సౌదీ అరేబియా: ఒకనాటి కలల ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు మూలన పడుతున్నాయి?

- రచయిత, సెబాస్టియన్ అషర్
- హోదా, గ్లోబల్ అఫైర్స్ కరస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 13 నిమిషాలు
మధ్యప్రాచ్యంలో ఒకప్పటి కింగ్‌లు, తాము తిరుగులేని అధికారం చెలాయిస్తున్న రోజుల్లో మొదలుపెట్టిన భారీ ప్రాజెక్టుల తాలూకు శిథిలాలు, ఇప్పుడు వారి వైభవపు గుర్తులుగా మిగిలిపోయాయి. ఆనాటి ఆ నిర్మాణాల గుర్తులు నేటికీ మధ్యప్రాచ్య సారవంతపు మైదానాల్లో, పర్వత శ్రేణుల్లో, ఎడారులలో కనిపిస్తాయి.
అయితే, ప్రస్తుత కాలంలో వారితో పోల్చదగ్గ ఒక ఆధునిక పాలకుడు మాత్రం, తన అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను కేవలం ఒక 'డిజిటల్ ముద్ర'ను మాత్రమే మిగిల్చేలా కనిపిస్తున్నారు.
ఒక దశాబ్దం కిందట, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) తన దేశ భవిష్యత్తు గురించి సైన్స్ ఫిక్షన్ ప్రపంచాన్ని తలపించేలా ఒక సరికొత్త విజన్‌ను ప్రకటించారు. దానికి 'విజన్ 2030' అని పేరు పెట్టారు.
కేవలం తమ దేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి సరికొత్త సాంకేతిక అద్భుతాలను పరిచయం చేసేందుకు అసాధారణమైన, భారీ ఏకశిలా కట్టడాలను (మోనోలిథిక్ స్ట్రక్చర్స్) నిర్మించాలని ఇందులో ప్రతిపాదించారు.

యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆలోచనలను ప్రతిబింబిస్తూ విడుదల చేసిన భారీ ప్రచార చిత్రాలు ఊహాజనిత ప్రపంచాన్ని కళ్లకు కట్టాయి.
ఇవి ఒకవైపు విస్మయాన్ని, మరోవైపు వెక్కిరింతలను ఎదుర్కొంటూ, విశేషంగా వార్తల్లో నిలిచాయి.
సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) ఒక ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.95.21 లక్షల కోట్లు)తో ఇది సాధ్యమైంది. పూర్తిగా చమురు ఆధారంగానే సమకూరిన ఈ అపార సంపదను, భవిష్యత్తులో చమురు అవసరం లేని ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థకు పునాది వేయడానికి ఉపయోగించాలనేది వారి ప్రణాళిక.

ఫొటో సోర్స్, NEOM
ఆర్థికంగా ఇబ్బందులు...
'విజన్ 2030' లక్ష్యానికి మరో నాలుగేళ్లు మాత్రమే గడువు ఉన్న తరుణంలో ఊహించినట్లుగానే ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల ఖర్చులలో కోత విధించడం మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఆర్థికపరమైన ఇబ్బందులే.
ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, చమురు ధరలు భారీగా పడిపోవడంతో అపారమైన సంపద ఉన్న సౌదీ అరేబియాకు సైతం ఆర్థికంగా గట్టి దెబ్బ తగలింది.
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం చమురు ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగినప్పటికీ, ఈ ఘర్షణల వల్ల ఏర్పడిన అనిశ్చితి సౌదీ అరేబియా ఆదాయ వ్యయాలపై పరిమితులకు కారణమైంది.
అంతేకాకుండా, అత్యంత ఖరీదైన ఈ కలల ప్రాజెక్టులలోకి సౌదీ అరేబియా ఆశించిన స్థాయిలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఎప్పుడూ రాలేదు.
ఇది కేవలం పునఃసమీక్ష మాత్రమేనా లేక పూర్తిగా వెనకడుగు వేయడమా?

ఫొటో సోర్స్, NEOM
కలల ప్రపంచం నుంచి కఠిన వాస్తవాల వైపు...
నియోమ్: సౌదీ అరేబియాలో అత్యంత అద్భుతమైన, ఆకర్షణీయమైన ప్రాజెక్టులలో కొన్నింటిని ఇప్పుడు తగ్గించుకుంటున్నారు, కొన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు లేదా పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. వీటిలో చాలావరకు, ఒకప్పుడు సర్వస్వంగా భావించిన 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.47 లక్షల కోట్లు) 'నియోమ్' (ఎన్ఈఓఎం) మెగా-ప్రాజెక్ట్ పరిధిలోనివే.
