సార్థక్,వేదాంత్, నిసర్గ్ : ఈ ముగ్గురు టీనేజర్లు ‘ఓఎస్ఎం వివాదం’పై ఏం చేశారు?

వేదాంత్, నిసర్గ్, సిద్ధాంత్

ఫొటో సోర్స్, ANI/@ni5arga/X

ఫొటో క్యాప్షన్, వేదాంత్, నిసర్గ్, సిద్ధాంత్
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షా పత్రాల మూల్యంకానానికి అనుసరించిన ఓఎస్ఎం విధానంపై తీవ్ర విమర్శలు రేగాయి.

ఓఎస్ఎం అంటే ఆన్‌స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్. ఇది ఒక డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్‌గా మూల్యాంకనం చేస్తారు. 12వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనానికి సీబీఎస్ఈ విధానాన్నే ఉపయోగించింది.

తక్కువ తప్పులతో, తక్కువ సమయంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను తెచ్చినట్టు సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.

అయితే 4 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ నుంచి తమ స్కాన్డ్ సమాధాన పత్రాలను కోరడంతో ఓఎస్ఎం వివాదం వెలుగులోకి వచ్చింది.

తమ సమాధాన పత్రాలు అస్పష్టంగా, ఖాళీగా లేదా మార్పులకు గురైనట్లు ఉన్నాయని పలువురు విద్యార్థులు ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సీబీఎస్ఈ

ఫొటో సోర్స్, Mayank Makhija/NurPhoto via Getty Images

ఈ వివాదం ముదరడంతో, దేశవ్యాప్తంగా విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా సమస్యను తమ చేతుల్లోకి తీసుకున్నారు.

అయితే, వీరిలో ముగ్గురు మాత్రం కొన్ని సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. దీంతో విద్యాశాఖ సీబీఎస్ఈ చైర్మన్‌ బదిలీ చేయడం లాంటి కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చింది.

అసలు ఈ ముగ్గురు టీనేజర్లు ఎవరు? వారేం చేశారు?

సార్థక్ సిద్ధాంత్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పార్లమెంటరీ కమిటీ ముందు తన వాదన వినిపించిన సార్థక్ సిద్ధాంత్

టెండర్ రూల్స్ మార్చారని బయటపెట్టిన సార్థక్ సిద్ధాంత్

సార్థక్ సిద్ధాంత్. 18 ఏళ్ల ఈ కుర్రాడు సీబీఎస్‌ఈ మార్కింగ్ విధానంలోని లోపాలపై 31 మంది ఎంపీల సమక్షంలో తన వాదనను వినిపించారు.

ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన సార్థక్, తన కోడింగ్,పరిశోధనా నైపుణ్యాల ద్వారా సీబీఎస్ఈ మూల్యాంకన విధానం, దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

టెండర్ నిబంధనలను పదేపదే మార్చడం ద్వారా జవాబు పత్రాల మూల్యాంకన కాంట్రాక్టును ఒక వివాదాస్పద కంపెనీకి సీబీఎస్ఈ ఎలా అప్పగించిందో సార్థక్ తన బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా రాశారు.

ఇంగ్లీష్‌లో రాసిన బ్లాగ్ పోస్టుకి 'కోఎంప్ట్ ఎడ్యుటెక్ కోసం సీబీఎస్ఈ నిబంధనలను ఎలా మార్చింది?' అనే శీర్షికను పెట్టారు.

హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రయోజనం కోసం వరుసగా మూడు టెండర్ రౌండ్లలో అర్హతలను, సాంకేతిక అవసరాలను పదేపదే ఎలా మార్చారో సార్థక్ వివరించారు. చివరికి ఈ టెండర్ కోఎంప్ట్‌ చేతికే వచ్చింది.

ఒక పెద్ద ప్రభుత్వ సంస్థ తన నియమాలను తిరగరాస్తూ.. పిల్లల భవిష్యత్తుతో ఎలా ఆడుకుందో ఈ కథ చెబుతుందని సార్థక్ రాశారు.

సార్థక్ కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా, తమకు కావాల్సిన వెండార్‌కు టెండర్‌ను కేటాయించడానికి అవకతవకలు ఎలా జరిగాయో పాయింట్ల వారీగా వివరిస్తూ టెండర్ కాలపట్టికను కూడా సిద్ధం చేశారు.

కోఎంప్ట్ కంపెనీ, సీబీఎస్ఈ ఈ ఆరోపణలను ఖంచినప్పటికీ.. అప్పటికే ఈ విషయం వెలుగులోకి వచ్చేసింది.

సోషల్ మీడియాలో సార్థక్ బ్లాగ్ వైరల్ అయింది.

తరువాత కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఆయన్ని పిలిపించింది.

సార్థక్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించారు.

పీటీఐ కథనం మేరకు ఈ సమావేశానికి సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, అలాగే విద్యాశాఖ, బోర్డుకు చెందిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే.. సీబీఎస్ఈ చీఫ్‌లు రాహుల్ సింగ్, సంజయ్ కుమార్‌ బదిలీ అయ్యారు. ఓఎస్ఎం సేవల కొనుగోలు వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు ఏక సభ్య కమిటీ ఏర్పాటైంది.

