You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘తెలంగాణ మీ అయ్య జాగీరా’.. ‘అవును.. మా జాగీరే’- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఇంకా ఎవరెలా స్పందించారంటే..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) రోజునే తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రాజకీయ రగడ ప్రారంభమైంది.
అది మరుసటి రోజు కూడా కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేఖరుల సమావేశం తర్వాత తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఈ సమావేశంలో, జనసేన పార్టీ సభ, తమపై కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు.
తెలంగాణకు తాను వ్యతిరేకం కాదనీ, దశాబ్ధం దాటినా ఇంకా ఏపీని విలన్‌గా చూపించే ప్రయత్నాలు చేయడంపైనే తన అభ్యంతరమని విలేఖరుల సమావేశంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
'మీరెవరు నన్ను బెదిరించడానికి..'
జనసేన ప్రయాణం తెలంగాణలోనే మొదలైంది, జనసేన ఇక్కడే ఉంటుందంటూ మంగళవారం మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మధ్య కొందరు తనను కొందరు హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావని అడుగుతున్నారని తెలిపారు.
'అసలు మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి. తెలంగాణ మీ అయ్య జాగీరా, మీ ఇష్టానికి మాట్లాడితే నేను భయపడాలా? నాపై దాడులు చేస్తామంటున్నారు కదా? నా అడ్రస్ తెలియాలనే ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టా. నాకు తెలంగాణలోకంటే ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ. నాకు భయం లేదు. నాపై దాడి చేయాలనుకునే వారెవరైనా రావొచ్చు. బాంచన్ మీ కాల్మొక్తా అనే వాడిని కాదు. ధైర్యంగా నిలబడతా.
తెలంగాణ యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకునేవాడిని. నాకు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అండగా నిలిచారు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
'అప్పుడు 11 రోజులు భోజనం ఎందుకు మానేశానంటే..'
జనసేన పార్టీ ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ, రాష్ట్రాన్ని విభజించిన తీరును వ్యతిరేకించినట్లు చెప్పారు.
‘‘పార్లమెంటు తలుపులు మూసి, సభ్యులను బయటకు నెట్టి తెలంగాణను ప్రకటించడాన్ని మాత్రమే జనసేన పార్టీ తప్పు పట్టింది. సుమారు 1200 మంది బలిదానాలకు ఇవ్వాల్సిన మర్యాద అదేనా? విభజించిన తీరు నచ్చక ఆ ఆవేదనతోనే 11 రోజులు భోజనం చేయలేదు. అంతే తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏనాడూ నేను వ్యతిరేకం కాదు. కొందరు నాయకులు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టేలా మాట్లాడుతున్నారు. రాష్ట్రం విడిపోయి పుష్కరకాలం అవుతున్నా, ఉద్యోగాలు రాకపోవడానికి, పరిశ్రమలు లేకపోవడానికి ఆంధ్రోళ్లు కారణం అనడం సబబు కాదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
‘‘వైఎస్ బతికి ఉన్నప్పుడు ఈ నోళ్లు లేవలేదు ఎందుకు’’
గత 12 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వాన్నిగానీ, ఇక్కడి నాయకుడినిగానీ తాను ఒక్కమాట కూడా అనలేదని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
'తెలంగాణకు పవన్ కల్యాణ్ రాకూడదు అని చెప్పే నాయకులు ఏ రాష్ట్రంలో అయినా తిరగొచ్చు. పార్టీలను విస్తరించొచ్చు. జనసేన పార్టీ ఈ రోజు 2 వేల మందితో సభ నిర్వహించాలని భావిస్తే అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దక్షిణాది వాయనాడ్‌లో పోటీ చేయొచ్చు. మేం మాత్రం పక్కరాష్ట్రం నుంచి రాకూడదా? తెలంగాణ విభజనను వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం లాంటి పార్టీలను మాత్రం ఏమీ అనలేని పరిస్థితి ఉంది. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం అని చెప్పిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి బతికి ఉన్నపుడు ఈ నాయకులు నోళ్లు ఎందుకు మూతపడ్డాయి? ఆయనతో ఉన్న వాళ్లంతా మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు కదా. మాపై విమర్శల వెనుక రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఉన్నారని అనుకోను. విద్వేషాలు రెచ్చగొట్టాలనే రాజకీయాలు పోవాలి. ఆంధ్రలో తెలంగాణ కాంట్రాక్టర్లు.. తెలంగాణలో ఆంధ్ర వ్యాపారులు బాగున్నారు. కానీ, ప్రజల్లోనే దూరం పెంచుతున్నారు’’ అని ఆయన అన్నారు.
