హంటావైరస్: షిప్‌లోని ప్రయాణికులను ఎక్కడెక్కడికి తరలించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ ఫిలిప్స్, సారా రైన్స్ ఫోర్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- చదివే సమయం: 4 నిమిషాలు
హంటా వైరస్ వ్యాపించిన క్రూయిజ్ షిప్‌లోని ఒకరిని ఫ్రాన్స్‌కు తిరిగి తీసుకొస్తుండగా వ్యాధి లక్షణాలు కనిపించాయని ఫ్రాన్స్ ప్రధాని చెప్పారు.
టెనెరిఫ్ నుంచి ప్యారిస్ వెళ్తున్న చార్టెడ్ విమానంలో ఉన్నప్పుడే ఆ వ్యక్తికి లక్షణాలు కనిపించాయని సెబాస్టిన్ లెకొర్ను చెప్పారు. ఈ ఘటన దృష్ట్యా ఎంవీ హోండియస్ నౌక నుంచి తరలించిన ఐదుగురినీ తదుపరి నోటీసులు వచ్చేవరకు తక్షణమే కఠినమైన ఐసొలేషన్‌లో ఉంచుతున్నట్టు తెలిపారు.
ఆదివారం(మే 10) డచ్ నౌక నుంచి స్వదేశాలకు పంపించిన 90మంది పర్యాటకుల్లో ఆ ఫ్రెంచ్ పౌరులు ఉన్నారు. ఆ నౌక తెల్లవారుజామున కానరీ దీవుల తీరానికి చేరింది.
ఈ షిప్‌లో ప్రయాణించిన వారిలో ముగ్గురు చనిపోయారు. వారిలో ఇద్దరు ఈ వైరస్‌తోనే చనిపోయినట్టు నిర్ధరణ అయింది.
లీ బర్గెట్ ఎయిర్‌పోర్టుకు ఫ్రెంచ్ విమానం చేరుకున్నతర్వాత అధికారులు పీపీఈ కిట్లు ధరించి ప్రయాణికులను కలిశారు. తర్వాత వారిని అంబులెన్సుల్లో బిచాట్ ఆస్పత్రికి తరలించారు. వారిని 72 గంటలపాటు క్వారంటైన్‌లో ఉంచి, పూర్తిస్థాయిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత 45రోజుల పాటు వాళ్లు ఇంట్లో సెల్ఫ్ ఐసొలేషన్ ఉండాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఐసొలేషన్‌లో ప్రయాణికులు
టెనెరిఫె నుంచి మాడ్రిడ్‌కు తీసుకెళ్లిన 14మంది స్పెయిన్ దేశస్థులను రాజధానిలోని మిలటరీ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉంచారు.
బ్రిటిష్ పౌరులను మాంచెస్టర్‌కు తీసుకెళ్లారు. వాళ్లకెవరికీ లక్షణాలు కనిపించలేదు. కానీ వారిని పర్యవేక్షణలో ఉంచామని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్ఎస్ఏ) చెప్పింది.
26మంది ప్రయాణికులు, సిబ్బందితో కూడిన విమానం నెదర్లాండ్స్‌కు చేరుకుంది. వారిలో ఎనిమిది మంది డచ్ జాతీయులు కూడా ఉన్నారు.
అమెరికా విమానంలో 18మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో అమెరికాలో నివసించే ఓ బ్రిటిష్ పౌరుడు కూడా ఉన్నారు.
క్రూయిజ్ షిప్ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత అమెరికన్లలో ఒకరికి హంటా వైరస్ లక్షణాలు స్పల్పంగా కనిపించాయని, ఇంకొకరికి స్వల్పస్థాయిలో పాజిటివ్‌గా తేలిందని అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగం తెలిపింది.
ఈ ఇద్దరు ప్రయాణికులను ''అత్యంత జాగ్రత్త చర్యగా విమానంలోని బయోకంటెయిన్‌మెంట్ యూనిట్లలో ప్రయాణించేఏర్పాట్లు చేశారు'' అని తెలిపింది.
షిప్‌లోని ఆరుగురు ప్రయాణికులు ఆస్ట్రేలియాకు వెళ్లారు. మరో 18మంది నెదర్లాండ్స్ వెళ్తారు. ఆయా దేశాలు విమానాలు పంపని ప్రయాణికులు కూడా ఈ విమానాల్లోనే ప్రయాణిస్తారు.
