రాయలసీమలో పరిశ్రమలు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఎందుకు వస్తున్నాయి?

  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

రాయలసీమకు రాయల్ ఎన్‌ఫీల్డ్, అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ పరిశ్రమలు వస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

సీమకు ఒక చివర సత్యవేడు సమీపంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ, మరో చివర పుట్టపర్తిలో యుద్ధ విమాన సంబంధిత పరిశ్రమలు రాబోతున్నాయి.

ఆసక్తికరమైన అంశం ఏంటంటే... ఈ రెండు ప్రదేశాలూ రాయలసీమకు సరిహద్దుల్లోనే ఉన్నాయి. అంతేకాదు, ఆ రెండు ప్రదేశాలూ, ఒకటి చెన్నై ఓడరేవుకు, మరొకటి బెంగళూరు విమనాశ్రయానికి దగ్గరగా ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ చిత్తూరు జిల్లా సత్యవేడు దగ్గరలోని రాళ్ళకుప్పం, వానల్లూరు గ్రామాల సమీపంలోని ఒక ప్లాంటును ప్రారంభించబోతుంది.

ఈ ప్రదేశం చెన్నై ఓడరేవుకు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల రోడ్డు ప్రయాణం.

అడ్వాన్స్‌డ్మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీకి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణాన్ని ఎంచుకున్నారు.

ఈ పట్టణం బెంగళూరు విమానాశ్రయానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే సుమారు 2 నుంచి 3 గంటలు పడుతుంది.

నిజానికి ట్రాఫిక్ బాగా ఉన్న సమయాల్లో బెంగళూరు నగరంలోని కొన్ని ప్రదేశాల నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడానికి కూడా అంతే సమయం పడుతుంది.

రాయలసీమ భౌగోళికంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంది. దీంతో బెంగళూరు, చెన్నై నగరాలు రాయలసీమకు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ రెండు నగరాలు, ఆ రెండు రాష్ట్రాలకు ఒక మూలగానూ, రాయలసీమకు దగ్గరగానూ ఉంటాయి.

ఉదాహరణకు అనంతపురం నుంచి బెంగళూరు సుమారు 200 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుపతి నుంచి చెన్నై సుమారు 130 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటాయి.

ఇక కుప్పం పట్టణం మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఉంటుంది. కుప్పం నుంచి గట్టిగా 20 కి.మీలు ప్రయాణిస్తే రాష్ట్రాల సరిహద్దులు మారిపోతాయి.

ఇక, బెంగళూరు నగరానికి సుమారు 100 కిమీ దూరంలో ఉంటుంది కుప్పం. ఆ అనుకూలతను వాడుకుని అక్కడ ఒక విమానాశ్రయం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

‘అది మన అదృష్టం’

బెంగళూరు నగరానికి రెండో విమానాశ్రయం కావాలి. ఆ రెండో విమానాశ్రయం ద్వారా ప్రయోజనం పొందాలని మూడు రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయి.

కర్ణాటక ప్రభుత్వం రెండో విమానాశ్రయం కడతామని ప్రకటించింది. తమిళనాడు ప్రభుత్వం బెంగళూరు పక్కనే తమిళనాడు పరిధిలోని హోసూరులో విమానాశ్రయం కట్టాలని ఆలోచించింది.

కుప్పం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఎయిర్‌పోర్టు కట్టాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది. అలా సీమ సరిహద్దులోని బెంగళూరు, చెన్నై నగరాలూ సీమకు చాలా ఉపయోగపడుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో 1980ల తరువాత హైదరాబాద్‌లో కోస్తా, రాయలసీమ వాసులు పెట్టుబడులు పెంచారనీ, అంతకుముందు, రాయలసీమ వాసుల పెట్టుబడులు, పెద్ద ఆసుపత్రుల కోసం, ఇతరత్రా అవసరాల కోసం చెన్నై,బెంగళూరుపై ఎక్కువగా ఆధారపడే వారని తరచూ సీమ వాసులు చెబుతుంటారు.

ఇప్పుడు పెట్టుబడిదారులు తమ ఫ్యాక్టరీలు స్థాపించడానికి, అత్యంత కీలకమైన విమానాశ్రయాలు, ఓడరేవులు, జాతీయ రహదారులతోపాటు సమీపంలోనే పెద్ద నగరాలు ఉండటం.. సీమ సరిహద్దు ప్రాంతాలకు కలసి వచ్చాయి.

