒక అధ్యయనంలో, వారిలో 43 శాతం మంది మాలడాప్టివ్ డేడ్రీమింగ్ అనుభవాలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఈ అలవాటు వారి ఒంటరితనం, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో పడుతున్న ఇబ్బందులతో ముడిపడి ఉంది.
మరికొన్ని పరిశోధనలు ఏడీహెచ్‌డీ, ఓసీడీ వంటి డిసోసియేటివ్, కంపల్సివ్ డిజార్డర్స్‌తో పాటు కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలకు, ఈ పగటి కలల అలవాటుకు మధ్య బలమైన సంబంధాలు లేదా ఒకే రకమైన ఆలోచనా విధానాలు ఉన్నట్లు చూపిస్తున్నాయి.
బోర్షర్డ్స్‌కు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు డిప్రెషన్ ఉన్నట్లు నిర్ధరణ అయింది.
"ఆ డిప్రెషనే అసలు సమస్య. దాని నుంచి తప్పించుకోవడానికి నేను నిజ జీవితానికి దూరంగా ఊహాలోకంలోకి వెళ్ళిపోయేదాన్ని" అని ఆమె చెప్పారు.
తన 40 ఏళ్ల వయసులో ఆమె డిప్రెషన్ చికిత్స కోసం ఒక నెల రోజుల పాటు సైకియాట్రిక్ యూనిట్‌లో గడిపారు. చివరికి తనకు కావలసిన సహాయం లభించినట్లు ఆమె భావించారు.
ఆమె పగటి కలలపై తిరిగి నియంత్రణ సాధించడానికి ఇది ఒక కీలక మలుపుగా మారింది. ఆ తర్వాత ఆమె పగటి కలలు మళ్లీ సృజనాత్మకంగా, ఆనందాన్ని ఇచ్చేవిగా మారాయి. వాటిని కనాలనే వ్యసనం ఆమెలో తగ్గిపోయింది.
మరియాకు ఎలాంటి మానసిక ఆరోగ్య సమస్య ఉన్నట్లు నిర్ధరణ కాలేదు. కానీ, ఆమెకు సహాయం చేయడానికి ఒక ప్రత్యేక థెరపిస్ట్ ఉన్నారు.
"ఏడీహెచ్‌డీతో దీనికున్న పోలికలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే విపరీతమైన ఊహల్లో మునిగిపోవడం బయట ఉన్నవారికి శ్రద్ధ లేకపోవడం (అలసత్వం) లాగా కనిపిస్తుంది. అలాగే ఓసీడీతో చూస్తే... మనసులోకి బలవంతంగా ఆలోచనలు రావడం, వాటిని ఆపలేకపోవడం, వాటి నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడటం వంటి ఉమ్మడి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి" అని సోమర్ చెప్పారు.
కానీ "పోలికలు ఉన్నంత మాత్రాన రెండూ ఒకటి కావు" అని ఆయన స్పష్టం చేశారు.
"మాలడాప్టివ్ డేడ్రీమింగ్‌ను పూర్తిగా ఏడీహెచ్‌డీ లేదా ఓసీడీగా మార్చి చూడలేమని ప్రస్తుత ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఒక ఊహాత్మక కథల ప్రపంచంలో పూర్తిగా మునిగిపోవడం, బాహ్య ప్రపంచాన్ని మరచిపోవడం, ఆ అంతర్గత లోకంతో భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకోవడం వంటి ప్రత్యేకమైన అనుభవాలు ఇందులో ఉంటాయి" అన్నారు సోమర్.
అయితే, మాలడాప్టివ్ డేడ్రీమింగ్ నిజ జీవిత సవాళ్లను తట్టుకోవడానికి సహాయపడే ఒక రక్షణ కవచమా ? లేక నిజ జీవితానికి, మీ అసలు గుర్తింపునకు మిమ్మల్ని దూరం చేసే ఒక మానసిక రుగ్మతా? ఆధారాలను బట్టి చూస్తే... ఇది చాలావరకు ఈ రెండూ కావచ్చునని సైకాలజీ ప్రొఫెసర్ ఎలీ సోమర్ చెప్పారు.
"చాలామందిలో మాలడాప్టివ్ డేడ్రీమింగ్ ఒంటరితనం, ఒత్తిడి, మానసిక గాయాల వల్ల కలిగే బాధ లేదా తీరని భావోద్వేగ అవసరాల నుంచి తట్టుకోవడానికి ఒక రక్షణ కవచంగానే మొదలవుతుంది. కానీ, కొంతమందిలో ఇది దీర్ఘకాలికమైన, వ్యసనపూరితమైన, బాహ్య ప్రపంచాన్ని మరచిపోయేలా చేసే ఒక మానసిక రుగ్మతగా మారుతుంది" అని ఆయన వివరిస్తున్నారు.
"అందుకే దీనిని నేను ఒక తప్పుడు రక్షణ విధానంగా అభివర్ణిస్తాను. ఇది తీవ్ర రూపం దాల్చినప్పుడు, దానికి అదే ఒక ప్రత్యేకమైన మానసిక రుగ్మతగా మారుతుంది" అన్నారు ప్రొఫెసర్ ఎలీ సోమర్.
చికిత్స ఉందా?
మాలడాప్టివ్ డేడ్రీమింగ్‌ను సోమర్, ఆయన సహచరులు ఒక క్లినికల్ సమస్యగా పరిగణిస్తున్నప్పటికీ... దీనికి ఇంకా 'డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్' లేదా 'ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్' లలో అధికారిక గుర్తింపు లభించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్యపై ఇప్పటివరకు భారీ స్థాయిలో అధ్యయనాలు జరగలేదు, కానీ చిన్న చిన్న నమూనాలతో అనేక పరిశోధనలు జరిగాయి. ఈ కారణంగానే దీనికి శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఒక ప్రామాణిక చికిత్సను ఇంకా ఖరారు చేయలేకపోయారని సోమర్ చెప్తున్నారు.
