"భారత్‌కు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఇవ్వడానికి మేం రెడీ", అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యల ఆంతర్యమేంటి?

ఫొటో సోర్స్, @SecRubio
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
అమెరికా, భారత్‌తో ఇంధన సహకారాన్ని పెంచుకోవడంపై చర్చిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం అన్నారు.
తన న్యూ దిల్లీ పర్యటనలో భాగంగా జరిగే చర్చల్లో ఇదే అత్యంత కీలకాంశం కానుందని ఆయన వ్యాఖ్యానించారు.
''భారత్ మా నుంచి ఎంత చమురు కొనాలనుకుంటే అంత చమురు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అమెరికా ప్రస్తుతం రికార్డు స్థాయిలో చమురు ఉత్పత్తి, ఎగుమతులు చేస్తోంది" అని మియామీలో జరిగిన విలేఖరుల సమావేశంలో మార్కో రూబియో అన్నారు.
దిల్లీలో జరగనున్న క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో భారత్ వచ్చారు. క్వాడ్ కూటమిలో అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
రూబియో మే 23 నుంచి 26 వరకు భారత్‌లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కోల్‌కతా, ఆగ్రా, జైపూర్, న్యూ దిల్లీలను సందర్శిస్తారు.

''భారతదేశ ఇంధన పోర్ట్‌ఫోలియోలో అమెరికా నుంచి దిగుమతయ్యే ఇంధనం సింహ భాగం కావాలని మేం కోరుకుంటున్నాం. వెనెజ్వెలా నుంచి కూడా భారత్‌కు ఈ విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం. వెనెజ్వెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వచ్చే వారం భారత పర్యటనకు రానున్నారు. వెనెజ్వెలా, భారత్ కలిసి పనిచేయడానికి అనేక అవకాశాలు వారి ముందున్నాయి'' అని మార్కో రూబియో వ్యాఖ్యానించారు.
రూబియో చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"వెనెజ్వెలా అధ్యక్షురాలు వచ్చే వారం భారత్‌కు రానున్నారనే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అందరికంటే ముందే ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పర్యటన గురించి అటు భారత్ కానీ, ఇటు వెనెజ్వెలా కానీ ఎలాంటి సంకేతం, అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. భారత విదేశాంగ విధానానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అమెరికా విదేశాంగ మంత్రి దగ్గర ఉంది? మున్ముందు ఆయన ఇంకేం ప్రకటించబోతున్నారు?" అని ఆయన ట్వీట్లో రాశారు.