''బెంగళూరు విమానాశ్రయం నుంచి బెంగళూరు నగరంలోకి వెళ్లేలోపు అనంతపురానికి వచ్చేయవచ్చు. అందుకే అందరూ మన పక్కకు రావాలని ఆశిస్తున్నారు. అది మన అదృష్టం'' అన్నారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్.

''పరిశ్రమలు రావడం ఆహ్వానించదగినది. ఈ పరిశ్రమలలో ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోనే వస్తున్నాయి. కోర్ రాయలసీమలో వచ్చేవి తక్కువ. వారికి చెన్నై పోర్టు, బెంగళూరు ఎయిర్‌పోర్టు కీలకంగా మారాయి. దానివల్ల వారి ఎగుమతి దిగుమతుల రవాణాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ క్రమంలో ఆ రెండు రాష్ట్రాలకు కూడా కాస్త లాభదాయకంగా ఉంటుంది'' అని అనంతపురానికి చెందిన మానవ హక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్ అన్నారు .

''రాయలసీమలో ఖాళీ స్థలాలు చాలా చోట్ల మెండుగా ఉన్నాయి. సాగు లేదు. స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ అగ్రి బేస్డ్ కంపెనీలను కూడా ప్రోత్సహించాలి. బెంగళూరు నుంచి పుట్టపర్తికి చాలా మంచి రోడ్లు వచ్చాయి. చాలా తక్కువ సమయంలో వెళ్లిపోవచ్చు. శ్రీసిటీ కూడా అంతే. పక్క నగరాలకి కంపెనీలే బస్సులు పెడుతున్నాయి'' అని చెప్పారు రాయలసీమ హక్కుల నాయకుడు భూమన్.

కియా ఫ్యాక్టరీ బెంగళూరు నగరానికి సుమారు 150 కి.మీ దూరంలోని పెనుకొండలో పెట్టారు. ఇక సత్యవేడు దగ్గరలోని శ్రీసిటీ, చెన్నైకి 70 కి.మీ దూరంలో ఉంటుంది.

ఉదయాన్నే శ్రీసిటీ పరిసరాల్లో నుంచుంటే ఆ సెజ్ పరిధిలోని కంపెనీలకు పెద్ద సంఖ్యలో బస్సుల్లో, కార్లలో చెన్నై నుంచి వచ్చే అధికారులు, సిబ్బంది కనిపిస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అనుకూలతను ఉపయోగించుకోవడంలో చురుకుగా పనిచేస్తోందని చెప్పవచ్చు.

అయితే, ఫ్యాక్టరీలు, సంస్థలు వస్తున్నప్పటికీ, స్థానికులకు ఉపాధి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కియా ఫ్యాక్టరీ సమయంలో కూడా ఈ వివాదం నెలకొంది.

స్థానికులకు ఎక్కువ ఉపాధి కల్పించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని కోరుతున్నారు సీమ వాసులు.

''శ్రీసిటిలో దాదాపు 200 కంపెనీలు ఉన్నాయి. కానీ, పనిచేసే వారిలో చెన్నై వారు ఎక్కువ. స్థానికులు చాలా తక్కువ. అయితే, పరోక్ష ఉపాధి అంటే హోటళ్లు వంటి వాటిలో చాలా మంది స్థానికులు ఉన్నారు. అలాగే, చెన్నై వాసులే కాకుండా, బెంగాల్, బిహార్, నేపాల్ నుంచి వచ్చి పనిచేసే వారు కూడా ఉన్నారు’’ అన్నారు భూమన్.

‘‘కియాలో తమిళులు చాలా మంది ఉన్నారు. మన భూమి, నీరు ఇస్తున్నాం కాబట్టి, మన వాళ్లకు ఉద్యోగం దొరకాలి కదా. అవసరమైతే స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలు ఉన్నాయి. వారికి కావాల్సిన నైపుణ్యాలు నేర్పించి తరువాత ఉద్యోగం ఇవ్వాలి. కంపెనీలు రావడాన్ని వ్యతిరేకించం. కానీ, వాటిని స్థానికులు సద్వినియోగం చేసుకునేలా, స్థానికులకే అధిక ఉపాధి ఇచ్చేలా నిబంధనలు పెట్టాలి. నైపుణ్యాలు నేర్పించాలి'' అన్నారు భూమన్.

