‘నేనుండగా ఇరాన్‌ను అణ్వాయుధం తయారు చేయనివ్వను’ అని పదే పదే చెప్పే నెతన్యాహును ఒప్పందం తర్వాత ‘వర్రీ’కి గురి చేసే ఐదు అంశాలు ఇవే..

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌గానీ, తానుగానీ ఒకరి ఇష్టానికి తగ్గట్లు మరొకరం వ్యవహరించం అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అవసరమైనంత కాలం దక్షిణ లెబనాన్‌లో తమ బలగాలు ఉంటాయని నెతన్యాహు నొక్కి చెప్పారు.
''మేం స్వతంత్ర, గర్వించదగిన దేశాలకు నేతలం. కొన్నిసార్లు మా అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉండొచ్చు. మా దేశ ప్రయోజనాల కోసం మేం నిలబడతాం. ఇజ్రాయెల్ భద్రతా, ప్రయోజనాల కోసం నేను నిలబడతాను'' అని నెతన్యాహు స్పష్టం చేశారు.
''ఉత్తర ప్రాంతంలోని మా ప్రజలను, దేశ ప్రజలందర్ని కాపాడేందుకు అవసరమైనంత కాలం మేం దక్షిణ లెబనాన్‌లోని సెక్యురిటీ జోన్లో ఉంటాం'' అని చెప్పారు.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఒక రకమైన స్పందనగా నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది.
గత వారం ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సమావేశంలో, అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను పొడిగించేందుకు ఒక ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందంలోని నిబంధనలలో ఒకటి లెబనాన్‌తో సహా అన్ని చోట్లా యుద్ధాన్ని ముగించడం.
అయితే, ఒప్పందం కుదిరిన తర్వాత లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడులలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని ఇరాన్ అంటోంది.
ఒప్పందం తొలి పేరాగ్రాఫ్లోనే.. అమెరికా, ఇరాన్, వాటి మిత్రదేశాలు, లెబనాన్‌తో సహా అన్ని చోట్లా తమ సైనిక కార్యకలాపాలను తక్షణమే, శాశ్వతంగా ముగించాలని ఉంది.
ఇజ్రాయెల్ జరుపుతున్న కాల్పులు .. శాంతి ఒప్పందానికి ముప్పుగా కూడా పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్ చర్యలపై డోనల్డ్ ట్రంప్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
జీ-7 సదస్సులో గతవారం రిపోర్టర్లతో మాట్లాడిన డోనల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్రంగా విమర్శించారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు అనవసరమని చెప్పారు.
''ఇజ్రాయెల్ ఎంతో కాలంగా హిజ్బొల్లాపై పోరాడుతోంది. ఈ పోరాటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మనం ఎవరికోసమైనా వెతుకుతున్నప్పుడు, ఆ మొత్తం ప్రాంతాన్ని ధ్వంసం చేయడం తెలివైన పని కాదు. ఎందుకంటే, అక్కడ పౌరులు కూడా నివసిస్తూ ఉంటారు. అక్కడ నివసించే వారందరూ హిజ్బొల్లాలు కాదు'' అని ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు.
అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని బెంజమిన్ నెతన్యాహుకు భారీ ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ గురించి కూడా అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ శాంతి ఒప్పందంతో బెంజమిన్ నెతన్యాహు అసౌకర్యంగా భావించే ఐదు కీలక అంశాలేంటో మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

ఫొటో సోర్స్, Getty Images
1. ఒప్పందంలో ఇజ్రాయెల్‌ను పక్కన పెట్టడం
ఇరాన్‌తో అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు రాజకీయంగా ఒక పీడకల.
ఈ ఒప్పందం నెతన్యాహు రాజకీయ జీవితంలోని మూడు మూలస్తంభాలను పెకిలించింది. దేశ భద్రత విషయంలో ఆయనను సరికొత్త సందిగ్ధ పరిస్థితిలోకి నెట్టివేసింది.
నెతన్యాహు తరచూ తనను తాను అమెరికాకు రాజకీయ మిత్రుడిగా, అమెరికా రాజకీయ నాయకులపై నిజమైన ప్రభావం ఉన్న నాయకుడిగా చిత్రీకరించుకున్నారు. కానీ, ఇరాన్ ఒప్పందం సమయంలో అమెరికా ఆయన్ను పక్కన పెట్టడమే కాకుండా బహిరంగంగా అవమానించింది.
