అలసటగా అనిపిస్తోందా? మీ శరీరం ఏం హెచ్చరిస్తోంది

    • రచయిత, డాక్టర్ హిమాని, రేడియేషన్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

రోజువారీ జీవితంలో "బలహీనంగా ఉండడం", "ఎప్పుడూ అలసటగా ఉండడం", "మెట్లు ఎక్కితే ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం", "తల తిరగడం" వంటి సమస్యలను చాలామంది సాధారణంగానే తీసుకుంటారు.

కానీ ఈ లక్షణాల వెనుక చాలా సందర్భాల్లో దాగి ఉండేది రక్తహీనత (Anemia) అనే ఆరోగ్య సమస్య.

భారతదేశంలో మహిళలు, గర్భిణులు, పిల్లలు, వృద్ధుల్లో ఇది అత్యంత సాధారణ సమస్యల్లో ఒకటి.

సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే గుండె, మెదడు, గర్భస్థ శిశువు ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం పడుతుంది.

భారతదేశంలో రక్తహీనత ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య.

రక్తహీనత అంటే ఏంటి?

మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల్లో "హిమోగ్లోబిన్" అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని అవయవాలకు తీసుకెళ్తుంది. ఈ హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోవడం లేదా ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడాన్ని రక్తహీనత లేదా అనీమియా అంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం:

పురుషుల్లో హిమోగ్లోబిన్ 13 g/dL కన్నా తక్కువగా ఉన్నప్పుడు, మహిళల్లో 12 g/dL కన్నా తక్కువగా ఉంటే, గర్భిణుల్లో 11 g/dL కన్నా తక్కువగా ఉన్నప్పుడు అనీమియాగా పరిగణిస్తారు.

భారత్‌లో ముఖ్యంగా గర్భిణులు, బాలికలు, చిన్న పిల్లలు, పోషకాహార లోపం ఉన్నవారు ఎక్కువగా రక్తహీనతకు గురవుతున్నారు.

భారత మహిళల్లో సగం మందికి పైగా ఏదో ఒక స్థాయిలో అనీమియాతో బాధపడుతున్నట్టు పలు జాతీయ సర్వేల్లో తేలింది.

రక్తహీనత ఎందుకు వస్తుంది?

1. ఐరన్ లోపం

ఇది అత్యంత సాధారణ కారణం. శరీరంలో ఐరన్ తక్కువైతే హిమోగ్లోబిన్ తయారీ తగ్గుతుంది.

కారణాలు:

సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువ రక్తస్రావం, మెనోరేజియా(నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం, పీరియడ్స్ ఎక్కువ రోజులుండడం), గర్భధారణ, కడుపులో పురుగులు వంటివాటివల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది.

2. విటమిన్ లోపాలు

విటమిన్ బీ12, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా రక్తహీనత వస్తుంది.

3. దీర్ఘకాలిక వ్యాధులు

కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల్లో కూడా అనీమియా కనిపిస్తుంది.

4. జన్యుపరమైన వ్యాధులు

తలసేమియా, సికిల్ సెల్, అనీమియా వంటి వ్యాధులు కుటుంబ వారసత్వంగా వస్తాయి.

5. రక్త స్రావం

మొలలు, పేగులో పుండ్లు ( అల్సర్స్), గర్భాశయ సమస్యలు, ప్రమాదాలు వంటి పరిస్థితుల్లో రక్తం పోవడం వల్ల అనీమియా వస్తుంది.

రక్తహీనత వల్ల ప్రారంభంలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ ఎక్కువయ్యేకొద్దీ

అలసట, బలహీనత, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి ఆడకపోవడం,

ముఖం, కళ్ల కింద నల్లగా కనిపించడం, జుట్టు రాలడం, గోళ్లు బలహీనపడడం, ఏకాగ్రత తగ్గడం వంటివి ఉటాయి.

తీవ్రమైన అనీమియాలో ఛాతీ నొప్పి, గుండె సమస్యలు, మూర్ఛ, గర్భిణుల్లో ప్రసవ సమస్యలు కూడా రావచ్చు.

గర్భిణుల్లో రక్తహీనత ఎందుకు ప్రమాదకరం?

