జంతర్ మంతర్ 2.0: ఈ నిరసనలకు ఎజెండాను ఎవరు నిర్దేశిస్తున్నారు, సీజేపీ తప్పటడుగులు వేస్తోందా?

ఫొటో సోర్స్, Reuters
గత వారం దిల్లీ అల్లకల్లోలంగా మారింది. ఈ అలజడి దేశంలోని అనేక ప్రాంతాలకూ పాకింది. ఈ నిరసనల నేపథ్యంలో దేశ రాజధానిలో మునుపెన్నడూ లేనంత భదత్రా ఏర్పాట్లు చేశారు.
సుమారు 30 వేల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు.
పోలీసులు ఆందోళనాకారులను బలవంతంగా ఈడ్చుకెళ్లి బస్సుల్లోకి ఎక్కిస్తున్న దృశ్యాలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి.
ఈ నిరసనలకు కేంద్ర బిందువుగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిలిచింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ వల్ల భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలకు ప్రయోజనం కలుగుతోందని ఈ పార్టీలు ఆరోపించాయి.
ఈ ఉద్యమాన్ని మూడు ప్రధాన శక్తులు కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, వామపక్ష సంఘాలు ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నిరసనలు ప్రభుత్వానికి సవాలు విసిరాయి. ఈ పరిణామాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.


గతంలో జరిగిన నిరసనలతో పోలిస్తే ఈసారి సీజేపీ ఉద్యమం ఎలా భిన్నంగా ఉంది? ఈసారి ఆందోళన ఒక నిర్ణయాన్ని లేదా ఒక వ్యక్తిని వ్యతిరేకించడానికే పరిమితం కాలేదు. ఎన్నికల వ్యవస్థనే ప్రశ్నించింది.
అయితే ఈ ఉద్యమం సామాన్య ప్రజలకు చేరువవుతోందా? ఈ పరిణామాల్లో సీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, వామపక్ష విద్యార్థి సంఘాల పాత్ర ఏంటి?
అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇకపై ఏం జరగబోతోంది? ఈ నిరసనల వల్ల ఎస్ఐఆర్ ప్రక్రియపై ఉన్నత స్థాయిలో పునరాలోచన చేస్తారా? లేక ఆందోళనలు, నిర్బంధాలు, రాజకీయ ఘర్షణలు జరిగినప్పటికీ డిమాండ్లు నెరవేరకుండానే మిగిలిపోతాయా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముఖేశ్ కుమార్, బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్, ది హిందూ రాజకీయ సంపాదకురాలు నిస్తుల హెబ్బర్తో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Reuters
దిల్లీ పోలీసుల వైఖరిపై ప్రశ్నలు
జంతర్ మంతర్ వద్ద జులై నెలలో జరిగిన నిరసనతో పోలిస్తే, ఈసారి పోలీసుల సన్నద్ధత, చర్యలు మరింత విస్తృతంగా, వేగంగా కనిపించాయి.
ఎలాంటి ఘటన జరగకుండా అడ్డుకోడమే పోలీసుల ప్రధాన లక్ష్యంగా కనిపించిందని ఈ నిరసనలను కవర్ చేసిన బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ ప్పారు.
"10వ తేదీ మధ్యాహ్నం మండీ హౌస్‌లో అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో ఎక్కడి నుంచో ఇద్దరు మహిళలు ఒక చిన్న ప్లకార్డు పట్టుకుని వచ్చారు. దానిపై ఏముందో కూడా మాకు సరిగ్గా చదవడం సాధ్యం కాలేదు. వారు ఐదో, పదో అడుగు వేసేలోపే డజన్ల కొద్దీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఒక బస్సు వచ్చింది. వారిని అందులోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. మొత్తం ఘటన మూడు, నాలుగు నిమిషాల్లో ముగిసిపోయింది. గరిష్ఠంగా ఐదు నిమిషాలు పట్టి ఉండొచ్చు" అని ఆయన వివరించారు.
ది హిందూ రాజకీయ సంపాదకురాలు నిస్తుల హెబ్బర్ కూడా ఈసారి పోలీసులు మరింత ముందస్తు ఏర్పాట్లతో ఉన్నారని అభిప్రాయపడ్డారు.
"నిరసనకారులు ఎక్కడా స్థిరపడకుండా చేయాలనే ఉద్దేశంతో వారు పూర్తిగా సిద్ధమయ్యారని అనిపిస్తోంది. గతంలో మాదిరిగా ఈ ఉద్యమం మరింత పెరగకుండా అడ్డుకోవాలనుకున్నారు. ఇండియా కూటమి నిరసనలో ఎవరినీ పెద్దగా కొట్టకపోవడం మీరు గమనించి ఉంటారు. అక్కడ పరిస్థితులను సులభతరం చేశారు. ఒకచోటికి వెళ్లొచ్చు, మరోచోటికి వెళ్లొచ్చు. రోడ్లపై పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ, అంతకు మించి ఏమీ జరగలేదు" అని ఆమె అన్నారు.
"ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందనే ఆరోపణే ఇప్పుడు ఒక ప్రధాన అంశంగా మారింది. దాని చుట్టూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మహిళల భద్రత వంటి అంశాలపై కూడా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఇందులో అసాధారణమైనదేమీ లేదు. అనేక నిరసనల్లో ఒక ప్రధాన అంశం ఉంటుంది. దాని చుట్టూ ఇతర అంశాలపై ఆందోళన చెందేవారు కూడా చేరుతారు" అని సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసన్ జైన్ చెప్పారు.
దిల్లీ పోలీసుల పనితీరుపై ఈ నిరసన అనేక ప్రశ్నలు లేవనెత్తిందని జుగల్ పురోహిత్ అన్నారు. గత నిరసనల్లో సాధారణ దుస్తుల్లో, ముఖాలు కప్పుకుని, గుర్తింపు బ్యాడ్జీలు లేకుండా అనేక మంది విధులు నిర్వహించడం కనిపించిందని చెప్పారు. ఈసారి కూడా అలాంటి పరిస్థితులే కనిపించాయని పేర్కొన్నారు. పెల్లెట్ గన్నుల వినియోగానికి సంబంధించిన అంశం కూడా ఇంకా పరిష్కారం కాలేదన్నారు.
"10వ తేదీకి ముందు జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన వారిపైనే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Manan VATSYAYANA / AFP via Getty Images
ప్రతిపక్ష ఎజెండా, నేహా బోరా పోరాటం
దిల్లీలో నిరసనలకు మూడు ప్రధాన సమూహాలు పిలుపునిచ్చాయి. అవి సీజేపీ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) నేతృత్వంలోని వామపక్ష సంఘాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి. వీటిలో ఉద్యమ ఎజెండాను నిర్దేశిస్తున్నది ఎవరు?
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యుడిగా నిలబెట్టాలన్న ప్రతిపక్ష ఎజెండా ఇప్పటికే స్పష్టమైందని నిస్తుల హెబ్బర్ అన్నారు. అయితే, నిరసనలను గౌరవప్రదంగా, సంతృప్తికరంగా ముగించడం ఒక పెద్ద సవాలని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా, తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చే పరిస్థితి లేనప్పుడు ఈ సమస్య మరింత క్లిష్టమవుతుందని చెప్పారు.
"ఇండియా కూటమి నిరసన సాగిన తీరు నాకు నచ్చింది. చివరకు అది సుప్రీంకోర్టులో ముగిసింది. వారు అక్కడో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి, న్యాయపరమైన ప్రక్రియను పూర్తిచేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాబట్టి ఈ వారాంతపు పరిణామాలను పరిశీలిస్తే ప్రతిపక్షానికి, నేహా బోరాకు మంచి మార్కులు ఇవ్వచ్చు. సీజేపీకి కొంచెం తక్కువ మార్కులు పడతాయి’’ అని ఆమె అన్నారు.

ఈ నిరసనలో మూడు వర్గాల మధ్య కొంత మేర ఐక్యత కనిపించిందని జుగల్ పురోహిత్ చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎస్ఐఆర్, ఎన్నికల సంఘాన్ని సమూలంగా మార్చిన చట్టం వంటి అంశాలపై ఈ మూడు వర్గాలూ ఒకే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. అయితే, వాటి కార్యాచరణలో మాత్రం ఆ ఐక్యతను సాధించలేకపోయారని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి సవాలు విసిరినప్పుడు దానిని కార్యాచరణ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని శ్రీనివాసన్ జైన్ అన్నారు. నిరసనకు పిలుపునిచ్చి, సవాలు విసిరిన తర్వాత క్షేత్రస్థాయిలో కనిపించకపోతే ప్రజలు ఖచ్చితంగా దాని గురించి ఆందోళన వ్యక్తం చేస్తారని చెప్పారు.
"నేహా బోరాకు ఇంత గుర్తింపు లభించడానికి కారణం ఆమె నిరంతరం చురుగ్గా ఉండటం, ప్రజలకు కనిపిస్తుండటమే. సీజేపీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించలేదు. కానీ నేహా 10వ తేదీన ప్రయత్నించారు, 11వ తేదీన కూడా ప్రయత్నించారు. అప్పటి నుంచి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ఆమెను అంగీకరించి ఆమెకు మాట్లాడే అవకాశం కల్పించింది" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Vipin KUmar/Hindustan Times via Getty Images
సీజేపీ నాయకత్వంపై సందేహాలు
సీజేపీ నాయకత్వ వ్యవహారశైలి, పనితీరు, దాదాపుగా కనిపించకుండా పోవడం వంటి అంశాలపై విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల్లో ఆ పార్టీ వెనుకబడుతున్నట్లు కనిపిస్తోందా?
