ఆదివారం బ్యాంకులు తెరచి ఉంటాయన్న మెసేజ్ మీకు కూడా వచ్చిందా? అసలేం జరుగుతోంది

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
దేశంలోని బ్యాంకుల అతిపెద్ద సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను ప్రకటించింది.
నాలుగు ప్రధాన డిమాండ్లతో పిలుపునిచ్చిన ఈ సమ్మెతో బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
అయితే, బ్యాంకు ఖాతాదారులకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదివారం బ్యాంకులు తెరవాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఏడు బ్యాంకు సంఘాలకు, దాదాపు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెబుతోంది.
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని యూనియన్లు అంతకుముందే హెచ్చరించాయి.
బ్యాంకింగ్ రంగంలోని దాదాపు 90 శాతం మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు యూనియన్లు పేర్కొంటున్నాయి.
ఆదివారం బ్యాంకులు తెరవాలనే విషయంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని ఫోరమ్ స్పష్టం చేసింది.
యూఎఫ్‌బీయూ 'ఎక్స్' వేదికగా విడుదల చేసిన ఒక ప్రకటనలో "వేర్వేరు బ్యాంకులు రకరకాల ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మా పోరాటం తీవ్రమవుతోందని, మా ఐక్యత బలపడుతోందని మాకు తెలుసు. ఎందుకంటే మా సమ్మె విజయవంతం అవుతుందని వారికి తెలుసు. ఐబీఏ, బ్యాంకు యాజమాన్యాలు నిరాశతోనే ఈ చర్యలు తీసుకుంటున్నాయి" అని పేర్కొంది.

ప్రధాన డిమాండ్ - ఐదు పని దినాలు

ఫొటో సోర్స్, ANI
బ్యాంక్ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం అనేది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అతిపెద్ద డిమాండ్. ప్రస్తుతం ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాల్లో బ్యాంకులు మూతపడుతున్నాయి. సాధారణంగా ఒకటి, మూడు, అవసరమైతే ఐదో శనివారం బ్యాంకులు పనిచేస్తున్నాయి. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని యూనియన్లు కోరుతున్నాయి.
బ్యాంకింగ్ రంగంలో మునుపటి కంటే ఇప్పుడు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని బ్యాంక్ ఉద్యోగులు చెబుతున్నారు. అందుకే బ్యాంకుల్లో వారానికి ఐదు పని దినాలు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
యూఎఫ్‌బీయూ ముందు ఉంచిన డిమాండ్లలో పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) ఒక కీలక అంశం. పీఎల్‌ఐ పథకంలో మార్పులు తీసుకురావాలని, దీనిపై ద్వైపాక్షిక చర్చలు జరపాలని వారు కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఇతర బకాయిల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ప్రస్తుత పీఎల్‌ఐ పథకం నిబంధనలు సరిగా లేవని బ్యాంకు సంఘాలు చెబుతున్నాయి. ఉద్యోగులందరికీ సమాన ప్రయోజనం చేకూర్చకుండా, ఇవి అనవసరమైన పోటీని, పని ఒత్తిడిని సృష్టిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
ఈ సమ్మె వల్ల దాదాపు రూ.2,000 కోట్ల వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలో ఏటీఎం, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం, భారతీయ బ్యాంకుల ప్రతినిధి సంఘం 'ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్' (ఐబీఏ) ఈ డిమాండ్‌ను అంగీకరించి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపింది. కానీ, రెండేళ్లకు పైగా గడుస్తున్నా ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగులు వారానికి ఆరు రోజులు పనిచేయాల్సి వస్తోంది. వేతన ఒప్పంద చర్చల సందర్భంగా వారానికి ఐదు పని దినాలకు ఐబీఏ అంగీకరించిందని, శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించేందుకు సమ్మతించిందని యూనియన్లు తెలిపాయి. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని, ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని ఫోరమ్ డిమాండ్ చేస్తోంది.

ఫొటో సోర్స్, ANI
యూనియన్ నాయకులు ఏమంటున్నారంటే..
ఈ విషయంపై ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సెక్రటరీ రూపమ్ రాయ్ బీబీసీతో మాట్లాడారు.
