Aliens-UFO: ఇవి నిజమా, కాదా - సీక్రెట్ డాక్యుమెంట్స్‌ బయటపెట్టిన అమెరికా

ఏలియన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షీలా ఫ్లిన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఆరుబయట బట్టలు ఆరేస్తున్న సమయంలో ఆకాశంలో ఏదో గుర్తు తెలియని వస్తువు ఒకటి ఎగురుకుంటూ రావడాన్ని తాను చూసినట్లు ఒక మహిళ తన కూతురికి చెప్పారు.

అసలు అదేంటి, అందులో ఏముంది అన్నది తెలుసుకోవాలని కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమె కూతురు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టెక్సస్‌లో ఉంటున్న ఓ థెరపిస్టుకు కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి అనుభవం ఉంది.

టెక్సస్‌కే చెందిన 36 ఏళ్ల సంగీత విద్వాంసుడు సొంతూరికి దగ్గర్లో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత గ్రహాంతరవాసుల గురించి పరిశోధిస్తున్నారు.

"యూఎఫ్ఓ కమ్యూనిటీ" మాదిరిగానే వాళ్లందరూ కూడా అమెరికా ప్రభుత్వం చరిత్రాత్మక ఘట్టంగా చెబుతున్న దాని కోసం వేచి చూశారు. అవే.. మునుపెన్నడూ, ఎవరూ చూడని యూఎఫ్ఓ ఫైళ్లు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యూఎఫ్ఓ, గ్రహాంతర వాసులు, ఎగిరే పళ్లాలు, అమెరికన్ ప్రభుత్వం, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, US Department of Defense

ఫొటో క్యాప్షన్, 1969లో అపోలో 12 మిషన్ సమయంలో చంద్రుడి మీద నుంచి కనిపించిన దృశ్యం. ఇందులో నీలి రంగులో గుర్తు తెలియని వస్తువుని జూమ్ చేసి చూపించడం జరిగింది.

వెలుగులోకి రహస్య సమాచారం

ఆకాశంలో ఎగురుతూ వచ్చే గుర్తు తెలియని వస్తువుల గురించిన ఫోటోలు, వివరాలున్న 162 డాక్యుమెంట్లను ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది. వీటిని గతంలో ఎవరూ చూడలేదు.

పారదర్శకతలో ఇది మరో ముందడుగని, మనకు తెలియని ప్రపంచం గురించి ఈ పత్రాలు సమాధానాలు అందిస్తాయని ఔత్సాహికులు భావిస్తున్నారు.

"ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించడంలో గత పాలకులు విఫలమయ్యారు. మేము విడుదల చేసిన పత్రాలు, వీడియోలను చూసి ఏం జరుగుతుందో ప్రజలు తమకు తామే నిర్ణయించుకోవచ్చు. ఎంజాయ్ చేయండి" అని ఈ డాక్యుమెంట్లను విడుదల చేసిన తర్వాత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన సోషల్ అకౌంట్ ట్రూత్‌లో ఈ మెసేజ్ పోస్ట్ చేశారు.

ఈ డాక్యుమెంట్లు, చిత్రాలతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ శుక్రవారం ఒక కొత్త వెబ్‌సైట్ ప్రారంభించింది.

అయితే ఆ వెబ్‌సైట్‌లో సమాచారానికి సంబంధించి ఏ విధమైన ముగింపు లేదా వ్యాఖ్యలు రాయలేదు. "మాకిచ్చిన పని పరిధిని దృష్టిలో ఉంచుకుని కొత్త సమాచారాన్ని కనుక్కుని విడతల వారీగా కొన్ని వారాల పాటు విడుదల చేస్తాము" అని రాసింది.

"ఇక్కడ భద్రపరిచిన పత్రాలన్నీ పరిష్కారం కాని కేసులకు సంబంధించినవి. అంటే వీటి గురించి ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయింది" అని అందులో రాశారు.

"ప్రైవేటు రంగంలో వీటిని విశ్లేషించే వారికి, సమాచారం, నైపుణ్యం ఉన్న వారు ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు" అని వెబ్‌సైట్ ప్రకటించింది.

