You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుద్ధం ముగించాలని ట్రంప్ కోరుకుంటున్నా, ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు?
- రచయిత, జెరెమీ బోవెన్
- హోదా, ఇంటర్నేషనల్ ఎడిటర్, బీబీసీ న్యూస్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఏప్రిల్ 8న ప్రకటించిన కాల్పుల విరమణ తరువాత నిలిచిపోయిన యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలనే ఆలోచన లేదని అమెరికా, ఇరాన్ సంకేతాలు ఇచ్చాయి.
ఇరు దేశాల మధ్య నిరంతరం సైనిక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, పాకిస్తాన్, ఖతార్, మరికొన్ని దేశాల మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలకు అడ్డుపడకుండా ఇరుపక్షాలు జాగ్రత్త పడ్డాయి.
ఇరాన్‌పై దాడులు చేయగలిగే దూరంలోనే అమెరికా తన శక్తిమంతమైన నౌకా, వైమానిక దళాలను ఇంకా మోహరించే ఉంచింది.
ఇరాన్ ప్రభుత్వం కూడా తన బలగాలను అప్రమత్తంగా ఉంచిందని భావించవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి, సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడానికి కాల్పుల విరమణ వల్ల లభించిన ఈ సమయాన్ని ఇరాన్ ఉపయోగించుకుంటోందనుకోవచ్చు.
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న సైనిక ఉద్రిక్తతల వల్ల ఇరుపక్షాలు పరస్పరం తప్పుడు అంచనాలకు రావడం, లేదంటే ఒకరి వ్యూహాలను మరొకరు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
తాము ఇరాన్‌కు అతిదగ్గరగా ఉన్నామని, భారీ నష్టాన్ని కలిగించగల సామర్థ్యం తమకు ఉందని చూపడం ద్వారా తెహ్రాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తద్వారా తన దారికి తెచ్చుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది.
అదే సమయంలో తమ ప్రతిఘటనా శక్తి ఏమాత్రం తగ్గలేదని, అవసరమైతే అమెరికా సైనికస్థావరాలపై, అరబ్ దేశాల విస్తృత మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ఇరాన్ అమెరికాను హెచ్చరిస్తోంది.
తొలి నుంచి నెతన్యాహుకు అయిష్టమే
అమెరికా, ఇరాన్ మధ్య ఓ విస్తృతమైన ఒప్పందం కుదరడమనేది సుదీర్ఘమైన, బహుశా అంత సులభం కాని ప్రక్రియ. కానీ ఈ దిశగా ముందడుగుపడాలంటే కాల్పుల విరమణను ఇలాగే కొనసాగించడం, రాబోయే చర్చల అజెండాలో ‘‘అవగాహనా ఒప్పందం’’ కుదుర్చుకోవడం ప్రాథమిక లక్ష్యాలుగా ఉండాలి.
కానీ, ఈ లక్ష్యాలను చేరుకోవడం అంత తేలికైన విషయంగా కనిపించడం లేదు.
బేరూత్‌పై తమ యుద్ధవిమానాలు మళ్లీ దాడులు చేస్తాయని ఇజ్రాయెల్ చేసిన ప్రకటన డోనల్డ్ ట్రంప్ ముందున్న అవకాశాలను పరిమితం చేసింది.
లెబనాన్‌లో తామను మళ్లీ ప్రారంభించే దాడుల వల్ల అమెరికా,ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడం మరింత కష్టసాధ్యమైనా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఏమాత్రం ఆందోళన చెందరు.
తొలి నుంచి కూడా తెహ్రాన్‌తో కాల్పుల విరమణ కుదరడం ఆయనకు ఇష్టం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య జరిగే ఏ ఒప్పందమైనా నెతన్యాహు దృష్టిలో చెడ్డ ఒప్పందమే.
ఇరాన్ మాత్రం లెబనాన్‌లోని తన మిత్రపక్షం, ప్రాక్సీ గ్రూపు హిజ్బొల్లాకు మద్దతు కొనసాగిస్తూనే ఉంది.
