జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ విమాన ప్రమాదం: ఇద్దరు అధికారులు, ఇద్దరు అగ్నివీర్‌వాయు సహా ఐదుగురు మృతి

జోర్హాట్‌, వాయుసేన, ఏఎన్-32 విమానం

ఫొటో సోర్స్, Avik

ఫొటో క్యాప్షన్, అస్సాంలోని జోర్హాట్‌లో వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం కుప్పకూలింది.
    • రచయిత, దిలీప్ కుమార్ శర్మ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ శనివారం ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో ఐదుగురు ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది మరణించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్) 'ఎక్స్' పోస్ట్‌లో ప్రకటించింది.

మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ (వాయు) ఖేమారామ్ కుమావత్, అగ్నివీర్ (వాయు) డానిష్ ఆలమ్ ఉన్నారు.

"ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ ఈరోజు జోర్హాట్‌లో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించడమైంది" అని ఐఏఎఫ్ 'ఎక్స్' పోస్టులో పేర్కొంది.

అంతకుముందు, జోర్హాట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఏఎన్-32 ప్రమాదానికి గురైనట్లు ఎయిర్‌ఫోర్స్‌ ప్రతినిధి వింగ్ కమాండర్ జయదీప్ బీబీసీ న్యూస్ హిందీకి ధ్రువీకరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అస్సాం, జోర్హాట్‌, వాయుసేన, ఏఎన్-32 విమానం

ఫొటో సోర్స్, @IAF_MCC

ఫొటో క్యాప్షన్, ఈ ఘటనలో ఇద్దరు అగ్నివీర్(వాయు)లు ఖేమారం కుమావత్ (కుడి), డానిష్ ఆలం (ఎడమ) మరణించారు.

ఎయిర్‌ఫోర్స్‌ ఏం చెప్పింది?

"స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్‌వాయు ఖేమారామ్ కుమావత్, అగ్నివీర్‌వాయు డానిష్ ఆలమ్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. బాధిత కుటుంబాలకు భారత వాయుసేన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలుస్తుంది" అని ఎయిర్‌ఫోర్స్‌ తెలిపింది.

ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏఎన్-32 విమానం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆవరణలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైందని, క్రాష్ అయిన తర్వాత అందులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది.

అయితే, ప్రమాదానికి గల ప్రధాన కారణం ఇంకా తెలియరాలేదు.

"ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, దర్యాప్తు కొనసాగుతున్నాయి. ప్రాథమిక విచారణ ఫలితాలు వెల్లడయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని ఐఏఎఫ్ అభ్యర్థిస్తోంది" అని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ తెలిపింది.

మరింత సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత వివరాలను పంచుకుంటామని ఎయిర్‌ఫోర్స్‌ తెలిపింది.

ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

"అస్సాంలోని జోర్హాట్‌లో జరిగిన ఏఎన్-32 ప్రమాదంలో ఐదుగురు ఎయిర్ వారియర్స్ మరణించడం నన్ను తీవ్రంగా కలచివేసింది" అని రాజనాథ్ సింగ్ ఎక్స్ పోస్టులో రాశారు.

"దేశం కోసం వారు చూపిన ధైర్యం, చేసిన సేవలను ఎల్లప్పుడూ గర్వంతో, కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ కష్ట సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుంది" అని తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా 'ఎక్స్'లో పోస్ట్ ద్వారా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.

"అస్సాంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమాన ప్రమాదంలో ఐదుగురు వీరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి సేవలకు, నిస్వార్థ త్యాగానికి మేం సెల్యూట్ చేస్తున్నాం. దేశం ఎల్లప్పుడూ వారికి, వారి కుటుంబాలకు రుణపడి ఉంటుంది" అని తెలిపారు.

ఏఎన్-32, వాయుసేన విమానం కూలడం, జోర్హాట్‌

ఫొటో సోర్స్, Avik

ఫొటో క్యాప్షన్, ఏఎన్-32 అనేది రెండు ఇంజిన్లు గల టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం, దీనిని మొదట సోవియట్ యూనియన్ (ప్రస్తుతం యుక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో) నిర్మించింది.

ఏఎన్-32 అంటే ఏమిటి?

ఏఎన్-32 అనేది ప్రాథమికంగా సోవియట్ యూనియన్ (ప్రస్తుతం ఉక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో) తయారు చేసిన రెండు ఇంజిన్లు గల టర్బోప్రాప్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్.

ఇది భారత వాయుసేనలో కీలకమైనది. సైనికులను ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలించడానికి, సహాయక సామగ్రిని చేరవేయడానికి, పారాట్రూపర్లను ఆకాశం నుంచి కిందకు దించడానికి దీనిని ఉపయోగిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)