రగులుతున్న ఫ్రాన్స్.. ‘దుకాణాలు దోచుకున్నారు, కార్లు, భవనాలు తగలబెట్టారు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ వాటర్ హౌస్, గాబ్రియెలా పామెరాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఫ్రాన్స్‌లో శనివారం(అక్టోబర్ 17) అంతటా జరిగిన అల్లర్లు, నిరసనల తర్వాత, ఆదివారం దేశవ్యాప్తంగా ఎక్కడచూసినా భారీ నష్టం జరిగిన గుర్తులు కనిపించాయి.
పారిస్‌లో దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. కార్లు కాలిపోయాయి. సైకిళ్లు దగ్ధమయ్యాయి. ఫుట్‌పాత్‌లపై పగిలిన అద్దపు ముక్కలు, ఇతర శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి.
శనివారం దాదాపు ఐదులక్షలమందికిపైగా నిరసనల్లో పాల్గొన్నారు. వారిలో దాదాపు 1,800 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇంధన ధరల పెరుగుదల, జీవన వ్యయం పెరగడం, పాఠశాలలు సహా ప్రభుత్వ సేవల నాణ్యత క్షీణించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు.

నల్లటిదుస్తులు ధరించి, ముఖాలకు మాస్కులు, ముఖాన్ని కప్పేసే వస్త్రాలు వేసుకున్న కొందరు అల్లరి మూకలు కూడా పారిస్, మార్సెయ్తో పాటు ఇతర పట్టణాలు, నగరాల్లో వీధుల్లోకి వచ్చారు. వాళ్లల్లో కొందరు కార్లు, భవనాలకు నిప్పు పెట్టారు.
పారిస్, మార్సెయ్, లిల్లే నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దోపిడీలు జరిగాయి.
అల్లర్లను అదుపుచేస్తున్న క్రమంలో పారిస్‌లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి.

ఫొటో సోర్స్, Reuters
‘అన్నీ దోచుకున్నారు’
నిరసనకారులపై పోలీసులు భాష్పవాయుగోళాలు, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. కొందరు గుంపులుగా చేరి రోజంతా రోడ్లపై మంటలు పెట్టి వాహనాలను తగులబెట్టారు. ఒక రెస్టారెంట్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
కొన్ని గుంపుల మధ్య జరుగుతున్న గొడవలను బీబీసీ ప్రత్యక్షంగా చూసింది.
సెంట్రల్ పారిస్‌లో ఒక గుంపు వైపు పోలీసులు దూసుకెళ్లి, పలువురిని లాఠీలతో కొట్టడం కనిపించింది.
"ఇక్కడ యుద్ధం జరిగినట్టుగా ఉంది" అని పారిస్‌లో ఉంటున్న మెహ్మెట్ ఓజెడెన్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
"యువకులు గుంపులగా ఏర్పడి ఏమాత్రం భయం లేకుండా అన్నింటినీ ధ్వంసం చేయడం, తమను ఎవరూ ఏం చేయలేరన్నట్టుగా వ్యవహరించడం చూస్తే భయం కలుగుతోంది" అని పారిస్‌లో ఉంటున్న అనితా గ్రాసిట్ అన్నారు.
"దోపిడీకి పాల్పడినవారు వస్తువులతో నిండిన సూపర్‌మార్కెట్ బుట్టలను గర్వంగా మోసుకెళ్తూ తమ దొంగతనాల గురించి నవ్వుకుంటున్నారు" అని ఆ ప్రాంతంలో నివసించే మేరీస్ అనే మహిళ బీబీసీతో చెప్పారు. ఆమె తన పూర్తిపేరును వెల్లడించలేదు.
దక్షిణంవైపుండే మార్సెయ్ నగరంలో నిరసనకారులు ఇనుప కంచెను ఆయుధంలా ఉపయోగించి సిటీ హాల్లోకి చొరబడ్డారు. లిల్లే నగరంలో ఒక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌కు నిప్పంటించారని పోలీసులు తెలిపారు.