గర్భధారణ సమయంలో తల్లి శరీరానికి, బిడ్డ ఎదుగుదలకు ఎక్కువ ఐరన్ అవసరం ఉంటుంది. ఈ సమయంలో రక్తహీనత ఉంటే ముందస్తు ప్రసవం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, తల్లిలో అధిక అలసట, ప్రసవ సమయంలో ప్రమాదాలు ( పోస్ట్ పార్టం హెమరేజ్)

పెరిగే అవకాశం ఉంది.

అందుకే గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తప్పనిసరిగా ఇస్తారు. పిల్లల్లో రక్తహీనత వల్ల ఎదుగుదల మందగిస్తుంది. చదువులో దృష్టి తగ్గుతుంది.

జ్ఞాపకశక్తి తగ్గుతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే చిన్నప్పటి నుంచే పోషకాహారం చాలా ముఖ్యం.

ఎలా నిర్ధరిస్తారు?

రక్తహీనతను నిర్ధారించడానికి సాధారణంగా ఈ పరీక్షలు చేస్తారు.

కంప్లీట్ బ్లడ్ కౌంట్(సీబీసీ) - హిమోగ్లోబిన్ స్థాయి, రక్త కణాల వివరాలు తెలుస్తాయి.

పెరిఫెరల్ స్మియర్ - రక్త కణాల ఆకారం, పరిమాణం తెలుసుకోవచ్చు.

సీరమ్ ఫెరిటిన్ - శరీరంలో ఐరన్ నిల్వలు తెలుసుకోవడానికి.

విటమిన్ బీ12, ఫోలేట్ పరీక్షలు - కొన్ని సార్లు అవసరమైతే మలం పరీక్ష,

ఎండోస్కోపీ , కొలోనోస్కోపీ, బోన్ మారో పరీక్షలు చేయవచ్చు.

రక్తహీనతకు చికిత్స కారణాన్ని బట్టి ఉంటుంది.

1. ఐరన్ మాత్రలు

సాధారణంగా మొదటి ఎంపిక. వైద్యుల సూచన ప్రకారం కొన్ని నెలలు తీసుకోవాలి.

2. ఐరన్ ఇంజెక్షన్లు

తీవ్రమైన లోపం లేదా మాత్రలు తట్టుకోలేని వారికి.

3. రక్తం ఎక్కిండం

చాలా తీవ్రమైన అనీమియాలో మాత్రమే అవసరం.

4. కారణానికి చికిత్స

ఉదాహరణకు, మొలలుకు చికిత్స, పుండ్లకు చికిత్స, నెలసరిలో అధిక రక్తస్రావం నియంత్రణ.

ఆహారంలో ఏం తీసుకోవాలి?

ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు -ఆకుకూరలు, గోంగూర, పాలకూర, బీట్‌రూట్, ఖర్జూరాలు, కిస్మిస్, జాగరీ (బెల్లం),పప్పులు,శనగలు,మటన్ లివర్

విటమిన్ సీ అధికంగా ఉండే నిమ్మకాయ, కమలా పండు, ఉసిరి వల్ల రక్తం పెరుగుతుంది.

భోజనం వెంటనే టీ లేదా కాఫీ తాగితే ఐరన్ శోషణ తగ్గుతుంది. కనీసం ఒక గంట గ్యాప్ ఇవ్వాలి.

శాకాహారుల్లో ఐరన్, బీ12 లోపం వచ్చే అవకాశం కొంత ఎక్కువ. కానీ సరైన ఆహార ప్రణాళికతో దీనిని నివారించవచ్చు. పప్పులు, ఆకుకూరలు, బీన్స్, నట్స్, బలవర్థక ఆహారం ఉపయోగపడతాయి.

క్యాన్సర్ రోగుల్లో కూడా రక్తహీనత సాధారణం. వ్యాధి ప్రభావం, కీమోథెరపీ,పోషకాహార లోపం, రక్తస్రావం.

అనీమియా వల్ల అలసట పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ ప్రభావంపైనా ఇది ప్రభావం చూపొచ్చు. అందుకే సరైన పర్యవేక్షణ అవసరం.

(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.