ఇరాన్‌తో చర్చలను క్లిష్టతరం చేసిన ట్రంప్, నెతన్యాహు ఫోన్ కాల్ కథేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెర్న్డ్ డెబుస్మాన్ జూనియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై నెతన్యాహుతో విభేదించినట్టు వార్తలు రావడంతో, డోనల్డ్ ట్రంప్ కూడా నెతన్యాహుతో విభేదించిన అమెరికా అధ్యక్షుల జాబితాలో చేరారు.
ఈ సైనిక చర్యలు వాషింగ్టన్, ఇరాన్ దౌత్య ప్రయత్నాలను సంక్షోభంలోకి నెట్టాయి.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా అమెరికాతో చర్చలను నిలిపివేస్తామని తెహ్రాన్ హెచ్చరించింది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నుంచి బయటపడాలని భావిస్తున్న ట్రంప్ ప్రయత్నాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది.
సోమవారం జరిగిన ఒక ఫోన్ కాల్లో నెతన్యాహును ట్రంప్ ‘పిచ్చివాడని’ దూషించారని, ఆయనకు కృతజ్ఞతా భావం లేదని ఆరోపించారని 'ఆక్సియోస్' వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది.
దీనిపై బుధవారం ప్రసారమైన 'పాడ్ ఫోర్స్ వన్' పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. "అవును, అన్నాను" అని ట్రంప్ అంగీకరించారు. "నాకు కోపం అని చెప్పలేను కానీ, లెబనాన్‌తో ఆయన నిరంతరం యుద్ధం చేయడం నాకు కొంత అసంతృప్తి కలిగించింది" అన్నారు.
అయితే, "నాకు బీబీ (నెతన్యాహు) అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నేను బాగా పని చేస్తాను" అని ట్రంప్ చెప్పారు.

నెతన్యాహుకు ఇది అలవాటే
ఇజ్రాయెల్ ప్రధానితో విభేదాలు వచ్చిన మొదటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే కాదు. వైట్ హౌస్ ఓపికను పరీక్షించడం నెతన్యాహుకు అలవాటే. ఆ వివాదాల నుంచి రాజకీయంగా ఎలా బయటపడాలో కూడా ఆయనకు బాగా తెలుసు.
తెహ్రాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరపడానికి, అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను పొడిగించడానికి, ట్రంప్ ఒక ఒప్పందాన్ని పరిశీలిస్తున్న తరుణంలోనే ఈ తాజా వివాదం తెరపైకి వచ్చింది.
ప్రపంచ నౌకాయానానికి అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలసంధిని తిరిగి తెరవడం కూడా ఈ చర్చలపైనే ఆధారపడి ఉంది.
అయితే, అమెరికాతో విభేదాలు ఉన్నాయనే వార్తలను నెతన్యాహు నవ్వుతూ కొట్టిపారేశారు.
" కుటుంబాలలో కూడా కొన్నిసార్లు ఇలాంటి వ్యూహాత్మక విభేదాలు రావడం సహజం. మేం ఎల్లప్పుడూ వాటిని పరిష్కరించుకునే మార్గాన్ని వెతుకుతాం, గొప్ప స్నేహితుల్లా కలిసి పనిచేస్తాం" అని బుధవారం సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో నెతన్యాహు పేర్కొన్నారు.
తాము 'ఉదయం విభేదించినా', మధ్యాహ్నానికల్లా ఒకే తాటిపైకి రాగలమని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని లక్ష్యాలపై దాడులు ప్రారంభించిన దాదాపు 100 రోజుల తర్వాత, అమెరికా, ఇజ్రాయెల్ సైనిక, రాజకీయ లక్ష్యాలు కలవకపోవడంపై వైట్ హౌస్ తీవ్ర అసంతృప్తితో ఉందనే విషయాన్ని ఈ ఫోన్ కాల్ సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"వాషింగ్టన్ ఏం చెబుతోందనే దాంతో సంబంధం లేకుండా, నెతన్యాహు తనదైన శైలిలో ముందుకు వెళ్లడం ఆయనకు పాత అలవాటే" అని క్రైసిస్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ గ్లోబల్ సిచ్యుయేషన్ రూమ్’ అధ్యక్షుడు, మాజీ దౌత్యవేత్త బ్రెట్ బ్రూయెన్ బీబీసీతో అన్నారు.