యూఎఫ్ఓ, గ్రహాంతర వాసులు, ఎగిరే పళ్లాలు, అమెరికన్ ప్రభుత్వం, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Courtesy of John Erik Ege

ఫొటో క్యాప్షన్, జాన్ ఎరిక్ ఎగే యువకుడిగా ఉన్నప్పటి నుంచి యూఎఫ్ఓల గురించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

ఔత్సాహికులు ఏమన్నారు?

ఈ విషయంలో "తనకు ఆసక్తి ఉందని" టెక్సస్‌లోని మ్యూచువల్ యూఎఫ్ఓ నెట్‌వర్క్ ప్రాంతీయ డైరెక్టర్ జాన్ ఎరిక్ ఎగే చెప్పారు.

"ఇది సరైన దిశలో వేసిన అడుగు అని నేను అనుకుంటున్నాను" అని చిన్నప్పటి నుంచి ఈ వ్యవహారాన్ని ఫాలో అవుతున్న ఎగే అన్నారు.

‘‘వాళ్లేమీ దాచరని అనుకుంటున్నాను. కానీ వాళ్లు ఇప్పుడు బయటపెడుతున్న విషయాలు మనకు ఎప్పటినుంచో తెలిసినవే."

‘‘ఇది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం" అని ఎగే అన్నారు. ప్రస్తుతం థెరపిస్టుగా పని చేస్తున్న ఆయన, చిన్నతనం నుంచే యూఎఫ్ఓల గురించి తెలుసుకుంటున్నారు.

"ఇందులో కొత్తగా ఏమీ లేదు. వాళ్ల దగ్గర గ్రహాంతరవాసుల శరీరాలు ఉన్నట్లు, వాళ్లతో మాట్లాడినట్లు ఆధారాలేమీ లేవు. అయినప్పటికీ మనం సరైన దిశలో వెళుతున్నామని అనుకుంటున్నా" అని ఎగే చెప్పారు.

శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఫైళ్లలో దశాబ్ధాల నాటి మిలటరీ మెమోలు, అపోలో మిషన్‌కు సంబంధించిన నివేదికలు, గ్రహాంతరవాసులు ఉన్న యూఎఫ్ఓలను చూసినట్లు చెప్పిన వ్యక్తుల చెప్పిన వివరణలు ఉన్నాయి.

అందులో సంచలన విషయాలేమీ లేవు. గ్రహాంతర జీవుల గురించి ఎలాంటి నిర్థరణ లేదు. అయితే గుర్తు తెలియని వస్తువుల గురించి తాము అధ్యయనం చేశామని అమెరికన్ ప్రభుత్వం అంగీకరించింది.

ఇది తమను అంతగా ఆకట్టుకోలేదని, అయితే సగటు పాఠకులకు ఇది కొత్తగా అనిపిస్తుందని అనేకమంది యుఫాలజిస్టులు, యూఎఫ్ఓ ఔత్సాహికులు ముందుగానే భావించారు.

"ఇవి కేవలం యూఎఫ్ఓ కమ్యూనిటీ కోసమే కాదు. పారదర్శకత గురించి అమెరికన్లకు భరోసా ఇచ్చేందుకే" అని 25వేలకు పైగా సభ్యులున్న యూఎఫ్ఓ నెట్‌వర్క్ ఫేస్‌బుక్ పేజ్‌ నిర్వహకుడు ఎగే, సహ నిర్వహకుడు డేనియల్ జోన్స్ చెప్పారు.

"తొలి విడత ఫైళ్లలో అంత ముఖ్యమైన విషయం ఏమీ ఉండకపోవచ్చు" అని తాను అనుకున్నానని అయితే భవిష్యత్‌లో విడుదల చేసే పత్రాలలో ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత కోరుకుంటున్నట్లు గతేడాది జరిగిన యూఎఫ్ఓ వేడుకల్లో పాల్గొన్నజోన్స్ చెప్పారు.

యూఎఫ్ఓ, గ్రహాంతర వాసులు, ఎగిరే పళ్లాలు, అమెరికన్ ప్రభుత్వం, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, ఏలియన్స్ స్కాట్లాండ్‌ను సందర్శిస్తుంటారని కొంతమంది భావిస్తున్నారు.

ప్రభుత్వ సమాచాారం నిరుత్సాహపరిచిందా?

