డోనల్డ్ ట్రంప్: జిన్‌పింగ్‌తో చర్చల తర్వాత తైవాన్‌ను ఏమని హెచ్చరించారు?

ఫొటో సోర్స్, Evan Vucci / POOL / AFP via Getty Images
- రచయిత, ఇయాన్ ఐక్‌మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
చైనా నుంచి స్వాతంత్ర్యం పొందినట్లు అధికారికంగా ప్రకటించుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తైవాన్‌ను హెచ్చరించారు.
అమెరికా, చైనా మధ్య రెండు రోజుల పాటు జరిగిన శిఖరాగ్ర సమావేశం శుక్రవారం ముగిసింది.
"స్వాతంత్ర్యం పేరుతో ఎవరూ ముందుకెళ్లడం నాకిష్టం లేదు" అని ఆయన ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థతో చెప్పారు.
అయితే, తమది సార్వభౌమ దేశమని తాము ఇప్పటికే భావిస్తున్నామని, అధికారికంగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం లేదని తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టె గతంలో చెప్పారు.
అమెరికా చాలాకాలంగా తైవాన్‌కు మద్దతిస్తోంది.

తైవాన్ రక్షణకు అవసరమైన వనరులను మనమే అందించాలని అమెరికా చట్టం చెబుతోంది. అయితే చైనాతో దౌత్య సంబంధాలను కొసాగించేందుకు తైవాన్ విషయంలో అమెరికా బ్యాలన్స్ పాటించే ప్రయత్నాలు చేస్తోంది.
తైవాన్‌లో ప్రభుత్వం ఉంది. దీంతో తాను "ఏ పక్షానికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు" అని ట్రంప్ గతంలో చెప్పారు.
తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమని అవసరమైతే బలవంతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటామని చైనా వాదిస్తోంది. అమెరికా చాలాకాలంగా తైవాన్‌కు మద్దతిస్తోంది. కానీ తైవాన్ స్వాతంత్ర్యానికి మద్దతివ్వడం లేదు. ఇది అమెరికా అధికారిక విధానం.

ఫొటో సోర్స్, Getty Images
తైవాన్ విషయంలో అమెరికా వైఖరి మారిందా?
చైనాతో సంబంధాలను కోరుకునే దేశాలు 'వన్ చైనా' ప్రభుత్వాన్ని మాత్రమే గుర్తించాలని బీజింగ్ నాయకత్వం షరతు పెడుతోంది.
తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ టె పట్ల చైనా బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
"సమస్యలను సృష్టిస్తారు" "రెండు పక్షాల మధ్య శాంతికి భంగం కలిగిస్తున్నారు" అని చైనా గతంలో తైవాన్ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించింది.
తైవాన్ ప్రజల్లో అనేకమంది తమది ప్రత్యేక దేశమని భావిస్తారు.
మరి కొంతమంది యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుకుంటారు. తైవాన్ చైనా నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకోకూడదు. అలాగే తైవాన్‌ను చైనాలో విలీనం చేయకూడదనేది వారి అభిప్రాయం.
తైవాన్‌పై తమ విధానంలో ఎలాంటి మార్పులేదని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు.
"యుద్ధం చేయడానికి మేము 9,500 మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. పరిస్థితి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చైనా కూడా ఇలాగే ప్రశాంతంగా ఉండాలి" అని ట్రంప్ అన్నారు.
బీజింగ్ నుంచి వాషింగ్టన్‌కు తిరిగి వెళుతున్నప్పుడు రిపోర్టర్లతో మాట్లాడుతూ తైవాన్ గురించి తాను, షీ జిన్‌పింగ్ చాలా అంశాలు మాట్లాడుకున్నామని ట్రంప్ చెప్పారు.

