You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘నా పిల్లలు అన్నం అడుగుతున్నారు, వారిని అమ్మేయడం తప్ప వేరే దారి లేదు’’
- రచయిత, యోగితా లిమాయే
- హోదా, బీబీసీ దక్షిణిసియా, అఫ్గానిస్తాన్ కరెస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని తీవ్రంగా కలచివేయవచ్చు)
అఫ్గానిస్తాన్‌లోని ఘోర్ ప్రావిన్స్ రాజధాని చఘ్చరాన్ నగరంలో తెల్లవారగానే ధూళి నిండిన ఒక చౌరస్తా దగ్గరకు వందల మంది పురుషులు వస్తారు.
కూలీ పని దొరుకుతుందనే ఆశతో, అలసిన ముఖాలతో వారు రోడ్డు పక్కన నిలబడతారు. ఆ రోజు వారి కుటుంబానికి తిండి దొరుకుతుందా లేదా అనేది ఉదయంపూట వాళ్లకు పని దొరకడం పైనే ఆధారపడి ఉంటుంది.
అయితే, వాళ్లకు పని దొరికే అవకాశం చాలా తక్కువే.
జుమా ఖాన్ వయస్సు 45 ఏళ్లు. గత ఆరు వారాల్లో ఆయనకు కేవలం మూడు రోజులే పని దొరికింది. అందుకుగానూ ఆయనకు రోజుకు రూ. 200 నుంచి 300 రూపాయలు కూలీగా లభించేవి.
'నా పిల్లలు వరుసగా మూడ్రోజులు ఆకలితోనే పడుకున్నారు. ఆకలితో వాళ్లు ఏడ్చేవారు, నా భార్య కూడా ఏడ్చింది. అందుకే పిండి కొనడానికి పొరుగువారి నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నా. నా పిల్లలు ఆకలితోనే చనిపోతారేమోనని భయంగా ఉంది' అని జుమా ఖాన్ ఆవేదనతో చెప్పారు. ఇది ఆయనొక్కడి పరిస్థితి మాత్రమే కాదు.
పేదరికం, అప్పుల బాధలు, నిస్సహాయత
ఐక్యరాజ్యసమితి చెప్పిన దిగ్భ్రాంతికరమైన నిజం ఏంటంటే అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం ప్రతి నలుగురిలో ముగ్గురు తమ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఆరోగ్య సేవలు పూర్తిగా కుప్పకూలాయి. ఒకప్పుడు లక్షల మందికి కనీస అవసరాలు తీర్చిన అంతర్జాతీయ సాయం ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది.
ఆఫ్గానిస్తాన్‌లో ఆకలి బాధ ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకుంది.
దేశ జనాభాలో 10శాతం కంటే ఎక్కువ మంది.. అంటే దాదాపు 47 లక్షల మంది ప్రజలు కరవు అంచున ఉన్నట్లు అంచనా. ఈ సంక్షోభంతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రావిన్సులలో ఘోర్ ఒకటి. ఇక్కడి ప్రజలు చాలా నిరాశలో ఉన్నారు.
''రెండు రోజులుగా నా పిల్లలు ఏమీ తినలేదు. ఇంట్లో తినడానికి ఏమీ లేదని నాకు ఫోన్ వచ్చింది. అది వినగానే, చచ్చిపోవాలనిపించింది. కానీ, నేను చచ్చిపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచించి, పని దొరుకుతుందనే ఆశతో ఇక్కడ నిలబడ్డా'' అని వణుకుతున్న గొంతుతో రబానీ అనే వ్యక్తి చెప్పారు.
ఖ్వాజా అహ్మద్ అనే వృద్ధుడు మాతో మాట్లాడుతుండగా ఏడుపు ఆపుకోలేకపోయాడు.
''మేం ఆకలితో అలమటిస్తున్నాం. నా పిల్లలలో కొందరు ఇప్పటికే చనిపోయారు. కుటుంబానికి తిండి పెట్టడం కోసం నేను పనిచేయాలి. కానీ, నేను ముసలివాడినని ఎవరూ పని ఇవ్వడం లేదు'' అని ఆయన ఏడుస్తూ చెప్పారు.