''మనం లేకుండా ఇజ్రాయెల్ లేదు. నేను లేకుండా, అసలు ఇజ్రాయెల్ ఉండేది కాదు. ఎందుకంటే, నేను చేసినంత ఏ అమెరికా అధ్యక్షుడు వారికోసం చేయలేదు'' అని ట్రంప్ అన్నారు.
నెతన్యాహు సొంత లికుడ్ పార్టీలోని నలుగురు సభ్యులు, ఆయన సంకీర్ణ ప్రభుత్వంలోని అతివాద (ఫార్ రైట్) కేబినెట్ మంత్రుల ప్రకటనలు కూడా ఆయన ఎదుర్కొంటున్న ఒత్తిడిని వెల్లడిస్తున్నాయి.
''ట్రంప్ ఒప్పందానికి మేం కట్టుబడి లేము. మా భద్రతకు హామీ ఇవ్వని ఈ ఒప్పందానికి మేం భాగస్వాములం కాదు'' అని సోమవారం సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ అతివాద నేత, నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటామర్ బెన్-గ్విర్ రాశారు.
ఇరాన్‌తో అమెరికా ఒప్పందం ఒక చెడ్డ ఒప్పందంగా ఇజ్రాయెల్‌లోని ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక జెరూసలెం పోస్టు ఎడిటర్ జ్వికా క్లెయిన్ అన్నారు.
''చర్చల నుంచి మమ్మల్ని పక్కనపెట్టారు. లెబనాన్‌లో వెనక్కి తగ్గాలని చెప్పారు. మాకు సన్నిహిత భాగస్వామిగా చెప్పుకునే ట్రంప్ యంత్రాంగం, నాలుగు నెలలుగా మమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేయడానికి ఒక గంట ముందు మమ్మల్ని హెచ్చరించింది" అని జెరూసలెం పోస్టులో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
2. బలమైన స్థానంలో ఇరాన్
ఇజ్రాయెల్ భద్రతకు అతిపెద్ద ముప్పుగా ఇరాన్‌ను వర్ణిస్తున్నారు నెతన్యాహు. అమెరికాతో కలిసి ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులను ప్రారంభించింది ఇజ్రాయెల్. సుమారు వంద రోజుల పాటు ఈ దాడులు జరిగాయి.
ముందటేడాది కూడా తన భద్రత పేరుతో ఇరాన్‌తో ఇజ్రాయెల్ 12 రోజుల పాటు యుద్ధం చేసింది.
2023 అక్టోబర్ 7న దారుణమైన హమాస్ దాడుల తర్వాత.. ఇజ్రాయెల్ భద్రత విధానాన్ని ఆయన మరింత కఠినంగా మార్చారు. అంటే ముప్పులను నివారించడమే కాకుండా.. వాటిని పూర్తిగా నిర్మూలించే విధానాన్ని అవలంభించారు.
ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న ముప్పులను తొలగించడం ద్వారా మధ్యప్రాచ్యాన్ని సురక్షితంగా మార్చడమే ఆ సంక్షోభానికి ఆయన కనుగొన్న పరిష్కారం.
అయితే, ఇరాన్ బలమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్న తరుణంలో ఆ దేశంతో యుద్ధాన్ని ఎలా ముగించగలం? అన్నది ఇప్పుడు నెతన్యాహు ముందున్న అతిపెద్ద ప్రశ్న.
హిజ్బొల్లా, ఇరాన్ ప్రభుత్వంతో పదేపదే జరిగిన ఘర్షణలు ఇజ్రాయెల్ ప్రధాన శత్రువులను నిర్మూలించకపోగా, ఇరాన్లో మరింత అతివాద నాయకుల ఆవిర్భావానికి దారితీశాయి.
ఈ ఇరాన్ నాయకులు అమెరికా, ఇజ్రాయెల్ శక్తికి అంతగా భయపడరు. పైగా హార్ముజ్ జలసంధి సహాయంతో వారికి మరింత పట్టు కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
3. ఇజ్రాయెల్‌లో సార్వత్రిక ఎన్నికలు
మరికొన్ని నెలల్లో ఇజ్రాయెల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. లెబనాన్‌లో హిజ్బొల్లాపై దాడులు చేయడం ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా, ఇరాన్‌లు డిమాండ్ చేస్తున్నాయి.
ఒకవేళ ఇజ్రాయెల్ అలా చేస్తే.. ఇజ్రాయెల్ 'మిస్టర్ సెక్యూరిటీ'గా పేరున్న నెతన్యాహు తన రాజకీయ భవిష్యత్ ఏం కావాలి?
