మాంసం తినే పరాన్నజీవి స్క్రూవర్మ్‌ వ్యాప్తి అరికట్టేందుకు ఈగలు, కుక్కలను ఉపయోగిస్తున్న అమెరికా

    • రచయిత, మాక్స్ మాట్జా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

మాంసం తినే పరాన్నజీవి స్క్రూవర్మ్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి అమెరికా వ్యవసాయ, ఆరోగ్య అధికారులు ప్రణాళిక ప్రకటించారు.

స్క్రూవర్మ్‌ను అమెరికాలో పూర్తిగా నిర్మూలించినట్లు 1966లో ప్రకటించిన తరువాత ఇటీవల మళ్లీ ఈ పరాన్నజీవి ఉనికిని గుర్తించారు.

అమెరికాలో ఈ పరాన్నజీవి వ్యాప్తించకుండా రూపొందించిన ఈ ప్రణాళికలో ప్రధానంగా కోట్ల సంఖ్యలో ఈగలను ఉపయోగించబోతున్నారు.

జన్యుమార్పిడితో సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా చేసిన(స్టెరైల్) ఈ ఈగల సహాయంతో స్క్రూవర్మ్స్‌ వ్యాప్తిని అరికట్టాలనుకుంటున్నారు.

అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇలాంటి ఈగల సంఖ్య, పెరుగుతున్న స్క్రూవర్మ్‌లను వెంటనే ప్రభావితం చేసి అరికట్టేందుకు సరిపోదని నిపుణులు చెబుతున్నారు.

దీనికి అదనంగా మరికొన్ని చర్యలూ తీసుకుంటున్నారు. అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతంలో ఈ పారసైట్ వ్యాప్తిని మొదట గుర్తించిన స్థలం చుట్టూ కంటెయిన్‌మెంట్ జోన్ ఏర్పాటు చేయడం, అలాగే ఈ పరాన్నజీవులను గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ వాడటం వంటివి ఉన్నాయి.

ఈ పరాన్నజీవితో మనుషులకు ముప్పు తక్కువగానే ఉన్నప్పటికీ బీఫ్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందేమోనని పశువుల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు

స్క్రూవర్మ్‌‌లలో ఆడవి.. జంతువులు, మనుషుల శరీరాలపై ఉండే గాయాలు, శ్లేష్మ పొరల్లో గుడ్లు పెడతాయి. గుడ్లు పగిలిన తర్వాత బయటకు వచ్చే వందలాది లార్వాలు తమ పదునైన నోటి భాగాలతో మాంసంలోకి చొచ్చుకుపోతాయి. సకాలంలో చికిత్స అందకపోతే చివరికి అవి ఆ జీవిని చంపేస్తాయి.

అమెరికా అధికారులు బుధవారం గత 60 ఏళ్లలోనే తొలి కేసును గుర్తించామని ప్రకటించారు. మూడు వారాల వయస్సున్న ఒక దూడ నాభి ప్రాంతంలో ఈ లార్వాలు కనిపించాయి. ఈ కేసు టెక్సస్‌లోని లా ప్రయర్ పట్టణంలో వెలుగుచూసింది. ఇది మెక్సికో సరిహద్దుకు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది.

20 కిలోమీటర్ల వెడల్పున కంట్రోల్ జోన్ ఏర్పాటు చేసి, ఆ ప్రాంతంలో క్వారంటైన్, రవాణా నియంత్రణలు, నిఘా చర్యలు అమలు చేస్తున్నట్లు అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) అధికారులు తెలిపారు.

స్క్రూవర్మ్ లార్వాలు ఎదిగి ఈగలుగా మారుతాయి. అవి వాటంతట అవి తక్కువ దూరాలే ప్రయాణించగలవు. అయితే ఎక్కువ దూరాలకు వ్యాపించడానికి ప్రధాన కారణం మనుషుల ద్వారానే సాధ్యమవుతుంది. 1966 తర్వాత కూడా ప్రయాణికుల ద్వారా ఈ పారసైట్ అమెరికాకు చేరిన కొన్ని సంఘటనలు నమోదయ్యాయి. అయితే పెద్ద ఎత్తున వ్యాప్తి మాత్రం జరగలేదు.

గత ఆరు దశాబ్దాలుగా అమెరికా, లాటిన్ అమెరికా దేశాలు స్క్రూవర్మ్ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, కొంతమేర మాత్రమే విజయాన్ని సాధించాయి.

దీన్ని అరికట్టేందుకు ఉపయోగిస్తున్న ఒక ముఖ్యమైన పద్ధతి సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా చేసిన కోట్ల ఈగలను విడుదల చేయడం.

ఆడ ఈగలు తమ జీవితకాలంలో ఒక్కసారే జతకడతాయి. సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా చేసిన ఈగలతో జతకట్టాక గుడ్లు పెట్టినా అవి పొదగవు.

"స్టెరైల్ ఇన్‌సెక్ట్ టెక్నిక్"గా పిలిచే ఈ విధానాన్ని ఫ్రూట్ ఫ్లైస్, దోమలు సహా అనేక కీటకాల జనాభా నియంత్రణకు చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం ఈగలను ఒక ప్రత్యేక వాతావరణంలో పెంచి, అనంతరం సంతానోత్పత్తి సామర్థ్యం లేకుండా మార్చి ప్రకృతిలోకి విడుదల చేస్తారు.

అయితే ప్రస్తుత వ్యాప్తిని అరికట్టాలంటే వారానికి 60 కోట్ల వరకు స్టెరైల్ స్క్రూవర్మ్ ఈగలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం అమెరికా, మెక్సికోలోని ఉత్పత్తి కేంద్రాలు కలిపి వారానికి కేవలం 10 కోట్ల స్టెరైల్ ఈగలను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాయి.

