సొరచేప దాడి చేయడంతో వ్యక్తి మృతి

    • రచయిత, అలెక్స్ ఫిలిప్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 2 నిమిషాలు

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ తీరంలో సొరచేప దాడిలో ఒక వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

కెయిర్న్స్, టౌన్స్ విల్ నగరాల మధ్య ఉన్న కాసోవరీ తీరంలో ఒక బోట్ ర్యాంప్ సమీపంలో ఈత కొడుతున్న 39 ఏళ్ల వ్యక్తి మీద షార్క్ దాడి చేసినట్లు ఎమర్జెన్సీ సేవల సిబ్బందికి సమాచారం అందింది.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త ముందు ఈ దాడి జరిగిందని అధికారులు చెప్పారు.

షార్క్ దాడిలో గాయపడిన వ్యక్తిని నీటి నుంచి బయటకు తీసిన తర్వాత, గాయాల కారణంగా చనిపోయినట్లు క్వీన్స్‌లాండ్ పోలీసులు తెలిపారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ సమీపంలో గత శనివారం ఈటెలతో చేపలు పడుతున్న 38 ఏళ్ల వ్యక్తి మరణించారు. ఆస్ట్రేలియా తీర జలాల్లో వారాల వ్యవధిలో ఇది రెండో ప్రాణాంతక దాడి.

పెర్త్ సమీపంలో జరిగిన సంఘటనలో ఆ వ్యక్తి కాళ్ల కింది భాగంలో చేపలు కొరికేశాయి.

తాజాగా షార్క్ దాడి బాధితుడికి తగిలిన గాయాల వివరాలను క్వీన్స్‌లాండ్ పోలీసులు వెల్లడించలేదు. మృతుడి వివరాలూ బహిర్గతం చేయలేదు.

"అనుమానాస్పదం కాని, ఆకస్మిక మరణం" పై కరోనర్ (న్యాయాధికారి) కోసం నివేదిక సిద్ధం చేస్తామని పోలీసులు వెల్లడించారు.

"ఈ విషయం కరోనర్ పరిశీలనలో ఉన్నందున దీనిపై మరింత వ్యాఖ్యానించలేం" అని పోలీసులు తెలిపారు.

ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో షార్క్ దాడులు ఎక్కువ. అయినప్పటికీ అవి ప్రతీసారి ప్రాణాంతంకంగా మారవు.

ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో నాలుగు సొర చేపల దాడులు జరిగితే అందులో ఒకటే ప్రాణాంతకమైనదని ఆస్ట్రేలియన్ షార్క్-ఇన్సిడెంట్ డేటాబేస్ చెబుతోంది.

ఆస్ట్రేలియా సముద్ర తీరంలో సర్ఫింగ్ చేసే ప్రదేశాలు, ఈత కొట్టే ప్రదేశాల్లో షార్క్ చేపల దాడుల నుంచి రక్షించుకునేందుకు తగిన ఏర్పాట్లు ఉంటాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)