ఆ చౌరస్తాకు సమీపంలోని ఒక బేకరీ అప్పుడే తెరుచుకుంది. దాని యజమాని మిగిలిపోయిన ఎండిన రొట్టె ముక్కలను ఆ గుంపులోకి విసిరాడు. ఆ రొట్టె ముక్కల కోసం ఒకరినొకరు నెట్టుకున్నారు. కొందరికి మాత్రమే అవి దొరికాయి.
అదే సమయంలో మోటార్ సైకిల్ మీద వచ్చిన ఒక వ్యక్తి.. 'మాకు ఇటుకలు మోయడానికి ఒక కూలీ కావాలి' అని అరవడంతో పదుల సంఖ్యలో పురుషులు అతని వైపు పరిగెత్తారు.
రెండు గంటల పాటు మేం అక్కడ ఉన్నాం. ఆ సమయంలో కేవలం ముగ్గురికే పని దొరికింది.
కడుపు కోత.. కూతుర్ల అమ్మకం
అబ్దుల్ రషీద్ అజీమీ మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లారు. తన పిల్లలు, ఏడేళ్ల కవల ఆడపిల్లలైన రోకియా, రోహిలాను మా ముందుకు తీసుకువచ్చారు. ఆ పిల్లలిద్దరినీ గట్టిగా హత్తుకుంటూ తాను తీసుకోబోయే కఠిన నిర్ణయం గురించి చెప్పేందుకు సిద్ధమయ్యారు.
''నా కూతుర్లను అమ్మడానికి నేను సిద్ధంగా ఉన్నా. చాలా పేదవాళ్లం. అప్పుల్లో కూరుకుపోయాను. పూర్తిగా నిస్సహాయుడిని. పని కోసం వెళ్లి నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా పెదవులు ఎండిపోయి ఉంటాయి. ఆకలి, దాహం, బాధలో ఉంటాను. 'బాబా, మాకు రొట్టె ఇవ్వు' అంటూ పిల్లలు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ, వాళ్లకు ఏమివ్వాలి? అసలు పని ఎక్కడ ఉంది?'' అంటూ ఏడుస్తూ చెప్పారు.
కూతుర్లను పెళ్లి కోసమో లేదా ఇంట్లో పని మనుషులుగా ఉంచడానికో అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు అబ్దుల్ చెప్పారు.
''ఒక కూతురిని అమ్మేస్తే, వచ్చే డబ్బుతో నా మిగిలిన పిల్లలకు కనీసం నాలుగేళ్లపాటు తిండి పెట్టగలను. పిల్లల్ని అమ్మేయాలనే ఆలోచనతో నా గుండె బద్దలవుతోంది. కానీ, నా ముందున్న దారి ఇదొక్కటే' అంటూ రోహిలాను హత్తుకుంటూ ఆయన గట్టిగా ఏడ్చారు.
కనీసం చాయ్ కూడా తాగలేని దుస్థితిలో ఉన్నామని ఆయన భార్య కాయ్హాన్ చెప్పారు.
కొడుకులను కాకుండా కూతుళ్లనే అమ్మేయాలనే నిర్ణయం వెనుక ఒక కారణం ఉంది.
సాంస్కృతికంగా, భవిష్యత్తులో సంపాదించి పెట్టే ఆసరాగా కొడుకులను భావిస్తారు. అఫ్గాన్‌లో మహిళలు, బాలికల విద్య, ఉద్యోగాలపై తాలిబాన్ విధించిన ఆంక్షల వల్ల ఈ ఆలోచన మరింత బలపడింది.
పైగా, పెళ్లి సమయంలో వరుడి కుటుంబం తరఫున వధువు కుటుంబానికి బహుమతి (డబ్బు) ఇచ్చే సంప్రదాయం కూడా ఈ పరిస్థితికి ఒక కారణం.
అబ్దుల్, కాయ్హాన్ల ఇద్దరు పెద్ద కొడుకులు షూ పాలిష్ పని చేస్తారు. మరో కుమారుడు చెత్త సేకరిస్తారు. వంట చేయడానికి ఇంధనంగా ఆ చెత్తను కాయ్హాన్ వాడతారు.
‘కనీసం బతికి ఉంటుందని నా కూతుర్ని అమ్మేశాను’
వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక తన అయిదేళ్ల కూతుర్ని అమ్మేశానని సయీద్ అహ్మద్ చెప్పారు.
