భారత్‌లో లక్షలమంది మర్చంట్ నేవీ ఉద్యోగులు, వీరి భద్రత ఎవరి బాధ్యత?

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

సముద్రంలో నావికుల భద్రత అంశాన్ని జి-7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

అమెరికా పేరు నేరుగా చెప్పనప్పటికీ, ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న నౌకలపై ఇటీవల అమెరికా సైన్యం జరిపిన దాడుల నేపథ్యంలో ఆయన మాట్లాడారు.

జూన్ 9న ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక సెట్టెబెల్లోపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు మరణించారు.

సెట్టెబెల్లోతో పాటు మరో రెండు భారతీయ నౌకలపై కూడా దాడులు జరిగాయి. అయితే వాటిలో ప్రాణనష్టమేదీ జరగలేదు.

వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న భారతీయ సిబ్బందిపై అమెరికా సైనిక దాడులు జరపడంపై భారత్‌లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మర్చంట్ నేవీ అంటే ఏంటి?

''మర్చంట్ నేవీ అనేది సముద్ర మార్గం ద్వారా సరకులను రవాణా చేసే వాణిజ్య నౌకలకు సంబంధించిన షిప్పింగ్ సర్వీస్. ఇది ఒక కాస్ట్ సెంటర్, అంటే ఇది లాభనష్టాలతో కూడుకున్న వ్యాపారం. అదే సమయంలో నేవీ అనేది ప్రధానంగా దేశ రక్షణ కోసం ఉంటుంది. అది మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లాగే భారత సైన్యంలో ఒక విభాగం'' అని చెప్పారు.

'మర్చంట్ నేవీ డీకోడెడ్' అనే ఎడ్యుటెక్ సంస్థను నడుపుతున్న ప్రణీత్ మెహతా స్వయంగా ఒక షిప్‌లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు.

మర్చంట్ నేవీ కార్యకలాపాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పర్యవేక్షిస్తుంది. ఇందులో వేర్వేరు విభాగాలు ఉంటాయి.

నౌకపై ఉండే జెండాకు అర్థమేంటి?

ఇండియన్ ఎక్సప్రెస్ కథనం ప్రకారం, భారత్ పతాకంతో ప్రయాణిస్తున్న 13 నౌకలు దాదాపు 100 రోజుల పాటు హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయాయి. ఇందులో 550 మంది భారతీయ నావికులు ఉన్నారు.

అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం గల్ఫ్ ప్రాంతంపై పడినప్పటి నుంచి 18 వేల మంది భారతీయ నావికుల భద్రత ప్రమాదంలో పడింది.

ఇండియాస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ గణాంకాల ప్రకారం దేశంలో 7.40 లక్షల మంది రిజిస్టర్డ్ నావికులు ఉన్నారు. వీరిలో 3,23,479 మంది నావికులు విధుల్లో ఉన్నారు. చైనా, ఫిలిప్పీన్స్ తర్వాత అత్యధిక సంఖ్యలో నావికులన్న దేశం భారత్.

ప్రపంచ నౌకా సిబ్బందిలో 17 శాతం మంది భారతీయులే. ప్రపంచంలోని ప్రతి ఐదుగురు నావికుల్లో ఒకరు భారతీయులు. అందువల్ల సముద్ర భద్రత, నావికులు, ఇతర సముద్ర సిబ్బంది రక్షణ భారత్‌కు అత్యంత కీలకమైన అంశం.

హార్ముజ్ సంక్షోభ సమయంలో దాడికి గురైన కొన్ని నౌకలు భారత పతాకంతో కాకపోయినా, భారతీయ సిబ్బందితో నడుస్తున్నవి ఉన్నాయి.

నౌకపై ఎగరేసే జెండా ఆ నౌక ఏ దేశంలో నమోదయ్యిందో తెలియజేస్తుంది. అయితే అది నౌక యజమాని లేదా సిబ్బంది ఏ దేశానికి చెందినవారో సూచించదు.

ప్రతి వాణిజ్య నౌక చట్టబద్ధమైన జాతీయతను పొందడానికి తప్పనిసరిగా ఏదో ఒక దేశ జెండా కింద నమోదు కావాలి.