ది లైన్: సౌదీ అరేబియా వాయువ్య ప్రాంతంలోని ఖాళీ భూముల్లో, సుమారు 100 మైళ్ల (161 కిలోమీటర్ల) కంటే ఎక్కువ దూరం ఏకధాటిగా నిలువు గీతలా సాగిపోతూ, లండన్‌లోని ప్రసిద్ధ 'ది షార్డ్' భవనం కంటే ఎత్తుగా నిర్మించతలపెట్టిన నగరం 'ది లైన్'.
అసలు నగరాల భావననే మార్చేస్తుందనుకున్న ఈ ప్రాజెక్ట్‌ను, ఇప్పుడు చాలా సాదాసీదా విషయంగా మార్చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ట్రోజెనా: వాయువ్య పర్వత శ్రేణులలోని 'ట్రోజెనా' వింటర్ రిసార్ట్ ప్రాజెక్టుపై కూడా ఇప్పుడు నియంత్రణలు విధించారు.
సౌదీ అరేబియా అంటే అంతులేని ఎడారి అనే ముద్రను చెరిపేస్తూ అక్కడ మంచు పడుతున్నప్పటికీ, అది స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. అక్కడి వాతావరణానికి భిన్నంగా ఏడాది పొడవునా అందుబాటులో ఉండే హిల్ రిసార్ట్‌ను నిర్మించాలనే ఆలోచన కూడా నడిచింది. దీనిని అత్యంత కృత్రిమత్వంతో కూడిన ప్రయోగంగా భావించారు. పైగా, ఇది ఆచరణాత్మకం కాదని తేలిపోయింది.
కొండల్లో మైళ్ల మేర స్కీ స్లోప్స్, కృత్రిమ సరస్సు, విలాసవంతమైన హోటళ్లు, షాప్‌లతో స్విట్జర్లాండ్ తరహా 'సెయింట్ మోరిట్జ్' నగరాన్ని అరేబియా కొండల్లో ఆవిష్కరించాలని భావించారు.
2029లో ఆసియా వింటర్ గేమ్స్ నిర్వహణకు ఆతిథ్యం ఇచ్చేలా 'ట్రోజెనా'ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రణాళిక రద్దయింది. ఇప్పుడీ క్రీడల వేదిక సౌదీ అరేబియాలో కాకుండా కజకిస్తాన్‌కు మారిపోయింది.
ది క్యూబ్: అమెరికాలోని ప్రసిద్ధ 'ఎంపైర్ స్టేట్ బిల్డింగ్' వంటి 20 అత్యంత భారీ భవనాలు పట్టేంత స్థాయిలో తలపెట్టిన అపార్ట్మెంట్లు, కార్యాలయాల సముదాయమే 'ది క్యూబ్'. దీని అంచనా వ్యయం 50 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4.75 లక్షల కోట్లు). అయితే, ఈ ప్రాజెక్టును ఇప్పుడు పూర్తిగా రద్దు చేశారు.
ఎల్ఐవీ గోల్ఫ్: క్రీడా ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలనే సౌదీ అరేబియా ప్రతిష్ఠాత్మక ఆశయాలన్నింటిలోకి అత్యంత ముఖ్యమైనదిగా భావించిన 'ఎల్ఐవీ గోల్ఫ్' టూర్ ప్రస్తుతం ఒక నిరుపయోగమైన, భారీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయింది. ఇప్పటివరకు దీనిపై 5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినా, అది అటు ఆదాయాన్ని కానీ, ఇటు ఆశించిన కీర్తిని కానీ తెచ్చిపెట్టలేదు.

'ఇదంతా పాత కథే'
'సౌదీ, ఇంక్.' పుస్తక రచయిత్రి ఎల్లెన్ ఆర్.వాల్డ్ వంటి సౌదీ వ్యవహారాల విశ్లేషకులు, ఈ తరహా పరిణామాలు తమకు కొత్తేమీ కాదంటున్నారు.
