You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాలియేటివ్ కేర్, హాస్పిస్ కేర్ అంటే ఏమిటి, ఎవరికి అవసరం?
- రచయిత, డాక్టర్ హిమాని, రేడియేషన్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 7 నిమిషాలు
ప్రపంచ వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని వ్యాధులు పూర్తిగా నయం కాకపోవచ్చు.
ముఖ్యంగా క్యాన్సర్, చివరి దశ గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ వైఫల్యం, నరాల సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు వంటి అనారోగ్యంతో ఉన్న రోగులు తీవ్రమైన శారీరక, మానసిక బాధలను ఎదుర్కొంటారు.
ఇలాంటి సమయంలో కేవలం వ్యాధిని నియంత్రించడమే కాకుండా, రోగి జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టే వైద్య విధానమే "పాలియేటివ్ కేర్".
వ్యాధి పూర్తిగా నయమవ్వడం సాధ్యం కాకపోయినా, రోగి మిగిలిన జీవితాన్ని గౌరవప్రదంగా, బాధలేని విధంగా గడపడానికి సహాయం చేసే సేవలను "హాస్పిస్ కేర్" అంటారు.
ఈ రెండు సేవలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే, భారత్‌లో ఇంకా చాలామందికి వీటి గురించి సరైన అవగాహన లేదు.
చాలామంది "ఇది చివరి దశలో ఉన్నవారికి మాత్రమే" లేదా "చికిత్స ఆపేసినప్పుడు మాత్రమే ఇస్తారు" అనే అపోహల్లో ఉంటారు. కానీ, వాస్తవానికి పాలియేటివ్ కేర్ అనేది రోగ నిర్ధరణ జరిగిన (ప్రారంభ) దశ నుంచే ఇవ్వవచ్చు.
పాలియేటివ్ కేర్ అంటే ఏంటి?
పాలియేటివ్ కేర్ అనేది తీవ్రమైన లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇచ్చే ప్రత్యేక వైద్య సేవ. వ్యాధి వల్ల కలిగే నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, అలసట, నిద్రలేమి, ఆకలి తగ్గడం, ఆందోళన, భయం వంటి సమస్యలను తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం.
ఇది కేవలం శారీరక సమస్యలకే పరిమితం కాదు. రోగి మానసిక స్థితి, కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, సామాజిక, ఆధ్యాత్మిక అవసరాలను కూడా ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. అందుకే దీనిని "సంపూర్ణ సంరక్షణ" అని కూడా అంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి పాలియేటివ్ కేర్ అవసరం ఉన్నప్పటికీ, వారిలో చాలా కొద్దిమందికే ఈ సేవలు అందుతున్నాయి.
హాస్పిస్ కేర్ అంటే ఏంటి?
వ్యాధి పూర్తిగా నయం అయ్యే అవకాశాలు లేనప్పుడు, జీవిత చివరి దశలో రోగికి ప్రశాంతమైన, గౌరవప్రదమైన జీవితం అందించడమే హాస్పిస్ కేర్ ప్రధాన లక్ష్యం. ఇందులో వివిధ రకాల పరీక్షలు, బాధ కలిగించే చికిత్సల కంటే రోగి సౌకర్యానికి, నొప్పి నియంత్రణకు, భావోద్వేగ మద్దతుకు ప్రాధాన్యం ఇస్తారు.
హాస్పిస్ సేవలు ఇంట్లో, ప్రత్యేక హాస్పిస్ కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో అందించవచ్చు. రోగి కుటుంబ సభ్యులకు కూడా ఈ సమయంలో మార్గదర్శకత్వం, మానసిక ధైర్యం అందిస్తారు.
ఎవరికి పాలియేటివ్ కేర్ అవసరం?
- పాలియేటివ్ కేర్ కేవలం క్యాన్సర్ రోగులకే కాదు.. మరికొందరికి కూడా ఇది ఎంతో ఉపయోగకరం:
- చివరి దశ క్యాన్సర్
- గుండె వైఫల్యం
- దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు
- కిడ్నీ వైఫల్యం
- లివర్ సిరోసిస్
- అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల వ్యాధులు
- స్ట్రోక్ తర్వాత తీవ్రమైన వైకల్యం
- హెచ్ఐవీ/ఎయిడ్స్
- వృద్ధాప్యంలో బలహీనత, దీర్ఘకాలిక నొప్పులు
- చిన్నపిల్లలకు (ప్రత్యేక బాల్య పాలియేటివ్ కేర్ సేవలు)
పాలియేటివ్ కేర్ ఎలా సాయపడుతుంది?