అమెరికాతో కుదిరే ఏ విస్తృత ఒప్పందంలోనైనా ఇజ్రాయెల్ దాడుల ముగింపు కూడా ఒక భాగం కావాలని ఇరాన్ సంకేతాలిచ్చింది. దీంతో ప్రస్తుతానికి అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌ను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
హార్ముజ్ జలసంధిపై సందిగ్ధం
ఇక హార్ముజ్ జలసంధి విషయానికి వస్తే చర్చలు ముందుకు సాగాలంటే దీనిని తెరవడం అత్యంత కీలకం. అయితే జలసంధిని తెరవడానికి ఇరాన్ కొంత ప్రతిఫలాన్ని ఆశిస్తోంది. బహుశా తమపై ఉన్న ఆంక్షల సడలింపు, లేదా స్తంభింపచేసిన తమ ఆస్తుల పునరుద్ధరణ రూపాల్లో ఇరాన్ కొన్ని ప్రయోజనాలు కోరవచ్చు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత.. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఎంతో కీలకమైన, అత్యంత రద్దీగా ఉండే ఈ జలసంధి గుండా ప్రస్తుతం కేవలం కొన్ని ఓడలు మాత్రమే అతి కష్టంమీద రాకపోకలు సాగిస్తున్నాయి.
సౌదీ అరేబియా కొంత చమురును పైప్‌లైన్ల ద్వారా ఎర్ర సముద్ర తీరంలోని తన ఓడరేవులకు తరలిస్తోంది.
అలాగే హార్ముజ్ జలసంధికి ఆవల, ఒమన్ గల్ఫ్‌కు అభిముఖంగా ఉన్న తమ చిన్న తీరప్రాంత టెర్మినల్స్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు కూడా ఓ పైపులైను ఉంది.
కానీ, మిగతా ప్రపంచ దేశాలు తమకు సాధారణంగా అందే చమురు, గ్యాస్ సరఫరాలతోపాటు ఇతర కీలక ఎగుమతుల్లో దాదాపు 20శాతాన్ని కోల్పోయాయి.
ఈ జలసంధిని ఇలాగే మూసి ఉంచితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ విపత్తు వాటిల్లుతుంది.
అమెరికా ఇప్పుడు గల్ఫ్ దేశాల చమురుపై ఆధారపడటం లేదు. అయినా అమెరికాలో పెట్రోల్ ధరలు అంతర్జాతీయ చమురు మార్కెట్ ఆధారంగానే నిర్ణయమవుతాయి.
డోనల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. యుద్ధానికి దిగితే సులభంగా విజయం సాధించవచ్చని ఆయన చేసిన పెద్దపొరపాటు వల్ల ఏర్పడిన పర్యవసానాల్లో చిక్కుకుపోయారు.
ఇరాన్ ప్రభుత్వం తమ దాడులను ఎంతవరకు తట్టుకుని, ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉందో అంచనా వేయడంలో అమెరికా అధ్యక్షుడు, ఆయన ఆప్తమిత్రుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పూర్తిగా విఫలమయ్యారు.
ట్రంప్ ముందరికాళ్లకు బంధాలు
హార్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరం ట్రంప్‌కు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇరాన్‌పై యుద్దం స్వదేశంలోనే అమెరికాకు అప్రతిష్ఠ తీసుకువస్తోంది. ఇది కొనసాగితే మరింతమంది అమెరికన్లు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.
ఈ పరిస్థితి నుంచి బయటపడటం ట్రంప్‌కు అంత తేలిక కాదు. ఇరాన్ ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని ఇలానే ఉంచాలని కోరుకుంటోంది.
ట్రంప్ సమస్య ఏమిటంటే హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ కోరే రాయితీలను ఆయన సొంత రిపబ్లికన్ పార్టీలోని అతివాద శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. పైగా తానే విజయం సాధించినట్టు ప్రపంచానికి చాటుకోవాలనే ట్రంప్ కోరిక కూడా దీనికి అడ్డొస్తోంది.