''ఈమధ్య వస్తున్న పరిశ్రమల్లో సాధారణ లేబర్, సెమీ స్కిల్డ్ కంటే హైలీ స్కిల్డ్ ఉద్యోగులు అవసరం ఉన్న కంపెనీలే ఎక్కువ ఉంటున్నాయని నా అభిప్రాయం. దాని వల్ల స్థానికులకు ఉపాధి దొరకడంలో కాస్త ఇబ్బంది ఉంది. కియా వంటి సంస్థల్లో స్థానిక ఉద్యోగులు ఎక్కువ మంది కనిపించరు. ఉన్నవారు కూడా కింది స్థాయిలో ఎక్కువగా ఉంటారు. అయితే, ఆ ఫ్యాక్టరీ ప్రత్యక్ష ఉపాధి కోణంలో కంటే పరోక్ష ఉపాధి, ఇతరత్రా రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల ఆర్థిక వృద్ధిలో ఉపయోగపడింది'' అని చెప్పారు చంద్రశేఖర్.

రాయలసీమలో హార్టి కల్చర్ పెరుగుతోంది కాబట్టి ఆ పరిశ్రమలపై కూడా కాస్త శ్రద్ధ పెట్టాలని చంద్రశేఖర్ అంటున్నారు.

''అసలు స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు దొరికాయనే విషయంలో గణాంకాలు రావాలి. అదే సమయంలో స్థానికులకే ఉపాధి అని ఒత్తిడి చేస్తే కంపెనీలు వెళ్లిపోతాయనే వాదన కొందరు చేస్తున్నారు. దానికి కారణం ఉంది. స్థానికుల కంటే వలస వచ్చిన వారు ఎక్కువ పనిచేస్తారనే భావన కొందరు యాజమాన్యాల్లో కనిపిస్తోంది'' అని విశ్లేషించారు భూమన్.

దీనిపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మంత్రి టిజి భరత్ బీబీసీతో మాట్లాడారు.

''ఇప్పుడు మా కర్నూలుకు కూడా చాలా కంపెనీలు వస్తున్నాయి.. వాటిని కూడా తెలంగాణ సరిహద్దు అంటారా..'' అంటూ హాస్యోక్తి విసిరారు భరత్.

''అసలు ఏమీ లేని చోట ఏదో ఒకటి వస్తున్నాయి అనేది మనం గమనించాలి. ముందుగా ఏదో ఒకటి మొదలు కావాలి. ఇక్కడ మనం ఇచ్చే వసతులు, ముఖ్యమంత్రి బ్రాండ్ ఇమేజ్ వల్ల సంస్థలు వస్తున్నాయి. దానికి తోడు కేంద్ర సహకారం ఉంది. ఉదాహరణకు పెనుగొండ ప్రాంతం కియా వల్ల ఎంత మారిందో మీరు చూడాలి. దానిని అభినందించాలి'' అన్నారు భరత్.

స్థానికుల ఉపాధి సమస్య గురించి భరత్ స్పందించారు.

''ఫ్యాక్టరీ పెట్టేవారు తన సంస్థ నడపడానికి బాగా అనుభవం ఉన్న ఉద్యోగుల కోసం చూస్తారు. ప్లాంట్ నడపడానికి నాలెడ్జ్ కావాలి. ఆ క్రమంలో టాప్ ఉద్యోగులలో నాన్ లోకల్ వారు ఉండటం సహజం. అందుకే స్థానికులకు ముందుగా కింది స్థాయి ఉద్యోగాలు దొరుకుతాయి. కంపెనీలకు అయినా, అందరు ఉద్యోగులనూ బయటి నుంచి తెచ్చుకోవాలంటే భారమే కదా. అలాగని నాలెడ్జ్ లేని, అందరూ కొత్త వారినే ఎవరూ ఉద్యోగాల్లో పెట్టుకోరు కదా.. నాకు తెలిసి 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే దొరుకుతాయి. ఓ 20 శాతం మాత్రం బయటి వారికి వస్తాయి. బాగా పెద్ద నగరాలు, పారిశ్రామికవాడల్లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ, కొత్తగా పెరుగుతోన్న చోట ఇలానే ఉంటుంది'' అని వివరించారు భరత్.

అయితే ముందుగా కంపెనీలంటూ మొదలైతే, క్రమంగా స్థానికుల ఉపాధి పెరుగుతుందని మంత్రి భరత్ చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)