‘వాళ్లు మమ్మల్ని వెళ్లగొట్టాలని, మాకు భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తున్నారు’ - ఇజ్రాయెల్‌లపై పాలస్తీనియుల ఆగ్రహం

    • రచయిత, యోలాండే నెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

జెరూసలేం ఓల్డ్ సిటీ ప్రహరీ గోడల కింద ఇళ్ల కూల్చివేత శబ్దాలు వినిపిస్తున్నాయి. అక్కడి ఓ కొండవాలు నుంచి నే చూస్తుండగానే... ఒక పాలస్తీనియన్ ఇంటిని ఓ భారీ ఇజ్రాయెల్‌ బుల్డోజర్ కూల్చివేస్తోంది.

సిల్వాన్ పరిసరాల్లోని అల్-బుస్తాన్ ప్రాంతంలో 2023 చివరి నుంచి ఇప్పటివరకు దాదాపు 59 ఆస్తులను ధ్వంసం చేశారు.

ప్రపంచం దృష్టి గాజా యుద్ధం నుంచి ఇప్పుడు ఇరాన్, లెబనాన్‌పైకి మళ్లిన తరుణంలో... ఇజ్రాయెల్ ఆక్రమిత తూర్పు జెరూసలేంలో పాలస్తీనియన్లను వారి ఇళ్ల నుంచి వెళ్లగొట్టే ఘటనలు నాటకీయంగా పెరిగాయి.

‘‘అసలు భవిష్యత్తే లేకుండా చేశారు.మొత్తం సర్వనాశనం చేశారు’’ అన్నారు 58 ఏళ్ల ఫాయెజ్ అవద్. ఆయన ఇంటిని కూడా కూల్చేశారు. కేవలం ఒకే ఒక అంతస్తు మిగిలింది. నేను ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడే కూర్చుని ఉన్నారు.

‘‘ఈ ఇల్లు కట్టుకోవడానికి మా జీవితాలను ధారపోశాం. మా జీవితంలో మేం సాధించినది ఇదే. వాళ్లు నన్ను, నా పిల్లలను మళ్లీ రోడ్డుపైకి తెచ్చారు’’అన్నారు.

యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమైన జెరూసలేం నగరం.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి, ఈ ప్రాంతంపై తమకే హక్కు ఉందనే పరస్పర పోరాటాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. 1967 మధ్యప్రాచ్య యుద్ధంలో జోర్డాన్ నుంచి తూర్పు జెరుసలెంతోపాటు దాని పవిత్ర స్థలాలు, మిగిలిన వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అనంతరం తూర్పు జెరుసలెంను తనలో విలీనం చేసుకుంది. కానీ ఈ విలీనాన్ని చాలా దేశాలు గుర్తించలేదు.

దాదాపు 20 సంవత్సరాలుగా, అల్-బుస్తాన్‌ను బైబిల్ నేపథ్యంతో కూడిన కింగ్స్ గార్డెన్‌గా మార్చడానికి ఇజ్రాయెల్‌ జెరూసలేం మునిసిపాలిటీ ప్రయత్నిస్తోంది.

దీని నిర్వహణ బాధ్యతలను ఒక యూదు సెటిలర్ సంస్థకు అప్పగించాలనేది వారి ప్రణాళిక.

ఇటీవల ఇజ్రాయెల్ కోర్టుల ఆదేశాలతో... ఇక్కడి ఇరుకైన వీధుల్లో కూల్చివేతలు వేగవంతమయ్యాయి.

ఆక్రమిత భూభాగాల్లో స్థావరాల నిర్మాణం, బలవంతంగా ప్రజలను తరలించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం.

జెరూసలేం నగర వాసుల ప్రయోజనాల కోసమే తాము పని చేస్తున్నామని, ప్రజా వినియోగానికి తగినంత ఖాళీ స్థలాలు లేని ప్రాంతంలో ఒక పార్కును అభివృద్ధి చేయాలన్నదే తమ ఉద్దేశమని మున్సిపాలిటీ ఒక ప్రకటనలో బీబీసీకి తెలిపింది.

అధికారులు ఏమంటున్నారు?

అయితే, తూర్పు జెరూసలేంలో, ఇజ్రాయెల్ నుంచి నిర్మాణ అనుమతులు పొందడం తమకు దాదాపు అసాధ్యమని పాలస్తీనియులు చెబుతున్నారు

ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థ 'బిమ్కోమ్' గణాంకాల మేరకు, 2025లో జెరూసలేంలో ఆమోదించిన కొత్త గృహ నిర్మాణాలలో కేవలం 7 శాతం మాత్రమే పాలస్తీనియన్ల కోసం కేటాయించారు. కానీ, నగర జనాభాలో వీరి వాటా దాదాపు 40 శాతం వరకు ఉంది.

ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రతిపాదనలపై రాజీకి రావడానికి తాము చేసిన ప్రయత్నాలను స్థానిక యంత్రాంగం తిరస్కరించిందని అల్-బుస్తాన్ ప్రాంత ప్రజలు అంటున్నారు.

ఇప్పటికే ఇక్కడి ఇళ్లలో సగానికి పైగా నేలమట్టమయ్యాయి. కూల్చివేత ఆదేశాలను ఎదుర్కొంటున్న పలువురు మున్సిపాలిటీ వేలాది డాలర్ల మేర విధించే భారీ ఖర్చులు, జరిమానాలను తప్పించుకోవడానికి తమ ఇళ్లను తామే పెద్ద పెద్ద సుత్తులతో ధ్వంసం చేసుకుంటున్నారు.

"రాబోయే నెలల్లో మిగిలిన ఇళ్లను కూడా ధ్వంసం చేస్తామని మాకు హెచ్చరికలు అందుతున్నాయి" అని స్థానిక సామాజిక కార్యకర్త ఫఖ్రీ అబు దియాబ్ చెప్పారు.

ఆయన ఇల్లును చాలారోజుల కిందటే కూల్చివేశారు. ఇప్పుడు శిథిలాల పక్కన ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసం నుంచి కూడా ఆయనను, ఆయన భార్యను ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు.

"ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను వాడుకుని ఈ సమస్యకు ముగింపు పలకాలని ఇజ్రాయెల్ చూస్తోంది. ఇది చాలాబాధాకరమైనది. అంతర్జాతీయ సమాజం మమ్మల్ని ఒంటరిగా వదిలేసింది. మునిసిపాలిటీ మాపై, మా ఉనికిపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోంది" అన్నారు అబు దియాబ్.

వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్ ఇప్పటివరకు దాదాపు 160 స్థిరనివాసాలను నిర్మించింది. వీటిలో 7 లక్షల మంది యూదులు నివసిస్తున్నారు.

పాలస్తీనా కుటుంబాలపై కేసులు

మెజారిటీ ఇజ్రాయెలీలు జెరూసలేం మొత్తాన్ని తమ రాజధానిగా భావిస్తుంటే, పాలస్తీనియన్లు మాత్రం తాము కలలుగంటున్న భవిష్యత్తు స్వతంత్ర దేశానికి తూర్పు జెరూసలేం రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే, ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీనా దేశం అనే ఆలోచననే 'సమాధి' చేస్తామని ప్రతిజ్ఞ చేసింది, దానికి అనుగుణంగానే అడుగులు వేస్తోంది.

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, ఇళ్లను ఖాళీ చేయాలంటూ దాదాపు 200 పాలస్తీనా కుటుంబాలపై ఎవిక్షన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం యూదు సెటిలర్లు దాఖలు చేసినవే.

1948లో ఇజ్రాయెల్ ఏర్పడకముందు యూదుల యాజమాన్యంలో ఉన్న ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అనుమతించే చట్టాలను ఇజ్రాయెల్ వాడుకుంటోంది. దీనివల్ల సెటిలర్లు ఆ ఇళ్లలోకి ప్రవేశించడానికి మార్గం సుగమమవుతోంది. ప్రస్తుతం అల్-బుస్తాన్ పక్కనే ఉన్న సిల్వాన్‌లోని మరో ప్రాంతం 'బత్న్ అల్-హవా'లో ఇదే జరుగుతోంది. అక్కడ ఏళ్లుగా నివసిస్తున్న పాలస్తీనా కుటుంబాలపై ఇప్పుడు 'ఆక్రమణదారులు'గా ముద్ర వేస్తోంది.

ఇజ్రాయెల్ భూభాగంలో చారిత్రకంగా తమకు చెందిన ఆస్తులను పాలస్తీనియన్లు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ చట్టాలు వీలు కల్పించడం లేదు.

ముస్లింలు 'అల్-హరమ్ అల్-షరీఫ్' అని, యూదుల సంప్రదాయంలో 'టెంపుల్ మౌంట్' అని పిలిచే పవిత్రమైన అల్-అక్సా మసీదు ప్రాంగణానికి సిల్వాన్ ప్రాంతం చాలా దగ్గరగా ఉండటమే ఇజ్రాయెల్ అధికారులు, సెటిలర్ గ్రూపులకు దీనిపై ఉన్న ఆసక్తికి ప్రధాన కారణం. ఇది యూదు మతంలో అత్యంత పవిత్ స్థలంగా, ఇస్లాంలో మూడో అత్యంత పవిత్ర స్థలంగా దీనికి ప్రత్యేకత ఉంది.

