ఇ20 ఇంధనంతో వాహనాలు దెబ్బతింటున్నాయా, వాహనదారుల ఆందోళన ఏంటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అర్చన శుక్లా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
పెట్రోలులో బయోఇంధన శాతాన్ని పెంచాలనే భారత్ నిర్ణయంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ఎక్కువశాతం వాహనాలు ఈ ఇంధనానికి అనుగుణంగా రూపొందించకపోవడంతో ఈ విధానం ఆచరణసాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్రవాహనాల మార్కెట్, మూడో అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్ చమురు దిగుమతిపై ఆధారపడటాన్ని, కర్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది.
ఈమేరకు 2000 మధ్య కాలంలోనే చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ప్రారంభించింది. అప్పటినుంచి ఇథనాల్ మిశ్రమ శాతాన్ని క్రమంగా పెంచుతూ వచ్చింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో 10శాతం ఇథనాల్ మిశ్రమానికి బదులుగా, 20శాతం ఇథనాల్ కలిగిన ఇ20 పెట్రోల్‌ను ప్రామాణిక ఇంధనంగా ప్రవేశపెట్టడంతో దీనిపై ఫిర్యాదులు మరింత పెరిగాయి. వాహనాలలో ఎక్కువ భాగం పదిశాతం ఇథనాల్ మిశ్రమానికి తగినట్టుగా ఉండేవి.
ఇథనాల్ కలపని సాధారణ పెట్రోల్ అందుబాటులో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని బట్టి అది ఇ20 కంటే 40నుంచి 50శాతం ఎక్కువ రేటు పలుకుతోంది. పైగా చాలా మంది వాహనదారులకు దాని గురించి అడగొచ్చన్న అవగాహన కూడా లేదు.


ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
‘ఇథనాల్ కలవని పెట్రోల్ ధర చాలా ఎక్కువ’
ఇథనాల్ పెట్రోల్ కారణంగా ఇంజిన్ త్వరగా అరిగిపోవడం, మైలేజ్ తగ్గిపోవడం, వాహన పనితీరు క్షీణిస్తోందనే ఫిర్యాదులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
గత వారం దిల్లీలో జరిగిన నిరసనల్లో అనేకమంది వాహనదారులు పాల్గొన్నారు. టీవీ చర్చల్లో తరచూ కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడే ఓ పారిశ్రామిక వేత్త ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజలపై ఇ20ని రుద్దిందని, దీంతో సర్వీసింగ్ ఖర్చులు పెరిగాయని, పెట్రోల్ బంకుల్లో ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని ఆరోపించారు.
అయితే ఈ ఫిర్యాదులన్నింటినీ తప్పుదారి పట్టించే సమాచారంగా, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కొట్టిపారేసింది.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
మైలేజ్ తగ్గుతోందా?
విస్తృత పరీక్షల అనంతరమే ఇ20ని ప్రవేశపెట్టామని, ఇది ఇంజిన్లకు ఎలాంటి నష్టం కలిగించదని గత నెలలో విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇ20 ప్రయోజనాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అపోహలను ఖండించేందుకు ప్రకటన విడుదల చేసింది.
ఇ20కి మద్దతుగా నిపుణులు, వాహన తయారీ సంస్థల వాదనలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది.
ఆరు ఆటోమొబైల్ కంపెనీల ప్రతినిధులు గత వారాంతంలో ప్రభుత్వం తరఫున మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనేక సంవత్సరాల పరీక్షలు, సర్వీస్ డేటా ప్రకారం ఇథనాల్ మిశ్రమం వల్ల వాహనాలకు భారీ నష్టం జరిగినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని తెలిపారు.
ఇ20కి అనుకూలంగా లేని కోటీ 50లక్షలకు పైగా పాత వాహనాలకు సంస్థ సర్వీసింగ్ చేసినప్పటికీ, ఇంధనానికి సంబంధించిన లోపాలేమీ కనిపించలేదని, మారుతీ సుజుకి కార్పొరేట్ వ్యవహారాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి రాహుల్ భారతి చెప్పారు.
