టీమిండియాకు ఏమైంది? ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో వైట్‌వాష్‌కు కారణమేంటి?

శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్‌లో శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ భారత్ 56 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిగిలిన 4 మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోయింది.

తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 257 పరుగులు చేసింది. తర్వాత, భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసిన సంజూ శాంసన్ 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వైభవ్ సూర్యవంశీకి తుదిజట్టులో చోటు దక్కలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సౌతాంప్టన్‌లో అయిదో టి20 మ్యాచ్ జరిగింది

ఫొటో సోర్స్, Dan Istitene/Getty Images

వరుస ఓటములపై ప్రశ్నలు

మొదట ఐర్లాండ్, ఇప్పుడు ఇంగ్లండ్‌ చేతిలో 'వైట్‌వాష్' కావడంతో టి20 చాంపియన్ అయిన భారత జట్టుపై నలుమూలల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లపై విమర్శలు వస్తున్నాయి.

జూన్ మొదట్లో భారత టి20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు అందుకున్నాడు. ఇప్పుడు వరుసగా రెండు సిరీస్‌లలో ఎదురైన ఈ ఓటములు అయ్యర్‌పై ఒత్తిడిని పెంచాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పరుగుల వరద పారించిన భారత బ్యాటర్లు కూడా ఐర్లాండ్, ఇంగ్లండ్ పిచ్‌లపై తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నంలో వరుసగా భారీ షాట్లకు ప్రయత్నించి విఫలమయ్యారు.

భారత జట్టు ఏ దిశగా వెళుతోందో అర్థం కావట్లేదని నాలుగో మ్యాచ్‌లో ఓటమి అనంతరం భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా అన్నారు.

ఈ సిరీస్‌లో బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వడంతో బౌలింగ్ విభాగం కూడా బలహీనంగా మారిపోయింది.

శివమ్ దూబే

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, శివమ్ దూబే

ఇంగ్లండ్ పిచ్‌లు వేరు

భారత్ ఓటమికి ఐపీఎల్ కోసం తయారు చేసే ఫ్లాట్ పిచ్‌లే కారణమని చాలా మంది భావిస్తున్నారు.

ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడటం ఐపీఎల్‌కు చాలా భిన్నంగా ఉంటుందని ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అన్నారు.

'ఐపీఎల్ పిచ్‌లు ఫ్లాట్‌గా ఉంటాయి. బౌండరీలు చిన్నవి. దీనివల్ల బ్యాటింగ్ సులువు అవుతుంది. కానీ, ఇంగ్లండ్‌లో ఆట సంప్రదాయశైలిలో ఉంటుంది. ఇక్కడ బౌలర్లకు ప్రయోజనం లభిస్తుంది. బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది' అని ఆర్చర్ వివరించారు.

ఇంగ్లండ్‌లో బంతి స్వింగ్ అవుతుందని, వికెట్‌లో బౌన్స్ ఉంటుందని, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. ఐపీఎల్‌లో ఆడినట్లుగా ఇంగ్లండ్‌లో ప్రతీ బంతిని బౌండరీ బయటకు పంపడం కుదరదని అభిప్రాయపడ్డారు.

జట్టు ఎంత బాగుంటే కెప్టెన్ అంత బాగా రాణిస్తారంటూ ఒక రకంగా శ్రేయస్ అయ్యర్‌కు భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ మద్దతుగా నిలిచారు.

భారత్ ఓడిన తీరు షాకింగ్‌గా, తీవ్ర ఆందోళనకరంగా ఉందని మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ అన్నారు.

'ఒక మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో, మరో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో జట్టు ఓడింది. ఎక్కడా పోటీలో ఉన్నట్లుగా కనిపించలేదు. దాదాపు ఈ ఆటగాళ్లతోనే జట్టు వరల్డ్ కప్ గెలిచింది. కాబట్టి తాజా ఆటతీరు మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది' అని అతుల్ వాసన్ వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. దీంతో అతను తన బ్యాటింగ్‌ను ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలని వాసన్ సలహా ఇచ్చారు.

ఇంగ్లండ్‌పై వైభవ్ సూర్యవంశీ పెద్దగా రాణించలేకపోయాడు

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్‌పై వైభవ్ సూర్యవంశీ పెద్దగా రాణించలేకపోయాడు

టీమ్ ఎంపికపైనా ప్రశ్నలు

ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో ఓటమి తర్వాత భారత జట్టు యాజమాన్యంపై, జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పలువురు కీలక ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదంటూ ఈ పర్యటనలకు ముందు నుంచే క్రికెట్ అభిమానులు, జట్టు ఎంపికను విమర్శిస్తున్నారు.

గత టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు విజయాన్ని అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు ఇవ్వలేదు.

ఇంగ్లండ్‌లో వైభవ్ సూర్యవంశీని రెండు మ్యాచ్‌ల్లో ఆడించలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శన ఆశించినంతగా కనిపించలేదు.

"భారత జట్టులో రజత్ పాటిదార్ లేకపోవడం విచారకరం. అతను ఇంకా ఏమి చేయాలి? అతను 501 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ దాదాపు 200గా ఉంది. ఇది అన్యాయం" అంటూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు.

క్రికెట్‌పై మంచి అవగాహన ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

'ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది మాటల్లో వర్ణించలేని అవమానకరమైన ఓటమి. నిజం చెప్పాలంటే, ఇప్పుడు మాట్లాడటానికి ఏమీ మిగల్లేదు' అని ఆ ట్వీట్‌లో శశి థరూర్ పేర్కొన్నారు.

ఫిబ్రవరిలో టి20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ఇప్పుడు పూర్తిగా నిస్సహాయంగా కనిపిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

భారత జట్టు సెలెక్షన్‌పై ఉత్పన్పమవుతున్న ప్రశ్నలు

ఫొటో సోర్స్, Ranjith Kumar/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, భారత జట్టు సెలెక్షన్‌పై ఉత్పన్పమవుతున్న ప్రశ్నలు

గంభీర్, అయ్యర్‌లపై విమర్శలు

భారత జట్టు సిరీస్ ఓటములపై తన షోలో సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా మాట్లాడారు.

''కోచ్‌గా గౌతమ్ గంభీర్ సమయం చాలా కాలం క్రితమే ముగిసిపోయింది. కానీ, సొంతగడ్డపై ప్రపంచకప్ గెలవడం, భారత్‌లోని పిచ్‌లను పోలినటువంటి యూఏఈలోని పిచ్‌లపై టీమిండియా గెలవడం వల్ల ఆయన గట్టెక్కారు.

ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో బ్యాలెన్స్ అస్సలే లేదు. పేస్ అటాక్ లేకుండా ఇంగ్లండ్ పర్యటనకు ఎలా వెళ్తారు? హర్షిత్ రాణాను అన్నిసార్లూ ఆడించడం ఏంటో అర్థం కాలేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత జట్టు తిరిగొచ్చాక మేనేజ్‌మెంట్, ఆటగాళ్ల ఎంపికలో పెద్ద మార్పులు కనిపించవచ్చు. బీసీసీఐ కూడా సమీక్షిస్తామని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)