50 డిగ్రీల వేడి, సాయుధ సంఘర్షణలను లెక్కచేయకుండా ఇరాన్ చమురును పాకిస్తాన్‌కు అక్రమ రవాణా చేస్తున్న ఈ స్మగ్లర్లు ఎవరు?

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

మజార్‌కు చెందిన చిన్నబైక్ అతను కూర్చోవడానికి కూడా వీలులేకుండా ప్లాస్టిక్ క్యాన్లతో నిండిపోయింది.అతని పాతబండిపై 70 లీటర్ల సామర్థ్యం కలిగిన 5 క్యాన్లు ఉన్నాయి. వాటి మొత్తం బరువు సుమారు 272 కేజీలు. బైక్‌కు రెండువైపులా తాళ్లతో కట్టిన ఆ చమురు క్యాన్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి.

పాకిస్తాన్‌లో అత్యంత పేద రాష్ట్రమైన బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ ప్రాంతంలో ఓ బహిరంగ ఇంధన మార్కెట్‌ నుంచి మజార్ ఈ పెట్రోల్ కొనుగోలు చేశాడు.

ఇరాన్ నుంచి అక్రమంగా సరిహద్దు దాటించి తీసుకొచ్చిన ఇంధనాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నింపిన పికప్ ట్రక్కులు, ఆ ఇంధనాన్ని మస్తుంగ్‌లోని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తుంటాయి.

ఇరాన్ నుంచి పాకిస్తాన్‌లోకి పెట్రోలియం ఉత్పత్తుల అక్రమ రవాణా దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇటీవలి నెలల్లో అది మరింత పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ఇంధన ధరలు పెరిగాయి.

దీంతో పాకిస్తాన్‌లో చౌకైన ఇరానీ అక్రమ పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ పెరిగింది.

50 డిగ్రీల ఎండ, క్యాన్లు పేలిపోయే ప్రమాదం

బలూచిస్తాన్‌లోని వేలాదిమంది స్మగ్లర్ల‌లానే మజార్ (భద్రత దృష్ట్యా పేరు మార్చాం) కూడా బహిరంగ మార్కెట్లకు, అనధికారిక పెట్రోల్ స్టేషన్లకు ఇంధనాన్ని తరలిస్తాడు.

అతడు పొరుగున్న ఉన్న సింధ్ ప్రావిన్స్‌కు ఇంధనం తీసుకువెళ్లడానికి భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన ఈ ప్రాంతం గుండా 350 కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.

బలూచిస్తాన్‌లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుతున్నాయి. దీనివల్ల ప్లాస్టిక్ ఇంధన క్యాన్‌లు ఉబ్బిపోతూ మెత్తబడిపోతాయి.

మజార్ బైక్ నడుపుతున్న సమయంలో అవి పగిలినా, లేదా మూతల నుంచి ఇంధనం లీకైనా మంటలు చెలరేగి పేలుళ్లకు దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి ఘటనల్లో తరచూ స్మగర్లు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇక్కడ ఇతర ప్రమాదాలు కూడా ఉన్నాయి.

స్వయం ప్రతిపత్తి కోరుతున్న తిరుగుబాటు వేర్పాటువాద బృందాలకు, పాకిస్తాన్ భద్రతా బలగాలకు మధ్య దశాబ్దాలుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేల మంది ప్రజలు అదృశ్యమయ్యారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

"మాకు మరో మార్గంలేకపోవడం వల్లే ఈ పని చేస్తున్నాం" అని మజార్ బీబీసీతో అన్నారు.

"వాతావరణం చాలా వేడిగా ఉంది. ధరలు ఎక్కువగా ఉన్నాయి. మేం రేయింబవళ్లు రోడ్డు మీదే గడుపుతున్నాం" అని ఆయన చెప్పారు.

స్మగ్లింగ్‌ కార్యకలాపాల ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలియనప్పటికీ, 2024లో జపాన్‌కు చెందిన పాకిస్తాన్ గూఢచార సంస్థలనుంచి లీకైన నివేదికను ప్రస్తావిస్తూ నిక్కీ ఆసియా ప్రచురించిన కథనంలో ప్రతి ఏటా సుమారు ఒక బిలియన్‌ డాలర్ల విలువైన ఇంధనం ఇరాన్‌ నుంచి పాకిస్తాన్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు అంచనా వేశారు.