అయితే ఇ20వాడకం వల్ల ఇథనాల్‌లో శక్తి తక్కువగా ఉండడంతో మైలేజ్ మూడు నుంచి 3.5శాతం వరకు తగ్గుతుందని వాహన తయారీ సంస్థలు అంగీకరించాయి. అయితే కొన్ని అంచనాల ప్రకారం వాస్తవంగా ఈ తగ్గుదల 4 నుంచి 12శాతం వరకు ఉండొచ్చని చెబుతున్నాయి.
బయోఫ్యూయల్ కార్యక్రమం ద్వారా చమురు దిగుమతి వ్యయాన్ని తగ్గించడం, రైతులకు మద్దతుగా నిలవడం, కాలుష్యాన్ని తగ్గించడం ప్రభుత్వ లక్ష్యం. పెట్రోల్ కంటే ఇథనాల్ నుంచి వెలువడే కాలుష్యం తక్కువ. అలాగే చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి దేశీయంగా తయారవుతుంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ లక్ష్యాలు చాలా వరకు నెరవేరాయి.
వాహనాలకు మంచిదా..కాదా..?
భారత్ వినియోగించే ముడిచమురులో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ ఘర్షణ సమయంలో అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఏర్పడిన అంతరాయాలు దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని మరింత బలపరిచాయి. ఇండోనేసియా, వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాలు కూడా ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు, ఫ్యూయల్ కార్యక్రమాలను వేగవంతం చేశాయి.
భారత్ అధికారుల తరచూ ఉదాహరణగా చూపే బ్రెజిల్ నాలుగు దశాబ్దాల పాటు క్రమంగా ఇథనాల్‌కు అనుకూల వాహనాలను పెంచిన తర్వాతే దాన్ని తప్పనిసరి చేసింది. అక్కడ వాహనదారులు ఇ27 పెట్రోల్ లేదా 100శాతం ఇథనాల్ ఎంపిక చేసుకోవచ్చు. అక్కడ ఇథనాల్ ధర తక్కువగా ఉంటుంది.
భారత్ మాత్రం 2022లో 10శాతం ఇథనాల్ నుంచి 2025నాటికి తప్పనిసరి 20శాతానికి కేవలం మూడేళ్లలో మారింది. ఇది నిర్దేశిత సమయం కన్నా ఐదేళ్ల ముందు. ఇతర ప్రధాన దేశాలు చేసినట్టుగా ముందుగా వాహనాలను కొత్త ఇంధనానికి అనుగుణంగా మార్చే సమయం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శకుల అభిప్రాయం.
ఆటో పరిశోధనా సంస్థ మొబిలిటీ గ్లోబల్ డైరెక్టర్ పునీత్ గుప్తా భారత రహదారులపై నడుస్తున్న వాహనాల్లో 75శాతం కంటే ఎక్కువ వాహనాలు ఇ20కి అనుకూలంగా లేవని చెప్పారు. గత ఏడాది థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ విశ్లేషణ కూడా ఇదే విషయం వెల్లడించింది. గత 15ఏళ్లలో విక్రయించిన పెట్రోల్ వాహనాల్లో కేవలం 20శాతమే ఇ20కి అనుకూలమని అందులో పేర్కొంది.
ఇథనాల్‌తో లాభమా?
ఈ వేగవంతమైన మార్పు, 2023కు ముందు తయారైన వాహనాల యజమానుల్లో ఆందోళన పెంచింది. ఇంజిన్ తుప్పుపట్టడం, సామర్థ్యం తగ్గిపోవడం వంటి భయాలను వ్యక్తంచేస్తున్నారు.
ఇటీవలి నెలల్లో ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గత వారం దిల్లీలో నిరసనలో పాల్గొన్న పలువురు ఇ20 వాడిన తర్వాత సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు.
ముంబైలోని పలుకార్లు, ద్విచక్ర వాహనాల సర్వీస్ కేంద్రాలు, మెకానిక్‌లతో బీబీసీ మాట్లాడింది. కొందరు ఇప్పటివరకు ఎలాంటి సమస్యలూ రాలేదని చెప్పగా, మరికొందరు అధిక ఇథనాల్ మిశ్రమం వల్ల కొన్ని సమస్యలు న్ని వచ్చినట్టు భావిస్తున్నామన్నారు.