ఇజ్రాయెల్‌లో సెటిల్‌మెంట్ల వ్యతిరేక సంస్థ'పీస్ నౌ'కు చెందిన యోనాతన్ మిజ్రాహి ఇజ్రాయెల్ పురావస్తు ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ "సిల్వాన్ ప్రాంతం 'సిటీ ఆఫ్ డేవిడ్' అనే చాలా ముఖ్యమైన చారిత్రక స్థలంలో ఉంది. ఇది ఇజ్రాయెల్ చెపడుతున్న పురావస్తు ప్రాజెక్టులో భాగం’’ అన్నారు.

"ఎక్కువ మంది సెటిలర్లు ఇక్కడికి రావడం, దురదృష్టవశాత్తూ అంతకంతకూ ఎక్కువ మంది పాలస్తీనియన్లు ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్లిపోవాల్సి రావడం మేం చూస్తున్నాం" అన్నారు యోనాతన్.

ఓల్డ్ సిటీ భవనాలపై ఇజ్రాయెల్ జెండాలు

పురాతన జెరుసలెంలోని క్రైస్తవ, ముస్లిం ప్రాంతాలలో ఇప్పుడు యూదు సెటిలర్లు నివసిస్తున్న భవనాలపై ఇజ్రాయెల్ జెండాలు కనిపిస్తాయి. అక్కడి యెషీవా విద్యాసంస్థ భవనంపైనా ఓ పెద్ద జెండా కనిపిస్తోంది. యెషీవా యూదు మత జాతీయవాద పాఠశాల. ఈ పాఠశాల ఎవిక్షన్ ఉత్తర్వుల వివాదంలో భాగంగా ఉంది.

బ్రిటిష్ పాలన కాలంలో, 1929లో జరిగిన మతపరమైన అల్లర్ల సమయంలో 20వ శతాబ్దం ప్రారంభంలో స్థాపితమైన ఆ యెషివా మూతపడింది. అయితే ఆ భవనంలోని కొంత భాగంలో నివసించేందుకు అనుమతి పొందిన పాలస్తీనా ముస్లిం కాపలాదారు మహమ్మద్ బాషా అబ్దుల్‌ఘనీ, ఆ ప్రాంగణాన్ని సంరక్షిస్తూ వచ్చారు.

ప్రస్తుతం, ఇజ్రాయెల్ న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక విభాగం దాఖలు చేసిన కేసులో, అబ్దుల్‌ఘనీ కుటుంబానికి చెందిన మిగిలిన 12 మంది సభ్యులు (వీరిలో ఎక్కువ మంది వృద్ధులే)ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లాలని జెరూసలేం కోర్టులు తీర్పునిచ్చాయి. తమ విద్యార్థుల కోసం అదనపు స్థలం కూడా అవసరమని ప్రస్తుత యెషీవా యాజమాన్యం కోర్టులో వాదించింది.

" ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి" అని చిన్న అపార్ట్‌మెంట్‌లో కూర్చుని ఉన్న అబ్దుల్‌ఘనీ కుమారుడు 76 ఏళ్ల ముఫిద్ బాషా ప్రశ్నించారు.

"మాకు వెళ్లడానికి వేరే చోటు లేదు. నాకు తెలిసిన ఒకే ఒక్క ఇల్లు ఇదే" అన్నారాయన.

తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న తర్వాత, యెషీవా తాళాన్ని తన తండ్రి అప్పగించినప్పుడు ఆయన్ను అభినందించిన రోజులను ముఫిద్ గుర్తుచేసుకున్నారు. ఆ భవనం లోపల వేలాది మతపరమైన గ్రంథాలూ లభ్యమయ్యాయి.

"ఆయన ఆ పుస్తకాలను కాపాడారు, ఆ స్థలాన్ని కాపాడారు, అన్నింటినీ అలాగే ఉంచారు" అని ముఫిద్ బాషా అన్నారు.

"దానికి మాకు దక్కిన బహుమతి ఇదొక్కటే" అన్నారాయన.

అయితే, దీనిపై ప్రస్తుత యెషీవా రబ్బీ (యూదు మత గురువు)ని బీబీసీ సంప్రదించగా, ఆయన మాట్లాడటానికి నిరాకరించారు.