"మొదట వీరు సమీకృతమైనప్పుడు, ఇది సామాజిక మాధ్యమాలకే పరిమితమైన ఒక పరిణామమని, క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వం భావించింది. కానీ పరిస్థితి తీవ్రత పెరిగి, చివరకు ఒక మంత్రి రాజీనామాను అంగీకరించాల్సిన స్థితి ప్రభుత్వానికి ఎదురైంది" అని శ్రీనివాస్ చెప్పారు.
"సీజేపీకి కొంత బలం ఉందన్నది స్పష్టం. ప్రజలను సమీకరించడం, ప్రభావితం చేయడం, ఒక సమూహాన్ని, ప్రేక్షక వర్గాన్ని ఆకర్షించడం వంటి సామర్థ్యాలు ఆ పార్టీకి ఉన్నాయి. బహుశా సీజేపీ కూడా వాటిని ముందుగా ఊహించి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ పార్టీని ప్రభుత్వం ఎంత తీవ్రంగా పరిగణిస్తోందంటే, దేశ రాజధాని మొత్తాన్ని మూసివేసే పరిస్థితి ఏర్పడింది. నిరసన తెలిపిన మరే ఇతర సమూహం కోసం ఇంతకుముందు ఇలా జరగలేదు.
"అయితే, ఇదే సమయంలో సీజేపీకి సంస్థాగత సామర్థ్యాలు కనిపించలేదు. ఆ పార్టీకి చెందిన ముగ్గురు నాయకులను నిర్బంధించినప్పుడు, వారి వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదు. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కూడా కనిపించలేదు. వామపక్ష సంఘాల వంటి ఇతర సమూహాలు మెరుగైన ప్రణాళికతో, సమన్వయంతో పనిచేశాయి. సంస్థాగతంగా సీజేపీకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అనుభవం కూడా తక్కువే" అని ఆయన అన్నారు.
"జులై 20న కూడా అభిజిత్ దీప్కే ఆరోగ్యం బాగాలేకపోవడంతో బహుశా ఒక ట్రక్కులో ఉన్నారు. ఆ సమయంలో సౌరభ్ దాస్, రంకా, జేపీ నడ్డా ఇంటి వద్ద ఉన్నారు. ఈ నిరసనలో పాల్గొన్న నా జర్నలిస్టులు కాని స్నేహితులు చాలామంది ఉద్యమం అకస్మాత్తుగా దిశానిర్దేశం లేకుండా పోయిందని చెప్పారు. వారిలో చాలామంది సామాజిక మాధ్యమాల్లో కూడా ఇదే విషయాన్ని రాశారు.
"రెండోసారి ప్రజలను నిరసనకు పిలిచే సమయానికి దిల్లీ సైనిక శిబిరంలా మారిపోయింది. ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేం ఈ విమానంలో వస్తున్నాం, ఈ విధంగా వస్తున్నాం అని వీడియో పెట్టి ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? మరో మాటలో చెప్పాలంటే, వచ్చి మమ్మల్ని అరెస్టు చేయండి అని బహిరంగంగా ఆహ్వానించినట్లయింది" అని నిస్తుల హెబ్బర్ అన్నారు.
"ఈ నాయకులను అరెస్టు చేసిన తర్వాత, వారిని నిరసనకు పిలిచినవారు నాయకత్వం ఎవరు వహిస్తున్నారో వెతకడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేహా బోరా ఐఎన్ఏ మార్కెట్ వైపు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించారు. అటూ ఇటూ పరుగులు తీశారు. నిరసన పేరుతో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ముగ్గురిని అరెస్టు చేశారు కాబట్టి, ఇక ఇంటికి వెళ్లిపోదామని అందరూ అనుకునే పరిస్థితి ఉండదు కదా.
"నిరసనకు వచ్చినవారందరికీ దారి చూపించడం మీ బాధ్యత. అందుకే ఇప్పుడు కొంతమందిలో సందేహాలు తలెత్తుతున్నాయి" అని చెప్పారు.

మీడియా, సామాజిక మాధ్యమాల అణచివేత
ఈసారి నిరసనల సందర్భంగా జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. వారిని ఈడ్చుకెళ్లి బస్సుల్లోకి ఎక్కించిన దృశ్యాలకు సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు నిరంతరం సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్నాయి. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న విచారణలోనూ ఈ అంశం ప్రస్తావనకు వస్తోంది.