''ఇదంతా పాత కథే, 'ది లైన్' విషయంలోనూ ఇదే పునరావృతమవుతోంది. మొదట మేము ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నాం అని గొప్పలు చెప్తారు. తీరా సమయం వచ్చాక దాని బడ్జెట్, పరిధి తగ్గించేశాం అంటారు. మహమ్మద్ బిన్ సల్మాన్ కాలానికి ముందు నుంచీ ఇదే తంతు నడుస్తోంది. వారు ఆరంభంలో భారీ ప్రచారాలతో హడావుడి చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు పూర్తిగా కనుమరుగవుతాయి లేదా ప్రాథమిక నమూనాకు పూర్తి భిన్నంగా అత్యంత సాదాసీదాగా మిగిలిపోతాయి'' అని ఎల్లెన్ ఆర్.వాల్డ్ విశ్లేషించారు.
పూర్వపు రాజు కింగ్ అబ్దుల్లా ఆధ్వర్యంలో 2000 దశకంలో నిర్మించాలనుకున్న సరికొత్త నగరాల గురించి వాల్డ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
చమురు ఆదాయంపై ఆధారపడకుండా సౌదీ ఆర్థిక వ్యవస్థను మార్చడమే లక్ష్యంగా ఈ 'ఎకనామిక్ సిటీస్' కార్యక్రమాన్ని కూడా సౌదీ కింగ్ ప్రారంభించారు.
దశాబ్దాలుగా సౌదీ అరేబియా దేశానికి చమురు ఒక శాశ్వతమైన ఆవశ్యకతగా ఉంది. ఎప్పటికీ శాశ్వతంగా ఉండని ఒకే ఒక్క సహజ వనరుపై పూర్తిగా ఆధారపడటం అనేది, అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన, పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఒక పెద్ద అడ్డంకి అని చాలాకాలంగా భావిస్తున్నారు.
అయితే, బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ దీని ఫలితాలు మాత్రం చాలా నిరాశాజనకంగా మిగిలాయి. ప్రతిపాదించిన నగరాల్లో చాలావరకు అసలు పనులే ప్రారంభం కాలేదు, మరికొన్నింటిని చాలా చిన్న ప్రాజెక్టులుగా మార్చేశారు.
జెద్దాకు ఉత్తరాన ఎర్ర సముద్ర తీరంలో నిర్మించిన 100 బిలియన్ డాలర్ల 'కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ' అనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఒక రూపానికి వచ్చినప్పటికీ అదొక వ్యాపార, పర్యాటక కేంద్రంగా మారాలనే లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
దేశంలో నిరంతరం పెరుగుతున్న యువ జనాభా కోసం నిస్తేజంగా ఉన్న ప్రభుత్వ రంగానికి భిన్నంగా కొత్త విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, నిజమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం 'ఎకనామిక్ సిటీస్' ప్రాజెక్ట్ లక్ష్యం. కానీ, 2016 నాటికి కూడా నిరుద్యోగిత రేటు దాదాపు 12 శాతంగానే ఉంది.
ఇటువంటి ప్రాజెక్టుల వెనుక ఉన్న అధికారులు, వాటి సామర్థ్యంపై ఒక వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండటంలో పూర్తిగా విఫలమవుతున్నారని వాల్డ్ అభిప్రాయపడ్డారు.
''అసలు మార్కెట్ ఎక్కడ ఉందని వారు భావించారు? ఇది సాధ్యమేనని వారికి ఎవరు చెప్పారు? అక్కడ తీవ్రమైన 'ఎస్ మ్యాన్' మనస్తత్వం (సొంత ఆలోచన లేకుండా పాలకుల మాటలకు 'అవును' అని తల ఊపే మనస్తత్వం) ఉంది. కింగ్ ఏమి వినాలనుకుంటున్నారో అధికారులు దాన్నే చెబుతుంటారు. కన్సల్టెంట్ల పరిస్థితి కూడా ఇంతే, ఎందుకంటే వారికి భారీ కాంట్రాక్టులు కావాలి. కాబట్టి, తమ సౌదీ క్లయింట్లు ఏమి వినాలనుకుంటున్నారో వాళ్లూ దాన్నే చెబుతారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులు విఫలమవుతాయి'' అని వాల్డ్ అన్నారు.
దశాబ్దాలుగా ఇదే తీరు కొనసాగుతోంది. తాము దక్కించుకున్న అత్యంత లాభదాయకమైన కాంట్రాక్టులను ఎక్కడ కోల్పోతామో అనే భయంతో విదేశీ కంపెనీలు కూడా యాజమాన్యాలను ఎలాంటి ప్రశ్నలు అడగడానికి ఇష్టపడవు.

ఫొటో సోర్స్, Getty Images
సమూలంగా మార్పు...
మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) 2017లో సౌదీ అరేబియా అనధికారికం(డి ఫాక్టో రూలర్)గా పాలనా పగ్గాలు చేపట్టినప్పుడు ఆయనకు భారీ సంస్కరణలు అవసరమైన ఒక వ్యవస్థ లభించిందని కొందరు భావించారు.
సౌదీ అరేబియాలో వస్తున్న మార్పులను కొన్నేళ్లుగా గమనిస్తున్న ఆర్థిక విశ్లేషకుడు ఘనెం నుసేబే, ''ఎంబీఎస్‌కు వారసత్వంగా లభించిన సామాజిక ఆర్థిక వ్యవస్థ ఆధునిక ప్రపంచానికి ఎంతమాత్రం సంబంధం లేనిదిగా, పూర్తిగా స్తంభించిపోయే దిశగా సాగుతున్నది'' అని చెప్పారు.
ఈ నేపథ్యంలో, సౌదీ అరేబియాను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా... ఇలా మూడు రకాలుగా మార్చడానికి ఎంబీఎస్ 'విజన్ 2030'ను రూపొందించారు.
''అయితే వారికి ఉన్న అత్యంత సంక్లిష్టమైన సవాలు ఏమిటంటే, ఈ మూడు మార్పులను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ఏకకాలంలో అమలు చేయాల్సి రావడం'' అని ఘనెం నుసేబే విశ్లేషించారు.
కఠిన సంప్రదాయవాద ఇస్లామిక్ శక్తుల సామాజిక పట్టు సౌదీ అరేబియా ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకంగా మారుతోందని ఎంబీఎస్, ఆయన అనుచర గణం భావించారు. ఎంబీఎస్ నాయకత్వంలోని రాజకీయ పరిణామాలను యువతరం చేతికి పాలనాపగ్గాలు అప్పగించడంగా ప్రచారం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణకు గానీ, రాజకీయ చర్చలకు గానీ ఎలాంటి స్వేచ్ఛా లభించలేదు.
సౌదీలో సంస్కరణల వేగాన్ని అడ్డుకోవడంలోనూ, తన ప్రతిష్ఠను మసకబార్చుకోవడంలోనూ స్వయంగా ఎంబీఎస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమయ్యాయని నుసేబే పేర్కొన్నారు.
ఎంబీఎస్ 2017లో అధికారం చేజిక్కించుకున్న వెంటనే రియాద్‌లోని విలాసవంతమైన 'రిట్జ్-కార్ల్టన్' హోటల్లో సౌదీ వ్యాపార, రాజకీయ ప్రముఖులను సామూహిక నిర్బంధం చేయించారు. దీనిని అవినీతి నిర్మూలన చర్యగా ప్రభుత్వం పేర్కొనగా, విమర్శకులు మాత్రం ఇది అధికార బలాన్ని ఉపయోగించి చేసిన వసూళ్లపర్వంగా అభివర్ణించారు.
దీనికి తోడు, 2018లో ఇస్తాంబుల్ కాన్సులేట్‌లో సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ దారుణ హత్య ఉదంతం యువరాజు ఎంబీఎస్ కీర్తికి పెద్ద కళంకంగా మిగిలిపోయింది.
సౌదీ పాలకుల అణచివేత ధోరణిని స్వయంగా అనుభవించిన వారిలో అమెరికాలో ఉంటున్న సౌదీ మేధావి, మానవ హక్కుల నేత అబ్దుల్లా అల్-ఔదా ఒకరు. ఇస్లామిక్ పండితుడైన ఆయన తండ్రి సల్మాన్ అల్-ఔదా, 'దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు' అనే కేసులో 2017 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్నారు.
రిట్జ్-కార్ల్టన్ వంటి నిర్బంధాల ద్వారా ఆనాడు లొంగిపోయిన ప్రముఖుల నుంచి ప్రభుత్వం దాదాపు 100 బిలియన్ డాలర్లు వసూలు చేసినప్పటికీ, దీర్ఘకాలంలో ఇటువంటి చర్యలు 'విజన్ 2030'కి ఆశించిన స్థాయిలో అంతర్జాతీయ పెట్టుబడులు రాకుండా దెబ్బతీశాయని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.