''2015లో నెలలో రెండో, నాలుగో శనివారం సెలవు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. భవిష్యత్తులో అన్ని శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయని అప్పట్లో చెప్పారు. 2020 సమయంలో కొత్త ఒప్పందం జరగాల్సి ఉంది. కానీ, అప్పుడు కోవిడ్ సమయం కావడంతో, ఆ సమయంలో దీన్ని అమలు చేస్తే తప్పుడు సంకేతం వెళుతుందని చెబుతూ ఈ ప్రతిపాదనను వాయిదా వేశారు'' అన్నారు.
ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామని బ్యాంకు యాజమాన్యాలు చెప్పాయని, కానీ ప్రభుత్వం దీన్ని వాయిదా వేస్తూ వస్తోందని ఆయన అన్నారు. ఇదే సమయంలో పబ్లిక్ బ్యాంకింగ్ రంగంలో పని ఒత్తిడి బాగా పెరిగిపోయిందని రూపమ్ రాయ్ చెబుతున్నారు.
"ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఒక ఉద్యోగి 2000 నుంచి 2200 మందికి సేవలు అందిస్తుండగా, ప్రైవేట్ బ్యాంకుల్లోని ఉద్యోగులు సగటున 350 నుంచి 400 మందికి సేవలు అందిస్తున్నారు" అన్నారు.
''ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియామకాలు జరగడం లేదు. కానీ, పని భారం మాత్రం పెరుగుతూనే ఉంది. దీంతో ఉద్యోగుల కుటుంబ జీవితం ప్రభావితం అవుతోంది. బ్యాంకింగ్ రంగంలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. భారతీయ కుటుంబాల్లో ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. దీంతో వారిపై ఒత్తిడి మరింత పెరుగుతోంది'' అన్నారు.
''పురుష ఉద్యోగులపై కూడా ఒత్తిడి ఉంది. పైగా ఉద్యోగులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తుంటారు. దీంతో ఇబ్బందులు మరింత పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానమే ఉంది. స్వయంగా ఆర్బీఐలో సైతం వారానికి ఐదు పని దినాలే ఉంటాయి. ఎల్‌ఐసీలోనూ వారానికి ఐదు రోజులే పనిచేస్తారు'' అని రూపమ్ రాయ్ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
పీఎల్ఐ అంశం
పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) అనేది మరో కీలక అంశం. ఇన్సెంటివ్‌ను ఏ ఒక్కరికో వ్యక్తిగతంగా కాకుండా, మొత్తం బ్యాంకు పనితీరు ఆధారంగా ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు చెబుతున్నారు. వ్యక్తిగత ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల అనవసరమైన పోటీ, పని ఒత్తిడి పెరుగుతాయి.
''బ్యాంకు పనితీరు ఆధారంగానే పీఎల్‌ఐ ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు కోరుకుంటున్నారు. వ్యక్తిగత పనితీరుపై కాదు'' అని రూపమ్ రాయ్ స్పష్టం చేశారు.
పీఎల్‌ఐ విధానాన్ని 2020 వేతన ఒప్పందం కింద ప్రారంభించారు. ఆ తర్వాత సీనియర్ బ్యాంకు అధికారుల కోసం ప్రభుత్వం సవరించిన పీఎల్‌ఐ పథకాన్ని బ్యాంకు అధికారుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
సవరించిన పీఎల్‌ఐలో గ్రేడ్ 4, ఆపై స్థాయి అధికారులను మాత్రమే చేర్చారు. కింది స్థాయి అధికారులను దీని నుంచి మినహాయించారు. ఇన్సెంటివ్‌ల పంపిణీ విషయంలో దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
ఈ బ్యాంకు సమ్మె ఎందుకు కీలకమంటే..
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఈ సమ్మె జరిగే సమయం చాలా కీలకం. సెప్టెంబర్ 30వ తేదీ బ్యాంకుల అర్ధ వార్షిక ఖాతాల ముగింపు (క్లోజింగ్) తేదీ. ఈ సమయంలో ఖాతాల వివరాలు సరిచూసుకోవడం, ప్రొవిజనింగ్, ట్రెజరీ, మార్కెట్ సంబంధిత పనులు చాలా కీలకం.
