ఇరాన్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నట్టుగా వచ్చిన కథనాలపై యూఏఈ, ఖతార్ ఏం చెప్పాయి?

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

అమెరికా ఆంక్షల కారణంగా స్తంభించిపోయిన బిలియన్ డాలర్లను విడుదల చేయడానికి ఇరాన్‌తో ఓ రహస్య ఒప్పందం కుదిరిందనే కథనాలను యూఏఈ ఖండించింది. అవి నిరాధారమైనవని పేర్కొంది.

బిలియన్ల కొద్దీ డాలర్ల విడుదలకు యూఏఈ అంగీకరించిందని, ఇప్పటికే 3 బిలియన్ల డాలర్లను విడుదల చేసిందని న్యూస్ఏజెన్సీ రాయిటర్స్ ఓ ప్రత్యేక కథనం అందించింది.

యుద్ధం ముగింపునకు అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు తుదిదశలో ఉన్నవేళ ఈ కథనం వెలువడింది. అమెరికా ఆంక్షల కారణంగా విదేశీ బ్యాంకులలో స్తంభించిపోయిన ఇరాన్ చమురు ఆదాయం విడుదల కూడా ఈ చర్చలలో భాగం కావచ్చని దౌత్యవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.

మరోపక్క ఖతార్ కూడా ఇరాన్‌తో రహస్య ఒప్పందం చేసుకుందనే కథనం వెలువడింది.

ఇరాన్ తమపై దాడి చేయకుండా తెహ్రాన్ నాయకత్వంతో ఖతార్ రహస్య ఒప్పందం చేసుకుందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే ఖతార్ దీన్ని కొట్టిపారేసింది. ఇది 'అబద్ధమని నమ్మదగినది కాదని' అంటూ ఇలాంటి కథనాల వల్ల మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు నష్టం జరుగుతుందని తెలిపింది.

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హార్ముజ్ వెళ్లే తమ నౌకలపై దాడులు చేయకుండా అనేక దేశాలు ఇరాన్‌తో 'రహస్య చర్చలు' జరుపుతున్నాయని కథనాలు వస్తున్నాయి.

హార్ముజ్ గుండా నౌకల రాకపోకల గురించి యూరోపియన్ దేశాలు తమతో చర్చిస్తున్నాయని ఇరాన్ పలు సందర్భాల్లో తెలిపింది. కానీ, ఈ విషయాన్ని స్వతంత్రంగా నిర్థరించే సమాచారం అందుబాటులో లేదు.

ప్రపంచ చమురు రవాణాలో 20శాతం హార్ముజ్ జలసంధి గుండా జరుగుతుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినప్పటి నుంచి ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసింది. తమ అనుమతి లేకుండా ఈ జలసంధి ద్వారా నౌకల రవాణా సాధ్యం కాదని ప్రకటించింది.

రాయిటర్స్ కథనంలో ఏముంది?

" మొత్తం 10 బిలియన్ డాలర్లను విడుదల చేసేందుకు యూఏఈ అంగీకరించింది. అందులో 3 బిలియన్ డాలర్లకు పైగా ఇప్పటికే విడుదల చేసింది" అని రాయిటర్స్ తన ప్రత్యేక కథనంలో తెలిపింది.

మొత్తం 20 బిలియన్ డాలర్లు ఇరాన్ ఆస్తులు స్తంభింప చేశారని, యూఏఈపై ఇరాన్ దాడులు చేయకుండా ఉండటానికి ప్రతిగా ఈ ఒప్పందం కుదిరిందని దీని గురించి బాగా తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పినట్లు రాయిటర్స్‌ తెలిపింది. ఇందులో 3 బిలియన్ డాలర్లు తొలి విడతగా ఇప్పటికే విడుదల చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తమతో చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.

అయితే ఆ నిధులు యుఏఈవా, లేక యూఏఈ బ్యాంకుల్లో చాలా కాలంగా స్తంభింపజేసిన ఇరాన్ ఖాతాల నుంచి విడుదల చేశారా, లేక మరెక్కడి నుంచైనా చేస్తున్నారా అనే దానిపై స్పష్టత లేదని రాయిటర్స్ రిపోర్ట్ తెలిపింది.

దీనిపై స్పందన కోసం రాయిటర్స్ సంస్థ వైట్‌హౌస్‌ను సంప్రదించింది. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అమెరికాతో ఒప్పందంపై సంతకం చేసినందుకు కానీ, చర్చలకు హాజరైనందుకు గానీ ఇరాన్‌కు ఎలాంటి నిధులు విడుదల చేయబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వాషింగ్టన్‌లో చెప్పారు.