"అయినప్పటికీ, ప్రారంభ క్లినికల్ ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి" అని ఆయన అంటున్నారు.
"మానసిక చికిత్స దీనికి సహాయపడుతుందని కేస్ రిపోర్టులు, ప్రారంభ చికిత్సా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అలవాటును రేకెత్తించే అంశాలు, బలవంతపు ఆలోచనలు, ఏకాగ్రతపై నియంత్రణ, భావోద్వేగాల క్రమబద్ధీకరణ, తప్పించుకునే ధోరణి, అవమాన భావన వంటి వాటిపై దృష్టి పెట్టినప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి" అన్నారు సోమర్.
ఈ చికిత్స ముఖ్య ఉద్దేశం ఊహాశక్తిని పూర్తిగా తుడిచిపెట్టడం కాదు; వ్యక్తికి తన ఆలోచనలపై తిరిగి ఎంపికను, పట్టును, నియంత్రణను అందించడమే. తద్వారా ఆ 'ఊహాశక్తి జీవితాన్ని' నాశనం చేయడానికి కాకుండా, జీవిత ఎదుగుదలకూ ఉపయోగపడుతుందని సోమర్ పేర్కొన్నారు.
మాలడాప్టివ్ డేడ్రీమింగ్ గురించి తెలిసి, దానికి చికిత్స చేయగల థెరపిస్ట్‌లు దొరకడం ప్రస్తుతం చాలా కష్టంగా ఉంది. ఒకవేళ మీరు కూడా ఈ పగటి కలల ప్రపంచంలో ఎక్కువగా మునిగిపోతుంటే, థెరపీ గురించి ఆలోచించే ముందే ఈ కింది వ్యూహాలను ప్రయత్నించవచ్చని ఫిషెరా సూచిస్తున్నారు:
- మీరు రోజులో ఎంత సమయం పగటి కలలు కంటున్నారు, అవి ఎప్పుడు వస్తున్నాయో ఒక చోట రాసి పెట్టుకోండి. ఒకవేళ మీరు పగటి కలల కోసం నాలుగు గంటలు కేటాయిస్తుంటే, ఆ సమయాన్ని మరో విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచించండి. ఉదాహరణకు, ఏదైనా కొత్త హాబీని ప్రారంభించవచ్చా?
- మెదడుకు శిక్షణ ఇవ్వడానికి ప్రస్తుత క్షణంలో జీవించడాన్ని సాధన చేయండి. తక్షణ ఆనందం ఇచ్చే చిన్న చిన్న విషయాలకు దూరంగా ఉంటూ... పుస్తకాలు చదవడం, ఎక్కువ నిడివి గల కంటెంట్‌ను అర్థం చేసుకోవడం వంటివి చేయండి.
- మీలో ఈ అలవాటును రేకెత్తించే అంశాలను గుర్తించి వాటికి దూరంగా ఉండండి. ఉదాహరణకు, సంగీతం వినడం మానేసి పాడ్‌కాస్ట్‌లు వినడం అలవాటు చేసుకోండి. ఒంటరిగా ఉండే సమయాన్ని తగ్గించుకోండి. "నా క్లయింట్ ఒకరు తన పిల్లి గదిలో ఉన్నప్పుడు పగటి కలలు కనలేనని చెప్పారు, అందుకే ఆ పిల్లి ఎప్పుడూ ఆమె గదిలోనే ఉండేలా చూసుకుంటారు" అని ఫిషెరా ఒక ఉదాహరణను పంచుకున్నారు.
ఈ సమస్య నుంచి బయటపడటం ఎంతో శ్రమతో కూడిన ప్రయాణం అయినప్పటికీ, దీనిని ఖచ్చితంగా అధిగమించవచ్చని ఫిషెరా స్పష్టం చేస్తున్నారు.
మరియా అనుభవమే దీనికి ఉదాహరణ. ఆమెకు రాయడం ఇష్టమని తెలుసుకుని, పగటి కలలు కనడానికి బదులు ఆ కథలను కాగితంపై పెట్టడం ప్రారంభించారు.
ఇప్పుడు బోర్షర్డ్స్ కూడా పగటి కలలతో ఒక సానుకూల బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె 'రెడిట్' లో ఈ సమస్య ఉన్నవారి కోసం ఒక కమ్యూనిటీని కూడా నడుపుతున్నారు. దీనికి వారానికి 18,000 మంది విజిటర్స్ వస్తుంటారు. తమకు కూడా ఈ సమస్య ఉందేమోనని అనుమానించే వారి సంఖ్య ఇందులో రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ సమస్యతో పోరాడుతున్న ఎవరికైనా బోర్షర్డ్స్ చెప్పే మాట ఒక్కటే, "ఇది జీవితాంతం ఇలాగే ఉండకపోవచ్చు".
ఆమె తన మనసులోని కథలను ఇప్పుడు ఎంతో గౌరవిస్తారు.
ఎందుకంటే "నా మీద నాకు నమ్మకం లేని సమయంలో, నా మనసులోని ఆ పాత్రలే నన్ను నమ్మాయి" అని ఆమె అంటున్నారు.
"మనసులో కథలు ఉండటం సమస్య కాదు. ఆ కథలకు వ్యసనపరులుగా మారిపోవడమే అసలైన సమస్య. సోషల్ మీడియాలో దాదాపు ప్రతి ఒక్కరూ గమనించలేకపోతున్న ముఖ్యమైన వ్యత్యాసం ఇదే" అన్నారు బోర్షర్డ్స్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)