1. నొప్పి నియంత్రణ
చాలా మంది క్యాన్సర్ రోగులు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. సరైన మందులు, ముఖ్యంగా ఓపియాయిడ్ వర్గానికి చెందిన ఔషధాలు నొప్పిని గణనీయంగా తగ్గించగలవు. మార్ఫిన్ వంటి మందులు సరైన పద్ధతిలో ఉపయోగిస్తే రోగి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి.
2. శ్వాసలో ఇబ్బంది తగ్గించడం
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనేది చాలా భయంకరమైన అనుభవం. ఆక్సిజన్, మందులు, శ్వాస వ్యాయామాలు, మానసిక మద్దతు ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.
3. మానసిక ధైర్యం
వ్యాధి నిర్ధారణ తర్వాత చాలా మంది నిరాశ, భయం, ఆందోళనకు గురవుతారు. ఆ సమయంలో సైకాలజిస్టులు, కౌన్సిలర్లు, సామాజిక కార్యకర్తలు రోగికి ధైర్యం చెప్పడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు.
4. కుటుంబ సభ్యులకు తోడ్పాటు
రోగిని చూసుకునే కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. వారికి అవసరమైన శిక్షణ, విశ్రాంతి, భావోద్వేగ మద్దతు అందించడం కూడా పాలియేటివ్ కేర్‌లో భాగమే.
5. గౌరవప్రదమైన జీవితం
జీవిత చివరి దశలో కూడా రోగి తన అభిరుచులకు అనుగుణంగా జీవించేందుకు, తన కుటుంబంతో సమయం గడిపేందుకు అవకాశం కల్పించడం ఈ సేవల ముఖ్య లక్ష్యం.
పాలియేటివ్ కేర్ ఎప్పుడు ప్రారంభించాలి?
చాలా మంది పాలియేటివ్ కేర్ అనేది చివరి రోజుల్లో మాత్రమే అవసరమని భావిస్తారు. కానీ ఇదో పెద్ద అపోహ. వ్యాధి నిర్ధరణ అయిన మొదటి దశ నుంచే పాలియేటివ్ కేర్ ప్రారంభిస్తే రోగి జీవన నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది.
ఉదాహరణకు క్యాన్సర్ రోగుల్లో కీమోథెరపీ లేదా రేడియేషన్ సమయంలో వచ్చే వాంతులు, నొప్పి, అలసట వంటి సమస్యలను తగ్గించడంలో పాలియేటివ్ కేర్ ఎంతో సహాయపడుతుంది.
భారత్‌లో పరిస్థితెలా ఉంది?
పాలియేటివ్ కేర్ సేవలలో కేరళ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచింది. అక్కడ కమ్యూనిటీ ఆధారిత సేవలు, వాలంటీర్ల సహకారం, ఇంటింటికి వెళ్లే వైద్య బృందాల ద్వారా వేలాది మంది రోగులకు సేవలు అందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సేవలను విస్తరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఈ సేవలు కొద్ది మేర ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్‌లో ఇవి అందుబాటులో లేవు.
హాస్పిస్ సేవల అవసరం ఎందుకు పెరుగుతోంది?
ప్రస్తుతం జీవనశైలి మార్పులు, వృద్ధాప్యం పెరగడం, దీర్ఘకాలిక వ్యాధులు అధికమవడం వల్ల హాస్పిస్ సేవల అవసరం కూడా పెరుగుతోంది.
వ్యాధి చివరి దశలో ఉన్న రోగులను తరచూ ఆసుపత్రులకు తీసుకెళ్లడం కుటుంబ సభ్యులకు ఆర్థికంగా, మానసికంగా భారం అవుతుంది. హాస్పిస్ సేవలతో రోగికి ఇంటి వాతావరణంలోనే సౌకర్యవంతమైన సంరక్షణ అందించవచ్చు.
పాలియేటివ్ కేర్ బృందంలో ఎవరు ఉంటారు?
పాలియేటివ్ కేర్ ఒక బృందపరమైన సేవ.
వైద్యులు, నర్సులు, సైకాలజిస్టులు, ఫిజియోథెరపిస్టులు, సామాజిక కార్యకర్తలు, పోషకాహార నిపుణులు, ఆధ్యాత్మిక సలహాదారులు, వాలంటీర్లు... ఇలా అందరూ కలిసి రోగి, రోగి కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి పనిచేస్తారు.