ఒప్పందంలో ప్రతిపాదనలకు తెహ్రాన్ అంగీకరిస్తేనే ఆ దేశానికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి అని వాన్స్ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించలేదు.

ఇరాన్ దాడి చేయకుండా ఉండటానికే..

మొన్నటి వరకు యూఏఈపై ఇరాన్ దాడులు చేసింది. అయితే తాజాగా కుదిరిన ఒప్పందం రెండు దేశాల సంబంధాల్లో మార్పుకు సూచికని రాయిటర్స్ కథనం వెల్లడించింది.

"ఇరాన్ దాడుల వల్ల దుబాయ్‌లోని హోటళ్లు ఖాళీ అయ్యాయి. కొంతమంది నిపుణులు దేశం విడిచి వెళ్లారు. ప్రధాన వాణిజ్య కేంద్రంగా, సురక్షిత ప్రాంతంగా దుబాయికున్న ప్రతిష్ఠ దెబ్బ తింది" అని రాయిటర్స్ తన కథనంలో రాసింది.

"ఈ ఒప్పందం గురించి తెలిసిన మరొకరు చెప్పినదాని ప్రకారం యూఏఈ నిధులు విడుదల చేసినందుకు బదులుగా ఇరాన్ యూఏఈపై క్షిపణి, డ్రోన్ దాడులు నిలిపివేస్తుంది. రెండు దేశాల మధ్య రహస్య సమాచార మార్పిడి, ఆర్థిక సహకారంతో సంబంధాలు మెరుగుపడతాయి" అని ఆ కథనం పేర్కొంది

ఇలాంటి ఏర్పాటు కోస ఇరాన్ 'కనీసం మరో రెండు అరబ్ దేశాలను' కూడా సంప్రదించిందని ఆ కథనం వెల్లడించింది.

"యూఏఈపై నెల రోజుల క్రితం ఇరాన్ ప్రత్యక్షంగా దాడి చేసింది. మే 4న ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా ఓడరేవుపై దాడి చేసింది" అని రాయిటర్స్ నివేదిక తెలిపింది.

"ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొన్ని వారాల క్రితమే మొదలైనా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు అబుదాబీని సందర్శించిన తర్వాత గత వారం ఊపందుకున్నాయి. అక్కడ వారు యూఏఈ జాతీయ భద్రతా సలహాదారుషేక్ తహ్నూన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిశారు. ఆ తర్వాత యూఏఈ అధికారులు తెహ్రాన్‌లో పర్యటించారు. అక్కడ ఒప్పందానికి సంబంధించి ఇతర అంశాలపై చర్చించారు" అని తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని రాయిటర్స్ కథనం తెలిపింది.

సంక్లిష్టమైన ఆర్థిక నేపథ్యంతో యూఏఈ- ఇరాన్ ఒప్పందం ముందుకు సాగనుందని, ఇందులో దుబయ్ కీలక పాత్ర పోషిస్తుందని యూఏఈ రిపోర్ట్ తెలిపింది.దుబయ్ యూఏఈకి ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. ఆర్థికపరంగా తెహ్రాన్‌కు కీలకమైనది.

"దుబయ్ బ్యాంకులు ఇరాన్‌కు చెందిన నిధుల్ని చాలా కాలంగా స్తంభింపజేశాయి. అమెరికా ఆంక్షల వల్ల ఈ నిధులు ఆ బ్యాంకుల్లో పడి ఉన్నాయి. అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరానియన్ సంస్థలతో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికన్ ఫైనాన్షియల్ నెట్‌వర్క్ నుంచి బహిష్కరణను ఎదుర్కోవచ్చు" అని రాయిటర్స్ తన కథనంలో రాసింది.

ఖతార్‌తో పాటు ఇతర విదేశీ బ్యాంకులలోని ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిందని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు ఏప్రిల్ 11న చెప్పారు. అయితే అమెరికా అధికారి ఒకరు వెంటనే దీన్ని ఖండించారు.

యూఏఈ విదేశాంగశాఖ ఏం చెప్పింది?

స్తంభింపజేసిన నిధులను బదిలీ చేసినట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూ యూఏఈ విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది.

"ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవి, నిరాధారమైనవి. స్తంభింపజేసిన నిధులేవీ యూఏఈ విడుదల చేయలేదు. ఇందులో 3 బిలియన్ డాలర్ల బదిలీ కూడా అవాస్తవం" అని ఆ ప్రకటనలో తెలిపింది.

