You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెజ్ బిర్యానిలో చికెన్ ముక్కలు, స్విగ్గీ యజమానికి నాన్ బెయిలబుల్ వారంట్
స్విగ్గీ యాప్ నుంచి ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడంతో వినియోగదారుడు కన్స్యూమర్ ఫోరంలో కేసు వేశారు.దీనిపై స్విగ్గీ యాజమాన్యం స్పందించకపోవడంతో వినియోగదారుల ఫోరం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటు జారీ చేసింది.
ఈ సంఘటన కర్నూలులో జరిగింది.
కర్నూలుకు చెందిన పోచా రాజశేఖర రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి.
2025 మార్చి 22న స్విగ్గీ ద్వారా కర్నూలులోని హోటల్ న్యూ అప్సర నుంచి 320 రూపాయల విలువైన వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు.
వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడంతో రాజశేఖర రెడ్డి వినియోగదారుల ఫోరంని ఆశ్రయించారు.
కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టం 2019 లోని సెక్షన్ 34, 35 కింద రాజశేఖర్ రెడ్డి కేసు వేశారు.
స్విగ్గీ కంపెనీ, హోటల్ నుంచి క్షమాపణతో పాటు, తాము అనుభవించిన మానసిక క్షోభకు అలాగే 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోరారు.
"ఆర్డర్ ఆలస్యం అయింది. చెప్పిన దాని కంటే తక్కువ వచ్చింది. అన్నిటికీ మించి తింటున్నప్పుడు అందులో కోడి మాంసం ముక్క కనిపించింది. మతపరమైన ఆహారపు అలవాట్లకు ఇది వ్యతిరేకం కాబట్టి అది వారికి తీవ్ర మానసిక క్షోభను కలిగించింది. వారు వెంటనే స్విగ్గీని సంప్రదించారు. ఫోటోలు కూడా పంపారు కానీ స్విగ్గీ స్పందించలేదు. పదిరోజుల తరువాత అంటే 2025 ఏప్రిల్ 1న స్విగ్గీ వివరణ అడిగింది. కానీ, ఈమెయిల్ ఐడిలో సమస్య వచ్చింది. ఈమెయిల్ అప్డేట్ చేయమని రాజశేఖర్ రెడ్డి కోరినా స్విగ్గీ ఆ పని చేయలేదని ఫిర్యాదుదారు కేసు వేశారు'' అని ఫోరం తన ఉత్తర్వుల్లో తెలిపింది.
''ఆ రోజు శనివారం. రాత్రి 9 గంటల ప్రాంతంలో స్విగ్గీ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం. వెజ్ బిర్యానీలో నాన్ వెజ్ పీసులున్నాయి. మా వైఫ్ శనివారం తినదు. దానిపై స్విగ్గీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. కేవలం చాట్ బాట్ సమాధానమే ఉంటుంది. ఫిర్యాదులు చేయగా చేయగా ఒక కాల్ చేశారు. అందులోనూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. 30 రూపాయలు ఇస్తాం, 40 రూపాయలు ఇస్తాం అన్నారు. దీంతో మేం స్విగ్గీకి నోటీస్ ఇచ్చాం. స్పందించలేదు. రెండో నోటీస్ ఇచ్చాం. అయినా స్పందించకపోవడంతో కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాం'' అని బీబీసీకి చెప్పారు ఫిర్యాదుదారు రాజశేఖర రెడ్డి.
స్విగ్గీ ఎండీ, సీఈవో మాజేటి శ్రీహర్ష, స్విగ్గీ సంస్థకు చెందిన ఆకాంక్ష జైన్, బుండీ టెక్నాలజీస్ ప్రై లిమిటెడ్ గ్రీవెన్స్ అధికారి, కర్నూలు హోటెల్ న్యూ అప్సర మేనేజర్లను కేసులో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
స్విగ్గీ వారు ఈ కేసులో న్యాయవాదిని పెట్టుకోగా, అప్సర హోటల్ అసలు కేసు విచారణకు హాజరు కాలేదు.
''స్విగ్గీ వారు మొదట్లో రాలేదు. కేసు చివరి దశకు వచ్చిన తరువాత వాళ్ల లాయర్ వచ్చారు'' అని చెప్పారు రాజశేఖర రెడ్డి.
ఈ కేసు విచారించిన కర్నూలు జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ది డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రీఅడ్రస్సెల్ కమిషన్) 2025 డిసెంబరు 31న ఉత్తర్వులు జారీ చేసింది.
కమిషన్ అధ్యక్షుడు కరణం కిశోర్ కుమార్, ఎన్.నారాయణ రెడ్డి, ఎస్.నజీమా కౌసర్ ఈ ఆదేశాలు ఇచ్చారు.
