మోదీ కంటే ముందు ప్రధాన మంత్రులు ఎక్కడ నివసించారు? తెలుగుదేశం ఎంపీలు 2013లో అప్పటి ప్రధాని నివాసం సమీపంలో ఎందుకు నిరసన తెలిపారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మొహమ్మద్ షాహిద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
సోమవారం నుంచి దేశ రాజధాని దిల్లీ ఆందోళనలతో హోరెత్తుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో.. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్‌కు పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ).
పార్లమెంట్‌కు వెళ్లే ప్రయత్నంలో నిరసనకారులు పెద్ద ఎత్తున పోలీసు యాక్షన్‌ను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ నిరసనకారులు మళ్లీ జంతర్ మంతర్‌కు చేరుకున్నారు.
పార్లమెంట్ సమావేశాల రెండో రోజు మంగళవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలతో కలిసి 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు.
ఆ తర్వాత.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు నేతలను దిల్లీ పోలీసులు ప్రధాని నివాసం బయట అదుపులోకి తీసుకున్నారు.
కొందరు నాయకులను మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో, మరికొందరిని ఛత్రసాల్ స్టేడియంలో నిర్బంధించారు. వారందరినీ చివరకు రాత్రి 10 గంటల ప్రాంతంలో విడుదల చేశారు. ప్రధానమంత్రి నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ చరిత్రలో ఇది అతిపెద్ద నిరసనగా నిలిచింది.

ప్రధానమంత్రి నివాసం చరిత్ర
న్యూదిల్లీ ప్రాంతంలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి నివాసం ఉంది.
ఈ రోడ్డు పేరు అంతకుముందు రేస్ కోర్స్ రోడ్‌గా ఉండేది. కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌లో ఈ రోడ్డు పేరును లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చింది.
దిల్లీ గురించి అనేక పుస్తకాలు రాసిన సీనియర్ జర్నలిస్ట్ వివేక్ శుక్లా, రేస్ కోర్స్ రోడ్ చుట్టూ ఉన్న భవనాలను బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ టోర్ రస్సెల్ డిజైన్ చేశారని చెప్పారు.
''న్యూదిల్లీలోని ఈ ప్రాంతాల్లోని భవనాల నిర్మాణం 1925లో మొదలై, 1930 నాటికి పూర్తయింది. వెస్ట్రన్ కోర్ట్, ఈస్ట్రన్ కోర్ట్, తీన్ మూర్తి భవన్‌ను రాబర్ట్ టోర్ రస్సెల్ డిజైన్ చేశారు'' అని ఆయన వివరించారు.
''లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాసం అనేక అపార్ట్మెంట్లతో ఉంటుంది. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని 1, 3, 5, 7 అపార్ట్మెంట్లను కలిపి ప్రధాని నివాసాన్ని నిర్మించారు'' అని పేర్కొన్నారు.
''ఈ బంగ్లాలను రాజస్థాన్‌కు చెందిన పేరు తెలియని ఎంతోమంది కార్మికులు నిర్మించారు. రచయిత-పాత్రికేయుడు ఖుశ్వంత్ సింగ్ వీరిని ''బాగ్డీలు'' అని పిలిచేవారు. ఈ కార్మికులు దిల్లీలోని పహాడీ ధీరజ్, కరోల్ బాగ్ ప్రాంతాల్లో తమ కుటుంబాలతో కలిసి నివసించారు. వారి పిల్లలు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు'' అని వివేక్ శుక్లా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజీవ్ గాంధీతో మొదలై....
1984లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రధానమంత్రి నివాసంగా 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌ను(అప్పట్లో రేస్ కోర్స్ రోడ్) ఉపయోగిస్తున్నారు.
''జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీన్ మూర్తి మార్గ్‌లో నివసించారు. ఈ భవనం మాజీ బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ నివాసంగా ఉండేది. నెహ్రూ మరణానంతరం దీన్ని స్మారక భవనంగా మార్చారు'' అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రషీద్ కిద్వాయ్ చెప్పారు.
''లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయిన తర్వాత.. 9 జనపథ్‌లో ఉన్న తన నివాసంలోనే ఉన్నారు. 1966లో ఆయన మరణించిన తర్వాత.. ఈ ప్రదేశాన్ని కూడా ఒక స్మారక చిహ్నంగా మార్చేశారు. ఇందిరా గాంధీ 1 సఫ్దర్‌జంగ్ రోడ్డులో ఉన్న తన నివాసంలోనే ఉండేవారు. అక్కడే హత్యకు గురయ్యారు. మొరార్జీ దేశాయ్, చౌధరి చరణ్ సింగ్ ప్రధానమంత్రులుగా వారు ఉన్న ఇళ్లల్లోనే నివసించారు'' అని పేర్కొన్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా 7 రేస్ కోర్స్ రోడ్లో నివసించడానికి వచ్చిన తొలి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీనేనని రషీద్ కిద్వాయ్ చెప్పారు. వి.పి సింగ్ ప్రభుత్వ సమయంలో దీన్ని ప్రధానమంత్రి నివాసంగా చేశారని తెలిపారు.
