You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘వీర్యం తీసుకోవడంకన్నా సెక్స్ చేయడం వల్లే ఫలితం ఎక్కువ’ అంటూ తల్లి కావాలని తపించే మహిళలను ఒత్తిడికి గురిచేస్తున్న అనధికారిక స్పెర్మ్ దాతలు
- రచయిత, గెమ్మా డన్‌స్టన్
- హోదా, బీబీసీ వేల్స్ ఇన్వెస్టిగేట్స్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
తల్లి కావాలని పరితపించిపోయే మహిళలను కొందరు సెక్స్ కోసం వేధిస్తుండగా, కొందరు నాణ్యత లేని వీర్యం శాంపిళ్లను చట్టవిరుద్ధంగా ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నారు.
సంతానం పొందేందుకు కావాలసిన చికిత్స పొందలేని కొందరు మహిళలు సోషల్ మీడియా సైట్లలో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతుండటంతో నియంత్రణ లేని మార్కెట్ పెరుగుతోంది. కొందరు వీర్యదానం కోసం టిండర్ లాంటి వెబ్‌సైట్లను సైతం ఉపయోగిస్తున్నారు.
బీబీసీ వేల్స్ ఇన్వెస్టిగేషన్ ఓ వ్యక్తికి వంద పౌండ్లు( సుమారు రూ.12,700) చెల్లించింది. తాను వీర్యం అందిస్తానని ఆయన ఆన్‌లైన్‌లో ప్రకటించారు. దాన్ని టొమాటో పాస్తాతో పాటు ఐస్ బాక్స్‌లో పంపించారు.
దురుద్దేశంతో ఉన్న దాతల వల్ల మహిళలు మోసపోయే ప్రమాదముందని యూకే సంతానోత్పత్తి నియంత్రణ సంస్థ మహిళలకు ఇప్పటికే హెచ్చరికలు చేసింది.
దర్యాప్తులో భాగంగా ఆన్‌లైన్‌లో వీర్యం పొందడం ఎంత సులభమో తెలుసుకోవాలని నేను ప్రయత్నించాను. వీర్యం అందిస్తామని చెప్పే మగవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
‘వీర్యం కోసం ఒక్క ఫోన్ కాల్ చాలు’
జో డోనర్ అనే వ్యక్తి తాను వీర్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఓ ఆన్‌లైన్ అడ్వర్టయిజ్‌మెంట్ నాకు కనిపించింది.
తరచుగా వీర్యం దానం చేస్తుంటాననీ, ప్రపంచవ్యాప్తంగా తనకు 180మంది పిల్లలున్నారని ఆయన చెప్పుకుంటారు. కొందరు పిల్లలు సెక్స్ ద్వారా, మరికొందరు పిల్లలు కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టారని తెలిపారు.
కార్డిఫ్‌లో ఓ కేసు విచారణ తర్వాత ఆయన పేరు రాబర్ట్ ఆల్బన్ అని ప్రకటించారు. ఇది అరుదైన విషయం. నియంత్రణలేని వీర్యదానాల ప్రమాదాల గురించి ప్రజలకు తెలియజేయడానికి ఇలా చేశారు.
మేం మారు పేరుతో ఆయనతో మాట్లాడాం. కొన్ని ఈ మెయిల్స్, ఓ చిన్న ఫోన్ కాల్‌తో పనయిపోయింది. మరుసటిరోజు వీర్యం అందించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. మేమేవరో ధ్రువీకరించుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. వైద్యపరీక్షల గురించీ సమాచారం తెలుసుకోవాలనుకోలేదు.
ఒక సిరంజ్ వీర్యం కోసం ఆయన వంద పౌండ్లు వసూలు చేశారు. ఆ డబ్బును పోస్ట్ ద్వారా పంపాలని కోరారు. వీర్యాన్ని ఐస్ బ్లాక్‌లో టొమాటో పాస్తాతో కలిపి డెలివరీ చేశారు.
శాంపిల్ అందుకున్న నాలుగు గంటల తర్వాత లైసెన్స్ ఉన్న క్లినిక్‌లో మేం దాన్ని పరీక్షించాం. అందులో వీర్యకణాలు చనిపోయాయని తేలింది.
ఆ వీర్యాన్ని ఎలా నిల్వచేస్తారని, ఎలా రవాణా చేస్తారని అల్బన్‌ను ప్రశ్నించినప్పుడు, తన డెలివరీ విధానంలో ఫలదీకరణకు సరిపడా వీర్యకణాలు బతికే ఉంటాయని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా చాలా మంది మహిళలు గర్భవతులయ్యారని కూడా చెప్పారు.