మరోవైపు గత ఐదేళ్లలో మూడు వేర్వేరు కేసుల్లో నెతన్యాహు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అవినీతి, మోసం, నమ్మకద్రోహం ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ ఆరోపణలను నెతన్యాహు ఖండించారు.
గత సంవత్సరం చివరిలో బెంజమిన్ నెతన్యాహు తనపై ఉన్న అవినీతి కేసుల విషయంలో దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను క్షమాభిక్ష ప్రసాదించమని లాంఛనంగా అభ్యర్థించారు.
న్యాయ ప్రక్రియ ఒక ముగింపుకు రావాలని తాను కోరుకుంటున్నప్పటికీ, అది "జాతి ప్రయోజనాలకు" మంచిది కాదని నెతన్యాహు ఒక వీడియో సందేశంలో తెలిపారు.
నెతన్యాహు దేశీయంగా తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ శత్రువైన ఇరాన్‌ను ఒక బలమైన శక్తిగా ఎదిగేందుకు దారితీసే ఈ ఒప్పందాన్ని ఆయన కోరుకోలేదు. ఎందుకంటే, ఎన్నికల్లో ఈ అంశాన్ని తన ప్రత్యర్థులు ఒక అదునుగా వాడుకోవచ్చు.

4. అణు కార్యక్రమంపై నిర్ణయం
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణకు ఇరాన్ అణు కార్యక్రమం ఇంకా ఒక ప్రధాన కారకంగానే ఉంది. దశాబ్దాలుగా ఇరాన్ అణు కార్యక్రమం తమకు మప్పు అని ఇజ్రాయెల్ వాదిస్తోంది.
ఇరాన్ శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి తాను తొందరపడటం లేదని ట్రంప్ అంటున్నారు.
మరోవైపు తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్‌ను అణ్వాయుధాలు సంపాదించడాన్ని అడ్డుకుంటానని నెతన్యాహు చెబుతున్నారు.
ఒప్పందంలోని ముసాయిదా ప్రకారం.. అణ్వాయుధాలను ఎప్పటికీ అభివృద్ధి చేయబోమని ఇరాన్ పునరుద్ఘాటించినప్పటికీ.. ఇరాన్ దగ్గర ఇప్పటికే ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలతో సహా కీలక అంశాలను తుది చర్చల కోసం ప్రస్తుతానికి పక్కనపెట్టారు.
అంటే.. ఈ విషయంలో యుద్ధానికి ముందు ఇరాన్ ఏ స్థానంలో ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉండనుంది. ఇరాన్‌పై దాడి తర్వాత కూడా ఈ విషయంలో పెద్దగా ఎలాంటి ఒత్తిడిని అమెరికా, ఇజ్రాయెల్‌లు తీసుకురాలేకపోయాయి.
కాల్పుల విరమణను పొడిగించడం, ఇరాన్ అణు కార్యక్రమంతో సహా కీలక అంశాలపై చర్చలను పునః ప్రారంభించడం లక్ష్యంగా జరుగుతున్న సంప్రదింపులలో ఇజ్రాయెల్ పాల్గొనడం లేదు.

5. ఇరాన్‌కు ఆర్థిక ప్రయోజనాలు
ఇరాన్-అమెరికా ఒప్పందపు ముసాయిదా పలు కీలకమైన ఆర్థిక అంశాలను కూడా సూచిస్తోంది.
వీటిలో ఇరాన్‌కు అమెరికా మినహాయింపులు ఇవ్వడం, దీనిద్వారా ఆయిల్, పెట్రోకెమికల్స్ ఎగుమతులను ఇరాన్ పునరుద్ధరించడం, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయడం, 300 బిలియన్ డాలర్ల వరకు విలువైన దీర్ఘకాలిక అభివృద్ధి విధానంపై చర్చించడం వంటివి ఉన్నాయి.
కచ్చితంగా ఇది ఇరాన్‌ను ఆర్థికంగా మెరుగైన స్థానంలో ఉంచనుంది.
ఇదిలా ఉండగా.. హార్ముజ్ జలసంధి గుండా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలిగించగలమని ఈ సంక్షోభ సమయంలో ఇరాన్ నిరూపించింది.
యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఇరాన్ శక్తి చెక్కుచెదరకుండా ఉంది.
ఇరాన్‌కు ఈ 300 బిలియన్ డాలర్ల నిధులు ఎలా అందుతాయో అమెరికా స్పష్టం చేయనప్పటికీ, ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసిన శత్రు దేశానికి అందనున్న ఈ 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ నెతన్యాహుకు ఏమాత్రం శుభవార్త కాదు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