అమెరికా వైఖరి ఎందుకు మారింది?
చైనా ఆక్రమించుకోవాలని చూస్తే తైవాన్‌ను అమెరికా రక్షిస్తుందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
ఈ విషయం గురించి షీ జిన్‌పింగ్ చాలా సీరియస్‌గా ఉన్నారని, స్వాతంత్ర్యం విషయంలో తైవాన్ ఎలాంటి ముందడుగు వేయకూడదని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు.
"అమెరికా- చైనా సంబంధాల్లో తైవాన్ సమస్య చాలా ముఖ్యమైన అంశం" అని షీ జిన్‌పింగ్ ట్రంప్‌తో చర్చల సమయంలో చెప్పినట్లు చైనా ప్రభుత్వ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
"ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే రెండు దేశాలు సంఘర్షణ లేదా యుద్ధం స్థాయికి చేరుకోవచ్చు" అని ఆయన హెచ్చరించారు.
తైవాన్ విషయంలో చైనాతో సంఘర్షణకు అవకాశం ఉందా అని ట్రంప్‌ను అడిగినప్పుడు "లేదు అలా అనుకోవడం లేదు. అంతా బాగానే ఉంటుందని భావిస్తున్నాను. షీ జిన్‌పింగ్ యుద్ధం కోరుకోవడం లేదు" అని ట్రంప్ అన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో తైవాన్ చుట్టూ చైనా తన సైనిక విన్యాసాలను గణనీయంగా పెంచింది.
చైనా చర్యలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల్ని పెంచుతూ అమెరికా స్ట్రాటజిక్ బ్యాలన్సింగ్‌కు పరీక్ష పెడుతున్నాయి.
గతేడాది చివర్లో ట్రంప్ ప్రభుత్వం తైవాన్‌కు11 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమ్ముతున్నట్లు ప్రకటించింది.
ఇందులో అత్యాధునిక రాకెట్ లాంచర్లు, పలురకాల క్షిపణులు ఉన్నాయి. దీన్ని చైనా తీవ్రంగా విమర్శించింది.
ఆయుధాల ఒప్పందం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ చెప్పారు.
ఆయుధాల ఒప్పందంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో వివరణాత్మక చర్చలు జరిగినట్లు ట్రంప్ చెప్పారు.
"ఇప్పుడు నేను తైవాన్‌ను పాలిస్తున్న వ్యక్తితో మాట్లాడాలి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు" అని ట్రంప్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తైవాన్ ఏమంటోంది?
అమెరికా- తైవాన్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ ఇరు దేశాల మధ్య బలమైన అనధికార సంబంధాలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు సాధారణంగా తైవాన్ నాయకుడితో నేరుగా మాట్లాడరు. అలా మాట్లాడితే అది చైనాతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయచ్చు. ఎందుకంటే చైనా ప్రభుత్వం తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టెను వేర్పాటువాదిగా పరిగణిస్తోంది.
ట్రంప్ వ్యాఖ్యల అసలు అర్థాన్ని గ్రహించడానికి తైవాన్‌కు మరింత స్పష్టత అవసరమని తైవాన్ ఉప విదేశాంగ మంత్రి చెన్ మింగ్-చిన్ అన్నారు.
అమెరికా చట్టం ప్రకారమే తైవాన్‌కు అమెరికా ఆయుధాలు అమ్ముతోందని ఇది చట్ట ప్రకారం చేసుకున్న ఏర్పాటు అని చెన్ చెప్పారు.
"తైవాన్-అమెరికా ఆయుధ ఒప్పందాలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి పునాదిగా ఉన్నాయి" అని ఆయన అన్నారు.
తైవాన్‌కు అమెరికా ఆయుధాల అమ్మకాలు "అమెరికా భద్రతా నిబద్ధతలో భాగమని, ప్రాంతీయంగా ఎదురయ్యే ప్రమాదానికి నిరోధకంగా పని చేస్తాయి" అని తైవాన్ అధ్యక్షుడు లై ప్రతినిధి రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.
2025 ఫిబ్రవరిలో తైవాన్ స్వాతంత్ర్యాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వాషింగ్టన్ పునరుద్ఘాటించిన ప్రకటనను అమెరికా విదేశాంగ శాఖ తన వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
ఇది "వేర్పాటువాద శక్తులకు తప్పుడు సంకేతం" పంపుతుందని చైనా పేర్కొంది.
"ఏ పక్షమైనా ప్రస్తుత పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తే, మేము దానివి వ్యతిరేకిస్తామని ఎప్పుడూ చెబుతూనే ఉన్నాము" అని తైవాన్‌లోని అమెరికా అధికారులు చెప్పారు.
అమెరికా-చైనా శిఖరాగ్ర సమావేశాన్ని తమ బృందం నిశితంగా పరిశీలిస్తోందని తైవాన్ విదేశాంగ మంత్రి లిన్ చియా-లుంగ్ అన్నారు.
అమెరికాతో పటు ఇతర దేశాలతో తైవాన్ మంచి సంబంధాలను కొనసాగిస్తోందని ఆయన అన్నారు.
ఈ ప్రాంతంలో తైవాన్ "శాంతి, సుస్థిరత పరిరక్షకురాలు" గా ఉంటుందని చియా లుంగ్ చెప్పారు.
'దురాక్రమణ సైనిక చర్యలు, నిరంకుశ అణచివేత' ద్వారా చైనా ఈ ప్రాంతంలో ముప్పును పెంచుతోందని ఆయన ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