"ట్రంప్ ఆయనతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. కానీ, చంచల మనస్తత్వం కలిగిన నాయకుడితో కలిసి యుద్ధానికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే విషయంపై ఇప్పుడు ట్రంప్ ఓ కఠినపాఠాన్ని నేర్చుకుంటున్నారు" అని బ్రూయెన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్ ప్రయోజనాలు - అమెరికా వ్యూహాలు
సాధారణంగా, ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా లేదా కలిగి ఉండకుండా నిరోధించాలనే అమెరికా ప్రధాన లక్ష్యంతో నెతన్యాహు, ట్రంప్ ఇద్దరూ ఏకీభవిస్తారు.
అయితే, లెబనాన్ విషయంలో వీరి ప్రయోజనాలు కొంత భిన్నంగా ఉన్నాయి. అమెరికా-ఇరాన్ చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా సాయుధ దళాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. మరోవైపు, ఏ కాల్పుల విరమణ ఒప్పందంలోనైనా లెబనాన్‌ను కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది.
ఇజ్రాయెల్‌కు అమెరికా అందిస్తున్న సుదీర్ఘ మద్దతును వ్యతిరేకించే వారి సంఖ్య అక్కడి ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఏప్రిల్‌లో విడుదలైన ఒక ప్యూ రీసెర్చ్ పోల్ ప్రకారం... ప్రస్తుతం 60 శాతం మంది అమెరికన్లు ఇజ్రాయెల్‌పై వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. 2023లో హమాస్‌తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఈ వ్యతిరేకత 42 శాతంగానే ఉంది.
ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లేలా ట్రంప్‌ను ఒప్పించడంలో ఇజ్రాయెల్ పాత్ర ఉందంటూ కొందరు ప్రముఖ కన్జర్వేటివ్ లీడర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను వైట్ హౌస్, నెతన్యాహు ఇద్దరూ తిరస్కరించారు.
ఈ యుద్ధాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న వారిలో జో కెంట్ ఒకరు. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అధిపతిగా పనిచేసిన ఆయన, మార్చిలో తన పదవికి రాజీనామా చేశారు.
"ఇజ్రాయెల్ ఒత్తిడి, అమెరికాలోని దాని శక్తిమంతమైన లాబీ వల్లే మేం ఈ యుద్ధాన్ని ప్రారంభించాం" అని జో కెంట్ పేర్కొన్నారు.
కెంట్ రాజీనామాపై ఇజ్రాయెల్ అనుకూల లాబీ గ్రూప్ 'అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ' స్పందించింది. ఆయన "పాతకాలపు యూదు వ్యతిరేక (యాంటీ సెమిటిక్) భావాలను" ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించిన ఒక ప్రకటనను అది రీపోస్ట్ చేసింది.
ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో, అమెరికాలోని విమర్శకులను శాంతింపజేయడానికి నెతన్యాహుతో విభేదించడం ట్రంప్‌కు రాజకీయంగా కలిసివచ్చే అంశమని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
"ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొంత దూరం ఉన్నట్లు చూపించాల్సిన రాజకీయ అవసరం ప్రస్తుతం ఏర్పడిందని భావిస్తున్నా" అని మాజీ దౌత్యవేత్త బ్రూయెన్ అన్నారు.
"లెబనాన్ లేదా గాజా... ఈ రెండింటిలోనూ నెతన్యాహు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ట్రంప్‌కు, రిపబ్లికన్లకు కూడా రాజకీయంగానూ ఇబ్బందికరంగా మారాయి" అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
గత అధ్యక్షులతోనూ విభేదాలు
నెతన్యాహు ప్రవర్తన వల్ల గతంలో ఇతర అమెరికా అధ్యక్షులు కూడా అసంతృప్తికి గురయ్యారు.