మీడియా సంస్థలు వార్తలు రాసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని, అధికారులను సంప్రదించాలని, నిరాధారమైన ఆరోపణలు ప్రచురించడం తగదని విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది.

యూఏఈ తీసుకున్నట్టు చెబుతున్న ఈ చర్య అమెరికా అమలు చేస్తున్న గరిష్ఠ ఒత్తిడి విధానాన్ని బలహీనపరుస్తున్నట్టుగా కనిపిస్తోందని రాయిటర్స్ కథనంపై ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్‌కు చెందిన పరిశోధకుడు మాక్స్ మెయిజ్లిష్ చెప్పారు.

'ఖతార్‌తో రహస్య ఒప్పందం'- వాషింగ్టన్ పోస్ట్

ఖతార్ తన రాస్ లఫాన్ గ్యాస్ కాంప్లెక్స్‌ను దాడుల నుంచి రక్షించుకోవడానికి ఇరాన్‌తో రహస్య చర్చలు జరిపిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం రాసింది.

మార్చి మధ్యలో ఖతార్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేశాక ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయువు ఉత్పత్తి కేంద్రమైన రాస్ లఫాన్ నుంచి దట్టమైన పొగలు కనిపించాయి.

ప్రపంచ గ్యాస్ సరఫరాలో సుమారు ఐదో వంతును అందించే ఈ ప్లాంట్‌లోని కొన్ని భాగాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. దీంతో చైనా, ఇతర దేశాలతో ఉన్న బిలియన్ల డాలర్ల ఒప్పందాలు ప్రమాదంలో పడ్డాయి.

అమెరికా, ఇరాన్‌ మధ్యవర్తిత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఖతార్ ఈ వివాదంలోకి రావడంతో యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది.

"యుద్ధం ప్రారంభంలో ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తి కేంద్రమైన రాస్ లఫాన్‌ను ఇరాన్ దాడుల నుండి రక్షించుకోవడానికి ఖతార్ తెహ్రాన్‌తో రహస్య ఒప్పందానికి రావడానికి ప్రయత్నించినట్లు సమాచారం ఉంది" అని వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది.

"రాస్ లఫాన్‌ను లక్ష్యంగా చేసుకోకపోతే, తామే గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేస్తామని ఖతార్ ప్రతిపాదించింది. దీనివల్ల ప్రపంచ ఇంధన ధరలు పెరిగి, యుద్ధాన్ని త్వరగా ముగించేలా అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఆర్థిక ఒత్తిడి పెరిగేది. ఖతార్‌కు ఇరాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీలు అందనప్పటికీ, యుద్ధం మొదలైన మూడో రోజే రాస్ లఫాన్‌లో ఉత్పత్తిని నిలిపివేశారు" అని ఆ నివేదిక పేర్కొంది.

"తరువాత తీసిన ఉపగ్రహ చిత్రాలలో నష్టం సంకేతాలేవీ కనబడలేదు. అయినప్పటికీ భద్రతాపరమైన ముప్పు వల్లే తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఖతార్ పేర్కొంది" అని వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది.

అయితే ఖతార్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించింది. ఇరాన్‌తో ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని, ఉద్యోగులు, మౌలిక సదుపాయాలు, ఇంధన సంస్థలను రక్షించడం కోసమే ఉత్పత్తిని నిలిపివేసే నిర్ణయం తీసుకున్నామని అది పేర్కొంది.

వాషింగ్టన్ పోస్ట్ నివేదికపై ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం ఒక ప్రకటనను జారీ చేసింది.

ఆ నివేదిక 'అసత్యమైనది, విశ్వసనీయత లేని సమాచారంపై ఆధారపడినది' అని అందులో పేర్కొంది.

"రాస్ లఫాన్ ఎల్ఎన్‌జీ కేంద్రం మూసివేతకు దారితీసిన నష్టాన్ని అతిశయోక్తిగా చూపుతూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన నివేదిక పూర్తిగా నిరాధారమైనది. యుద్ధం ప్రారంభమైన వెంటనే, కార్మికుల భద్రతకు ఇకపై హామీ ఇవ్వలేనందున ఎల్ఎన్‌జీ ఒప్పందాలపై ఫోర్స్ మేజర్ (ముందస్తు మూసివేత) ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఖతార్ అధికారులు స్పష్టం చేశారు. ఖతార్ సైన్యం ప్రమాదాన్ని అంచనా వేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు" అని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)