వారాంతం ముగిసిన వెంటనే వరుసగా మూడు రోజుల పాటు సమ్మె జరగడం వల్ల భారీ స్థాయిలో పనులపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. దీని ప్రభావం బ్యాంకు శాఖలపై, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలపై అత్యధికంగా ఉంటుంది.
నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్ క్లియరెన్స్, ఖాతాలకు సంబంధించిన పనులు, ఇతర బ్రాంచ్ స్థాయి సేవలకు తీవ్ర అంతరాయం కలగవచ్చు.
అయితే, దీని అర్థం బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోతుందని కాదు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా పనిచేసే అవకాశం ఉంది.
ఖాతాదారులు తమ ముఖ్యమైన పనులను సమ్మెకు ముందే పూర్తి చేసుకోవాలని, సమ్మె సమయంలో డిజిటల్ మాధ్యమాలు, ఏటీఎంలను వినియోగించుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు సూచించాయి.
ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరిగే సమ్మెకు ముందు సెప్టెంబర్ 27న తెరుచుకుంటాయి.
దీనికి కారణముంది. ఒకవేళ ఆదివారం బ్యాంకులు తెరవకపోతే, వారాంతం పూర్తయిన వెంటనే ఖాతాదారులు వరుసగా మూడు రోజుల సమ్మెను ఎదుర్కోవాల్సి వచ్చేది.
దీనివల్ల బ్యాంకింగ్ సేవలకు వరుసగా ఐదు రోజుల పాటు అంతరాయం కలిగే అవకాశం ఉండేది.
అందువల్ల, సమ్మెకు ముందే ఖాతాదారులు తమ ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవడానికి అదనంగా ఒక రోజు లభించేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏర్పాటు చేసింది.
సెప్టెంబర్ 27న బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు పూర్తిగా పనిచేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది.
కానీ, సెప్టెంబర్ 27ను నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద పని దినంగా ప్రకటించారా లేదా అనేది స్పష్టంగా లేదని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలిపింది. అలాగే, ఆ రోజు అన్ని రకాల బ్యాంకింగ్ పనులు జరుగుతాయా లేదా ఏటీఎంలలో నగదు నింపడం, కరెన్సీ చెస్ట్‌ల వినియోగానికి మాత్రమే అనుమతి ఉంటుందా అనే విషయాలపై కూడా స్పష్టత లేదని పేర్కొంది.
వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ పని దినాల ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉందని, నిర్ణయం తీసుకునే ముందు పలు కోణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈలోగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల సన్నాహాలు ప్రారంభించింది. ఏటీఎంలలో తగినంత నగదు ఉంచాలని, సమ్మె సమయంలో అత్యవసర సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, సెప్టెంబర్ 27వ తేదీ (ఆదివారం) అన్ని ప్రభుత్వ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. ఆ రోజున అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు పూర్తిగా పనిచేసేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది.
ఐదు పని దినాల వెనుక యూనియన్ల వాదన
ప్రభుత్వ బ్యాంకుల పెరుగుతున్న లాభాలు, ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడి అంశాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ లేవనెత్తింది.
తక్కువ మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ బ్యాంకుల వ్యాపారం, లాభాలు పెరుగుతున్నాయని, అదే సమయంలో బ్యాంకు సిబ్బందిపై పని ఒత్తిడి నిరంతరం పెరుగుతోందని ఫోరమ్ 'ఎక్స్'లో పెట్టిన ఒక పోస్ట్‌లో పేర్కొంది.
ఈ సంఘం వివరాల ప్రకారం, 2020లో ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం 26 వేల కోట్ల రూపాయలు కాగా, 2026 నాటికి అది సుమారు 7.6 రెట్లు పెరిగి 1.98 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.
బ్యాంకు ఉద్యోగులు అందిస్తున్న సేవలకు గాను వారికి తగిన గౌరవం, గుర్తింపు దక్కాలని, మెరుగైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లభించాలని ఆ పోస్ట్‌లో స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