'నా కూతురు షైకాకు అపెండిసైటిస్, లివర్‌లో సిస్ట్ వచ్చింది. ఆ స్థితిలో ఆమెను బతికించుకోవడం కోసం అమ్మక తప్పలేదు. నా దగ్గర వైద్య ఖర్చుల కోసం డబ్బుల్లేవు. అందుకే ఆమెను ఒక బంధువుకు అమ్మేశాను'' అని ఆయన తెలిపారు.
ఆమెను అమ్మగా వచ్చిన 3 లక్షల రూపాయలతో షైకాకు సర్జరీ చేయించినట్లు ఆయన చెప్పారు.
'అప్పుడే నేను మొత్తం డబ్బు తీసుకొని ఉంటే, ఆయన వెంటనే నా కూతుర్ని తనతో తీసుకెళ్లిపోయేవాడు. ప్రస్తుతానికి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో అంతే డబ్బు ఇవ్వండని ఆయనకు చెప్పాను. మిగిలిన మొత్తాన్ని వచ్చే అయిదేళ్లలో ఇవ్వండని అన్నారు. ఆ తర్వాత మీరు పాపను తీసుకెళ్లొచ్చని చెప్పాను. అప్పుడు ఆమె వారింటి కోడలు అవుతుంది' అని సయీద్ వివరించారు.
షైకా తన చిన్న చేతులను తండ్రి మెడ చుట్టూ వేసుకొని ఆయన ఒడిలో కూర్చుంది. ఆ నాన్నకూతుళ్ల మధ్య ఉన్న బంధం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, అయిదేళ్ల తర్వాత, అంటే ఆమెకు 10 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు తండ్రిని, తన ఇంటిని ఆమె వదిలి వెళ్లాల్సి ఉంటుంది. సదరు బంధువు ఇంటికి వెళ్లి, వారి కొడుకుల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
తాలిబాన్ ఆంక్షలతో పెరిగిన బాల్య వివాహాలు
''నా దగ్గర డబ్బు ఉండి ఉంటే అసలు ఎప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకునేవాడిని కాదు. సర్జరీ చేయించకపోతే నా బిడ్డ చనిపోతుందని ఆలోచించి ఇలా చేశాను. ఇంత చిన్న వయసులోనే నా బిడ్డను వారికి అప్పగించాలనే ఆలోచన నన్ను సతమతం చేస్తోంది. బాల్య వివాహాల వల్ల చాలా సమస్యలు వస్తాయి. కానీ నేను ఆమె వైద్య ఖర్చులు భరించలేకపోయాను. కనీసం ఆమె బతికైనా ఉంటుందని ఇలా చేశాను'' అని సయీద్ వివరించారు.
అఫ్గానిస్తాన్‌లో బాల్య వివాహాలు ఇంకా జరుగుతున్నాయి. బాలికల విద్యపై తాలిబాన్ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల ఇవి మరింతగా పెరిగాయి.
అఫ్గానిస్తాన్‌లో లక్షల కుటుంబాలకు అందినట్లుగానే రెండేళ్ల కిందటి వరకు సయీద్ కుటుంబానికి కొంత ఆహార సహాయం అందేది. పిండి, వంట నూనె, పప్పులు, పిల్లల కోసం పోషకాహార సప్లిమెంట్లు లభించేవి.
కానీ, గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ సహాయంలో భారీ కోత వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రాణాలను నిలబెట్టే ఈ సహాయానికి దూరమయ్యారు.
ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌కు అతిపెద్ద దాతగా ఉన్న అమెరికా, నిరుడు ఆ దేశానికి ఇస్తున్న సాయాన్ని దాదాపు పూర్తిగా నిలిపివేసింది.
బ్రిటన్‌తో సహా పలు ఇతర ప్రధాన దేశాలు కూడా తమ సహాయాన్ని భారీగా తగ్గించుకున్నాయి.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత గణాంకాల ప్రకారం, 2025తో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు అందిన సహాయం 70% తక్కువగా ఉంది.
పోషకాహార లోపంతో శిశు మరణాల రేటు పెరుగుదల
దేశంలోని సగానికి పైగా ప్రావిన్సులను ప్రభావితం చేస్తున్న తీవ్ర కరవు వారి పరిస్థిని మరింత దిగజారుస్తోంది.