అదే నగరంలోని ఒక ఆపిల్ స్టోర్‌లోకి చొరబడి దోపిడీ చేశారు.
శనివారం జరిగిన అల్లర్లలో 500 మందికి పైగా పోలీసులు, జెండార్మ్స్లు(ఫ్రాన్స్ ప్రత్యేక పోలీస్ దళం) అగ్నిమాపక సిబ్బంది గాయపడినట్టు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
సుమారు 1,500 దుకాణాలు, వ్యాపార సంస్థలు కూడా దెబ్బతిన్నాయని రిటైల్ అండ్ ట్రేడ్ ఫెడరేషన్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Reuters
‘దోపిడీలతో నిరసనకారులకు సంబంధం లేదు’
ఆదివారం ఉదయం పారిస్ ప్రజలు అల్లర్ల తర్వాతి పరిస్థితిని పరిశీలించారు.
రాల్ఫ్ లారెన్, గూచీ, వెర్సాచే వంటి ప్రముఖ కంపెనీల దుకాణాల ముందు అద్దాలు పూర్తిగా పగిలిపోయి కనిపించాయి.
దుకాణ యజమానులు ఉదయాన్నే చీపుర్లతో బయటకు వచ్చి పెద్ద పెద్ద అద్దాల ముక్కలను తొలగిస్తూ అక్కడ శుభ్రం చేయడం మొదలుపెట్టారు. చెత్తను, ఇతర శిథిలాలను తొలగించడానికి కొన్ని ప్రధాన రహదారులపై చెత్తసేకరించే వాహనాలు తిరిగాయి.
చాలా దుకాణాల గోడలపై రంగులతో నినాదాలు రాసి ఉన్నాయి.
"ధనవంతులపై పన్నులు పెంచండి", "ధనవంతులను తినేయండి" వంటి నినాదాలు అందులో ఉన్నాయి.
ప్లాస్ ద లా రిపబ్లిక్ ప్రాంతానికి సమీపంలోని ఒక దుస్తుల దుకాణాన్ని బీబీసీ సందర్శించింది.
ఆ దుకాణం పూర్తిగా దోపిడీకి గురైంది. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.
దుస్తులు, ఫర్నిచర్ దుకాణం అంతా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
దోపిడీపై దుకాణం యజమాని తీవ్ర ఆవేదన చెందారు.
సీసీటీవీల్లో దోపిడీదారులు కనిపించారని, వాళ్లు గంటన్నర కంటే ఎక్కువసేపు దుకాణంలో ఉన్నారని చెప్పారు.
ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా అక్కడ కనిపించలేదన్నారు.
తమ దుకాణాన్ని దోచుకున్నవారు పాఠశాలల పరిస్థితులు లేదా జీవన వ్యయంపై నిజంగా ఆందోళన చెందుతున్న నిరసనకారులు కాదని ఆయన చెప్పారు. తన పేరు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
నిరసనలను అవకాశంగా తీసుకుని దోపిడీలకు పాల్పడ్డారని ఆయనంటున్నారు.
ప్లాస్ ద లా రిపబ్లిక్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న "గుడ్ వైబ్స్" బేకరీని కూడా బీబీసీ సందర్శించింది.
ఆ బేకరీ ముందు భాగంలోని అద్దం పూర్తిగా పగిలిపోయింది.
అక్కడే ఉన్న "నికోలస్" వైన్ దుకాణంలో కొన్ని బాటిళ్లను దొంగలించారు. మిగిలినవాటిని పగలగొట్టారు. దీంతో అక్కడంతా మద్యంవాసనతో నిండిపోయింది.