క్రూయిజ్ నౌక ఆదివారం ఉదయం(మే 10) గ్రనడిల్లా పోర్టులో లంగరేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడుగంటల సమయంలో వైద్య బృందాలు అక్కడికి వెళ్లాయి.

ఫొటో సోర్స్, Reuters
స్పెయిన్ ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం నౌకలో ఉన్న వారిని బయటకు తరలించి, వారిని స్వదేశాలకు పంపే ప్రక్రియ జరిగింది.
ఆదివారం ఉదయం మొదటి తరలింపులు జరుగుతున్న సమయంలో డెక్‌పై, కిటీకిల దగ్గర తెల్లని ఫేస్ మాస్క్‌లు ధరించిన ప్రయాణికులు కనిపించారు.
ప్రయాణికులను మొదటగా తరలిస్తున్న పడవలో కొన్ని దృశ్యాలు కనిపించాయి. ఒకరికొకరు దూరంగా కూర్చున్న ప్రయాణికులు తీరానికి చేరుకుంటున్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. అక్కడే వాళ్లు అధికారులను కలుసుకున్నారు.
బ్లూ కలర్ పీపీఈలు వేసుకున్న కొందరు బ్రిటిష్ ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్తూ అక్కడ ఉన్న మీడియాను చూసి చేతులూపుతూ ముందుకు వెళ్లారు.
ఎంవీ హోండియస్ రాకను కానరీ దీవుల అధ్యక్షుడు సహా పలువురు వ్యతిరేకించారు. వైరస్ టెనెరిఫ్‌కు వ్యాప్తిచెందుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వైరస్ ఎలా వ్యాపించింది?
హంటా వైరస్‌లు సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తాయి. కానీ మనుషుల్లో ఆండెస్ స్ట్రయిన్ వ్యాపించే అవకాశముంది. నౌకలోని కొందరు ప్రయాణికులకు దక్షిణ అమెరికాలో ఇది సోకి ఉంటుందని డబ్ల్యుహెచ్ఓ భావిస్తోంది.
జ్వరం, తీవ్రమైన అలసట, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నౌకలపై వ్యాపించే వైరస్‌లకు ఎలా అడ్డుకట్ట వేయాలనేదానిపై కొన్ని విషయాలు నేర్చుకోవాలని ‘ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పాండెమిక్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెస్పాన్స్’(ఐపీపీఆర్) సహ అధ్యక్షురాలు హెలెన్ క్లార్క్ బీబీసీతో చెప్పారు.
మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధమయిందా అన్న ప్రశ్నకు ఇంకా చేయాల్సింది ఉందని ఆమె బదులిచ్చారు.
మొదటి ప్రయాణికుడు ఏప్రిల్ 11న, మరో ప్రయాణికుడు మే 2న చనిపోయారు. సెయింట్ హెలెనాలో ఏప్రిల్ 24న షిప్ నుంచి దిగిపోయిన 69ఏళ్ల డచ్ మహిళ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ రెండు రోజుల తర్వాత ఆమె మరణించారు.
వైరస్ సోకినట్టు నిర్ధరణ అయిన ఇద్దరు బ్రిటిషర్లు నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్నారు.
మరో బ్రిటిషర్‌కు కూడా ఈ వ్యాధి సోకిందన్న అనుమానంతో మారుమూల అట్లాంటిక్ దీవి ట్రిస్టాన్ డా కున్హాలో చికిత్స అందించారు. బ్రిటిష్ ఆర్మీ వైద్యులు వైద్యపరికరాలతో పారాచ్యూట్ ద్వారా అక్కడికి చేరుకున్నారు.
యూకేకు చేరుకున్న బ్రిటిషర్లను ఓ ఐసొలేషన్ సెంటర్‌లో 72గంటలపాటు పర్యవేక్షణలో ఉంచారు. వారి పరిస్థితులకు తగ్గట్టుగా వారు ఇళ్లల్లో ఐసొలేట్ అవ్వాలా లేకా మరో అనుకూలమైన ప్రాంతంలో ఉండాలా అన్నది వైద్యులు నిర్ణయిస్తారు.
ప్రయాణికులు, సిబ్బంది అందరూ నౌకనుంచి దిగిన తర్వాత హోండియస్ నెదర్లాండ్స్‌కు వెళ్తుంది. చనిపోయిన ప్రయాణికుడి మృతదేహాన్ని, వస్తువులను క్రిమిసంహారం చేసి నౌకనుంచి దించుతారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.





