నిరసనకారుల పోరాటానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనిజుగల్ పురోహిత్ చెప్పారు.
జర్నలిస్టులు ఫొటోలు తీయకుండా అడ్డుకోవడానికి పోలీసులు, ఇతర భద్రతా బలగాలు నిరసనకారులను పూర్తిగా చుట్టుముట్టేందుకు ప్రయత్నించాయని వివరించారు. జర్నలిస్టులు ఎటువైపు వెళ్లినా, ఫొటోలు తీయకుండా అడ్డుకునేందుకు పోలీసులు తమ షీల్డులను పైకెత్తేవారని చెప్పారు.
"ఇలాంటి దృశ్యాన్ని నేను మొదటిసారి చూశాను. అంతేకాదు, మైక్‌లో మాట్లాడుతున్నప్పుడు కొందరు మా చుట్టూ చేరి మైక్ ముందు నిలబడి ఈలలు వేయడం మొదలుపెట్టారు. అందరూ ఇదే చేశారు. మీరు మాట్లాడుతుండగా, మీ మైక్ ముందు 20 మంది నిలబడి ఈలలు వేస్తున్నారని ఊహించుకోండి. దానివల్ల మైక్ శబ్దానికి, ఆడియోకు అంతరాయం కలగవచ్చు. అంతేకాదు, మీరు చెప్పాలనుకుంటున్న విషయాలపై ఫోకస్ ఉండదు" అని ఆయన చెప్పారు.

"2014 నుంచి పత్రికా స్వేచ్ఛను ఒక్కొక్కటిగా అణచివేయడాన్ని చూస్తున్నాం. ఛానళ్లు, వార్తాపత్రికలు తమ సంపాదకీయ వైఖరినే పూర్తిగా మార్చుకునేలా మీడియా యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో జర్నలిస్టులను నిర్బంధించడం కూడా మొదలుపెట్టారు" అని శ్రీనివాసన్ జైన్ అన్నారు.
"కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల వంటి ఘర్షణాత్మక ప్రాంతాలను మినహాయిస్తే, నిరసనకారులకు, జర్నలిస్టులకు మధ్య తేడాను గుర్తించకుండా వ్యవహరించేంత స్వేచ్ఛను పోలీసులకు ఇవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. జర్నలిస్టులు తమ గుర్తింపు కార్డులు చూపిస్తున్నారు. మైకులు చూపిస్తున్నారు. అయినప్పటికీ, నా కళ్ల ముందే ఏడెనిమిది మంది జర్నలిస్టులను అత్యంత క్రూరంగా పట్టుకుని, దుర్భాషలాడి, వ్యాన్‌లోకి ఎక్కించారు.
"ఇది ఆందోళన కలిగించే కొత్త పరిణామం. జంతర్ మంతర్ వద్ద జరిగిన తొలి దశ నిరసన తర్వాత, ప్రభుత్వం గాయపడిన పులిలా మారింది. ఓటమిని అంగీకరించి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఎదురవడంతో, ఈసారి మరింత దూకుడుగా దాడి చేస్తోంది. ఇది మన మీడియా రంగంలోని వారందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయం" అని ఆయన అన్నారు.
అయితే, ఈ పరిస్థితి సంక్లిష్టమైనదని కూడా శ్రీనివాసన్ జైన్ పేర్కొన్నారు. ఎవరైనా మీడియా గుర్తింపు కార్డును తయారు చేసుకోవచ్చు, ఒక లోగో సృష్టించుకోవచ్చు, తమ ఫోన్లో వీడియోలు రికార్డు చేయడం ప్రారంభించవచ్చు. ఇలాంటి పరిస్థితులను నియంత్రించడం సవాలుతో కూడుకున్నదని చెప్పారు.
అయితే, ప్రభుత్వం ఈ సమస్యను శాంతిభద్రతలకు భంగం కలిగించే పెద్ద సమస్యగా చూపించాలని ప్రయత్నిస్తోందని, నిజానికి ఇదంత పెద్ద సమస్య కాదని ఆయన అన్నారు.
"ప్రధాన స్రవంతి మీడియా ఇప్పటికే ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయింది. కానీ సామాజిక మాధ్యమాల్లోని పెద్ద, చిన్న వేదికలు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాయి. అందుకే వాటిని నియంత్రించడానికి, అదుపులో పెట్టడానికి, మూసివేయడానికి ఈ పరిణామాలను ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు" అని శ్రీనివాసన్ జైన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