ప్రభుత్వం నుంచి గానీ, స్వచ్ఛంద సంస్థల నుంచి గానీ తమకు ఎలాంటి సహాయం అందలేదని గ్రామీణ ప్రాంతానికి చెందిన అబ్దుల్ మాలిక్ చెప్పారు.
2021లో అధికారంలోకి వచ్చిన తాలిబాన్ ప్రభుత్వం, దేశంలో నెలకొన్న తాజా పరిస్థితికి మునుపటి ప్రభుత్వమే కారణమంటూ నిందిస్తోంది.
''ఆక్రమణ జరిగిన గత 20 ఏళ్ల కాలంలో అమెరికా డాలర్ల ప్రవాహం కారణంగా ఒక కృత్రిమ ఆర్థిక వ్యవస్థను సృష్టించారు. ఆ ఆక్రమణ ముగిసిన తర్వాత మాకు పేదరికం, కష్టాలు, నిరుద్యోగం, ఇతర సమస్యలు వారసత్వంగా వచ్చాయి'' అని బీబీసీతో తాలిబాన్ ప్రభుత్వ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ అన్నారు.
తాలిబాన్ల విధానాలు, ముఖ్యంగా మహిళలపై వారు విధించిన ఆంక్షల వల్లే అఫ్గాన్‌కు సహాయం అందించే దాతృత్వ దేశాలు వెనక్కి తగ్గాయని నిపుణులు చెబుతున్నారు.
దాతలు వెనక్కి తగ్గడానికి తాము ఏ రకంగానూ కారణం కాదని అఫ్గాన్ ప్రభుత్వం అంటోంది. మానవీయ సహాయాన్ని రాజకీయం చేయకూడదని వ్యాఖ్యానించింది.
పెద్ద ఆర్థిక ప్రాజెక్టులను అమల్లోకి తీసుకురావడం ద్వారా పేదరికాన్ని తగ్గించి, ఉపాధిని సృష్టించాలని తాలిబాన్ ప్రభుత్వం యోచిస్తోందని ఫిత్రత్ చెప్పారు.
తాలిబాన్లు చెబుతున్న దీర్ఘకాలిక ప్రాజెక్టులు భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడొచ్చు. కానీ తక్షణ సహాయం అందకపోతే, ప్రస్తుతం లక్షల మంది ప్రజలు బతికే పరిస్థితి లేదు.
తన 14 నెలల కూతురు కొన్ని వారాల కిందటే చనిపోయిందని మొహమ్మద్ హషీమ్ తెలిపారు.
'నా బిడ్డ ఆకలి కారణంగా, మందుల కొరతతో చనిపోయింది. పిల్లలు అనారోగ్యానికి గురైనా, ఆకలి బారిన పడినా చనిపోవడం ఖాయం' అని ఆయన అన్నారు.
గత రెండేళ్లలో శిశు మరణాల రేటు చాలా పెరిగిపోయిదని, పోషకాహార లోపం వల్లే శిశువులు మరణిస్తున్నారని స్థానికుడు ఒకరు అన్నారు.
అయితే ఇక్కడ మరణాలకు సంబంధించిన ఎటువంటి అధికారిక రికార్డులు ఉంచడం లేదు.
పిల్లల మరణాల పెరుగుదలకు ఆధారాలు కేవలం స్మశానవాటికలోనే కనిపిస్తాయి. అందుకే మేం చిన్న, పెద్ద సమాధులను విడివిడిగా లెక్కించాం. చిన్న సమాధుల సంఖ్య, పెద్ద సమాధుల కంటే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి చూస్తే, పెద్దల సంఖ్య కంటే చనిపోతున్న పిల్లల సంఖ్య దాదాపు రెండింతలు ఉందని స్పష్టమవుతోంది.
చఘ్చరాన్ ప్రాంతీయ ఆసుపత్రిలో కూడా ఇటువంటి ఆధారాలే మాకు లభించాయి.
'మరణాల రేటు 10% కి చేరుతోంది, ఇది ఆమోదయోగ్యం కాదు'
ఇక్కడి ఆసుపత్రిలో నవజాత శిశువుల విభాగం (NICU) అత్యంత రద్దీగా ఉంది. అక్కడున్న పడకలన్నీ నిండిపోయాయి. కొన్ని పడకలపై ఇద్దరేసి పిల్లలు ఉన్నారు. వీరిలో చాలా మంది తక్కువ బరువుతో ఉన్నారు. ఎక్కువ మంది సొంతంగా శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఒక నర్సు అప్పుడే పుట్టిన కవల ఆడపిల్లలను చూపించారు. వారు నెలలు నిండక ముందే జన్మించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఆ పిల్లలకు ఆక్సీజన్ అందించారు. వారి తల్లి, 22 ఏళ్ల షకీలా ప్రసూతి వార్డులో ఉన్నారు.