‘‘శారీరక సంబంధం కోసం ఒత్తిడి’’
అల్బన్‌తో పాటు వందలమంది పురుషులు వీర్యదాత కోసం వెతుకుతున్న మహిళలతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పరచుకున్నారు. ఇలాంటి కొన్ని గ్రూపుల్లో 40వేలమంది వరకు సభ్యులున్నారు.
నేను ఖాళీ ప్రొఫైల్‌తో ఒక డోనర్ గ్రూప్‌లో చేరాను. నాకు వచ్చిన కొన్ని సందేశాలు నిజాయితీగా అనిపించాయి. చాలామంది సెక్స్ కోసం ప్రతిపాదన చేశారు. శాంపిళ్ల కోసం డబ్బు ఇవ్వాలని కొందరు అడిగారు. మరికొందరు వ్యక్తిగత ఫోటోలు కావాలన్నారు.
కొందరు మగవారు చాలాసార్లు సెక్స్ కోసం ఒత్తిడి చేశారు. అదే అత్యంత చవకైన, మంచి ఫలితాన్నిచ్చే మార్గమని నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు.
ఓ మహిళ దీనికి సంబంధించి ఓ హెచ్చరిక చేశారు. ఆమె నార్త్ వేల్స్‌కు చెందిన వ్యక్తి నుంచి వీర్యం తీసుకున్నానని, తర్వాత ఆయన లైంగిక నేరంలో దోషి అని తెలిసిందని ఆ మహిళ చెప్పారు.
యూకేలో హ్యూమన్ ఫెర్టిలైజేషన్ ఎంబ్రయాలజీ అథారిటీ (హెచ్ఎఫ్ఈఏ) లైసెన్స్ పరిధిలోకి రాని వీర్యదానాన్ని నియంత్రణలేని వీర్యదానం అంటారు. ఇక్కడ దీన్ని నేరంగా పరిగణిస్తారని హెచ్ఎఫ్ఈఏ తెలిపింది.
సౌత్ వేల్స్‌కు చెందిన టియానా, ఆమె భాగస్వామి నిక్కీ అనధికారిక వీర్యదానం మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ఎన్‌హెచ్ఎస్ ద్వారా నిధులు అందే అర్హత లేదని, ప్రైవేట్ చికిత్స చాలా ఖరీదైనదిగా అనిపించిందని చెప్పారు.
''నాకు ఎప్పటినుంచో తల్లి కావాలన్న కోరిక ఉండేది. మా కుటుంబంలో ఏదో లోటు ఉందని మేము భావించేవాళ్లం'' అని టియానా చెప్పారు.
వీర్యదాతల నుంచి వచ్చే ఒత్తిళ్లు, ప్రమాదాల గురించి తనకు అవగాహన ఉందని ఆమె అన్నారు.
తప్పుడు ఉద్దేశాలతో ఉండే విచిత్రమైన వ్యక్తులు ఎదురవుతారని ఆమె అన్నారు.
‘విలువైనది పొందామనిస్తుంది’
వీర్యదానానికి సంబంధించి ఓ వెబ్ సైట్ ఉంది. అది కేటలాగ్, టిండర్ రెండింటి మిశ్రమంలా ఉంటుంది. కళ్లరంగు, జుట్టురంగు వంటి వివరాలతో ఉండే ఆ వెబ్ సైట్ నుంచి కావాల్సిన వ్యక్తిని వెతుక్కోవచ్చు.
ఈ దంపతులు కృత్రిమ గర్భధారణ కోసం దాతను వెతుకుతున్నారు. అయితే చాలామంది మగవారు శారీరక సంబంధమే ఎక్కువ ఫలితాలనిస్తుందని చెబుతుంటారు.
''నేను, నా భాగస్వామి ఇద్దరం కలిసి ఉండడం చాలా సహాయపడింది. మాకు ఇష్టంలేనిది చేయాలని ఎవరూ మాపై ఒత్తిడి చేయలేకపోయారు. ఎందుకంటే బిడ్డ కోసం ఎంతో ఎదురుచూస్తున్నప్పుడు మనం చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంటాం'' అని టియానా అన్నారు.
చివరికి ఓ కో పేరెంటింగ్ వెబ్ సైట్ ద్వారా తమకు సురక్షితంగా అనిపించిన దాతను వారు కనుగొన్నారు. భవిష్యత్తులో పిల్లలతో సంబంధాలు, తల్లిదండ్రుల హక్కులు వంటి విషయాలపై అందరికీ స్పష్టత ఉండే విధంగా ఓ ఒప్పందం కుదర్చుకున్నారు.
