నెతన్యాహును ఓడించడానికి ఏకమైన రెండు పార్టీలు.. ఇజ్రాయెల్‌లో వేగంగా మారుతున్న రాజకీయం

చదివే సమయం: 3 నిమిషాలు

ఇజ్రాయెల్‌లో ఈ ఏడాది జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును ఓడించేందుకు రెండు రాజకీయ పార్టీలు విలీనమై కొత్త పార్టీని స్థాపించాయి.

మాజీ ప్రధానమంత్రి, రైట్ వింగ్ లీడర్ నఫ్‌తాలీ బెన్నెట్.. సెంట్రిస్ట్ లీడర్, ప్రతిపక్ష నాయకుడైన యాయర్ లాపిడ్ తమ పార్టీలను విలీనం చేసి 'యాచాడ్' (అంటే 'కలిసికట్టుగా' ) అనే కొత్త పార్టీని ప్రకటించారు. ఏప్రిల్ 27న ఇజ్రాయెల్ మీడియాలో ఈ వార్త ప్రధానాంశంగా నిలిచింది.

ఈ నిర్ణయంతో 'యాచాడ్' అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది, నెతన్యాహుకు ప్రధాన ప్రత్యర్థిగా బెన్నెట్ నిలిచారు.

ఇజ్రాయెల్ మీడియా ఈ విలీనాన్ని 'నాటకీయ పరిణామం'గా వర్ణిస్తూ, నెతన్యాహును అధికారం నుంచి తప్పించడమే దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. దాదాపు అన్ని ప్రముఖ పత్రికలు బెన్నెట్, లాపిడ్ ఫోటోలను మొదటి పేజీలో ప్రచురించాయి.

నెతన్యాహును అధికారం నుంచి తొలగించడానికి బెన్నెట్, లాపిడ్ 2021లోనూ చేతులు కలిపారు. అయితే, నెతన్యాహును పక్కన పెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పడిన వారి కూటమి ఎక్కువ కాలం కొనసాగలేదు.

ఇజ్రాయెల్ మీడియాలో చర్చ

"మేం కేవలం జియోనిస్ట్ పార్టీలపైనే ఆధారపడతాం. అరబ్ పార్టీలు జియోనిస్ట్ పార్టీలు కావు, అందుకే వారిని నమ్మం" అని బెన్నెట్ చెప్పినట్లుగా ఛానెల్ 12 న్యూస్ రిపోర్ట్ చేసింది.

ఇటీవలి కాలంలో ఎన్నికల ప్రచారాల్లో పాలస్తీనా పార్టీలను సంకీర్ణ ప్రభుత్వాలకు దూరంగా ఉంచాలనే డిమాండ్ ప్రధాన అంశంగా మారింది.

ఇజ్రాయెల్ తదుపరి ఎన్నికల ప్రక్రియ అనధికారికంగా ఇప్పటికే ప్రారంభమైందని లిబరల్ న్యూస్ పేపర్ హారెట్జ్ రిపోర్ట్ చేసింది.

"చట్టబద్ధంగా ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ, ఎన్నికల సందడి నేటి నుంచే మొదలైంది" అని తెలిపింది.

హారెట్జ్ కథనం ప్రకారం, మొదట్లో విడివిడిగా పోటీ చేస్తామన్న బెన్నెట్, లాపిడ్, వాస్తవ పరిస్థితుల ఒత్తిడితో నిర్ణయాన్ని మార్చుకున్నారు. బెన్నెట్ తన నాయకత్వంలో వేగంగా విలీనం జరగాలని కోరుకున్నారు. రైట్ వింగ్ నుంచి వీలైనన్ని ఎక్కువ ఓట్లను రాబట్టడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. "నేను గెలవడానికే వచ్చాను" అని బెన్నెట్ అన్నారు.

మరోవైపు, లాపిడ్ మొదట్లో విలీనంపై తొందరపడకూడదని భావించారు. బెంజమిన్ నెతన్యాహు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది చూసి, రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని వేచి చూశారు.

అయితే, ఈ సంకీర్ణ కూటమిలోకి గ్యాడీ ఐసెన్‌కోట్ కూడా చేరే అవకాశం ఉందని, ప్రస్తుతం ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని హారెట్జ్ రిపోర్ట్ చేసింది.

నెతన్యాహుకు మద్దతుగా ఉండే రైట్ వింగ్ ఛానెల్ 14 న్యూస్ ఈ విలీనాన్ని తక్కువ చేసి చూపింది. లాపిడ్, బెన్నెట్ తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా దీనిని అభివర్ణించింది. సర్వేల ప్రకారం వారి పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.

కానీ, ప్రధాన స్రవంతి మీడియా సర్వేలు మాత్రం నెతన్యాహు లికుడ్ పార్టీకి బెన్నెట్ పార్టీ గట్టి పోటీనిస్తుందని చెబుతున్నాయి.

బెన్నెట్ పాత వ్యాఖ్యలపై వివాదం

ఈ విలీనం తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

నెటిజన్లు బెన్నెట్ గతంలో చేసిన వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. లాపిడ్‌ను ప్రధానమంత్రిగా ఎప్పటికీ అంగీకరించబోనని, అది తన సిద్ధాంతాలకే విరుద్ధమని బెన్నెట్ గతంలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్)లో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో 'నీతో కలిసి కూర్చోవడానికి ఎవరూ ఇష్టపడర'ని లాపిడ్‌తో బెన్నెట్ అనడం కనిపిస్తుంది.

ఈ వీడియోను పోస్ట్ చేసిన ఒక యూజర్, "ఆయన మళ్లీ ఇలా అబద్ధాలు చెబుతుండగా చూడటం బాధాకరం, నిజానికి ఆయనకా సామర్థ్యం ఉంది" అని రాశారు.

మరో వీడియోలో బెన్నెట్ పాత ప్రసంగాలను చూడవచ్చు. అందులో బెన్నెట్ తనను తాను గట్టి రైట్-వింగ్ లీడర్‌గా చెప్పుకుంటూ, "లాపిడ్‌ను నేను ప్రధానమంత్రిని కానివ్వను" అని స్పష్టంగా చెప్పడం కనిపిస్తుంది.

నఫ్‌తాలీ బెన్నెట్ గతంలో అతి జాతీయవాద పార్టీ అయిన 'న్యూ రైట్'కు సహ-నాయకుడిగా, అంతకుముందు 'జ్యూయిష్ హోమ్' పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)