You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్యారీమెన్: మీ షాపింగ్ బ్యాగులను మోసేందుకు అద్దె మనుషులు, ఏంటీ స్టార్టప్?
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
మీరు మార్కెట్‌లో షాపింగ్ చేస్తున్నారు. మీ బ్యాగులను మోయడానికి ప్రత్యేకంగా ఒక మనిషి మీ వెంట వస్తున్నారు. ఈ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
దిల్లీలో పుట్టిన ఒక కొత్త స్టార్టప్ దీన్ని నిజం చేస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన ‘క్యారీమెన్’ సంస్థ దిల్లీలోని లాజ్‌పత్ నగర్ మార్కెట్‌లో షాపింగ్ చేసే వారికి సహాయకులను అందిస్తోంది.
30 నిమిషాలకు 79 రూపాయల నుంచి చార్జీలు ప్రారంభమవుతాయి. ఒక గంటకు 149 రూపాయలు చెల్లించాలి. గరిష్ఠంగా 4 గంటల వరకు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
ఈ స్టార్టప్ ఇప్పుడు కస్టమర్లలో మంచి ఆదరణ పొందుతోంది. క్యారీమెన్ వల్ల తమ షాపింగ్ అనుభవం ఎంతో తేలికైందని పలువురు చెబుతున్నారు.
అయితే ఇదే సమయంలో ఇలాంటి సేవపై మరో చర్చ కూడా మొదలైంది.
భారత మధ్యతరగతి అతిగా సౌకర్యాలకు అలవాటు పడిపోయిందా? ఈ క్యారీమెన్‌లు ఆధునిక ‘కూలీ’లుగా మారుతున్నారా?
దోపిడీ ఆధారిత పనులకు ఇది కొత్త రూపమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ స్టార్టప్‌ను రితు కందారి శ్రీవాస్తవ, కనిష్కా మల్హోత్రా అనే ఇద్దరు మహిళలు ప్రారంభించారు. వీరిద్దరూ చిన్న పిల్లల తల్లులే.
"పోయిన సంవత్సరం నేను, కనిష్కా మా పిల్లలతో కలిసి లాజ్‌పత్ నగర్‌కు వెళ్లాం. షాపింగ్ బ్యాగులను మోస్తూనే ప్రామ్‌లను (చిన్న పిల్లలను తీసుకువెళ్ళేందుకు వాడే ట్రాలీలు) నడపించడం చాలా కష్టమైంది" అని బీబీసీతో అన్నారు రితు.
"అక్కడే ఒక వృద్ధ మహిళ తన బ్యాగులతో ఇబ్బంది పడుతుండటం చూశాం. ఆమెకు సహాయం చేయాలని అనిపించింది. కానీ మా పరిస్థితి కూడా అంతే కష్టంగా ఉండటంతో ఏమీ చేయలేకపోయాం. అది చాలా ఇబ్బందిగా అనిపించింది"
"అప్పుడే మేం ఆలోచించాం. డబ్బు చెల్లించి ఈ విషయంలో సహాయం పొందేలా ఒక సర్వీస్ ఉంటే కుటుంబ సభ్యులను షాపింగ్‌కు తీసుకెళ్లడానికి బతిమాలుకోవాల్సిన అవసరం ఉండదనిపించింది" అన్నారామె.
రితు, కనిష్కాలాగే లక్షలమంది భారతీయులు వెళ్లే లాజ్‌పత్ నగర్ లాంటి మార్కెట్లు సాధారణ మాల్స్‌లా ఉండవు. ఇక్కడ సున్నితమైన నేల, ఎస్కలేటర్లు, ఎయిర్ కండిషనింగ్ వంటి సౌకర్యాలు ఉండవు. ఇవి కిక్కిరిసిన ఓపెన్ బజార్లు. ఫుట్‌పాత్‌లు ఎక్కడో మాయమైపోయి ఉంటాయి.
కొన్ని చోట్లలో వీధి వ్యాపారులు కూడా ఫుట్‌పాత్‌లపైనే ఉంటారు. ప్రామ్‌లను నడపించడంకాదు, కొన్నిచోట్ల మనం నడవడం కూడా కష్టంగా మారుతుంది.
ఆ రోజు సాయంత్రం ఈ ఇద్దరు మహిళలు తమ కుటుంబాలతో ఈ ఆలోచన గురించి చర్చించారు. అలా ‘క్యారీమెన్’ రూపుదిద్దుకుంది.