''అలాగే అక్కడి అణచివేత ధోరణి కూడా పెట్టుబడిదారులు సౌదీ అరేబియాను ఒక ప్రభుత్వంగా, ఒక దేశంగా చూసే విధానాన్ని ప్రభావితం చేసింది. పెట్టుబడిదారులు అత్యంత ముఖ్యంగా కోరుకునేది 'భరోసా'. కానీ అక్కడ అది లోపించింది. ఎటువంటి భరోసా లేనప్పుడు, మీరు ఈరోజు పెట్టుబడిదారుడిగా ఉండి, మర్నాడే అకారణంగా నిర్బంధానికి గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని ఎవరూ కోరుకోరు'' అని అబ్దుల్లా అన్నారు. ఈ పరిస్థితే 'విజన్ 2030'పై చర్చను మార్చడంలో సహాయపడింది.
అలాగే 2016 నుంచి సౌదీ అరేబియాలో వరుసగా జరిగిన ప్రముఖ క్రీడలు, వినోద కార్యక్రమాలు ఆ దేశ అంతర్గత పరిస్థితిని, బయట ఉన్న ప్రతిష్ఠపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి.
మహిళలకు ఎట్టకేలకు డ్రైవింగ్ చేసే హక్కును కల్పించడం వంటి సంచలన నిర్ణయాలు సౌదీ అరేబియా సమాజంలో నిజంగానే మార్పు తెచ్చాయి. కానీ, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు ఇప్పటికీ ఈ మార్పులను నీడలా కమ్మేస్తూనే ఉన్నాయి.
ఎంబీఎస్, సౌదీ సార్వభౌమ నిధి (పీఐఎఫ్) ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త రంగాలలోకి అడుగుపెడుతున్న కొద్దీ... స్పోర్ట్స్ వాషింగ్ (క్రీడల నిర్వహణ ద్వారా ప్రతిష్ఠను పెంచుకోవడం), ఆర్ట్ వాషింగ్, గ్రీన్ వాషింగ్ వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి.
క్రీడా, వినోద రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు సౌదీ అరేబియాలో కనిపించడానికి సంతోషంగా అంగీకరించినప్పటికీ, మరికొందరు మాత్రం అక్కడి మానవ హక్కుల రికార్డును ప్రస్తావిస్తూ నిరాకరించారు.
మోటార్ రేసింగ్, బాక్సింగ్ వంటి ఈవెంట్ల కోసం వేలమంది అభిమానులు రియాద్‌కు తరలివచ్చినప్పటికీ, పర్యాటకులుగా రాగల అవకాశం ఉన్నవారు కూడా ఆ దేశంపై ఉన్న ప్రతికూల అభిప్రాయాల వల్ల వెనకడుగు వేశారు.
అయితే, చాలామంది సౌదీ యువతకు ఎంబీఎస్ ఆశయాలు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయనీ, ప్రజాదరణ పొందాయనే వాస్తవాన్ని ఇవేవీ కాదనలేవు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
'విజన్ 2030' మనుగడ కోసం...
అత్యంత హంగులు, ఆర్భాటాలతో ప్రపంచాన్ని ఆకర్షించిన భారీ ప్రాజెక్టుల బడ్జెట్లో కోతలు విధించడమనేది ఒక రకంగా తమ ఓటమిని పాక్షికంగా అంగీకరించడమేనని అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నప్పటికీ, సౌదీ యంత్రాంగం మాత్రం దీన్నొక సానుకూల పరిణామంగా చిత్రీకరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
''భారీ మెగా ప్రాజెక్టుల వెంటపడటం కంటే, ప్రస్తుతానికి చిన్న చిన్న విజయాలతో సంతృప్తి చెందాలనే ధోరణి అధికారుల్లో కనిపిస్తోంది. ఉదాహరణకు, రెడ్ సీ ఐలాండ్ రిసార్ట్ 'సిందాలా'ను వారు ఒక విజయవంతమైన ప్రాజెక్టుగా చూపించవచ్చు. ఇది పాత పద్ధతిలోనే సాగే రిసార్ట్ అయినా, 'ది లైన్' లేదా 'ది క్యూబ్' స్థానంలో దీనిని విజన్ 2030 విజయంగా ప్రచారం చేసుకోవచ్చు. 'నియోమ్' ప్రాజెక్టుకు ఇవే పునాదులని, మొత్తం నగరాన్నంతా నిర్మించాల్సిన పనిలేదని సమర్థించుకునే అవకాశం దీనివల్ల వారికి దక్కుతుంది'' అని అబ్దుల్లా అన్నారు.
సౌదీ అధికారిక వర్గాల తాజా ప్రకటనలు సైతం ఇదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.
