పాకిస్తాన్‌: ఇమ్రాన్ ఖాన్ కంచుకోటలో ఎమర్జెన్సీ, ప్రభుత్వం తప్పు చేస్తోందంటున్న నిపుణులు

పాకిస్తాన్, ఇమ్రాన్ ఖాన్, పీటీఐ
ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్‌ను రిలీజ్ చేయాలని పీటీఐ శ్రేణుల ఆందోళన
    • రచయిత, కరోలిన్ డేవిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

పాఠశాలలు మూతపడ్డాయి. ఇంటర్‌నెట్‌ సేవలను పాక్షికంగా నిలిపేశారు. షిప్పింగ్ కంటైనర్స్‌తో రహదారులను మూసేశారు. భారీ ఎత్తున ఆర్మీ బలగాలు నగరంలోకి చేరుకుంటున్నాయి

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) బలంగా ఉన్న ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అక్కడ ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సస్పెండ్ చేశారు.

పాకిస్తాన్ ప్రభుత్వానికి స్థానికంగా ఇమ్రాన్ ఖాన్ అనుచరులకు మధ్య జరుగుతున్న ఘర్షణ మరింత అస్థిరతకు దారితీస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉగ్రవాదం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారంతోనే ఈ చర్యలు తీసుకున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది.

"ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఉన్న పీటీఐ ప్రభుత్వం ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తోంది" అని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తా త్రార్ ఆదివారం ఆరోపించారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు, ఇతర వివరాలను తెలియజేయలేదు. కానీ త్వరలోనే వాటిని బయటపెడతామని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆధారాలు బయటపెడతామని చెప్పి రెండు రోజులు గడిచినా ఆయన నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు. కానీ పెషావర్‌ సహా ప్రావిన్స్‌లోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. ఇంటర్‌నెట్ సేవలను పునరుద్ధరించారు.

ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు. కానీ నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినట్టు స్పష్టమవుతోంది. దీని కారణంగానే ప్రావిన్స్‌లో చాలా మంది పీటీఐ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ప్రావిన్షియల్ ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రిది స్వస్థలం, ఖైబర్ జిల్లాలోని బారా పట్టణంలో పీటీఐకి చెందిన పదుల సంఖ్య మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించినట్టు వార్తలు వచ్చాయి.

పాకిస్తాన్, ఇమ్రాన్ ఖాన్, పీటీఐ
ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా నిరసనలు

ఎమర్జెన్సీ ఎందుకు?

ఆదివారం అత్యవసర పరిస్థితి ప్రకటించడం యాదృచ్చికం కాదని చాలా మంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

గత వారం రోజులుగా ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని వేల సంఖ్యలో ఆయన మద్దతుదారులు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ప్రదర్శనలు, ర్యాలీలు చేస్తున్నారు. ఈ ప్రావిన్స్‌లో 13 ఏళ్లుగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారంలో ఉంది.

" నిజం చెప్పాలి అంటే, ఆ వ్యాఖ్య (పాకిస్తాన్ సమాచార మంత్రి చేసిన వ్యాఖ్య) నమ్మదగినట్టు లేదని చెప్పవచ్చు" అని చాథమ్ హౌస్‌కు చెందిన పరిశోధకురాలు ఫర్జానా షేక్ అన్నారు.

"దీనికి ఉగ్రవాదంతో సంబంధం ఉందని నాకు అనిపించడం లేదు" అని రాజకీయ విశ్లేషకురాలు, జర్నలిస్ట్ అరిఫా నూర్ అన్నారు. " ఈ పరిస్థితికి ఇమ్రాన్ ఖాన్ అనుచరులు చేపట్టిన లాంగ్ మార్చ్ కూడా కారణమని కూడా కచ్చితంగా తెలియదు. అది చివరి కారణం అయ్యి ఉండొచ్చు. లేదా ప్రతిపక్షం చేతిలో ప్రభుత్వం ఉండటం ఇష్టం లేక దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు" అని వ్యాఖ్యానించారు.

పీటీఐ ఆందోళనలకు ప్రావిన్స్ ముఖ్యమంత్రి అఫ్రిది నాయకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో అంతుపట్టకుండా ఉంది. ప్రభుత్వమే ఆయన్ని అరెస్టు చేసిందని పీటీఐ చెబుతుంటే, భద్రతా కారణాల వల్ల ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంటోంది.

లాంగ్ మార్చ్‌కు ముందే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులను సెప్టెంబర్‌లోనే అరెస్టు చేశారు. మద్దతుదారులను సమీకరిస్తున్నారనే ఆరోపణలపై ముగ్గుర్ని అరెస్టు చేశారు. వారు ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు.

ఏడాది కాలంలో తన కుటుంబాన్ని, లాయర్లను చాలా అరుదుగా మాత్రమే ఇమ్రాన్ ఖాన్ కలుసుకున్నారు. ఆయనను ఆగస్టులోఇద్దరు సిస్టర్స్‌ను కలుసుకున్నారు. ఒకరు జైల్లో కలిశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించే సమయంలో మరో సోదరి కలిశారు. ఈ పరీక్షలు పూర్తి అయిన వెంటనే ఆయన్ను జైలుకు తరలించారు. దాదాపు మూడేళ్ల నుంచి కారాగారంలోనే ఉన్నారు.