కానీ అది చట్టపరమైన ఒప్పందం కాదు.
''భవిష్యత్తులో తల్లిదండ్రుల హక్కులు కోరుతూ ఆయన కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండేందుకు మేం సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆయన అలాంటివి చేయబోరని భావిస్తున్నాం'' అని అన్నారు.
వాళ్లకిప్పుడు ఏడాది కొడుకున్నాడు.
''మేం దీని కోసం చాలాకాలం ఎదురుచూశాం. మేం ఓ ప్రమాదాన్ని స్వీకరించాం. కానీ అది అంత విలువైనదే'' అని అన్నారు.
అనధికారిక వీర్యదాతలు తమ సేవలను అనేక రకాలుగా అందిస్తున్నారు. కొందరు శారీరక సంబంధం కోసం ముందుకు వస్తుంటే మరికొందరు కృత్రిమ గర్భధారణ కోసం ఇతర దేశాలకు వెళ్లి ఆ ఖర్చులు తీసుకుంటున్నారు.
‘అలా పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలంటే’
25 ఏళ్ల డేనియల్ బయేన్ అమెరికాలో ఉంటారు. 2025 వేసవిలో ఆయన యూకేకు వచ్చి కృత్రిమ గర్భధారణకు వీర్యదానం చేశారు. అలా తనకు నలుగురు పిల్లలు పుట్టారని బయేన్ చెప్పారు.
బీబీసీ మూడు రోజుల పాటు డాన్‌తో ఉంది. తాను ఎక్కువ డబ్బులు తీసుకుంటానని, అయితే లాభాల కోసం ఎదురుచూడనని ఆన్‌లైన్ వీడియోల్లో ఆయన చెప్పారు.
నా ప్రయాణ ఖర్చులతో పాటు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా లబ్ధిదారులు భరించాలని తెలిపారు.
వారితో కమ్యూనికేషన్, ఆరోగ్య పరీక్షలు, ఇన్ స్టాగ్రామ్‌లో సమాచారం అందించడం, అవగాహన కల్పించడం వంటివి కూడా ఇందులో భాగం.
యూకేలో ప్రయాణ ఖర్చులు మాత్రమే తీసుకున్నానని, ఇతర దేశాల్లో వీర్యదానం కోసం 20వేల అమెరికా డాలర్ల వరకు ఆఫర్లు అందాయని తెలిపారు.
డబ్బు ఖర్చుకు వెనకాడని వ్యక్తులను ఉపయోగించుకుంటున్నారనే విమర్శపై బీబీసీ ప్రశ్నించగా ''ఇతరులు ఏమనుకుంటారో నాకు పెద్దగా పట్టదు. పిల్లలకు, కుటుంబాలకు ఏది మంచిదో అదే నాకు ముఖ్యం'' అని అన్నారు.
ఓపెన్ డోనర్ అని తనను తాను పిలుచుకునే డాన్‌కు తన ద్వారా పుట్టిన పిల్లలు తన గురించి భవిష్యత్తులో తెలుసుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. జీవన శైలి, ఆరోగ్య పరీక్షలు వంటివాటి గురించి వీడియోలు పోస్ట్ చేస్తారు. అయితే అన్ని విషయాలూ చెప్పరు.
''దాతగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీ పేరు మీద ఎక్కువ ఆస్తులుండకూడదు. అప్పుడే ఎవరైనా మీ జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నా చేయలేరు'' అని తెలిపారు.
ఆరోగ్య సమాచారం, లైంగిక వ్యాధుల పరీక్షల గురించి అబద్దం చెప్పకూడదు. కానీ మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, పూర్తి పేరేంటి? చిరునామా ఏంటి వంటి వివరాలను పూర్తిగా వెల్లడించకూడదు.
యూకేలో వీర్యదానం చేస్తూ తాను ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని డాన్ అన్నారు.
యూకేలో లైసెన్స్ పొందిన సంతానోత్పత్తి క్లినిక్‌లను హెచ్ఎఫ్ఈఏ నియంత్రిస్తుంది. ఈ అంశానికి సంబంధించిన చట్టాల గురించి అవగాహన కల్పించేందుకు తమ వెబ్‌సైట్‌లో ప్రత్యేక సమాచారం అందుబాటులో ఉంచింది.
అనేకమంది అనధికారిక వీర్యదాతల వివరాలను పోలీసులకు అందించామని హెచ్ఎఫ్ఈఏ తెలిపింది.