పీఐఎఫ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యాన్ ఇటీవల ఒక కొత్త ఐదేళ్ల ప్రణాళికను ప్రస్తావిస్తూ, తమ నిధి తాలూకు వ్యూహం ఇకపై 'ఖర్చుల నియంత్రణ, నిధుల వినియోగంలో పారదర్శకత, ఆర్థిక వనరుల సుస్థిరతను కాపాడుకుంటూ వ్యాపారాల పనితీరును నిరంతరం సమీక్షించుకోవడంపైనే ఉంటుంది' అని స్పష్టం చేశారు.
ఇలా వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గి నిధుల సర్దుబాటు చేసుకోవడమే సౌదీ పాలకుల ముందున్న ఏకైక మార్గమని, పైగా ఇది 'విజన్ 2030'ని సంక్షోభం నుంచి గట్టెక్కించే రక్షణ చర్య అని కొంతమంది నిపుణుల అభిప్రాయం.
కానీ, ప్రముఖ సౌదీ పారిశ్రామికవేత్త థామర్ షేకర్ దీనిని భిన్నమైన కోణంలో చూశారు.
''ఇది కేవలం కేటాయింపుల మార్పు కాదు, ఆశయాల స్థాయి నుంచి ఆచరణాత్మక స్థాయికి మారే క్రమంలో జరిగే ఒక సహజ పరిణామం. ఏ దేశంలోనైనా పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టినప్పుడు, ఒకానొక దశలో కేవలం ఆర్భాటపు ప్రకటనల కంటే... ప్రాధాన్యతలను గుర్తించడం, పనులను క్రమబద్ధీకరించడం, వనరుల సమర్థవంతమైన కేటాయింపులే అత్యంత కీలకంగా మారతాయి'' అని థామర్ షేకర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఊహాజనిత ప్రాజెక్టులు పక్కకు...
సైన్స్ ఫిక్షన్ కథలను తలపించే ఊహాజనిత ప్రాజెక్టులను పక్కనపెట్టి, వాస్తవ రూపం దాల్చడానికి వీలున్న మరికొన్ని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను మాత్రం కొనసాగిస్తున్నారు.
అందులో భాగంగా రియాద్‌లోని చారిత్రాత్మక పాత రాజధాని 'దిరియా' పునరుద్ధరణ పనులు, అలాగే రాజధాని నగరానికి సమీపంలోనే నిర్మిస్తున్న అత్యాధునిక థీమ్ పార్క్ 'సిక్స్ ఫ్లాగ్స్ కిద్దియా సిటీ' పనులు వేగంగా సాగుతున్నాయి.
జోర్డాన్‌లోని ప్రసిద్ధ 'పెట్రా' కట్టడాలకు ఏమాత్రం తీసిపోని పురాతన నబాటియన్ కట్టడాలు ఉన్న 'అల్ ఉలా' ప్రాంతాన్ని పర్యాటక రంగంలో విజయవంతంగా తీర్చిదిద్దిన అనుభవమే, ఈ తరహా ప్రాజెక్టులను ఎలా విజయవంతం చేయవచ్చనే దానికి ఒక చక్కని దిక్సూచిగా నిలుస్తోంది.
ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ఒక ప్రాంతాన్ని సౌదీ అరేబియా ఆధునిక జాతీయ, సాంస్కృతిక అస్తిత్వానికి ప్రధాన చిహ్నంగా మార్చేందుకు ఇప్పటికే వేల కోట్ల డాలర్లు వెచ్చించారు. దీనిని అంతర్జాతీయ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించనున్నారు. 'ది లైన్' వంటి అసాధ్యమైన కలలతో పోలిస్తే ఇది ఎంతో ఆచరణాత్మకమైన లక్ష్యం.
మరోవైపు క్రీడారంగంలో ప్రపంచంలోనే అత్యంత భారీ ఈవెంట్ 2034 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆతిథ్య బాధ్యతలను సౌదీ దక్కించుకోగలిగింది. దీని నిర్వహణకు సంబంధించిన స్టేడియాలు, మౌలిక వసతుల రూపకల్పనలో తనదైన సరికొత్త విజన్ ఉండేలా చూసేందుకు యువరాజు ఎంబీఎస్ కచ్చితంగా ప్రయత్నించవచ్చు.
అయితే, బడ్జెట్ అదుపు తప్పకుండా చూసుకునే క్రమంలో, ఆరంభంలో ఊహించిన కొన్ని భారీ అసాధారణ ప్రణాళికలపై ప్రస్తుతం నియంత్రణలు విధించినట్లు స్పష్టమవుతోంది.