కొన్నినెలల్లోనే వారు తమ కంపెనీని నమోదు చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, పోలీసుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నారు. లాజ్‌పత్ నగర్‌లో ఒక కియోస్క్ ఏర్పాటు చేశారు.
మొదట ఐదుగురు యువకులను ఉద్యోగంలోకి తీసుకున్నారు. తరువాత ఇద్దరు మహిళలను కూడా నియమించారు. నెలరోజులపాటు శిక్షణ ఇచ్చిన తరువాత తమ సర్వీసులను ప్రారంభించారు.
కొద్దిరోజుల్లోనే ఈ స్టార్టప్ వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఇదొక చర్చనీయాంశంగా మారింది. భిన్నాభిప్రాయాలు వినిపించాయి.
కొంతమంది దీన్ని అద్భుతమైన ఆలోచనగా ప్రశంసించారు. పట్టణాల్లో నిరుద్యోగం 5 శాతం కంటే ఎక్కువగా ఉండే దేశంలో ఇది వేలాది ఉద్యోగాలను సృష్టించే అవకాశముందని అన్నారు.
విమర్శలూ ఉన్నాయ్
మరికొందరు మాత్రం దీన్ని సంపన్న భారతీయుల అలవాటుపడ్డ అతి సౌకర్యానికి నిదర్శనమని విమర్శించారు. చిన్న చిన్న పనులకూ ఇతరులను నియమించుకునే అలవాటు పెరుగుతోందని అన్నారు.
సోషల్ మీడియాలో ఏఐ రూపొందించిన కొన్ని చిత్రాలు కూడా ఈ విమర్శలకు మరింత ఊతమిచ్చాయి. ధనిక మహిళలు ఈ సేవని పొందతున్నట్లుగా కనిపించేలా ఆ చిత్రాలు ఉండటంతో చర్చ మరింత ముదిరింది.
కార్మిక హక్కుల కార్యకర్త, సోషియాలజిస్ట్ ఆకృతి భాటియా మాట్లాడుతూ "ఈ సేవ గురించి విన్న వెంటనే చేతికి మేనిక్యూర్ చేయించుకుని గోళ్లు చెడిపోకుండా ఉండేందుకు బ్యాగులను వేరే వాళ్ళతో మోపించుకునే అత్యంత ధనిక మహిళల కోసమే దీన్ని సృష్టించినట్టు అనిపించింది" అన్నారు.
మరికొందరు క్యారీమెన్ ఉద్యోగులను కేవలం ఆధునిక ‘కూలీ’లుగా అభివర్ణించారు. శ్రమ దోపిడికి ఎక్కువ ఆస్కారం ఉండే గిగ్ ఎకానమీలో మరో బలహీన వర్గంగా వీరు మారతారని విమర్శించారు. కొందరు దీన్ని ఆధునిక బానిసత్వంగా కూడా పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలను స్టార్టప్ వ్యవస్థాపకులు ఖండించారు.
"ఇది బానిసత్వం కాదు. ఎవరినీ బలవంతంగా పని చేయించడం లేదు. మా ఉద్యోగులంతా పూర్తి స్థాయి జీతభత్యాలు పొందే సిబ్బంది. వీరు గిగ్ వర్కర్లు కాదు" అని రితు చెప్పారు.
"ఇది అధిక సౌకర్యాల విషయం కూడా కాదు. రద్దీ మార్కెట్లు, ఇబ్బందికర వీధుల్లో స్వయంగా తిరగలేని వారికి సహాయం అందించడమే" అని ఆమె అన్నారు.
గత ఆరు వారాల్లో తమ సేవలను ఎక్కువగా ఉపయోగించుకున్న వారు గర్భిణీలు, చిన్న పిల్లల తల్లులు, వృద్ధులు, వికలాంగులేనని ఆమె తెలిపారు.
క్యారీమెన్‌లో పనిచేస్తున్న ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, తమ మొదటి కస్టమర్ ఒక గర్భిణి అని చెప్పారు.
‘‘ఎప్పుడూ వినయంగా ఉండాలని, కస్టమర్లను కుటుంబ సభ్యుల్లా చూడాలని శిక్షణ సమయంలో మాకు చెప్పారు’’ అని ఆయన అన్నారు.
క్యారీమెన్ సిబ్బంది ప్రామ్‌లు, గొడుగులు, మడత కుర్చీలు, నీటి బాటిళ్లు, పోర్టబుల్ చార్జర్లు కూడా వెంట తీసుకెళ్తారు. ప్రామ్‌లను సురక్షితంగా తెరవడం, మూయడం వంటి అంశాల్లో కూడా వారికి శిక్షణిస్తారు.
