మేఘాలు మాయం.. 'మాన్‌సూన్ బ్రేక్' అంటే ఏమిటి?

ఎల్‌నినో, వర్షపాతం, మేఘాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

భారత్‌లో చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజల జీవితాలు ఇబ్బందుల్లో పడగా.. మరోవైపు వాయువ్య, మధ్య భారత్‌లో 'మాన్‌సూన్ బ్రేక్' వల్ల చాలా రోజులు వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

దేశంలో రుతుపవనాల వర్షపాతం ఇప్పటికే సగటు కంటే చాలా తక్కువగా ఉన్న సమయంలో వాతావరణంలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పుపై వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాయువ్య భారతానికి చెందిన మైదాన ప్రాంతాలు, పశ్చిమ-మధ్య భారతం, దక్షిణ ద్వీపకల్ప భారతంలో వచ్చే ఆరేడు రోజుల పాటు వర్షపాతం తక్కువగానే ఉండే అవకాశం ఉందని శనివారం వాతావరణ శాఖ కూడా తెలిపింది.

రుతుపవనాల కాలంలో ఇలాంటి మార్పు ఎంత తీవ్రంగా ఉంది, దీనివల్ల కలిగే ప్రభావం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"జూలై రెండవ వారంలో తీసిన ఉపగ్రహ చిత్రాలు చాలా ఆందోళనకరమైన పరిస్థితిని చూపిస్తున్నాయి" అని ఎన్జీవో 'లైవ్ వెదర్ ఆఫ్ ఇండియా' వ్యవస్థాపకుడు నవదీప్ దహియా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.

''దేశంలో పశ్చిమ కనుమల నుంచి ప్రధానంగా రుతుపవనాలుండే ప్రాంతాల వరకు ఎక్కడా కూడా వర్షం పడే సూచనలు కనిపించడం లేదు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రెండింటిలోనూ మేఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. పరిస్థితి జూలై 12 కంటే ఏప్రిల్ 12 ఉదయంలా ఎక్కువగా కనిపిస్తోంది'' అని చెప్పారు.

''జూలై 18 ముందు వరకు రుతుపవనాల పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదు'' అని తెలిపారు.

దేశంలో దిల్లీ ఎన్‌సీఆర్, చాలా ప్రాంతాల్లో పడే వర్షం కూడా రాబోయే రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

మాన్‌సూన్ బ్రేక్ వల్ల వాతావరణంలో ఈ మార్పు చోటు చేసుకుంది. ఇది సాధారణంగా జరిగే విషయమే అయినప్పటికీ, ఈ సంవత్సరం కాస్త ఎక్కువ అసాధారణంగా ఉంది.

ఎల్‌నినో, వర్షపాతం, మేఘాలు

ఫొటో సోర్స్, IMD

వాతావరణ మార్పు ఎంత పెద్ద సమస్య?

జూలై 19, 20వ తేదీ వరకు వాయువ్య, మధ్య భారత్‌లో వర్షాలు పడే అవకాశం లేదని బీబీసీ న్యూస్‌కు స్కైమెట్ వెదర్ అధినేత, వాతావరణ నిపుణులు మహేష్ పలావత్ చెప్పారు.

దీనివల్ల, దిల్లీ ఎన్‌సీఆర్ వంటి చాలా ప్రాంతాల్లో వర్షాలు తీవ్రంగా ప్రభావితమవ్వనున్నాయని, దిల్లీలో, దాని పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 37 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవ్వగలదని పేర్కొన్నారు.

"జూలై, ఆగస్టు నెలల్లో ఒకటి లేదా రెండుసార్లు మాన్‌సూన్ బ్రేక్‌లు వస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో మాన్‌సూన్ బ్రేక్ రాలేదు. ప్రస్తుతం వాయువ్య, మధ్య భారత్‌లో కరువు ఉన్నప్పటికీ, తూర్పు భారత్‌లో వర్షాలు కురుస్తున్నాయి" అని మహేష్ పలావత్ చెప్పారు.

