ఇరాన్ చమురు విషయంలో, అమెరికా రాయితీతో భారత్‌కు లాభమా?

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

గత కొద్ది నెలలుగా ఇతరుల యుద్ధాలకు భారత్ మూల్యం చెల్లిస్తోంది.

2026 ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి తర్వాత భారత ఇంధన భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి.

అమెరికా ఒత్తిడి కారణంగా, భారత్ అనేక విధానాలు మార్చుకోవాల్సి వచ్చింది. హార్ముజ్ గుండా ముడిచమురు రవాణాకు అంతరాయం ఏర్పడటంతో భారత్ అనేక దశల్లో ఒత్తిడి ఎదుర్కొంది.

భారత్ ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలి, ఎవరి నుంచి కొనకూడదనే విషయంలో భారత్‌పై అమెరికా తరచుగా ఒత్తిడి చేయడం కూడా సమస్యగా మారింది.

భారత్ తన చమురు, సహజవాయువు అవసరాల కోసం దిగుమతుల మీద ఆధారపడుతోంది. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు, ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ ధరలు పెరిగాయి.

భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు, నాల్గో అతిపెద్ద ఎల్ఎన్‌జీ, రెండో అతి పెద్ద ఎల్‌పీజీ దిగుమతిదారు. దేశీయ ఇంధన పరిశ్రమ విషయానికి వస్తే, భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద శుద్ధి కర్మాగారం, శుద్ధి చేసిన పెట్రోలియంను ఎగుమతి చేసే ఐదో అతిపెద్ద దేశం.

కొన్నిరోజుల క్రితం వరకు భారత్ ఇంధన దిగుమతుల్లో అధిగ భాగం రష్యా నుంచి హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చేవి. అదే సమయంలో, శుద్ధి చేసిన ఉత్పత్తులు కూడా భారత్ నుంచి ఈ మార్గం ద్వారానే ఎగుమతి అయ్యేవి.

హార్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నప్పుడు, భారత్ ముడి చమురులో 45 శాతం, ఎల్‌ఎన్‌జీలో 50 శాతం ఎల్‌పీజీ దిగుమతులలో 90 శాతం దీని గుండానే వచ్చేవి.

ముడి చమురు విషయంలో భారత్ గతంలో ఇరాన్‌పై ఎక్కువగా ఆధారపడింది.

ఇటీవలి సంవత్సరాల్లో ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లపై కఠిన ఆంక్షలు విధించడంతో భారత్ చమురు దిగుమతుల కోసం ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ మీద ఆధారపడటం పెరిగింది.

భారత్‌కు అవసరమైన ఎల్ఎన్‌జీ సరఫరాలో అధిక భాగం ఖతార్, యూఏఈ, ఒమన్ నుంచి వస్తుండగా, ఎల్‌పీజీ సరఫరాలు ప్రధానంగా యూఏఈ, ఖతార్ కువైట్, సౌదీ అరేబియా, ఒమన్ నుంచి దిగుమతి అయ్యాయి.

నిషేధం ఉన్నప్పటికీ ఇబ్బందులు

2022 నుంచి రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకుంది. అయితే, మాస్కోపై అమెరికా ఆంక్షలు, గతేడాది ట్రంప్ సుంకాల బెదిరింపులతో రష్యా చమురు దిగుమతులపై భారత్ సమీక్షించుకోవాల్సి వచ్చింది.

మార్చిలో హార్ముజ్ జలసంధిని అకస్మాత్తుగా మూసివేసిన తర్వాత, ప్రత్యామ్నాయ మార్గాల కోసం భారత్ వేగంగా చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

ఇప్పుడు ఇరాన్ నుంచి ఇంధన దిగుమతుల విషయంలో అమెరికా 60 రోజుల పాటు మినహాయింపు ఇచ్చింది. దీని ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది?

"ఈ మినహాయింపు వల్ల భారత్‌కు ఇరాన్ ముడి చమురు పెద్దగా లభించదని భారతీయ రిఫైనరీలు, ప్రభుత్వ అధికారులు, మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ చమురు కోసం ఇతర కొనుగోలుదారుల నుంచి తీవ్రమైన పోటీ, ఇరాన్‌కు చెల్లింపుల విషయంలో ఆంక్షల విషయంలో భారత చమురు కంపెనీల అప్రమత్తత ఇందుకు ప్రధాన కారణాలు" అని ఎనర్జీ ఇంటెలిజెన్స్ తన నివేదికలో రాసింది.

