జెట్లీ: జేమ్స్ బాండ్ హీరోగా సత్య ప్రయత్నం అలరించిందా?

ఫొటో సోర్స్, facebook.com/MythriMovieMakers
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
సత్య హీరోగా , మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వంలో జెట్లీ థియేటర్‌లోకి వచ్చింది. వీళ్లిద్దరి కాంబినేషన్ అంటేనే అంచనాలుంటాయి.
మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా చూద్దాం.
కథ ఏమంటే.. ప్రజాపతి (అజయ్) ప్రజల సొమ్ముని దోచేసి బ్యాంకుని దివాళా తీయించి విదేశాలకు పారిపోతాడు.
దుబయ్‌లో ఉన్న అతను లొంగిపోవాలని నిర్ణయించుకుంటే పోలీస్ అధికారి రియా సింఘా తన బృందంతో బయలుదేరి వెళుతుంది.
ప్రజాపతిని సురక్షితంగా తీసుకురావడానికి విమానం ఎక్కుతుంది. అయితే అదే విమానంలో అతన్ని రక్షించాలని అనుకున్నవాళ్లు , శిక్షించాలని అనుకునేవాళ్లు , రకరకాల వ్యక్తులున్నారు.
వారి మధ్యలో డాక్టర్ వ్యాస్ (సత్య) ఉంటాడు. అయితే, తానెవరో అతనికి గుర్తుండదు. వీళ్లందరి మధ్య ప్రజాపతికి ఆ విమానంలో ఏం జరిగింది? సురక్షితంగా వచ్చాడా? లేదా?

నిజానికి ఈ సినిమాలో కథంటూ ఏమీ లేదు. ముఖ్యంగా కథనం (స్క్రీన్ ప్లే) మీద ఆధారపడిన సినిమా. ఊహించని మలుపులు, ఉత్కంఠ ఇలాంటి సినిమాలకి ప్రాణం.
ప్రారంభంలో కొంత ఆసక్తిగా అనిపించినా, క్రమేపీ విసుగ్గా అనిపిస్తే ప్రేక్షకుడి తప్పుకాదు.
దీనికి కారణం సినిమా మొత్తం విమానంలో జరగడం. బరువంతా సత్య భుజాల మీదే ఉండడం.
ఒక దశ దాటిన తర్వాత ఎవరెవరో, స్క్రీన్ మీద అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ప్రజాపతిని ఇండియాకి తీసుకురావడానికి రిస్క్ ఉన్నప్పుడు మామూలు విమానంలో ఎందుకొచ్చారో తెలియదు.

ఫొటో సోర్స్, x.com/MythriOfficial
యాక్షన్ కామెడీ మంచిదే, కానీ..
సరే లాజిక్‌లు వదిలేస్తే సత్య జేమ్స్‌బాండ్ తరహాలో ఎన్ని రకాల సాహసాలు చేస్తాడో ఊహించలేం.
విమానం నడపడం దగ్గరి నుంచి , విమానంలోంచి దూకడం వరకు ఏదైనా చేసేస్తాడు. సత్య కామెడీని చూస్తారు కానీ, యాక్షన్‌ని భరించడం కొంచెం కష్టం.
కామెడీలో బిజీగా ఉన్నవాళ్లు హీరోలుగా ప్రయత్నించడం, యాక్షన్ కామెడీలు చేయడం తప్పుకాదు కానీ , చివరికి కెరీర్ ఇబ్బందుల్లో పడకుండా చూసుకోవడం కూడా ప్రధానమే.
సప్తగిరి దీనికి ఉదాహరణ. సత్య కూడా ఆ దారిలో వెళ్లకపోతేనే మంచిది.

ఫొటో సోర్స్, instagram.com/rheasingha
ఉన్నంతలో సత్య బాగానే చేసినా, కేవలం కామెడీ టైమింగ్ , పంచ్‌లైన్లతో సినిమాలు గట్టెక్కవు.
బలమైన ఎలిమెంట్ ఏదో ఉండాలి. వెన్నెల కిశోర్ ఉన్నా రిలీఫ్ లేదు. పైగా సత్య, కిశోర్ మధ్య వచ్చే సీన్స్ రిపీటెడ్‌గా ఉన్నాయి.
అజయ్ , కబీర్, హీరోయిన్ రియా, వైవా హర్ష ఇలా చాలా మంది ఉన్నారు కానీ, సినిమా అంతా సత్య ఏకపాత్రాభినయమే.
కామెడీ పేరుతో ఏం తీసినా చూస్తారని దర్శకుడు అనుకున్నట్టున్నారు.
అందుకే కన్వీనియనెంట్ రైటింగ్ అని తన మీద తానే జోకులేసుకున్నాడు.

ఫొటో సోర్స్, x.com/MythriOfficial/
అదే పెద్ద పజిల్..
ప్లస్ పాయింట్
1.అక్కడక్కడ కామెడీ
2.సత్య టైమింగ్
మైనస్ పాయింట్స్
1.గందరగోళపు కథ, కథనం
2.విమానంలో ఇరుక్కుపోయిన సినిమా
ఫైనల్‌గా.. సినిమాకి సత్య సపోర్టింగ్ ఉంటే ఉపయోగం, సినిమానే సత్యకి సపోర్టింగ్‌గా ఉంటే ప్రేక్షకులకి కష్టం.
ప్రజాపతి పాత్రని విజయ్ మాల్యాని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నట్టున్నారు.
కింగ్‌ఫిషర్‌కి బదులు స్వింగ్‌ఫిషర్ ఉంటుంది.
సినిమా మొత్తం చూసినా జెట్లీ ఎవరో అర్థం కాకపోవడం ప్రేక్షకుడికి పెద్ద పజిల్.
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