‘నేరం కాకపోవచ్చు కానీ ప్రమాదాలు పొంచి ఉంటాయి’
అనధికారిక వీర్యదాత నుంచి వీర్యం తీసుకోవడం నేరం కాదు. కానీ వీర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో భాగమైన దాతలు లేదా ఇతర వ్యక్తులు తీవ్రమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉంది.
హెచ్ఎఫ్ఈ చట్టం ప్రకారం మనుషులు ఉపయోగించేందుకు అండాలు లేదా వీర్యాన్ని సేకరించడం, నిల్వచేయడం, పరీక్షించడం, ప్రాసెస్ చేయడం, పంపిణీ చేయడం వంటి పనులు హెచ్ఎఫ్ఈఏ లైసెన్స్ పొందిన క్లినిక్కుల ఆధ్వర్యంలో జరిగితేనే చట్టబద్ధమైనవిగా భావిస్తారని హెచ్ఎఫ్ఈ చట్టం చెబుతోంది.
వీర్యాన్ని ఆల్బన్ పంపిన విదానం షాకింగ్‌గా ఉందని హెచ్ఎఫ్ఈఏలో స్ట్రాటజీ, కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ క్లేర్ ఎట్టింగ్‌హౌసెన్ అన్నారు.
''చట్టం చాలా స్పష్టంగా ఉంది. హెచ్ఎఫ్ఈఏ లైసెన్స్ లేకుండా ఆల్బన్ పంపించిన పద్ధతిలో వీర్యాన్ని ప్రాసెస్ చేయకూడదు, పంపిణీ చేయకూడదు'' అని క్లేర్ ఎట్టింగ్‌హౌసెన్ చెప్పారు.
మరోవైపు వ్యక్తిగతంగా వీర్యదానం చేయడం, దానికి డబ్బు తీసుకోవడం చట్టబద్ధమేనని తాననుకుంటున్నానని ఆల్బన్ చెబుతున్నారు.
ఏ బలహీన స్థితిలో ఉన్న మహిళకూ తన నుంచి నేరుగా ప్రమాదం లేదన్నారు.
ఫేస్‌బుక్‌కు యాజమాన్య సంస్థ అయిన మెటా చట్ట ఉల్లంఘనలకు వేదిక కల్పిస్తున్నట్టుగా ఉంది. ఈ విషయాన్ని ఆమె మార్చిలో బ్రిటన్ పార్లమెంట్ కమిటీ ముందు ప్రస్తావించారు.
ఈ సమస్యపై మెటా నేరుగా సంప్రదించినట్టు హెచ్ఎఫ్ఈఏ తెలిపింది. అయితే ఇలాంటి సోషల్ మీడియా గ్రూపులను పూర్తిగా మూసేసినా, ఈ కార్యకలాపాలు ఆగబోవని, మరోచోటికి మారిపోతాయని ఎట్టింగ్‌హౌసెన్ తెలిపారు.
నిరంతరం ఆరోగ్య హెచ్చరికలు ఇవ్వడం, సురక్షితమైన చికిత్స మార్గాల గురించి సమాచారం అందించడం, పూర్తిగా సమస్యలను పరిష్కరించకపోయినా, కొంత సహాయపడుతుందని ఆమె చెప్పారు.
వ్యక్తిగత భద్రతపై కూడా ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
కొంతమంది దాతలు కేవలం సహజ గర్భధారణకే అవకాశముంటుందని ప్రకటనలు ఇస్తున్నారు. కొన్ని సందర్బాల్లో ఇది మహిళలను వారికిష్టంలేకపోయినప్పటికీ శారీరక సంబంధానికి ఒత్తిడి చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు.
తమకు సమాచారమందించిన గ్రూపులు లేదా పోస్టులను సమీక్షిస్తామని, తమ నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్‌ను తొలగిస్తామని మెటా తెలిపింది.
''మా విధానాలను ఉల్లంఘించకపోయినా, స్థానిక చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను నియంత్రణ సంస్థలు గుర్తించి నివేదించడానికి మా దగ్గర ప్రత్యేకమైన రిపోర్టింగ్ వ్యవస్థ ఉంది. సంబంధిత అధికారులతో మేం సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాం'' అని తెలిపింది.
''అనధికారిక వీర్యదానం వల్ల అనేక ప్రమాదాలున్నాయి. అత్యంత బలహీన పరిస్థితిలో ఉన్న వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకుని, చట్టబద్ధమైన మార్గాలనే ఎంచుకోవాలని మేం సూచిస్తున్నాం
ఎవరికైనా అనుమానాలు లేదా ఆందోళనలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడు మేం సహాయం చేసి అవసరమైతే దర్యాప్తు చేపడతాం'' అని పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ ప్రతినిధి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)