దీని ఆధారంగానే ఆ నౌక ఏ చట్టాలను అనుసరించాలి, అందులో పనిచేసే సిబ్బందికి ఎలాంటి చట్టపరమైన రక్షణ లభించాలి అనే విషయాలను నిర్ణయిస్తారు.

ఇంటర్నేషనల్ మారిటైమ్ సంస్థ ప్రకారం, ఏ దేశ జెండా కింద నౌక నమోదై ఉంటుందో అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆ దేశానికే ఆ నౌకను రక్షించే హక్కు ఉంటుంది.

దేశ జెండా కింద నమోదు విధానం ఉండటానికి కారణం నౌకలు అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించడమే. అవి ఏ ఒక్క దేశ అధికార పరిధిలోనూ ఉండవు.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం, నౌకలకు తమ జాతీయతను, తమ దేశ జెండాను ఎగరవేసే హక్కును ఏ నిబంధనల ప్రకారం ఇవ్వాలనేది ప్రతి దేశం స్వయంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

అయితే నౌకల నమోదుకు సంబంధించి ఒక ఏకీకృత అంతర్జాతీయ వ్యవస్థేదీ లేదు.

భారత్‌లో నౌకల వివరాలు, యజమానుల అర్హతలు, సిబ్బంది నియామక సంస్థల పరిశీలన బాధ్యత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌దే.

అయితే నిబంధనల అమలులో సడలింపుల, జాప్యాల కారణంగా అనేక సంస్థలు నావికులను సముద్రంలోనే వదిలేస్తున్నాయని నౌకాయాన రంగం ఆరోపిస్తోంది.

ప్రమాదాల కారణంగా గాయాలు మరణాలు సంభవించినప్పుడు భారతీయ చట్టాల ప్రకారం భారత కోర్టుల్లో పరిహారం కోరే హక్కు సిబ్బందికి ఉంటుంది.

తమ జెండా కింద ప్రయాణించే నౌకలపై పరిపాలనా, సాంకేతిక అలాగే ఇతర అంశాల్లో సంబంధిత దేశాలకు నియంత్రణాధికార పరిధి ఉంటుంది.

నౌక భద్రత, కాలుష్య నియంత్రణ, సిబ్బంది నివాస, పని పరిస్థితులకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేయించడం నౌక మీదున్న జెండాకు చెందిన దేశ బాధ్యత.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఒక దేశ జెండా కింద నౌకను నమోదు చేయడం ద్వారా పన్ను మినహాయింపులు, ధ్రువీకరణలు, భద్రతా సౌకర్యాలు వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

దీన్నే ఫ్లాగ్ ఆఫ్ కన్వీనియన్స్ అని పిలుస్తారు. ఎక్కువ ప్రయోజనాలు అందించే దేశాలనే నౌకలు ఎంచుకుంటాయి. అందువల్ల చాలా వాణిజ్య నౌకలు కొన్ని దేఆశల కిందే నమోదవుతుంటాయి.

2023 సంవత్సరంలో అత్యధిక నౌకలు నమోదైన టాప్ ఎనిమమిది దేశాల జాబితాలో పనామా, లైబీరియా, మార్షల్ ఐలెండ్స్, హాంగ్ కాంగ్, సింగపూర్, చైనా, మాల్టా, బహామస్ ఉన్నాయి.

నావికుల భద్రతకు బాధ్యత ఎవరిది?

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌ ప్రకారం, నౌకలు ఎక్కువ సమయం అంతర్జాతీయ వాణిజ్యంలో నిమగ్నమై ఉంటాయి. అందువల్ల భద్రతా ధ్రువీకరణ పత్రాలు నిర్దిష్ట కాలానికి పునరుద్ధరించకపోయినా, నిర్వహణలో లోపాలు ఉన్నా, అలాగే భద్రతా ప్రమాణాలు, నిర్వహణ, సిబ్బంది అమల్లో ఉన్న నిబంధనలను పాటిస్తున్నారా అనేది నిర్ధరించేందుకు వివిధ నౌకాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించడం అవసరం.

నౌకాశ్రయాల్లో జరిగే ఈ పర్యవేక్షణను పోర్ట్ స్టేట్ కంట్రోల్ అని పిలుస్తారు.

నాణ్యతలేని నౌకలను తొలగించడం, సముద్రాలను పరిశుభ్రంగా ఉంచడం పోర్ట్ స్టేట్ కంట్రోల్ ప్రధాన లక్ష్యం.