ఫొటో సోర్స్, @SecRubio
అమెరికా ఆధిపత్యం
వెనెజ్వెలాలో నికోలస్ మదురో 13 ఏళ్ల పాలనకు ఇటీవలే అమెరికా ముగింపు పలికింది. ఆ తర్వాత వెనెజ్వెలా పగ్గాలు డెల్సీ రోడ్రిగ్జ్ చేతుల్లోకి వెళ్లాయి.
ప్రస్తుతం వెనెజ్వెలాపై అమెరికా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో డెల్సీ పర్యటన గురించి మార్కో రూబియో ప్రకటించడం పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదు.
అయితే, భారత్ ఎంతంటే అంత చమురును అమెరికా నుంచి కొనుగోలు చేయవచ్చని రూబియో చేసిన వ్యాఖ్యలపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రష్యాకు బదులుగా వెనెజ్వెలా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
చమురు వాణిజ్యంలో అమెరికా ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటోందని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రొఫెసర్ ధనంజయ్ త్రిపాఠి అన్నారు. అమెరికా చమురు వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని కోరుకుంటోంది.
"ఈ ఆధిపత్య ధోరణి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొదట రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించడం, ఆ తర్వాత వెనెజ్వెలాలో అధికార మార్పిడి, ఇరాన్‌పై దాడి చేసింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇటువంటి స్థితిలో అమెరికాపై పూర్తిగా ఆధారపడటం వ్యూహాత్మకంగా చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ట్రంప్ రెండో పదవీకాలంలో అమెరికాను పూర్తిగా నమ్ముకోవడం ప్రమాదకరమని భారత్ ఇప్పటికే గ్రహించింది" అని ఆయన అన్నారు.
పెట్రోడాలర్ వ్యవస్థను కాపాడుకునే ఆందోళన
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు, వెనెజ్వెలాలో అధికార మార్పిడి, ఇరాన్‌పై దాడుల వెనుక 'పెట్రోడాలర్' వ్యవస్థను కాపాడుకోవాలనే అమెరికా ఆలోచనే కారణమని పలువురు నిపుణులు భావిస్తున్నారు. నిజానికి, దశాబ్దాలుగా చమురు వాణిజ్యం, ప్రధానంగా అమెరికా డాలర్లలోనే సాగింది. ఈ వ్యవస్థే డాలర్ ప్రపంచ ఆధిపత్యానికి అతిపెద్ద పునాది వేసింది.
చైనా తన ఇంధన దిగుమతుల్లో 'యువాన్' కరెన్సీ వాడకాన్ని పెంచి, తమ కరెన్సీని అంతర్జాతీయం చేస్తోంది. భారత్ కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కొన్నిసార్లు యువాన్లలోనే చెల్లింపులు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ మార్పును పెట్రోడాలర్‌కు సవాలుగా భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదే సమయంలో ప్రపంచ ఇంధన వ్యవస్థ కూడా మారుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి కూడా చైనానే నాయకత్వం వహిస్తోంది. దీనివల్ల చమురు డిమాండ్‌లో మార్పులు రావచ్చు.
ఇదే కాకుండా, తమ సొంత కరెన్సీలలో వ్యాపారం చేయడంపై బ్రిక్స్ కూటమిలో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. భారత్, బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశం. డాలర్‌ను బలహీనపరిచే ఎలాంటి ప్రయత్నాలనైనా సహించబోమని ట్రంప్, బ్రిక్స్ దేశాలను హెచ్చరించారు కూడా. డాలర్ ఆధిపత్యానికి సవాలు ఎదురవుతుందనే ఆందోళన ట్రంప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
"అమెరికా చమురు సరఫరాపై నియంత్రణను కోరుకుంటోంది. దీనికి పెట్రోడాలర్ ఉండటం అనివార్యం. అంటే చమురు కొనుగోళ్లు డాలర్లలోనే జరగాలి. కానీ ఇరాన్‌పై దాడి తర్వాత సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలు తమ భద్రతకు అమెరికా పూర్తి గ్యారెంటీ ఇవ్వలేదనే విషయాన్ని గ్రహించాయని నేను అనుకుంటున్నా. అందువల్ల ఈ దేశాలు కూడా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. ఇది అమెరికా ఆధిపత్య వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతుంది" అని త్రిపాఠి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
డాలర్ ఆధిపత్యం
భారత్ గత ఆర్థిక సంవత్సరంలో ఇంధన దిగుమతుల కోసం 174 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇంధన కొరత రాకుండా ఉండాలంటే భారత్ వద్ద తగినంత డాలర్ నిల్వలు ఉండటం అత్యవసరం.
ఒకవేళ చమురు ఎగుమతి చేసే దేశాలు డాలర్ కాకుండా ఇతర కరెన్సీలను అంగీకరిస్తే, అమెరికా డాలర్ ప్రాధాన్యత తగ్గుతుంది. అందుకే అమెరికా తన పట్టు కోసం డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు. నిరుటి వరకు అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌కు వాణిజ్య మిగులు ఉండేది.
అందుకే భారత్ తన ఇంధన దిగుమతులను అమెరికా వైపు మళ్లించాలని ట్రంప్ ప్రభుత్వం కోరుకుంటోంది.
భారత్ ఇంధన సరఫరాను తన నియంత్రణలోకి తీసుకోవాలని అమెరికా భావిస్తోందని ప్రముఖ ఇంధన విశ్లేషకులు నరేంద్ర తనేజా భావిస్తున్నారు.
''మార్కో రూబియో ప్రకటన భారత్‌పై ఒత్తిడి తీసుకురావడానికేనని స్పష్టంగా తెలుస్తోంది. కానీ, భారత్ తన ఇంధన అవసరాల కోసం పూర్తిగా అమెరికాపై ఆధారపడలేదు. భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించడం ద్వారా అమెరికాను పూర్తిగా నమ్మలేమని అనుకునేలా ఆ దేశమే చేసింది.
చమురు మార్కెట్‌పై ఒపెక్ దేశాల ఆధిపత్యాన్ని బలహీనపరచడమే ఇరాన్ యుద్ధం వెనకున్న ప్లాన్. అమెరికా ఈ పనిలో విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒపెక్ నుంచి యూఏఈ నిష్క్రమించడం.. చమురు సరఫరాను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోబోతోందని చెప్పడానికి సూచన. భవిష్యత్తులో గల్ఫ్ చమురు ఎగుమతిదారులను మినహాయిస్తూ, 'మైనస్ గల్ఫ్' పేరుతో వేరే కూటమి ఏర్పడే అవకాశం ఉంది. ఈ కూటమికి అమెరికా నాయకత్వం వహించవచ్చు. ఇందులో అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, ఇతర దేశాలు ఉండొచ్చు" అని నరేంద్ర తనేజా వివరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