సరిహద్దుల నుంచి అక్రమ పెట్రోలియం ఉత్పత్తుల ప్రవాహం పెరిగిందని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ ఏడాది మేలో పాకిస్తాన్‌లోని 5 ప్రధాన రిఫైనరీలు ప్రభుత్వాన్ని కోరుతూ ఒక లేఖ రాశాయి.

ఈ ఏడాది ఇప్పటి వరకు అధికారిక పెట్రోలియం అమ్మకాలు 27ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని, ఇందుకు ఇంధన అక్రమ రవాణా పెరగడం కూడా కారణమని పాకిస్తాన్ చమురు పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే ఆయిల్ కంపెనీస్ అడ్వైజరీ కౌన్సిల్ ఈ నెలలో ప్రభుత్వానికి లేఖ రాసింది.

ముప్పైల చివరలో ఉన్న మజారే ఓ పెద్ద కుటుంబానికి దిక్కు. అతనికి పలువురు సోదరులు, ఒక బిడ్డ ఉన్నారు.

కరవు కారణంగా వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో నాలుగు నెలల క్రితం తాను ఇంధన స్మగ్లర్‌గా మారినట్లు ఆయన చెప్పారు.

'ఆయిల్ అక్రమ రవాణానే ఆర్థిక వ్యవస్థకు మూలం'

సుమారు కోటి యాభై లక్షల జనాభా ఉన్న బలూచిస్తాన్‌లో 24 లక్షల మంది ఇరాన్‌-పాకిస్తాన్ మధ్య ఇంధన అక్రమ రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు నిక్కీ ఆసియా చూసిన లీక్‌డ్ పాకిస్తాన్ గూఢచార నివేదిక అంచనా వేసింది.

పాకిస్తాన్‌లో ఇంధన స్మగ్లింగ్ చట్టవిరుద్ధం. చిన్న కేసులైతే జరిమానా, వాహనాల జప్తు వంటి శిక్షలు, పెద్ద కేసులైతే జైలుశిక్ష విధిస్తారు.

అయితే తమ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నందున ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు ఇది కీలకమని బలూచిస్తాన్‌లోని క్వెట్టా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షుడు ఫిదా హుస్సేన్ దష్తీ వాదిస్తున్నారు.

ఇరాన్‌కు పశ్చిమాన, అఫ్గానిస్తాన్‌కు ఉత్తరాన ఉన్న బలూచిస్తాన్‌ పాకిస్తాన్ భూభాగంలో 44 శాతం విస్తీర్ణం కలిగి ఉన్నప్పటికీ, దేశ జనాభాలో కేవలం ఆరు శాతం మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు.

ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఇక్కడ పేదరికం ప్రపంచంలోని అత్యంత పేద ప్రాంతాలలో కొన్నింటికి సమానంగా ఉంది. ఇదే ఈ ప్రాంతంలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

"ప్రజలు నిస్సహాయంగా ఉన్నారు, వారికి వేరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ కృషి చేసి ఉండాల్సింది" అని దష్తీ అన్నారు.

ఎంఏ పట్టభద్రుడు కూడా చివరికి చమురు అక్రమ రవాణా మార్గాన్ని ఎంచుకున్నారు.

తనకున్న వైకల్యం కారణంగా వేరే ఏ పనీ చేయలేనని ఇర్ఫాన్ (భద్రత దృష్ట్యా పేరు మార్చడం జరిగింది) చెబుతున్నారు.

పోలియో సోకిన తర్వాత ఆయన కాలు, చేయి చచ్చుబడి పోయాయి.

ఇర్ఫాన్‌ కొన్ని నెలలుగా స్మగ్లింగ్ చేస్తున్నారు. పెట్రోల్ కంటే డీజిల్ సురక్షితమైనది, మండే అవకాశం తక్కువ కాబట్టి అతను దానిని రవాణా చేస్తున్నారు.

"నేను పెట్రోల్ తీసుకెళ్లలేను, ఎందుకంటే ఒకవేళ దానికి నిప్పు అంటుకుంటే? నేను నిలబడలేకపోతే మంటల్లో తగలబడి పోతాను" అని ఇర్ఫాన్ చెప్పారు.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఇంధనం అక్రమ రవాణా కార్యకలాపాల వెనుక ఉన్న రాజకీయాలు సంక్లిష్టమైనవి.

ఇరాన్- అమెరికా మధ్య శత్రుత్వానికి శాశ్వత ముగింపు పలకడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తున్నందున ఇది మరింత క్లిష్టంగా మారింది.