"మార్కెట్‌లోని షాపుల రూటు గురించి కూడా మాకు అవగాహన కల్పించారు. కస్టమర్లను వారికి కావాల్సిన షాపులకు త్వరగా తీసుకెళ్లగలగాలి. వాళ్లు కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఫుడ్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం కూడా మా పని" అని ఆనంద్ చెప్పారు.
18 ఏళ్ల ఆనంద్ గతంలో చీరల దుకాణంలో సహాయకుడిగా, ఆన్‌లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ సేవల్లో డెలివరీ బాయ్‌గా పనిచేశారు. ఇక్కడ జీతం మెరుగ్గా ఉందని, ముఖ్యంగా గౌరవం దక్కుతోందని చెబుతున్నారు.
ఒక రోజు, ఎండ భగభగమంటున్న ఓ మధ్యాహ్నంపూట వారి కేంద్రాన్ని సందర్శించింది బీబీసీ. ఆ సమయంలోనే జతిందర్, అనితా సభర్వాల్ దంపతులు క్యారీమెన్ కియోస్క్ వద్దకు వచ్చి సహాయకుడిని కోరారు.
కొద్ది నెలల్లోనే ‘సీనియర్ సిటిజన్’ కాబోతున్నానని చెప్పిన జతిందర్, భుజంపై బరువైన బ్యాగు మోస్తున్నారు. అనితా చేతుల్లో కూడా రెండు బ్యాగులు ఉన్నాయి. ఇంకా కొనాల్సిన వస్తువులు కూడా మిగిలే ఉన్నాయి.
"ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి నా భార్య ఈ సర్వీస్ గురించి చెప్పింది" అని జతిందర్ తెలిపారు.
"ఇప్పుడు మేము బ్యాగుల భారం లేకుండా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం" అని అనితా అన్నారు.
అధిక సౌకర్యాలపై మోజు, శ్రమ దోపిడీ వంటి విమర్శలతో తాము ఏకీభవించమని ఆ దంపతులు చెప్పారు.
"బ్యాగులు మోయగలిగినవారు వాళ్లే మోసుకోవచ్చు. మోయలేని వారు ఈ సేవ ఉపయోగించుకోవచ్చు. మాలాంటి వారికి ఇది చాలా ఉపయోగకరమైన సేవ. ప్రతి మార్కెట్‌లో ఇది ఉండాలి" అని జతిందర్ అన్నారు.
రితు మాట్లాడుతూ జూలైలో చాందినీ చౌక్ మార్కెట్‌లో కూడా క్యారీమెన్ సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. తరువాత క్రమంగా దిల్లీలోని ఇతర మార్కెట్లకు, ఆపై దేశవ్యాప్తంగా మా సేవలను విస్తరించాలని భావిస్తున్నామని తెలిపారు.
అయితే కార్మిక హక్కుల కార్యకర్త ఆకృతి భాటియా మరో అంశాన్ని ప్రస్తావించారు.
"విస్తరణ కోసం క్యారీమెన్‌కు పెట్టుబడులు అవసరం అవుతాయి. అదే ఈ సేవ ఎంతకాలం నిలబడుతుందో నిర్ణయిస్తుంది" అని ఆమె అన్నారు.
ప్రస్తుతం క్యారీమెన్ చాలా చిన్న స్థాయి సంస్థ మాత్రమే. మొత్తం ఏడుగురు పూర్తి స్థాయి ఉద్యోగులతో పనిచేస్తోంది.
"కానీ దేశవ్యాప్తంగా విస్తరించిన తరువాత కూడా ఇదే విధానాన్ని కొనసాగించగలరా? గిగ్ వర్క్, ప్లాట్‌ఫాం ఆధారిత ఉద్యోగాలు మొదట మంచి వేతనాలు, అనేక సౌకర్యాల హామీలతోనే ప్రారంభమయ్యాయి. కానీ తరువాత అవి క్రమంగా బలహీనపడ్డాయి" అని భాటియా అన్నారు.
"శ్రమ చాలా చౌకగా దొరికే దేశం ఇది. ఇక్కడ కార్మిక సంఘాలు బలహీనంగా ఉంటాయి. అందుకే సంస్థలు కార్మికులపై ఒత్తిడి కొనసాగించగలుగుతున్నాయి. క్యారీమెన్ కూడా అదే దారిలో వెళ్తుందా లేదా అనేది కాలమే చెప్పాలి" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)