దీనిలో భాగంగా ఏ నౌకాశ్రయంలోనైనా నాణ్యతలేని నౌకలను గుర్తించి, అవసరమైన అప్‌గ్రేడేషన్ చేయాలని ఆదేశించిన తర్వాతే వాటిని ప్రయాణానికి అనుమతిస్తారు.

నావికులను పట్టించుకోకుండా వదిలేయడం, అంటే నౌక యజమాని తన సిబ్బందికి జీతాలు, ఆహారం, నివాసం, వైద్య సదుపాయాలు, స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన రవాణా వంటి అన్ని రకాల సహాయాన్ని నిలిపివేయడంలాంటి ఘటనలు జరుగుతుంటాయి.

దీంతో వారు నౌకపైనా లేదా విదేశీ నౌకాశ్రయంలో చిక్కుకుపోతారు. దాన్ని 2006 సముద్ర కార్మిక ఒప్పందం ప్రకారం నౌక యజమాని ప్రాథమిక బాధ్యతల ఉల్లంఘనగా పరిగణిస్తారు.

కొన్నిసార్లు సముద్రాల్లో షాడో ఫ్లీట్‌ను ఉపయోగిస్తారు. అక్రమ సరుకులను రవాణా చేయడానికి, గుర్తింపును తప్పించుకోవడానికి మోసపూరిత పద్ధతులు ఉపయోగించే నౌకలను ఈ పదంతో సూచిస్తారు.

ముగ్గురు భారతీయ నావికులు మరణించిన పలావు జెండా ఉన్న నౌక కూడా ఆంక్షలను తప్పించుకుంటూ ఇరాన్ చమురును తరలిస్తున్న 'షాడో ఫ్లీట్‌'లో భాగమే.

షాడో ఫ్లీట్‌కు చెందిన ట్యాంకర్లు నిషేధిత నౌకాశ్రయాల్లోకి ప్రవేశించే సమయంలో లేదా సముద్రంలో అక్రమ నౌక నుంచి అధికారిక నౌకకు సరుకు బదిలీ చేసే సమయంలో ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థలను నిలిపివేయడం, తారుమారు చేయడం ద్వారా గుర్తింపును తప్పించుకుంటాయి.

అంతర్జాతీయ చట్టాలేం చెబుతున్నాయి?

నావికుల భద్రతకు సంబంధించిన ప్రధాన అంతర్జాతీయ చట్టాల్లో మారిటైమ్ లేబర్ కన్వెన్షన్, సోలాస్ 1974 (SOLAS- Safety of Life at Sea) కన్వెన్షన్, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం ఉన్నాయి.

మారిటైమ్ లేబర్ కన్వెన్షన్‌ను అంతర్జాతీయ సముద్ర చట్టాల నాలుగో స్తంభంగా, నావికుల హక్కుల పత్రంగా పరిగణిస్తారు. ఇది కార్మికులుగా వారికి ప్రాథమిక హక్కులతో పాటు జీవనం, పని పరిస్థితులకు కనీస అంతర్జాతీయ ప్రమాణాలను కల్పిస్తుంది.

సముద్రంలో ప్రాణ భద్రతపై అంతర్జాతీయ ఒప్పందమైన సోలాస్ (1974) కన్వెన్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య నౌకలపై పనిచేసే సిబ్బంది భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.

భారత్ ఈ ఒప్పందంపై సంతకం చేసింది.

ప్రపంచ సముద్రాలు, మహాసముద్రాల వినియోగం, వాటిలో ప్రయాణానికి సంబంధించిన నియమాలను నిర్దేశించే అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం. సముద్ర కార్యకలాపాలకు సంబంధించి దేశాల హక్కులు, బాధ్యతలను ఇది నిర్దేశిస్తుంది.

అంతర్జాతీయ జలాలు అంటే ఏ ఒక్క దేశం అధికారంలోగానీ నియంత్రణలోగానీ లేని ప్రాంతాలు.

ఈ ప్రాంతాలు ఏ దేశ తీరప్రాంతం నుంచైనా 200 నాటికల్ మైళ్లు, అంటే సుమారు 370 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంటాయి. ఈ జలాల్లో నౌకాయానం, చేపల వేట వంటి కార్యకలాపాల విషయంలో అన్ని దేశాలకు సమాన హక్కులు ఉంటాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)