ఇరాన్‌తో తాను చేసుకునే ఎలాంటి ఒప్పందాన్నైనా చివరకు చర్చల కోసం కాల్పుల విరమణను పొడిగించే తాత్కాలిక ఏర్పాటునైనా 2015లో బరాక్ ఒబామా హయాంలో జరిగిన అణు ఒప్పందంతో పోల్చడం ట్రంప్‌కు అస్సలు ఇష్టం లేదు. ఒబామా ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. పైగా తన మొదటి పాలనాకాలంలో ఆ ఒప్పందం నుంచి అమెరికాను వైదొలిగేలా చేశారు.
తాము తమ ఉనికి కోసం,పాలన కోసం పోరాడుతున్నామనే ఇరాన్ పాలకుల భావన కొంతవరకు సమర్థనీయమే.
కాబట్టి, ఇజ్రాయెల్‌తో కలిసైనా, లేదా విడిగానైనా అమెరికా మరిన్ని దాడులు చేసినంత మాత్రాన ఇరాన్ తన పట్టును వీడదని స్పష్టంగా అర్థమవుతోంది.
అరబ్ దేశాల వైఖరి
గల్ఫ్ ప్రాంతంలోని సంపన్న అరబ్ చమురు దేశాలు ఇప్పటికే దీర్ఘకాలిక ఆర్థిక నష్టాన్ని
చవిచూశాయి. ఇకపై మరిన్ని నష్టాలను భరించడానికి అవి సిద్ధంగా లేవు.
గల్ఫ్ ప్రాంతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఒక స్థిరమైన కేంద్రంగా ఉండటం, విదేశీ పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా మారడమనే పునాదిపైనే ఈ దేశాల వాణిజ్య, దీర్ఘకాల అభివృద్ధి ఆధారపడి ఉంది.
ప్రస్తుతం యుద్ధం ఈ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. మునుపటి స్థిరత్వం, నమ్మకాన్ని పునరుద్ధరించడానికి చాలా ఏళ్లే పడుతుంది.
ఇరు దేశాల చర్చల పునరుద్దరణకు జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలలో పాకిస్తాన్‌తోపాటు ఖతార్ కూడా పూర్తిస్థాయి మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది.
ఇరాన్‌ను ఎదుర్కొనే విషయంలో యూఏఈ, సౌదీ అరేబియా రెండూ భిన్నమైన వ్యూహాలను అనుసరిస్తున్నాయి.
ఇజ్రాయెల్‌తో తన వ్యూహాత్మక సంబంధాలను యూఏఈ మరింత బలోపేతం చేసుకుంది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను, దానిని నిర్వహించడానికి ఇజ్రాయెల్ రక్షణ దళాల సైనికులను అక్కడ మోహరించింది.
మరోవైపు, ఇరాన్ దాడులకు ప్రతీకారంగానే తాము ఇరాన్‌పై దాడి చేశామని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. తాము స్వతంత్రంగానే ఈ చర్యకు దిగామని, అమెరికా, ఇజ్రాయెల్ కూటమిలో భాగం కాదని తెహ్రాన్‌కు స్పష్టం చేసినట్టు సౌదీ ఉన్నతవర్గాలు తెలిపాయి.
డోనల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై యుద్ధానికి దిగినప్పుడు తమ దేశాలకున్న అపారమైన వైమానిక శక్తి తెహ్రాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సరిపోతుందని భావించారు. కానీ వారి అంచనా తప్పింది.
యుద్ధాలు, ఆంక్షలు, ఏకాకి కావడం వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటూ దాదాపు అర్థశతాబ్దకాలంగా మనుగడ సాగిస్తున్న ఒక వ్యవస్థ నైజాన్ని అర్థం చేసుకోవడంలో వారు విఫలమయ్యారు.
ఇప్పుడు అమెరికా, ఇజ్రయెల్ ఆ తప్పుడు అంచనాల పర్యవసానాలను అనుభవిస్తున్నాయి. వాటితో పాటు మిగతా ప్రపంచం కూడా ఈ నష్టాన్ని ఎదుర్కొంటోంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)