నిసర్గ్ అధికారి, ఎథికల్ హ్యాకర్

ఫొటో సోర్స్, @ni5arga/X

ఫొటో క్యాప్షన్, ఎథికల్ హ్యాకర్ నిసర్గ్ అధికారి

నిసర్గ్ అధికారి: లోపాలు ఎత్తిచూపిన ఎథికల్ హ్యాకర్

తానో ఎథికల్ హ్యాకరనని చెప్పుకునే నిసర్గ్ అధికారి.. ఓఎస్ఎం యూఆర్ఎల్‌ను తాను ఎలా హ్యాక్ చేయగలిగానో బీబీసీకి వివరించారు.

తాను సిస్టమ్ మాస్టర్ పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయడమే కాకుండా.. విద్యార్థుల రికార్డులు, పరీక్షల కాపీలు, ఎగ్జామినర్ల ఖాతాలవరకు యాక్సెస్ పొందగలిగానని చెప్పారు.

ఇంత తేలికగా యాక్సెస్ దొరికితే ఎవరైనా పరీక్షల కాపీలను తేలిగ్గా తారుమారు చేయగలరని, మార్కులను సవరించవచ్చని, ప్రజల ఫోన్ నెంబర్లను, బ్యాంకు వివరాలను యకూడా తెలుసుకోవచ్చని అధికారి చెప్పారు.

కోఎంప్ట్ కంపెనీ విద్యార్థుల సమాచారన్నంతటినీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్) లాంటి పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్ అప్‌లోడ్ చేసిందని, దీనిని ఎలాంటి ధ్రువీకరణ లేకుండా ఎవరైనా చూడవచ్చని తెలిపారు.

తాను కనుగొన్న దాదాపు ఆరు నుంచి ఏడు లోపాలను భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు (సీఈఆర్‌టీ-ఐఎన్) పలు ఈమెయిళ్ల ద్వారా నివేదించినట్లు అధికారి తెలిపారు. ఈ ఈమెయిల్స్‌ను బీబీసీ కూడా చూసింది.

ఈ హ్యాకింగ్ గురించి అధికారి తన ఎక్స్ ఖాతాలో కూడా సుదీర్ఘంగా రాశారు.

అయితే సీబీఎస్ఈ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అధికారి పేర్కొంటున్న యూఆర్ఎల్ కేవలం టెస్టింగ్ సైట్ అని, దానిలో అసలు డేటా లేదని బోర్డు సమర్థించుకుంది.

కానీ, కొన్ని రోజుల తర్వాత.. సీబీఎస్ఈ ఎక్స్ ఒక పోస్టు రాసింది. పబ్లిక్ డొమైన్‌పై వచ్చిన లోపాలపై నిఘా పెట్టామని, సిస్టమ్‌ను పకడ్బందీగా చేయడానికి ఐఐటీ నిపుణులు, అనుభవజ్ఞులైన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది.

వేదాంత్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో వేదాంత్

వేదాంత్ శ్రీవాస్తవ : జవాబు పత్రం మారిందన్నందుకు ట్రోలింగ్ గురైన విద్యార్థి

సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థి వేదాంత్ శ్రీవాస్తవ ఫిజిక్స్ సమాధాన పత్రం చుట్టూ పెద్ద వివాదం నడిచింది.

పునర్ మూల్యాంకన ప్రక్రియలో భాగంగా తాను డౌన్‌లోడ్ చేసుకున్న స్కాన్డ్ కాపీ తనది కాదని, మరొకరిదని వేదాంత్ ఆరోపించారు.

ఈ వివాదం తర్వాత.. చాలామంది వేదాంత్‌కు మద్దతు ఇచ్చారు. మరికొందరు ఆయన్ను ట్రోల్ చేశారు. కొందరైతే ఆయన్ను దేశద్రోహి అని కూడా పిలిచారు.

ఆ తర్వాత.. సీబీఎస్ఈ తన తప్పును ఒప్పుకుంటూ వేదాంత్‌కు సరైన జవాబు పత్రాన్ని పంపినట్లు తెలిపింది.

'' ఫిజిక్స్ ఫలితంపై వేదాంత్ సంతృప్తికరంగా లేడు. ఫిజిక్స్‌తో పాటు.. మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్‌ సమాధాన పత్రాల పునర్ మూల్యాంకన కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మేం స్కాన్డ్ కాపీ చూసినప్పుడు, ఫిజిక్స్ సమాధాన పత్రంతో ఆయన కాపీతో సరిపోలేదని గుర్తించాం'' అని వేదాంత్ సోదరుడు సిద్ధాంత్ శ్రీవాస్తవ వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.

ఈ విషయంపై సీబీఎస్ఈకి ఈమెయిల్ చేశానని, సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశానని, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశానని సిద్ధాంత్ చెప్పారు.

''మా పోస్టు బాగా వైరల్ అయింది. కానీ, చాలామంది మమ్మల్ని బాగా ట్రోల్ చేశారు. మమ్మల్ని పాకిస్తానీ అన్నారు. కొంతమంది న్యూస్ చానళ్ల యాంకర్లు ఎలాంటి నిజనిర్థరణ చేయకుండానే మమ్మల్ని పాకిస్తానీ అనడం ప్రారంభించారు’’ అని సిద్ధాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ కూడా స్పందించారు. 17 ఏళ్ల బాలుడు న్యాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించగా, బీజేపీ ఆయన్ను 'దేశద్రోహి' గా చిత్రీకరించిందని విమర్శించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)