'పేరు మార్చుకుని.. పురోహితుడిగా మారిన రౌడీషీటర్', 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న హత్య కేసు నిందితుడి అరెస్ట్

ఫొటో సోర్స్, Hyderabadpolice.
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
బెయిల్ మీద బయటికొచ్చి, పురోహితుడి అవతారమెత్తి, 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ హత్య కేసు నిందితుడిని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.
రూపం మార్చుకుని, ఐడెంటిటీ కార్డులలో మారుపేర్లతో జీవిస్తున్న వైష్ణవ్ కిషన్ దాస్ అలియాస్ గణేశ్ మహారాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు హత్యలు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, చోరీ సహా 21 కేసుల్లో వైష్ణవ్ దాస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్, మల్కాజ్ గిరి, సైబరాబాద్ సహా తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు విచారణ దశలో ఉన్నట్టు డీసీపీ వివరించారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వైష్ణవ్ కిషన్ దాస్ 90వ దశకంలో హైదరాబాద్‌కు వలస వచ్చారు.
ఆయనపై 1999లో మొదటిసారి హత్యాయత్నం కేసు నమోదైనట్టు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి.నరేశ్ బీబీసీతో చెప్పారు.
''కిషన్ దాస్‌కు పాతికేళ్ల వయసున్నప్పుడు మొదటి కేసు నమోదైంది.
ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్టు కేసులు నమోదయ్యాయి.''

ఫొటో సోర్స్, Getty Images
బెయిల్‌పై బయటకొచ్చి పరారీ
సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో, 2010లో జరిగిన హత్య కేసులో కిషన్ దాస్ రెండో నిందితుడిగా ఉన్నారని సుల్తాన్ బజార్ పోలీసులు చెప్పారు.
''ఆస్తి వివాదాల నేపథ్యంలో తన సోదరుడు తుల్జారాంను హత్య చేసిన కేసులో వైష్ణవ్ కిషన్ దాస్ నిందితుడిగా ఉన్నారు'' అని సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ జి.నరేశ్ తెలిపారు.
అయితే, ఈ కేసు ఇప్పటికీ విచారణ దశలో ఉంది.
గతంలో, 2010 నవంబర్‌లో కిషన్‌దాస్ కోర్టులో లొంగిపోయారు.
''2012 మే నెలలో బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయనపై రౌడీషీట్ ఉంది'' అని నరేశ్ వివరించారు.
బెయిల్‌పై విడుదలయ్యాక కిషన్ దాస్ మహారాష్ట్రకు వెళ్లిపోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
అక్కడే వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ వ్యవసాయం చేసుకుని, నాలుగైదేళ్ల తర్వాత హైదరాబాద్ నగరానికి తిరిగొచ్చి మలక్ పేట ప్రాంతంలో ఇల్లు కొనుక్కొని ఉంటున్నాడని చెప్పారు.
''ఆయన్ను కొంతకాలంగా చూస్తున్నాం. మాకు తెలిసిన వారి ఇంట్లో పూజలు చేశారు. ఆయనపై హత్య వంటి తీవ్రమైన కేసులు ఉన్నాయని ఊహించలేదు. ఇది మాకు ఆశ్చర్యంగా ఉంది'' అని మలక్ పేటకు చెందిన సునీల్ చారి ఫోన్ ద్వారా బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, ANI/UGC
ఇప్పుడు పోలీసులకు ఎలా చిక్కారంటే…
సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ జి.నరేశ్ ఇటీవల పాత కేసులకు సంబంధించి రికార్డులు పరిశీలిస్తున్న క్రమంలో కిషన్ దాస్ 14 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నట్టు గుర్తించారు.
గతంలో ఆయన వాడిన రెండు ఫోన్ నంబర్లు పోలీసు రికార్డుల్లో నమోదై ఉన్నాయి.
''ఆ రెండు నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో ఆ నంబరుకు ప్రత్యామ్నాయంగా మరో నంబరు అప్డేట్ చేసి ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ తీసుకున్నట్టు గుర్తించాం'' అని నరేశ్ బీబీసీతో చెప్పారు.
ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్‌తో హైదరాబాద్ నగరంలోనే మలక్ పేట ప్రాంతంలో కిషన్ దాస్ అడ్రస్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ అడ్రస్‌కు వెళ్లి పరిశీలించగా, అలాంటి పేరుతో ఎవరూ లేరని పోలీసులకు సమాచారం వచ్చింది.
''మా కానిస్టేబుళ్లు మే 27వ తేదీన ఆ అడ్రస్‌కు వెళ్లి ఎదురుచూశారు. ఆ సమయంలో ఒక వ్యక్తి గుండుతో పురోహితుడి వేషధారణలో బయటకు వచ్చారు.
మాకు అనుమానం వచ్చి ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా తానే కిషన్ దాస్ అని ఒప్పుకొన్నారు'' అని ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కిషన్ దాస్ నుంచి గణేశ్ మహారాజ్..
'వైష్ణవ్ కిషన్ దాస్'.. తన పేరు 'వైష్ణవ్ గణేశ్ మహారాజ్'గా మార్చుకున్నట్టు గుర్తించామని డీసీపీ శిల్పవల్లి చెప్పారు.
''ఆయన ఆధార్, ఎల్పీజీ కనెక్షన్లో పేరు.. ఇలా అన్ని ఐడెంటిటీల వివరాలను గణేశ్ మహారాజ్‌గా కిషన్ దాస్ మార్చేశారు. పురోహితుడి అవతారమెత్తి తెలిసిన వారి ఇళ్లల్లో పూజలు చేస్తూ జీవితం సాగిస్తున్నారు.''
ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వైష్ణవ్ కిషన్ దాస్ తానేనని అంగీకరించారని ఇన్స్పెక్టర్ నరేశ్ బీబీసీతో చెప్పారు.
వైష్ణవ బ్రాహ్మణుడు కావడంతో ఆయన పౌరోహిత్యం చేస్తున్నట్టు గుర్తించామన్నారు.
నకిలీ పద్ధతుల్లో గుర్తింపు పత్రాలను పొందినందుకు మరో కేసు నమోదైంది.
ఈ 14 ఏళ్లలో పేరు మార్చుకోవడంతోపాటు గుండు చేయించుకుని రూపం మార్చుకోవడం, బరువు పెరగడంతో వేషధారణలో పూర్తిగా మార్పులు వచ్చాయని నరేశ్ తెలిపారు.
కిషన్ దాస్ అలియాస్ గణేశ్ మహారాజ్‌కు గతంలో వివాహమైందని, భార్యకు విడాకులు ఇచ్చారని పోలీసులు చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారంపై కిషన్ దాస్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఆయన తరఫున న్యాయవాది కూడా అందుబాటులోకి రాలేదు.
మరోవైపు కిషన్ దాస్ రహస్య జీవితం గడుపుతున్న సమయంలో ఏవైనా నేరాలకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.


