పాకిస్తాన్‌లో శక్తివంతమైన సైన్యంతో విభేదాల కారణంగానే అధికారం కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారని చాలా మంది నమ్ముతున్నారు. శిక్షలు పడ్డ అవినీతి కేసులన్నీ కూడా రాజకీయ కక్షతోనే పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకుంది?

పీటీఐ బలహీనంగా ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు?

"ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన పెరుగుతున్న వేళ, గత కొన్ని నెలలుగా పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారుల్లో అసంతృప్తి, ఆందోళనలు పెరుగుతున్నాయి" అని అట్లాంటిక్ కౌన్సిల్లో దక్షిణాసియా పరిశోధకుడు మైకేల్ కుగెల్‌మన్ అన్నారు.

"పీటీఐకి గట్టి హెచ్చరిక ఇవ్వాల్సిన సమయం వచ్చిందనే భావన అధికారుల్లో కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మరింత కష్టాసాధ్యమనేలా చేయాలనుకుంటున్నారు" అని అభిప్రాయపడుతున్నారు.

జైలులో ఉండగానే తనను కలవడానికి వచ్చిన వారితో ఇమ్రాన్ ఖాన్ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ సమావేశాలు నిర్వహించారని ప్రభుత్వం గతంలో వాదించింది.

"అత్యవసర పాలన విధించడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. వారు తమ లాంగ్ మార్చ్‌ను కొనసాగించి ఉండొచ్చు" అని తారర్ అన్నారు. అలాగే ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం, పీటీఐ మధ్య చర్చలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. మాట్లాడుకొని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించామని చెప్పారు.

అయితే, దీనిని ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ కార్యకలాపాలను నియంత్రించడానికి ప్రభుత్వం చేసిన మరో ప్రయత్నంగా చూస్తున్నారు.

"ప్రభుత్వం ఇప్పుడు భిన్నాభిప్రాయాలు, విమర్శలు సహించడానికి సిద్ధంగా లేదు. ఏ వివాదం వచ్చినా చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలనే ఆసక్తి కూడా కనిపించడం లేదు" అని నూర్ అంటున్నారు.

పాకిస్తాన్, ఇమ్రాన్ ఖాన్, పీటీఐ
ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి పట్టున్న ప్రావీన్స్‌లో అత్యవసర పరిస్థితి

పాకిస్తాన్ సైన్యంలో ఆత్మవిశ్వాసం పెరిగిందా?

ఈ నిర్ణయం వెనుక ఉన్నదెవరో స్పష్టంగా తెలుస్తుందని ఇస్లామాబాద్‌కు చెందిన రచయిత, రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు జాహిద్ హుస్సేన్ అన్నారు.

"దేశంలో అధికారం మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది" అని అన్నారు.

‘‘వైట్‌హౌస్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, అమెరికా-ఇరాన్ వివాదంలో మధ్యవర్తిత్వంతో అంతర్జాతీయ ప్రతిష్ఠ పెరిగిందని పాకిస్తాన్ సైన్యం ఆత్మవిశ్వాసంతో ఉందని’’ ఫర్జానా షేక్ అంటున్నారు.

"ఇదే సరైన సమయం, ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి అనే భావన వారిలో కనిపిస్తోంది" అని ఆమె అన్నారు. " అన్ని అవకాశాలు ఇప్పుడు తమ చేతుల్లో ఉన్నాయని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఎలాంటి విమర్శలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అనుకుంటున్నారు."

కానీ పాకిస్తాన్‌లో చాలా సమస్యలు ఉన్నాయి. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. 2026 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ప్రకారం ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంది.

పాకిస్తాన్ రెండు పొరుగు దేశాలతో ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపిస్తూ అఫ్గనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ ఆరోపణలు అఫ్గనిస్తాన్ ఖండించింది. అలాగే భారత్‌తో చాలా కాలంగా ఉన్న వివాదాలు తీవ్రమవ్వడానికి ఎక్కువ సమయం పట్టదని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో సౌదీ అరేబియాకు సాయం చేస్తామని హామీ ఇచ్చింది. హోతీలతో జరుగుతున్న పోరాటంలో సౌదీ అరేబియాపై దాడులు జరిగితే వారికి రక్షణ సహాయం చేస్తామని చెప్పింది.

ఒక సమస్యను పరిష్కరించేందుకు ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించడం వల్ల మరిన్ని సమస్యలకు కారణమవుతుంది.

ఈ నిర్ణయం అస్థిరతను పెంచే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రావిన్స్ బాధ్యత నేరుగా ఇస్లామాబాద్‌పై పడుతుంది. పరిస్థితులు బాగోలేకపోతే ప్రావిన్షియల్ ప్రభుత్వంపై నింద వేయడానికి కూడా ఉండదు.

"ఈ నిర్ణయం చివరికి ప్రభుత్వానికే నష్టంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నా"అని కుగెల్‌మన్ అన్నారు. "ఇది ప్రమాదకరమైన ఆట. ఎందుకంటే ఈ చర్య వల్ల అక్కడి ప్రజల్లో కోపం, అసంతృప్తి మరింత పెరిగితే, ప్రభుత్వం చాలా పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది" అని ఆయన హెచ్చరించారు.

"దేశం ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి నిర్ణయం చాలా నిర్లక్ష్యంగా తీసుకున్న చర్య" అని జాహిద్ హుస్సేన్ అన్నారు. "భవిష్యత్‌లో ఇలాంటి అత్యవసర అధికారులను పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది" అని ఆందోళన వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)