ముఖాలకు మాస్కులు ధరించిన టీనేజర్లు ఎక్కువగా మొబైల్ ఫోన్ దుకాణంలోకి వెళ్లి ర్యాక్‌ల్లో ఉన్న వస్తువులను తీసుకుంటున్నట్టు ఫ్రాన్స్‌కు చెందిన ఛానల్-2 ప్రసారం చేసిన సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘మంటలను అదుపులోకి తేకుండా అడ్డుకున్నారు’
ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు గత నెల చివరిలో ప్రారంభమైనప్పటి నుంచి లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
పాఠశాలలకు మరిన్ని నిధులు కేటాయించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కొరత, క్లాస్ రూమ్‌ల్లో రద్దీ, నిర్వహణ సరిగాలేని, శిథిలావస్థకు చెందిన భవానాలపై వాళ్లు విమర్శలు చేస్తున్నారు.
నిరసనలు చేయడం ప్రాథమిక హక్కు అని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ న్యూనెజ్ అన్నారు.
అయితే పోలీసులతో ఘర్షణ పడాలని నిర్ణయించుకున్న వేలాదిమంది అతివాద వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తులు ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
ఫ్రాన్స్‌లోని పలు నగరాల్లో అనేక వ్యాపార సంస్థలను దోచుకుని, ధ్వంసం చేసిన నేరప్రవృత్తి గల వ్యక్తులు కూడా ఆ తర్వాత ఆ గుంపులతో కలిశారని తెలిపారు.
లియోన్ నగరంలోని పర్యటక సమాచార కేంద్రానికి నిప్పుపెట్టడాన్ని ఆ నగర మేయర్ గ్రెగొరీ డూసెట్ విషాదకరమైన ఘటనగా అభివర్ణించారు.
"ఇది చాలా ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రాధాన్యం ఉన్న భవనం. ఇది కాలిపోవడం మా హృదయాలను కలిచివేస్తోంది" అని ఆయన ఫ్రెంచ్ మీడియా బీఎఫ్ఎంటీవీతో చెప్పారు.
మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అగ్నిమాపకసిబ్బందిని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారని స్థానిక పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఉద్దేశపూర్వకంగానే హింసాత్మక చర్యలు’
లిమోజ్ నగరపాలక సంస్థ భవనానికి కూడా మంటలు అంటుకున్నాయి. భవనంలో కొంత భాగం కూలిపోయింది.
నగరపాలక సంస్థ భవనం దాదాపు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు.
''143ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవనానికి ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారని, క్రూరమైన అల్లరి మూక ఈ పని చేసిందని హాట్ – వియెన్నె డిపార్ట్మెంట్ ఫ్రిఫెక్ట్ మౌరైస్ బరాటె చెప్పారు.
ప్రిఫెక్ట్ అంటే ప్రభుత్వం తరఫున ఓ ప్రాంతంలో పరిపాలనావ్యవహారాలను పర్యవేక్షించే అధికారి.
ఆగ్నేయ ఫ్రాన్స్‌లోని సెయింట్-ఎటియెన్ నగరంలో చిన్న పేలుడు పదార్థం పేలడంతో ఓ యువకుడి చెయ్యి పూర్తిగా తెగిపోయిందని మేయర్ రెజిస్ జువానికో సోషల్ మీడియాలో తెలిపారు.
"ఇలాంటి విషాదం ఎప్పుడూ జరగకూడదు" అని ఆయన అన్నారు.
శనివారంనాటి నిరసనల్లో కొన్ని ప్రాంతాల్లో లక్ష్యంగా చేసుకుని హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. రాజధాని పారిస్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు మార్సెయ్, రెన్నెస్, టూలూజ్, ఆంజే నగరాల్లో ముఖాలు కనపడకుండా జాగ్రత్తలు తీసుకుని కొందరు వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది.
గ్రెనోబుల్, అవిగ్నాన్, పావ్, మోంట్పెలియర్, వాలెన్స్ సహా ఫ్రాన్స్‌లోని అనేక నగరాల్లో భవనాలకు నష్టం జరిగినట్టు సమాచారం అందింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