''శాకాహారం బదులు మాంసాహారం ఇవ్వడం, వినియోగదారుల హక్కును హరించడంతో పాటు మతపరమైన సెంటిమెంట్ కు భంగం కలిగించడమే. అలాగే ఆర్డర్ చేసిన ఫుడ్ ఇవ్వకపోవడం 'బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్' కిందకు వస్తుందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఆఖరికి ఆ వినియోగదారుడు చేసిన ఫిర్యాదులపై స్పందించలేదు. చర్యలు తీసుకోలేదు'' అని కన్స్యూమర్ కోర్టు అభిప్రాయపడింది.
''శాకాహారం స్థానంలో మాంసాహారం ఇవ్వడం కేవలం సేవాలోపం మాత్రమే కాదు, ఇది మతపరమైన విశ్వాసాలను, డైట్ రిస్ట్రిక్షన్లను, వ్యక్తిగత నమ్మకాలకు భంగం కలిగిస్తుంది'' అని కోర్టు అభిప్రాయపడింది.
అయితే ఈ కేసులో తాము కేవలం మధ్య వర్తులం కాబట్టి హోటల్ తప్పుకు తాము బాధ్యులం కాదని స్విగ్గీ తరపు న్యాయవాది వాదించారు.
కానీ కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు.
''స్విగ్గీ టెక్నాలజీ ఆధారిత డెలివరీ కంపెనీ. సర్వీస్ చార్జ్ తీసుకుంటారు. ఫుడ్ ఐటెమ్‌ల గురించి యాడ్స్ ఇస్తారు. పేమెంట్ ప్రొసెస్ చేస్తారు. నాణ్యత, సమస్యల గురించి స్పందిస్తారు. వినియోగదారుడు ఆ సంస్థపై ఆధారపడ్డ తరువాత, ఆ సంస్థ తన బాధ్యత నుంచి తప్పకుని పూర్తి బాధ్యత రెస్టారెంట్ పై నెట్టలేదు. అన్నిటికీ మించి తమకు ఫిర్యాదు అందినా, ఆఖరికి లీగల్ నోటీసులు అందినప్పటికీ, వారు స్పందించలేదు. ఇక హోటల్ బాధ్యత కూడా కచ్చితంగా ఉంది'' అని కోర్టు తన ఉత్తర్వుల్లో రాసింది.
''ఇందులో అన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఉంది. అలాగే వారికి కలిగిన మానసిక వ్యధ వెలకట్టలేనిది. అయినప్పటికీ వారు కోరిన రూ. 5 లక్షలు పెద్ద మొత్తం. ప్రతివాదులు అంతా కలసి వినియోగదారుడికి 50 వేలు పరిహారం ఇవ్వాలి. కోర్టు ఖర్చుల నిమిత్తం 5 వేలు ఇవ్వాలి. లిఖితపూర్వక క్షమాపణలు చెప్పి, భవిష్యత్తులో ఇలా జరగవని రాసివ్వాలి. ఈ మొత్తం 45 రోజుల్లో చెల్లించాలి. ఆలోపు చెల్లించకపోతే ఆలస్యమైన దానికి ఏడాదికి 9 శాతం చొప్పున వడ్డీతో ఇవ్వాలి'' అని ఆదేశాలు ఇచ్చింది కోర్టు.
ఈ కేసు ఉత్తర్వుల్లో గతంలో బెంగళూరు కన్స్యూమర్ కోర్టు, నిషా వర్సెస్ స్విగ్గీ కేసులో ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే ఫ్లిప్ కార్ట్ వర్సెస్ యూపీ ప్రభుత్వం కేసులను రిఫర్ చేశారు.
అయితే 2026 జనవరి 3నే ఈ కేసులో ఆదేశాలు వచ్చినా, వినియోగదారుడికి నష్టపరిహారం అందలేదు.
దీంతో వారు మరోసారి కమిషన్‌ను ఆశ్రయించారు.
మే 21న, స్విగ్గీ యజమాని, ప్రతినిధులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది వినియోగదారుల కమిషన్.
''తీర్పు వచ్చినా వారు పరిహారం ఇవ్వలేదు. దీంతో ఇఎ పిటిషన్ వేశాం. స్విగ్గీ వారు కూడా వకాలత్ వేశారు. కానీ, న్యాయవాది మొదట వచ్చి తాము ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తున్నాం అన్నారు. సరే అని కమిషన్ గడువు ఇచ్చి, ఆ వివరాలు ఇమ్మని కోరింది. కానీ వారు మళ్లీ రాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు'' అని బీబీసీకి చెప్పారు ఈ కేసులో వినియోగదారుని తరపు వాదించిన న్యాయవాది శివపురం మాధవి.
స్విగ్గీ సంస్థ ఉద్యోగులపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ఉత్తర్వులు వచ్చాయి.
అయితే హోటల్ న్యూ అప్సర ప్రతినిధిపై వారెంట్ వచ్చిందా లేదా అన్నది స్పష్టత లేదు.
ఈ వ్యవహారంపై స్విగ్గీ, హోటల్ న్యూఅప్సర యాజమాన్యాల స్పందన కోసం ప్రయత్నిస్తున్నాం. వారి స్పందన రాగానే ఈ కథనంలో అప్డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)