అమెరికా వ్యవసాయ శాఖ కార్యదర్శి బ్రూక్ రాలిన్స్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ, సంక్రమిత దూడను గుర్తించిన తర్వాత 40 లక్షల స్టెరైల్ ఈగలను విడుదల చేశామని, ఫిబ్రవరి నుంచి ప్రతి వారం విమానాల ద్వారా మరో 40 లక్షల ఈగలను విడుదల చేస్తున్నామని తెలిపారు.

అయితే టెక్సాస్‌లోని పశువుల పెంపకదారులు సహా విమర్శకులు ఈ చర్యలు సరిపోవని అంటున్నారు. కొందరు ఈ సమస్యను ట్రంప్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

అమెరికాలో చివరిసారి 1970లలో పశుసంపదకు ముప్పుగా మారే స్థాయిలో వ్యాప్తి జరిగింది. అయితే ఆ సమయంలో అమెరికా భూభాగంలో ఎక్కడా స్క్రూవర్మ్‌ను గుర్తించలేదు.

స్టెరైల్ ఈగల వినియోగం కారణంగా అప్పట్లో స్క్రూవర్మ్‌లను పనామా–కొలంబియా సరిహద్దులోని దట్టమైన అరణ్య ప్రాంతమైన డారియన్ గ్యాప్ వైపు మళ్లించగలిగారు.

ఆ సమయంలో మధ్య అమెరికా అంతటా వారానికి 50 కోట్ల నుంచి 70 కోట్ల స్టెరైల్ ఈగలను విడుదల చేసేవారని సోండా స్విగర్ తెలిపారు.

అయితే ఇటీవలి సంవత్సరాల్లో స్క్రూవర్మ్‌లు మళ్లీ ఉత్తర దిశగా వ్యాపించడం ప్రారంభించాయి. 2022లో పనామాలో కేసులు భారీగా పెరిగాయి. అనంతరం మధ్య అమెరికాలోని ఇతర దేశాల్లో కూడా వ్యాప్తి నమోదైంది. 2024 నాటికి అవి మెక్సికోలో కనిపించి, క్రమంగా అమెరికా వైపు కదలసాగాయి.

ఈ తాజా వ్యాప్తి కారణంగా ఇప్పటివరకు మనుషుల్లో 2,070 స్క్రూవర్మ్ కేసులు నమోదైనట్లు సెంటర్ ఫర్ జిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.

‘బీగల్ బ్రిగేడ్’ అంటూ బరిలోకి కుక్కలు

ఇప్పటివరకు తీసుకున్న చర్యలు నెమ్మదిగా, ఆలస్యంగా జరిగాయని ప్రతిపక్ష డెమోక్రాట్లు విమర్శించారు. సెంట్రల్ అమెరికాలో స్క్రూవర్మ్‌లను ట్రాక్ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థను ట్రంప్ తొలగించడాన్ని వారు ప్రస్తావించారు.

టెక్సస్ వ్యవసాయ కమిషనర్ సిడ్ మిల్లర్, " అధికార యంత్రాంగ జాప్యాలతో, చాలీచాలని స్పందన కారణంగానే ఈ పరాన్నజీవి మెక్సికో అంతటా వ్యాపించి అమెరికాను చేరింది" అని ప్రభుత్వాన్ని విమర్శించారు.

పురుగుమందు ఉచ్చులను ఉపయోగించాలని మిల్లర్ కోరారు. అయితే గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అధికారులు ఆ సూచనను తిరస్కరించారు. అవి స్క్రూవర్మ్‌లను అరికట్టడంలో ప్రభావవంతంగా లేవని, అలాగే మనుషులు, వన్యప్రాణుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాల అందులో ఉంటాయని చెప్పారు.

గురువారం విలేకరులతో మాట్లాడిన రోలిన్స్, స్క్రూవర్మ్‌లు ఉత్తర దిశగా వ్యాపించడానికి "ఓపెన్ బార్డర్స్" అలాగే పశువులు, పెంపుడు జంతువులను అక్రమంగా తరలించే స్మగ్లర్లు కారణమని ఆరోపించారు.

మెక్సికో ప్రభుత్వ స్పందన కూడా "ఆశించిన స్థాయిలో లేదని" ఆమె విమర్శించారు.

ఈ వ్యాప్తిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా, స్క్రూవర్మ్‌లను వాసన ఆధారంగా గుర్తించగల ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కలను అమెరికా సరిహద్దుల్లో మోహరిస్తోంది. కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్, యూఎస్‌డీఏ సంస్థలు వినియోగిస్తున్న ఈ స్నిఫర్ డాగ్స్‌ను "బీగల్ బ్రిగేడ్" అని పిలుస్తున్నారు.

స్క్రూవర్మ్‌ వ్యాప్తిని అరికట్టాలంటే పశువుల శరీరాలపై ఉన్న గాయాలను రైతులు జాగ్రత్తగా కప్పి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. తద్వారా ఈ పరాన్నజీవి అక్కడ చేరకుండా నిరోధించవచ్చు.

ప్రజలు తమను తాము, తమ పెంపుడు జంతువులను కూడా తరచూ పరిశీలించాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

స్క్రూవర్మ్‌లు సాధారణంగా వేడిగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే వాతావరణ మార్పుల ప్రభావంతో అవి మరింత ఉత్తర దిశగా వ్యాపించే అవకాశం ఉందని స్విగర్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)