పీవీ నరసింహా రావు, ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజపేయీ నుంచి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు అందరూ ఇక్కడే నివసించారని, అయితే చంద్రశేఖర్ తన 7 నెలల పదవీకాలంలో ఈ ప్రదేశంలో ఉండలేదని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నివాసం వెలుపల నిరసనలు ఎప్పుడు జరిగాయి?
రేస్ కోర్స్ రోడ్ లేదా ప్రస్తుత లోక్ కళ్యాణ్ మార్గ్ కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం.
అశోక హోటల్ నుంచి సఫ్దర్‌జంగ్ రోడ్ పోలీస్ స్టేషన్ వరకు ఈ ప్రాంతంలో పక్షి కూడా ఎగరలేదని, అయినప్పటికీ ప్రధానమంత్రి నివాసం సమీపం వరకు నిరసనలు జరుగుతూనే ఉన్నాయని వివేక్ శుక్లా అన్నారు.
ప్రధానమంత్రి నివాసం పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున అక్కడ గుమిగూడటం సాధ్యం కాదని రషీద్ కిద్వాయ్ చెప్పారు.
మంగళవారం రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన నిరసన చాలా పెద్దదని ఆయన అభిప్రాయపడ్డారు.
"ప్రధాని నివాసానికి ఇంత దగ్గరగా నిరసన జరగడం ఎస్పీజీ (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) వల్ల జరిగిన పొరపాటులో భాగం. ప్రధాని నివాసం వెలుపల ఇంతసేపు ఏ నిరసన కూడా జరగకూడదు" అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నాయకుల ఈ ప్రదర్శనకు ముందు, 2011 నాటి ప్రదర్శనను ప్రధానమంత్రి నివాసం వెలుపల జరిగిన అతిపెద్ద నిరసనగా రషీద్ కిద్వాయ్ భావిస్తున్నారు.
జన్ లోక్‌పాల్‌ను డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే మద్దతుదారులు ప్రధానమంత్రి నివాసం వెలుపల గుమిగూడారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. సుమారు 40 మంది పురుషులను, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధాని నివాసం వరకు చాలాసార్లు మార్చ్‌కు పిలుపునిచ్చిందని రషీద్ కిద్వాయ్ తెలిపారు. నిరసనలకు నిర్దేశిత స్థలం ప్రస్తుతం జంతర్ మంతర్ అయినప్పటికీ, అంతకుముందు బోట్ క్లబ్‌ను నిరసనల కోసం నిర్దేశించారని, అయితే అది పార్లమెంటుకు సమీపంలో ఉండటం వల్ల ఇప్పుడు అక్కడ నిరసనలకు అనుమతి లేదని రషీద్ కిద్వాయ్ చెప్పారు.
"2012లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని 'ఇండియా అగెనెస్ట్ కరప్షన్' సంస్థ ప్రధానమంత్రి నివాసం బయట నిరసన తెలిపింది. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. అవినీతికి వ్యతిరేకంగా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ప్రధానమంత్రి నివాసం బయట నిరసన చేయాలని కోరుకున్నారు" అని వివేక్ శుక్లా తెలిపారు.
''2013లో, కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి నివాసం సమీపంలో ఒక ప్రతీకాత్మక నిరసన చేపట్టారు. 1984 సిక్కు అల్లర్ల నుంచి సిక్కు సంస్థలు ఎప్పటికప్పుడు నిరసనలు చేపడుతూనే ఉన్నాయి. కానీ, మంగళవారం నాటి కాంగ్రెస్ నిరసన ఇప్పటివరకు జరిగిన వాటిలో అతిపెద్దదని నేను భావిస్తున్నాను'' అని వివేక్ శుక్లా చెప్పారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో, 1999లో కాందహార్ విమానం హైజాక్ జరిగినప్పుడు, హైజాక్‌కు గురైన విమానంలోని ప్రయాణికుల కుటుంబాలు, వివిధ సంస్థలు ప్రధానమంత్రి నివాసం బయట నిరసనలు తెలిపేవారని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది చెప్పారు.
7 లోక్ కళ్యాణ్ మార్గ్ ఎంతకాలం పాటు ప్రధానమంత్రి అధికారిక నివాసంగా ఉంటుందో ఇంకా స్పష్టంగా తెలియదు. ఎందుకంటే, సౌత్ బ్లాక్ సమీపంలో నిర్మిస్తున్న కొత్త సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రణాళికలో ప్రధానమంత్రి కోసం ఒక కొత్త నివాసాన్ని కూడా ప్రతిపాదించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