మోటార్ సైకిళ్లను మరమ్మతు చేసే మహ్మద్ ఆరిఫ్ గత ఏడాదిలో పాత బైక్‌ల కార్బ్యురేటర్లలో ఇంధన అవశేషాలు పేరుకుపోయిన అనేక కేసులు వచ్చాయని చెప్పారు. దీనికి అధిక ఇథనాల్ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అవశేషాల వల్ల వాహన పనితీరు తగ్గిపోతుందని, తరుచుగా శుభ్రం చేయాల్సివస్తోందని ఫలితంగా సర్వీస్ ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పారు.
మైలేజ్ తగ్గిపోవడంతో వినియోగదారులు తరచుగా పెట్రోల్ నింపుకోవాల్సి వస్తుందని కారు సర్వీసింగ్ కేంద్ర నిర్వాహకుడు బాసిల్ జాకబ్ తెలిపారు. ఇథనాల్ తయారీ చవకైనా ఆ ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని ఇ 20ధర పాత పెట్రోల్ మాదిరిగానే ఉందని అన్నారు
లీటరుకు అదే ధర చెల్లిస్తున్నారుగానీ తక్కువ కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలుగుతున్నారని ఆయనన్నారు.

ఇంజిన్, వాహనాల విడిభాగాలపై ప్రభావమేంటి?
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇ20వల్ల కలిగే ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు. కానీ పదివేల నుంచి ఇరవై వేల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వాహనంలోని విడిభాగాలు అరిగిపోవడం, దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు.
''ఇది నెమ్మదిగా కనిపించే ప్రభావం. అయితే వాహనాన్ని సక్రమంగా వాడుకుంటే పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కొన్ని ఆందోళనలు అతిశయోక్తి కూడా కావొచ్చు'' అని ఆటోకార్ ఇండియా ఎడిటర్ హోర్మజ్ సోరాబ్జీ బీబీసీతో చెప్పారు.
ఇథనాల్ తేమను ఆకర్షించే స్వభావం కలిగి ఉండడంతో కాలక్రమేణా ఇంధనం నుంచి అది విడిపోయి తుప్పుకు దారితీయచ్చని ఆయన వివరించారు.
పాత ఇంజిన్‌లో పేరుకుపోయిన మలినాలు కొన్ని సందర్భాల్లో ఫ్యూయల్ పంపులు, ఇంజెక్టర్లలో అడ్డంకులు ఏర్పడేలా చేయొచ్చని, దీని వల్ల విడిభాగాలు త్వరగా అరిగిపోవడం, తరచూ సర్వీసింగ్ చేయించుకోవడం, కొన్ని భాగాలను మార్చాల్సి రావడం వంటి జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీర్ఘకాలిక ఖర్చు ఎక్కువయ్యే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
2023కు ముందు పెట్రోల్ వాహనాలు కొనుగోలు చేసిన 44వేలమందికి పైగా పాల్గొన్న లోకల్ సర్కిల్స్ సర్వేలో వాహనాలు అసాధారణంగా త్వరగా అరిగిపోయాయని లేదా మరమ్మత్తులు పెరిగాయని చెప్పే వారి సంఖ్య బాగా పెరిగింది.
అయితే ఇ20 వల్ల నిజంగా నష్టం జరుగుతుందనే విషయాన్ని గానీ, ప్రభుత్వం వాహన తయారీ సంస్థలు చెబుతున్నట్టు ఇది పూర్తిగా సురక్షితమనే విషయాన్ని గానీ నిర్థరించే స్వతంత్ర శాస్త్రీయ అధ్యయనాలు ఇప్పటివరకు బహిరంగంగా అందుబాటులో లేవు. ఇదే గందరగోళానికి ప్రధాన కారణమవుతోంది.
ఈ నిర్ణయాన్ని తప్పనిసరి చేస్తే అది సురక్షితమని నిరూపించే ఆధారాలు కూడా ప్రభుత్వం చూపించాలి అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ పారిశ్రామిక నిపుణుడు అన్నారు.
అత్యంత స్పష్టంగా కనిపిస్తున్న విషయం మాత్రం మైలేజ్ తగ్గిపోవడమేనని, కాబట్టి ఈ ఇంధనం చవకగా ఉండాల్సిందని, అలాగే వినియోగదారులకు ఎంపిక అవకాశం ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.





