ఆ కవల పిల్లల అమ్మమ్మ గుల్బదన్ బీబీసీతో మాట్లాడారు.
'నా కూతురు చాలా బలహీనంగా ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆమెకు తినడానికి ఏమీ లేదు. కేవలం రొట్టె, చాయ్ మాత్రమే తీసుకుంది. అందుకే పిల్లల పరిస్థితి ఇలా ఉంది' అని గుల్బదన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ రోజు మేం ఆసుపత్రి నుంచి బయలుదేరిన కొన్ని గంటలకే కవల పిల్లల్లో ఒక చిన్నారి చనిపోయారు.
మరుసటి రోజు గుల్బదన్ మాతో మాట్లాడారు.
'డాక్టర్లు ఆ పాపను బతికించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ పాప చిన్న శరీరాన్ని బట్టలో చుట్టి నేను ఇంటికి తీసుకువెళ్లాను. ఆ విషయం తెలిసి వాళ్ల అమ్మ స్పృహ తప్పి పడిపోయింది' అని చెప్పారు.
బతికి ఉన్న మరో చిన్నారి వైపు చూపిస్తూ, 'కనీసం ఈ పిల్లయినా బతికి ఉంటే చాలు' అని గుల్బదన్ నిస్సహాయంగా అన్నారు.
శిశు మరణాల రేటు 10% కి చేరుకుంటోందని, ఇది ఎంతమాత్రం 'ఆమోదయోగ్యం కాదు' అని బీబీసీకి నవజాత శిశువుల విభాగాన్ని నడుపుతున్న డాక్టర్ మొహమ్మద్ మూసా ఓల్దాత్ చెప్పారు.
'పేదరికం కారణంగా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పిల్లలకు సరైన చికిత్స చేయడానికి తగినంత వనరులు, వైద్య పరికరాలు కూడా మా వద్ద లేవు' అని ఆయన అన్నారు.
ఆరు వారాల వయసున్న జమీర్ అనే పిల్లాడు మెనింజైటిస్ (మెదడు వాపు వ్యాధి), నిమోనియాతో పోరాడుతున్నాడు. అతనికి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)లో చికిత్స అందిస్తున్నారు. బాబు బాధపడుతున్న రెండు వ్యాధులకు చికిత్స సాధ్యమే. కానీ, వైద్యుల వద్ద ఆ చికిత్సకు సంబంధించిన సరైన పరికరాలు లేవు.
బహుశా మరింత అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ మంది రోగులకు సరిపడా మందులు లేవు. రోగుల కుటుంబాలు బయట ఉన్న ప్రైవేట్ మందుల దుకాణాల నుంచి మందులను కొనుగోలు చేయాల్సి వస్తోంది.
'కొన్నిసార్లు, ఎవరైనా ధనిక కుటుంబానికి చెందిన పిల్లల మందులు మిగిలిపోతే, మేం వాటిని మందులు కొనలేని పేద పిల్లల కోసం ఉపయోగిస్తాం' అని నర్సు ఫాతిమా చెప్పారు.
డబ్బులు లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది.
గుల్బదన్ మరో మనవరాలి పరిస్థితి కాస్త కుదుటపడింది. అయితే, ఆసుపత్రి ఖర్చులను భరించలేక కొన్ని రోజులకే కుటుంబ సభ్యులు ఆ పాపను ఇంటికి తీసుకెళ్లిపోయారు.
జమీర్‌ను కూడా అతని తల్లిదండ్రులు ఇదే కారణంతో ఇంటికి తీసుకెళ్లిపోయారు.
ఇప్పుడు ఆ చిన్న ప్రాణాలు బతకడానికి సొంతంగా పోరాడాల్సి ఉంటుంది.
(అదనపు రిపోర్టింగ్ ఇమోజెన్ అండర్సన్, మహ్ఫూజ్, సంజయ్ గంగూలీ )
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)