నాడు ఓస్లో శాంతి ఒప్పందాల అమలు విషయంలో బిల్ క్లింటన్‌తో ఇజ్రాయెల్ ప్రధాని విభేదించిన సంగతి తెలిసిందే.
ఇక అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నెతన్యాహుకు అంత సత్సంబంధాలు ఉండేవి కావు. ముఖ్యంగా మార్చి 2015లో వైట్ హౌస్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా, ఇరాన్ విధానంపై అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి నెతన్యాహు ప్రసంగించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
అలాగే అమెరికా తమకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందకుండా ఆపుతోందని నెతన్యాహు ఆరోపించడంతో జో బైడెన్‌తో కూడా ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. నెతన్యాహు వ్యాఖ్యలు 'తీవ్రంగా కలచివేసేవిగా', 'ఎంతో నిరాశపరిచేవిగా' ఉన్నాయని వైట్ హౌస్ అధికారులు చెప్పారు.
"అమెరికా అధ్యక్షులతో ఆయనకు అత్యంత ఉద్రిక్తమైన సంబంధాలు ఉండేవి" అని వాషింగ్టన్‌లోని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్లో భారత్-అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల నిపుణుడు నాటన్ సాక్స్ చెప్పారు.
"ఆయనతో చర్చలు జరపడం చాలా కష్టం. కేవలం మొండిగా వ్యవహరించడమే కాదు, ప్రతి విషయాన్ని ఎంతో అనుమానంతో చూడటం ఆయన నైజం" అన్నారు.
గతంలో కూడా నెతన్యాహుపై ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది 12 రోజుల యుద్ధం తర్వాత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి, ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ముప్పు వాటిల్లింది. ఆ సమయంలో రిపోర్టర్ల ముందే కెమెరా సాక్షిగా ట్రంప్ అభ్యంతరకరమైన పదాలను కూడా ఉపయోగించారు.
అయినప్పటికీ, మొత్తంగా చూస్తే వీరిద్దరి మధ్య సంబంధాలు చాలావరకు సానుకూలంగానే సాగాయి. అమెరికా చరిత్రలోనే ఇజ్రాయెల్‌కు ట్రంప్ 'అత్యంత గొప్ప స్నేహితుడు' అని నెతన్యాహు పలుమార్లు కొనియాడారు.
"మధ్యప్రాచ్య వ్యవహారాలను నడిపే పాత పద్ధతులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా ట్రంప్‌ను నెతన్యాహు చూశారు" అని సాక్స్ అన్నారు.
"నెతన్యాహు ఆ విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలిగారు. ఇరాన్ కూటమిని సైనికంగా ఎదుర్కోవడంలో నియమాలు, అమెరికా-ఇజ్రాయెల్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చాలని ఆయన భావించారు" అన్నారు.
అయితే, వీరి మధ్య తాజాగా వచ్చిన ఈ విభేదాలు దీర్ఘకాలంలో ఆ దగ్గరి సంబంధాలను మారుస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.
"ఇది చాలా కీలకమైన పరిణామం కావచ్చు. ఇది కేవలం ఒకే ఒక్కసారి జరిగిన ఘటనా లేక భవిష్యత్తులో రాబోయే పెద్ద మార్పులకు సంకేతమా అనేది మనకు ఇంకా తెలియదు" అని భారత్-అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల నిపుణుడు నాటన్ సాక్స్ అన్నారు.
"కానీ, ఆ మార్పును మనం పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే అధ్యక్షుడు ట్రంప్ గతంలో చాలా మంది విషయంలో తన అభిప్రాయాలను మార్చుకున్నారు" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