జెరూసలేం జిల్లా కోర్టు ఇటీవల బాషా కుటుంబం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను పరిశీలిస్తున్న తరుణంలో, వారిని ఇల్లు ఖాళీ చేయించకుండా స్టే జారీ చేసింది.

'హద్దులు లేకుండా వ్యవహరిస్తోంది'

తూర్పు జెరూసలేంలో ఓవైపు పాలస్తీనియన్లను ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తుండగా, మరోవైపు అదే నగరంలో మరో చోట ఉందామన్నా వారికి ఎక్కడా ఇళ్లు దొరకడం లేదు.

ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థ 'బిమ్కోమ్' ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, 2018లో తూర్పు జెరూసలేంలో ప్రవేశపెట్టిన కొత్త భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రభుత్వం భారీ ఎత్తున భూములను స్వాధీనం చేసుకోవడానికి, పాలస్తీనియన్లను ఖాళీ చేయించడానికి ఒక సాధనంగా వాడుకుంటోంది.

"ప్రస్తుతం జెరూసలేంలోని పాలస్తీనియన్లు తాము సురక్షితంగా లేమని భావిస్తున్నారు. చివరికి సొంత ఇంటిలో కూడా వారికి రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది" అని ఇజ్రాయెల్ సెటిలర్ల తిరేక స్వచ్ఛంద సంస్థ 'ఇర్ అమీమ్'కు చెందిన పరిశోధకుడు అవీవ్ టాటర్స్కీ అన్నారు.

జెరూసలేం నగరం ఇజ్రాయెల్ ప్రజలతో పాటు, పాలస్తీనియన్లకూ ఉమ్మడి నగరంగా ఉండాలని ఈ సంస్థ విశ్వసిస్తోంది.

"ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రభుత్వం హద్దులు లేకుండా వ్యవహరిస్తోంది. జెరూసలేంలో పాలస్తీనియన్ల హక్కులను లేదా వారి ఉనికిని కూడా ఏమాత్రం అంగీకరించకుండా, నగరంలో యూదుల ఆధిపత్యాన్ని శాశ్వతం చేసేలా వారు వేగంగా అడుగులు వేస్తున్నారు" అని టాటర్స్కీ చెప్పారు.

తూర్పు జెరూసలేంలోని షేక్ జర్రా ఏరియా ప్రారంభంలోనే ఒక భారీ 'అల్ట్రా-ఆర్థడాక్స్ యెషీవా' నిర్మాణానికి సంబంధించిన వివాదాస్పద ప్రాజెక్టుకు జెరూసలేం జిల్లా ప్రణాళికా అధికారులు ఇటీవల ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.

ఆస్తుల స్వాధీనానికి అధికారుల బృందం

అలాగే, ఓల్డ్ సిటీలోని అల్-అక్సా మసీదు ప్రాంగణం లేదా టెంపుల్ మౌంట్ ప్రవేశద్వారమైన 'చైన్ గేట్' సమీపంలో పాలస్తీనియన్ల యాజమాన్యంలో ఉన్న పదుల సంఖ్యలోని ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశాలను పరిశీలించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

అల్-బుస్తాన్ ప్రాంతంలో విదేశీ దౌత్యవేత్తల పర్యటనలో నేను కూడా భాగమయ్యాను. అంతర్జాతీయ చట్టాలను కాపాడాలని, తాము తమ ఇళ్లలోనే ఉండేలా సహాయం చేయాలని స్థానిక పాలస్తీనియన్లు అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

తూర్పు జెరూసలేంలో, ముఖ్యంగా సిల్వాన్ ప్రాంతంలో పరిస్థితి 'చాలా దారుణంగా' ఉందని యూరోపియన్ యూనియన్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది.

"ఇజ్రాయెల్ సెటిలర్ల విధానాలను, వారి కార్యకలాపాలను యూరోపియన్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది" అని ఆ ప్రకటనలో తెలిపింది.

దౌత్యవేత్తల పర్యటనలో, చివరగా మేం మంచానికే పరిమితమైన 97 ఏళ్ల యుస్రా ఖ్వైదర్ దగ్గరకు వెళ్లాం. 1948లో జాఫా నుంచి ఈమె కుటుంబం ప్రాణభయంతో పారిపోయి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు నివాసాలు మారారు. ఇప్పుడు గత అర్ధ శతాబ్ద కాలంగా నివసిస్తున్న ఇంటిని కూడా ఖాళీ చేయాలంటూ వారికి నోటీసు వచ్చింది.

"వారు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారు. నేను అనారోగ్యంతో ఉన్నాను, నడవలేను. మేం కేవలం దేవుడిపైనే భారం వేశాం" అని యుస్రా నాతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)