ఇది ఖరీఫ్ కాలం. చాలా పంటలు రుతుపవన వర్షాలపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం వర్షాలు పడకపోతుండే సరికి, రైతుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.

అయితే, రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారిన తర్వాతే ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని మహేష్ పలావత్ అన్నారు.

"ఇలాంటి పరిస్థితిలో, కొండల దిగువ ప్రాంతాల వద్ద వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కానీ, మధ్య, పశ్చిమ భారత్‌లో వాతావరణం దాదాపు పూర్తిగా పొడిగా మారుతుంది. ఈ సమయంలో, గాలిలో తేమ తగ్గుతుంది. వర్షం ఆగిపోతుంది. తేమ లేకపోవడం వల్ల ఆకాశం దాదాపు నిర్మలంగా మారుతుంది" అని చెప్పారు.

ఈ రుతుపవనాలు దక్షిణానికి కదిలినప్పుడు, అంటే సుమారుగా జూలై 19-20 తేదీలలో, ఈ ప్రాంతాలలో మళ్లీ వర్షాలు ప్రారంభం కావచ్చన్నారు.

ఎల్‌నినో, వర్షపాతం, మేఘాలు

ఫొటో సోర్స్, Firdous Nazir/NurPhoto via Getty Images

ఎందుకంత ఆందోళనకరం?

మాన్‌సూన్ బ్రేక వల్ల చాలామంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

''ఇది ఆందోళనకర పరిస్థితి. జూలైలో బలహీనమైన రుతుపవనాల వల్ల, వ్యవసాయానికి, నీటి భద్రతకు, గ్రామాల్లో ప్రజల జీవనోపాధికి ప్రమాదం వాటిల్లుతుంది. మోదీ ప్రభుత్వానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? పార్లమెంట్‌లో ఈ సమస్యను నేను లేవనెత్తుతాను'' అని టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోస్ సోషల్ మీడియాలో రాశారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. అయితే, అప్పటికి వర్షాలు తిరిగి ప్రారంభం కావచ్చు.

ఈ ఏడాది జూన్‌లో భారత్‌లో సగటు కంటే సుమారు 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ, ఆ తర్వాత జూలై 9 వరకు దేశంలో మంచి వర్షపాతం నమోదైంది.

అయితే, జూలై 9 వరకు సగటు వర్షపాత లోటు 12 శాతంగానే ఉంది. మాన్‌సూన్ బ్రేక్ ఈ వర్షపాతం లోటు మరింత పెరిగేందుకు కారణం కావొచ్చు.

''మాన్‌సూన్ బ్రేక్‌లు ప్రతేడాది వస్తాయి. కానీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వచ్చింది. రుతుపవనాలు అసలకే బలహీనంగా ఉన్నాయి. ఇది చాలా సుదీర్ఘకమైన విరామం. సాధారణంగా మాన్‌సూన్ బ్రేక్‌లు ఇంత ఎక్కువ కాలం ఉండవు'' అని మహేష్ పలావత్ అన్నారు.

''వర్షాలు 4-5 రోజుల పాటు ఎగువ ప్రాంతాలకు మళ్ళి, ఆ తర్వాత కిందకు దిగివస్తాయి. కానీ ఈసారి అది పది రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి చాలా సుదీర్ఘమైన విరామం ఏర్పడుతుంది. ఇది ఇంత సుదీర్ఘంగా ఉండకూడదు" అని ఆయన చెప్పారు.

దీని కారణంగా రుతుపవన వర్షపాత గణాంకాలు బలహీనపడతాయని ఆయన చెప్పారు.

మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు సాధారణం కంటే మరింత వెచ్చగా మారినప్పుడు తలెత్తే సహజమైన, క్లిష్టమైన వాతావరణ పరిణామమే ఎల్‌నినో.

దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గాలులు బలహీనపడతాయి. ప్రపంచవ్యాప్తంగా కురిసే వర్షపాత చక్రాలు ప్రభావితమవుతాయి.

ఎల్‌నినో భారత ఉపఖండంలో వాయు పీడనాన్ని ప్రభావితం చేస్తుంది. దేశంలో చాలా ప్రాంతాల్లో తరచూ రుతుపవనాలను బలహీనపరుస్తుంది, కరువు పరిస్థితులకు దారితీస్తుంది.

ఎల్‌నినో, వర్షపాతం, మేఘాలు

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు మాన్‌సూన్ బ్రేక్ ఏర్పడుతుంది?

మాన్‌సూన్ బ్రేక్‌లు సాధారణమైన వాతావరణ పరిస్థితే. బలమైన గాలుల కారణంగా రుతుపవనాలకు బ్రేక్ రావడం అసాధారణమేమీ కాదు.

''గాలులు వీచే దిశ బట్టి మాన్‌సూన్ బ్రేక్‌లు ఏర్పడతాయి. పశ్చిమ గాలి బలంగా వీస్తే, అది రుతుపవన ద్రోణిని పైకి కదిలిస్తుంది'' అని మహేష్ పలావత్ తెలిపారు.

ఒకవేళ కొత్త వాతావరణ వ్యవస్థ ఏర్పడితే, అంటే మరింత ప్రభావవంతమైన తుపాను అల్పపీడన ప్రాంతం ఏర్పడితే, అది రుతుపవనాలను కిందికి లాగుతుందని ఆయన చెప్పారు.

''బంగాళాఖాతంలో తుపాను వ్యవస్థ ఏర్పడి, అది లోపలికి కదిలినప్పుడు, అది రుతుపవనాలను కిందికి లాగుతుంది. దీనివల్ల వర్షాలు మళ్లీ ప్రారంభమవుతాయి'' అని చెప్పారు.

ఎల్‌నినో, వర్షపాతం, మేఘాలు

ఫొటో సోర్స్, Kevin Carter/Getty Images

2027 వరకు ఎల్‌నినో ప్రభావం ఉండనుందా?

ఈ ఏడాది ఇప్పటివరకు తక్కువ వర్షపాతం నమోదు కావడానికి ఎల్‌నినో ప్రభావమే కారణమని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

బీబీసీ 2026 జూన్ నెలలో ప్రచురించిన ఒక కథనంలో 2026 మిగిలిన నెలల్లో ఎల్‌నినో పరిస్థితులు బలపడే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

అనేక అంచనాల ప్రకారం, ఇది ఇప్పటివరకు రికార్డయిన అత్యంత శక్తివంతమైన ఎల్‌నినోలలో ఇదొకటి.

మానవ కార్యకలాపాల వల్ల దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 2027 ఏడాది అత్యంత వేడి గల సంవత్సరంగా నమోదు కావొచ్చు. ఇది వాతారణంపై, ఆహార సరఫరాలపై, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపొచ్చు.

మధ్య ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదు కావడంతో.. ఎల్‌నినో కొత్త దశ ప్రారంభమైందని యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.

శాస్త్రవేత్తలు వాతావరణ పరిస్థితులలో మార్పులను కూడా గమనించారు. పశ్చిమ పసిఫిక్ కంటే మధ్య పసిఫిక్‌లో తక్కువ వాయు పీడనం నమోదైంది.

ఎల్‌నినో పరిస్థితులు నెలకొని ఉన్నాయని జపాన్ వాతావరణ సంస్థ కూడా తెలిపింది.

యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఈ ఎల్‌నినో 'చాలా బలంగా' మారడానికి 63 శాతం అవకాశం ఉంది.

ఒకవేళ ఇలా జరిగితే, 1950 తర్వాత నమోదైన అతిపెద్ద ఎల్‌నినో సంఘటనలలో ఇది ఒకటి అవుతుందని ఆ సంస్థ తెలిపింది.

కనీసం 2027 సంవత్సరం ప్రారంభం వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)