అపోహలు – నిజాలు:
అపోహ: పాలియేటివ్ కేర్ అంటే చికిత్స ఆపేయడం.
నిజం: ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఇతర చికిత్సలతో పాటు కూడా ఇవ్వవచ్చు.
అపోహ: మార్ఫిన్ వంటి మందులు ప్రమాదకరం.
నిజం: వైద్యుల పర్యవేక్షణలో సరైన మోతాదులో ఇస్తే ఇవి చాలా సురక్షితం.
అపోహ: ఇది చివరి రోజుల్లో మాత్రమే అవసరం.
నిజం: వ్యాధి ప్రారంభ దశ నుంచే ఉపయోగపడుతుంది.
అపోహ: హాస్పిస్ అంటే మరణం కోసం ఎదురుచూడటం.
నిజం: ఇది మిగిలిన జీవితాన్ని గౌరవప్రదంగా, బాధలేకుండా గడపడానికి సహాయపడే సేవ.
ఇంట్లో రోగిని ఎలా చూసుకోవాలి?
- రోగికి సమయానికి మందులు ఇవ్వాలి.
- తగిన పోషకాహారం అందించాలి.
- రోగి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి.
- నొప్పి లేదా శ్వాస సమస్యలు పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- రోగి ఒంటరితనంగా భావించకుండా కుటుంబ సభ్యులు సమయం కేటాయించాలి.
- మంచం పైన ఎక్కువసేపు ఉండే రోగులకు బెడ్ సోర్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వైద్యుల పాత్ర
వైద్యులు కేవలం మందులు ఇవ్వడమే కాదు, రోగి, కుటుంబ సభ్యులతో నిజాయితీగా మాట్లాడాలి. వ్యాధి స్థితి, చికిత్స ప్రయోజనాలు, పరిమితులు గురించి స్పష్టంగా వివరించాలి.
చాలా సందర్భాల్లో వ్యాధి చివరి దశలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు "ఏదైనా చేసి బతికించండి" అనే ఆందోళనలో ఉంటారు. ఇలాంటి సమయంలో అవసరం లేని చికిత్సల వల్ల రోగి మరింత బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రోగి సౌకర్యం, గౌరవాన్ని ప్రాధాన్యంగా చూడాలి.
ప్రభుత్వాలు ఏం చేయాలి?
- పాలియేటివ్ కేర్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలి.
- ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఈ సేవలు అందుబాటులో ఉంచాలి.
- వైద్య విద్యలో పాలియేటివ్ కేర్ శిక్షణ తప్పనిసరి చేయాలి.
- వాలంటీర్లను ప్రోత్సహించాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో హోమ్ కేర్ సేవలను విస్తరించాలి.
మానవత్వానికి ప్రతీక
పాలియేటివ్ కేర్, హాస్పిస్ సేవలు కేవలం వైద్య విధానాలు మాత్రమే కాదు. ఇవి మానవత్వానికి ప్రతీక. ఒక రోగి బాధను తగ్గించడం, వారికి ధైర్యం చెప్పడం, చివరి క్షణాల్లో కూడా గౌరవంగా జీవించే అవకాశం ఇవ్వడం అనేది అత్యున్నత సేవ అని వైద్య వృత్తిలో ఉన్నవారు భావిస్తారు.
జీవితాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో, బాధను తగ్గించడం కూడా అంతే ముఖ్యం. పాలియేటివ్ కేర్, హాస్పిస్ సేవలపై అవగాహన పెరిగితే, సమాజం మరింత సానుభూతితో, మానవత్వంతో ముందుకు సాగుతుంది. బాధలేని, గౌరవప్రదమైన జీవితం ప్రతి మనిషి హక్కు అనే భావన సమాజంలో బలపడాలి.
తీవ్ర వ్యాధులతో పోరాడుతున్న రోగులకు మందులతో పాటు మానవీయ స్పర్శ కూడా అవసరం. "మీరు ఒంటరిగా లేరు" అని చెప్పే వైద్య సేవలే పాలియేటివ్ కేర్, హాస్పిస్ సేవలు. రోగి జీవితాన్ని పొడిగించడం మాత్రమే కాదు, ఆ జీవితానికి నాణ్యతను ఇవ్వడమే వీటి అసలు లక్ష్యం.
(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)