ఇంధన అక్రమ రవాణాపై అధికారులు అనేక సార్లు చర్యలు తీసుకున్నప్పటికీ, స్మగ్లింగ్ మళ్లీ పెరిగింది.

దీనిని పూర్తిగా ఆపడం చాలా కష్టం. ఎందుకంటే 900 కిలోమీటర్ల సరిహద్దులో మారుమూల ప్రాంతాల్లో పహారా కాయడం కష్టం.

అలాగే బలోచిస్తాన్‌లో అనేక మందికి ఈ వ్యాపారమే జీవనాధారమనే అవగాహన ప్రభుత్వంలో కూడా ఉంది.

రవాణా ఖర్చులు, భద్రతా సమస్యలు, చౌకైన అక్రమ ఇంధన పోటీ కారణంగా కొన్ని ప్రాంతాలకు ఆయిల్‌ కంపెనీలు అధికారికంగా ఇంధన సరఫరా చేయడం లేదు.

ఇంధనం అక్రమ రవాణాకు నేర ముఠాలే కారణమని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ ప్రజలకు రాయితీ మీద అమ్మే పెట్రోల్, డీజిల్‌ను వాళ్లు కొని అక్రమంగా తరలిస్తున్నారనేది తెహ్రాన్ వాదన.

"చమురు అక్రమంగా తరలించే స్మగ్లర్లు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్‌లో భాగమని లేదా దానితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. వారి లక్ష్యం అమెరికా ఆంక్షలను తప్పించుకోవడమే" అని అక్రమ మార్కెట్లను పర్యవేక్షించే 'గ్లోబల్ ఇనిషియేటివ్ ఎగైనెస్ట్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్'కు చెందిన ప్యాడీ గిన్ అన్నారు.

యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలను అవకాశంగా తీసుకుని ఇరాన్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న గ్రూపులు ఇప్పుడు మరింత ఇంధనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాయని తాను నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.

ఇంధన స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణ గురించి స్పందన కోసం బీబీసీ ఇరాన్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

'యుద్ధం మొదలైంది. అంతా సర్వనాశనమైంది'

లంచాలిస్తే పాకిస్తాన్ అధికారులు, భద్రతా దళాలు ఈ అక్రమ రవాణాను చూసీచూడనట్టు వదిలేస్తారని కొందరు స్మగ్లర్లు బీబీసీకి చెప్పారు.

ఇంధన స్మగ్లింగ్‌లో ప్రభుత్వ శాఖలు, అధికారుల ప్రమేయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఖండించింది.

ఇంధన స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని పాక్ ప్రధానమంత్రి ఆదేశించారని, గతేడాది భద్రతా బలగాలు సుమారు 1.3 బిలియన్ పాకిస్తానీ రూపాయల విలువైన ఇంధనాన్ని స్వాధీనం చేసుకున్నాయని పాక్ ప్రభుత్వం వెల్లడించింది.

యుద్ధం వల్ల తన వ్యాపార ఖర్చులు పెరిగాయని మజార్ అంటున్నారు.

అతను అక్రమంగా రవాణా చేసే పెట్రోల్ కోసం చెల్లించే ధర పెరిగింది. కానీ దాన్ని అమ్మే ధర మాత్రం మారలేదు.

పెట్రోల్, ఆహార ఖర్చులు, బైక్ లీజుకు తీసుకున్నాక ఆయన రోజుకు 5వేల పాకిస్తానీ రూపాయలు సంపాదించేవారు. కానీ అది ఇప్పుడు 3 వేల రూపాయలకు పడిపోయింది. ఇది పాకిస్తాన్ కనీస వేతనానికి దాదాపు రెట్టింపు.

"యుద్ధం మొదలైంది. మా జీవితం నాశనమైంది"అని ఆయన అన్నారు.

మస్తుంగ్‌ జిల్లా నుంచి తన స్వగ్రామం వైపు 11 మంది బైక్‌ రైడర్లతో కలిసి బయలుదేరిన మజార్‌ బృందాన్ని తీవ్రమైన వేడి గాలులు, దుమ్ము తుఫాను తాకాయి.

గాయాలు, మరణం సంభవించే ప్రమాదాల గురించి అడగినప్పుడు "నేను దాని గురించి ఆలోచించను" మజార్ అన్నారు.

‘‘నేను ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. ఇప్పుడే చనిపోచ్చేమో ఎవరికి తెలుసు? అది దైవ నిర్ణయం. నన్ను బతికించాలా, లేక తీసుకుపోవాలా అనేది ఆయన ఇష్టం’’ అని చెప్పాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)