"అమెరికా నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్లో సరఫరాలను సులభతరం చేయనుంది. దీని వల్ల భారత్‌కు తక్కువ ధరలు లేదా మెరుగైన ఎంపికల వంటి పరోక్ష ప్రయోజనాలు చేకూరవచ్చు. భారత్‌ ముడి చమురు కంటే ఎల్‌పీజీ రూపంలోనే ఇరాన్ నుంచి ఎక్కువ ఆశిస్తోంది. ఎందుకంటే, ఇది భారత్‌కు మరింత అవసరం" అని ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది.

భారత్ - ఇరాన్ సంబంధాలపై అమెరికా ఒత్తిడి

2022 ఏప్రిల్ 2025 సెప్టెంబర్ మధ్య రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు 33 శాతం పెరిగాయి.

చమురు మార్కెట్లలో ధరలను అదుపులో ఉంచడానికి, శుద్ధి చేసిన పెట్రోల్ ఉత్పత్తుల కొరతను నివారించడానికి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని యూరోపియన్ యూనియన్, బైడెన్ ప్రభుత్వం సమర్థించాయి.

ట్రంప్ ప్రభుత్వం పరస్పర సుంకాల విధానంలో భాగంగా భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించింది. 2026 ఫిబ్రవరిలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత సుంకాల్ని 18 శాతానికి తగ్గించారు. దీనికి ప్రతిగా భారత్ అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతామని హామీ ఇచ్చింది.

దౌత్య, వాణిజ్య పరంగా భారత్‌కు ఇరాన్ కీలక భాగస్వామి. భారత ఉత్పత్తులు మధ్య ఆసియా చేరడానికి ఇరాన్ మార్గంగా ఉంది. ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ నిర్మాణంలో భారత్ భాగస్వామిగా ఉంది. అయితే, అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు భారత్ - ఇరాన్ సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి.

ఇరాన్ విషయంలో భారత విదేశాంగ విధానం

"1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశ విదేశాంగ విధానాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. 1947 నుంచి 1990 వరకు ఉన్న మొదటి దశలో నెహ్రూ ప్రభావం బలంగా ఉండేది. ఈ కాలంలో భారత్‌ అలీన విధానాన్ని అవలంబించి మూడో ప్రపంచ దేశాలతో సహకారానికి ప్రాధాన్యత ఇచ్చింది" అని మిడిల్‌ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక తెలిపింది.

1991 నుంచి 2001 వరకు కొనసాగిన రెండో దశలో ఆర్థిక సంస్కరణలకు ప్రాధాన్యం లభించింది. ఈ కాలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పొరుగు దేశాలతో వివాదాల పరిష్కారం, ప్రపంచీకరణను వేగవంతం చేయడం భారత్ ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి.

మూడో దశలో 2001 నుంచి ఇప్పటి వరకు భారతదేశ విదేశాంగ విధానం వాణిజ్యం నుంచి భద్రత వైపు దృష్టి సారించింది. సైనిక శక్తి, రక్షణ సామర్థ్యానికి ప్రాధాన్యత పెరిగింది.

ఇరాన్ అనేక కారణాల వల్ల భారతదేశాన్ని ముఖ్యమైనదిగా పరిగణిస్తుంది. అందులో రెండూ ఆసియా దేశాలు కావడం, రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఒక కారణం.

భారత విదేశాంగ విధానం అనేక విధాలుగా ఇరాన్ విధానాన్ని పోలి ఉంటుంది. ఇరు దేశాలు అమెరికా ఏకపక్ష విధానాలను, ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థను వ్యతిరేకించాయి.

అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి భారత్‌కు చమురు దిగుమతులు తగ్గాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇరాన్ నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు 46 శాతం తగ్గాయి.

ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుకు చెల్లింపులు డాలర్లకు బదులుగా రూపాయలలో జరుగుతున్నాయి. భారత్ గతంలో మాదిరిగా అదే పరిమాణంలో ఇరాన్ చమురును దిగుమతి చేసుకోవడం కొనసాగించి ఉంటే, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 80 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసుకోగలిగేది అని మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఒక నివేదికలో రాసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)