ఫొటో సోర్స్, NEOM
విశ్వసనీయమైన అమలు నమూనా...
'విజన్ 2030' ప్రణాళికల మార్పుపై తాము అవలంబిస్తున్న ధోరణిని... గతంలో పాలకులకు ఉన్న రహస్య స్వభావానికి, అస్పష్టతకు పూర్తి భిన్నమైనదిగా చెప్పుకునేందుకు సౌదీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాము చేసిన పొరపాట్లను గుర్తించి, తగిన సంస్కరణలు చేపట్టామనే సంకేతాలను ఇస్తున్నారు.
గల్ఫ్ ప్రాంత రాజకీయ-ఆర్థిక సమీకరణాల విశ్లేషకుడు మేట్ సలై అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామం విదేశీ ప్రతినిధులకు, దౌత్యవేత్తలకు ఒక పరిమితి వరకు మేలు చేస్తుంది.
''సౌదీ యంత్రాంగం తమ తప్పులను పాక్షికంగానైనా అంగీకరిస్తూ చర్చకు రావడం నిస్సందేహంగా ఒక సానుకూల పరిణామమే. కానీ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, భాగస్వాములు ఆశించే పూర్తి స్థాయి నమ్మకాన్ని ఇది ఇంకా కలిగించలేదు'' అని ఆయన విశ్లేషించారు.
మరోవైపు, థామర్ షేకర్ దీనిపై మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
''అన్నివేళలా భారీ ప్రాజెక్టుల వెంటే పడకుండా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రాధాన్యతలను మార్చుకోవడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంపొందిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చల ధోరణి మారుతోంది. ఆర్భాటపు ప్రకటనల కంటే, ఆయా ప్రాజెక్టుల ఆచరణాత్మక నమూనా ఎంతవరకు విశ్వసనీయంగా ఉందనే అంశానికే అంతర్జాతీయ సమాజం ప్రాధాన్యత ఇస్తోంది'' అని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Reuters
ఆర్భాటపు వ్యయాలకు అడ్డుకట్ట...
ఇరాన్‌కు, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ జ్వాలలు రాజుకోవడానికి ముందే సౌదీ అరేబియా తన 'విజన్ 2030'ని పునఃసమీక్షించే పనిలో పడింది. అయితే ఈ తాజా యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న మునుపటి అంతర్జాతీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది.
అంతర్జాతీయ వాణిజ్య, పర్యాటక హబ్‌గా ఎదగాలన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యూహాల మనుగడపైనే ఇది సందేహాలను లేవనెత్తింది.
నిజానికి సౌదీ అరేబియా సైతం యూఏఈ తరహా వ్యూహాన్నే అనుసరిస్తూ, దానికంటే మెరుగైన స్థానాన్ని అందుకోవాలని కలలుగంది.
సౌదీ తన లక్ష్యాలను సరిదిద్దుకునే ప్రక్రియ ప్రారంభమైన కొద్ది నెలలకే ఇరాన్ యుద్ధం మొదలుకావడంతో, 'విజన్ 2030' భవిష్యత్తుపై మరింత అనిశ్చితి నెలకొందని విశ్లేషకుడు సలై అభిప్రాయపడ్డారు.
''యుద్ధ వాతావరణానికి ముందు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు పర్యాటకం, తయారీ రంగం, మైనింగ్ వంటి స్థానిక పరిశ్రమలలో భారీగా పెట్టుబడులు రాబట్టాలని సౌదీ భావించింది. అయితే మైనింగ్ మినహా మిగిలిన అన్ని రంగాలు ఈ యుద్ధం కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి'' అని ఆయన చెప్పారు.
''నియోమ్ ప్రాజెక్టును పూర్తిగా ఏఐ ఆధారిత పరిశ్రమల కేంద్రంగా మార్చబోతున్నామన్నది యుద్ధానికి ముందు వారు ఇచ్చిన సంకేతం. ప్రస్తుత యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం సరైనదే అనిపించినప్పటికీ, వారి ప్రాధాన్యతలు నెలనెలా మారిపోతున్నాయనే వాస్తవాన్ని ఇది నొక్కి చెబుతోంది. ఇది వారి వ్యూహాత్మక గందరగోళాన్ని చాటిచెబుతోంది. అయినప్పటికీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసుకోవాలనే ఆచరణాత్మక ఆలోచన సౌదీ పాలకులకు ఉందనడానికి ఇదొక మంచి ఉదాహరణ'' అని సలై విశ్లేషించారు.