‘‘గద్దర్ బతికున్న రోజుల్లో మీరంతా ఎక్కడున్నారు?’’
గద్దర్ బతికి ఉన్నపుడు కనీసం ఆయనను పట్టించుకోని వామపక్ష మేధావులు ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పవన్ ఆరోపించారు. వారి వల్లే కమ్యూనిజం చచ్చిపోతోందని వ్యాఖ్యానించారు.
‘‘రాజకీయాల్లోకి రాకముందు నుంచే గద్దర్ అన్నతో నాకు అనుబంధం ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులంతా గద్దర్ బతికున్న రోజుల్లో ఎక్కడున్నారు? వెన్నులో ఉన్న బుల్లెట్‌తో నడవలేకపోతున్నా అంటే రెండు రోజుల్లో ఆయనకు బండి కొనిచ్చా. ఆయనకు మీరేం చేశారు’’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
తెలంగాణపై ప్రేమతోనే అంజన్నకు...
తెలంగాణపై ఉన్న ప్రేమతోనే కొండగట్టు అంజన్న ఆలయానికి టీటీడీ నుంచి రూ. 30 కోట్లు ఇప్పించానని పవన్ కల్యాణ్ అన్నారు.
‘‘తెలంగాణపట్ల కమిట్మెంట్ లేకుంటే కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి డబ్బు ఇప్పిస్తానా? విపత్తులవేళ ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళం ఇస్తానా? మీరే చెప్పాలి. తెలంగాణలోని భీంరావు వాడ కోసం కొట్లాడినప్పుడే నా మీద మొదటి పోలీసు కేసు నమోదైంది. జనసేన పార్టీ మొదటి నుంచి పోరాటాలను, ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటే పార్టీ. ఎలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడదు. అమిత్ షాతో నేను ఏదో చెప్పానని తప్పుడు ప్రచారం చేశారు. అసలు అలాంటిదేమీ జరగలేదని మేం ఖండిస్తే దాన్ని తప్పు అంటారు. తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను తిట్టకుండా, ప్రజల మధ్య ద్వేషం నింపి ఏం సాధిస్తారు? ఇలా చేస్తే జాతీయ సమగ్రత దెబ్బతింటుంది. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం’’ అని అన్నారు.
అవును, తెలంగాణ మా జాగీరే: మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ మీద ప్రేమ ఉందని చెబుతున్న పవన్ కల్యాణ్ ఎప్పుడైనా తెలంగాణకు మద్దతుగా మాట్లాడారా అంటూ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి మంగళవారం గాంధీభవన్‌లో పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
‘‘బీజేపీ కోసమే పవన్ మాట్లాడినట్లుంది. మా దగ్గర డబ్బు ఉంటే ఆయనకు డబ్బు ఇచ్చి మా తరఫున కూడా మాట్లాడించి ఉండేవాళ్లం. ఏపీలోనే గెలవలేకపోయిన మీరు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు? ఏపీ వాళ్లను రావొద్దని ఎవరూ అనలేదు. విడిపోయి కలిసి ఉందామని అప్పుడే చెప్పాం. తెలంగాణ బరాబర్ 4 కోట్ల ప్రజల జాగీరే. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని పవన్ చెప్పారు. గద్దర్‌కు వాహనం కొనిచ్చానని అహంకారంతో చెప్పిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో మీరు తిరగడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే మీరు నవ నిర్మాణ సభ పెడితే మేం చూస్తూ ఊరుకోలేం. మేం ఎప్పుడూ తెలంగాణలో ఆంధ్రవాళ్లకు పనేం లేదని అనలేదు. హైదరాబాద్‌లో అందరూ ఉండొచ్చు. ఆత్మగౌరవ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు’’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
పవన్ నుంచి నేర్చుకోవాల్సిందేమీ లేదు: కేటీఆర్
తెలంగాణ ఏర్పడితే అన్నం తినని వ్యక్తి... రాష్ట్ర అవతరణ రోజే హైదరాబాద్‌లో ఎందుకు సభ పెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్నారు.
