You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టైర్‌లో ఇరుక్కున్న గుర్రం పిల్ల.. ఎలా బయటకు తీశారంటే
- రచయిత, కరోలిన్ గాల్
- హోదా, వెస్ట్ మిడ్‌ల్యాండ్స్
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
పొలంలో ఉన్న ఒక ట్రాక్టర్ టైర్‌లో ఇరుక్కుపోయిన గుర్రపు పిల్లను చాకచక్యంగా రక్షించారు.
ఇంగ్లండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్ ప్రాంతంలోని పొలంలో ఉన్న ఒక పెద్ద టైర్‌లో ఆ గుర్రం పిల్ల పూర్తిగా ఇరుక్కుపోయింది.
అందులో నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న గుర్రపు పిల్లను చూసిన స్థానికులు ఆర్‌ఎస్‌పీసీఏ అనే జంతువుల సంక్షేమ సంస్థకు సమాచారం ఇచ్చారు.
ఆర్‌ఎస్‌పీసీఏ బృందం ఆ టైర్‌ను పైకి లేపగా, రెస్క్యూ ఆఫీసర్ నికోలా రిలే దశల వారీగా ఆ గుర్రం పిల్లను బయటకు తీశారు. టైర్‌లో ఇరుక్కున్న గుర్రం పిల్ల భయాందోళనలో ఉన్నట్లు వారు గమనించారు.
ముందుగా దాని కాళ్లు, భుజాల భాగాన్ని బయటకు తీసి ఆ తర్వాత మెడ భాగాన్ని నెమ్మదిగా టైర్ నుంచి బయటకు తీసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
దానికి ఎలాంటి గాయాలు కాలేదని, అది పూర్తిగా కోలుకునే వరకు నికోలా రిలే దాని పరిస్థితిని పర్యవేక్షించారని వెల్లడించారు.
'ఇది చాలా డెలికేట్ రెస్క్యూ ఆపరేషన్' అని రిలే చెప్పారు.
ఆ గుర్రపు పిల్ల ఒంటిపై ఉన్న వెంట్రుకలన్నీ మట్టితో కలిసిపోయి జడలు కట్టుకుపోయాయని, అది చాలా భయపడిపోయినట్లు స్పష్టంగా కనిపించిందని ఆమె అన్నారు.
‘ఎలాంటి గాయం కాకుండా బయటకు’
'దశల వారీగా దాన్ని క్షేమంగా బయటకు తీశాం. మొదట దాని కాళ్లు, తర్వాత భుజాలు, మెడను బయటకు తీశాం. అందరూ కలిసికట్టుగా పని చేయడంతోనే దానికి ఎలాంటి గాయం కాకుండా బయటకు తీయగలిగాం' అని ఆమె వివరించారు.
టైర్ నుంచి బయటపడిన తర్వాత అది కాసేపు 'తడబడుతూ' నడిచిందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక అది పూర్తిగా కోలుకొని మామూలుగా నడిచి వెళ్లిపోయిందని తెలిపారు.
అది పూర్తిగా కోలుకుందో లేదో తెలుసుకోవడానికి నికోలా మరో గంట పాటు దాన్ని పర్యవేక్షించారు.
పొలంలోని ఇతర జంతువులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ఆ టైర్‌ను అక్కడి నుంచి తొలగించారు.
'అది త్వరగానే కోలుకుంది. ఎప్పటిలాగే పొలంలో గడ్డి మేస్తూ తిరగడం మొదలుపెట్టింది. కానీ, కొంచెం అటుఇటైనా పరిస్థితి మరోలా ఉండేది. సమయానికి స్పందించి సహాయం చేసిన స్థానికులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)