సౌదీ అరేబియా ముఖచిత్రాన్ని మార్చడంలో 'విజన్ 2030' కీలక పాత్ర పోషించింది. అయితే ఈ పరిణామాలు కొందరిలో హర్షాన్ని, మరికొందరిలో తీవ్ర నిరసనను రేకెత్తించాయి.
ఏదేమైనా, ఈ త్రిముఖ సంస్కరణల వ్యూహంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిగా అందుకోవడానికి సౌదీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
రాజకీయ రంగం: ఇక్కడ పాలకుల పట్ల అసమ్మతి లేదా భేదాభిప్రాయాల వ్యక్తీకరణపై అణచివేత ఎప్పటిలాగే అత్యంత కఠినంగా కొనసాగుతోంది.
సామాజిక రంగం: క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రియాద్ వంటి నగరాల వాతావరణం పూర్తిగా మారిపోయింది. రెండు దశాబ్దాల క్రితం అసలు ఉనికిలోనే లేని విభిన్న వినోద విలాసాలు అందుబాటులోకి రావడంతో, సౌదీ ప్రజలు తమ సొమ్మును విరివిగా స్వదేశంలోనే ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
ఆర్థిక రంగం: విజన్ 2030 మెగా ప్రాజెక్టుల ద్వారా దేశ ఆర్థిక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించాలన్నది పాలకుల ఆలోచన. విదేశీ, ప్రైవేటు పెట్టుబడులను ప్రభుత్వ చమురు ఆదాయానికి దీటుగా నిలబెట్టాలన్న వారి కల పాక్షికంగానే సాకారమైంది.
మొదట్లో ఊహించినంత భారీ విజయం కాకపోయినప్పటికీ, సౌదీ పాలకులు మాత్రం దీనిని ఒక సక్సెస్ స్టోరీగానే ప్రపంచం ముందు ఉంచుతున్నారు.
ప్రపంచం దృష్టిలో ఒక గొప్ప దూరదృష్టి గల నేతగా గుర్తింపు పొందాలని యువరాజు ఎంబీఎస్ ఆశించినప్పటికీ, సమయం వచ్చినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోగల సమర్థుడిగా కనిపించడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
భవిష్యత్తులో కేవలం ఇంటర్నెట్ వీడియోలకే పరిమితం కాబోతున్న ఇలాంటి ఊహాజనిత ప్రాజెక్టుల కోసం వేల కోట్ల డాలర్ల ప్రజాధనాన్ని వృథా చేసినా పాలకులను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు. సమాధానం చెప్పుకోవాల్సిన పని పాలకులకు లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ యువతలో యువరాజుకు ఉన్న ఆదరణ చెక్కుచెదరలేదు. ఆ అండ చూసుకునే, 'ది క్యూబ్'లాంటి ప్రతిష్ఠాత్మక మెగా ప్రాజెక్టులను సైతం చెత్త కాగితాల్లా బుట్టదాఖలు చేయడం వారికి సాధ్యమైంది.
బహుశా 'ది క్యూబ్' ప్రాజెక్ట్ అసలు రంగు కూడా అదే కావచ్చు.
ఇన్నాళ్లూ సౌదీ అరేబియా పెట్టే పెట్టుబడులు, నగదుపైనే పూర్తిగా ఆధారపడి బతికిన అంతర్జాతీయ క్రీడా, వినోద, కళారంగాల దిగ్గజాలకు ఇప్పుడు అసలైన సినిమా కనిపిస్తోంది. ఆ నిధుల కుళాయి ఇప్పుడు కేవలం బొట్లు బొట్లుగా మాత్రమే కారుతోంది లేదా పూర్తిగా మూతపడింది.
''ఎల్ఐవీ గోల్ఫ్ టూర్ వంటి కొన్ని ప్రాజెక్టులకు ఆర్థికపరంగా ఎలాంటి లాభం లేదు. అసలు వీరు ఏ వ్యూహంతో రంగంలోకి దిగారనేదే అర్థం కావడం లేదు. కేవలం తమ దేశంపై ఉన్న చెడ్డ పేరును తుడిచేసుకోవడానికి అంత భారీ ఎత్తున నిధులు కుమ్మరించారని అనుకోలేం. ఒకవేళ అదే నిజమైతే, అది మూర్ఖత్వమే అవుతుంది'' అని ఎల్లెన్ ఆర్.వాల్డ్ వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.



