దేశభక్తి గురించి, పోరాటాల గురించి పవన్ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.
‘‘ఎన్నో బలిదానాలు, దశాబ్దాల కష్టం తర్వాత తెలంగాణను సాధించుకున్నాం. అలాంటప్పుడు ఏపీ నేతలు మళ్లీ ఇక్కడికి వచ్చి అధికారం చెలాయించాలనుకోవడం ఏంటి? నటుడిగా మేం ఆయన్ను గౌరవిస్తాం. ఒక సోదరుడిగా మా ఇంటికి వస్తే ఆదరిస్తాం. కానీ, తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి పెత్తనం చేస్తామంటే మాత్రం ఇక్కడి ప్రజలు ఒప్పుకోరు’’ అని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ ద్వంద్వ నీతి: అద్దంకి దయాకర్
పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్ చూశాక ఆయనకు తెలంగాణపై ఉన్న అజ్ఞానం బయటపడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.
'తెలంగాణ ఇవ్వడాన్ని మీరు ఎంతలా వ్యతిరేకించారో అందరికీ తెలుసు. 11 రోజులు అన్నం తినకుండా ఉండటం దీన్ని నిరూపిస్తుంది. గద్దర్ పేరును ప్రస్తావించి ఏదో తెలంగాణ ఫ్లేవర్ అద్దడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, ప్రజలు నమ్మరు. తెలంగాణపై మీకు ఎంత ప్రేమ ఉందో మీ వ్యాఖ్యలు, ప్రకటనల ద్వారా తెలుస్తోంది. మీ ద్వంద్వ నీతి కనిపిస్తోంది. తెలంగాణను ఆమూలాగ్రం అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. తెలంగాణ అస్తిత్వం ఏంటో తెలియని మీరు ఇక్కడ మాట్లాడటం సరికాదు' అని ఆయన వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.
పవన్ రాజకీయ జీవితానికి స్పష్టత లేదు: వీరేశం
తెలంగాణలో అస్తిత్వం లేని బీజేపీ, వెనుకబడిన బీఆర్ఎస్లను పైకి లేపడానికి పవన్ కల్యాణ్ ఒక పావులా మారారని ఎమ్మెల్సీ వీరేశం అన్నారు.
‘‘పవన్ నీ రాజకీయ జీవితానికే స్పష్టత లేదు. ఒకసారి చే గవేరా , మరోసారి భగత్ సింగ్ అన్నారు. తర్వాత వాళ్లను పక్కన బెట్టి బీజేపీ, సనాతన ధర్మం అంటున్నారు. క్లారిటీ లేని రాజకీయ నేత మీరు. తెలంగాణ రాజకీయాల్లో మీకు చోటు లేదు. మీరు ఇక్కడ సినిమాలు తీసుకోవచ్చు. అంతేకానీ, రాజకీయ కుట్రలు చేస్తామంటే ఒప్పుకోం’’ అని మీడియా సమావేశంలో వీరేశం వ్యాఖ్యానించారు.
తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే సహించం: కోదండరామ్
‘‘ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై అభ్యంతరం ఉంటే ఆయనపై ప్రతి వ్యాఖ్యలు చేయొచ్చు. అంతేగానీ వ్యక్తిగత దాడికి దిగడం సరికాదు. వ్యక్తుల మధ్య వైరాన్ని ప్రాంతాల మధ్య వైరంగా మార్చొద్దు’’ అని మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కోదండరామ్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)