ఎలైన్ లొపెరెనా (69) కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. యూఎఫ్ఓల గురించి ప్రభుత్వం విడుదల చేసిన సమాచారాన్ని శుక్రవారం ఉదయం ఆమె తన వంటగదిలో నిలబడి ట్యాబ్‌లో పరిశీలించారు.

జీవితాంతం తాను యూఎఫ్‌ఓ గురించి పరిశోధనల్లో మునిగి తేలుతున్నప్పటికీ, ప్రభుత్వం విడుదల చేసిన సమాచారంలో ఆశ్చర్చం కలిగించే అంశం ఏదీ కనిపించలేదని చెప్పారు.

ఆమె చిన్నతనంలో ఉండగా, ఆమె తల్లి యూఎఫ్ఓను చూశానని చెప్పారు. అప్పటి నుంచి యూఎఫ్ఓ అంటే ఏంటి, అందులో ఏముంటుందిలాంటి ప్రశ్నలకు అప్పటి నుంచి సమాధానాల కోసం ఎదురు చూస్తున్న లొపెరెనా, ప్రభుత్వం విడుదల చేసే సమచారం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

"ట్రంప్‌ దీని గురించి ప్రకటిస్తారని నాకు తెలుసు. మొదటి నుంచి నేను దీని గురించి చెబుతున్నా" అని కాలిఫోర్నియా రాష్ట్రంలోని క్లోవిస్‌లో నివసిస్తున్న లొపెరెనా అన్నారు.

"ఆయన చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారని మీకు తెలుసు. ఆయనకు అహం ఎక్కువని కూడా తెలుసు. అయినప్పటికీ ఆయన తన మాటకు కట్టుబడి ఉన్నారు. ఈ ప్రక్రియను మొదలు పెట్టారు" అని ఆమె అన్నారు.

యూఎఫ్ఓల గురించి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నవారిలో ఒత్తిడి పెరుగుతోందని ఆమె చెబుతున్నారు. గ్రహాంతర జీవుల గురించి ఆసక్తి ఉన్న వారితో ఏర్పాటైన ఫేస్‌బుక్ పేజ్ నిర్వహకురాలిగా ఆమెకు దీని గురించి బాగా తెలుసు.

ఆమె మూడేళ్ల కిందట ఈ గ్రూపులో చేరినప్పుడు 40వేల మంది సభ్యులుండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య లక్షకు చేరింది. "కేవలం కొన్ని నెలల్లోనే ఈ సంఖ్య పెరిగింది" అని ఆమె చెప్పారు.

"ఇందులో ప్రత్యేకత ఏంటంటే దీనిని దాచిపెట్టడం కష్టం. సైన్యంలో పని చేస్తున్నప్పుడు వీటి గురించి తెలుసుకున్న వారి పాత ఇంటర్వ్యూలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వారు తాము చూసిన వాటి గురించి చెప్పారు" అని ఆమె చెప్పారు.

"ఇప్పుడు దీని ప్రవాహం మొదలైంది. ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి" అని లొపెరెనా చెప్పారు.

యూఎఫ్ఓ, గ్రహాంతర వాసులు, ఎగిరే పళ్లాలు, అమెరికన్ ప్రభుత్వం, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, war.gov/ufo/

తర్వాత ఏం జరగనుంది?

శుక్రవారం విడుదల చేసిన ఫైల్స్ సముద్రంలో నీటి చుక్కలాంటిదని, ఇంకా వెలువడాల్సిన సమాచారం చాలా ఉందని జోన్స్ మాదిరిగానే లొపెరెనా భావిస్తున్నారు.

"ఇదంతా క్రమ పద్దతిలో చేయాలి" అని ఆమె చెప్పారు. ఒక విషయం ఉందని నమ్ముతున్న దాని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పూర్తిగా నిజమే చెప్పాలని ఆమె భావిస్తున్నారు.

అమెరికాలో రాజకీయ విభేదాల కారణంగానే ట్రంప్ ప్రభుత్వం ఈ ఫైళ్లను విడుదల చేస్తుంటే ప్రజలు వాటిని నమ్మరని ఆమె అన్నారు.

నమ్మినా, నమ్మకున్నా, మీరు యుఫాలజిస్ట్ అయినా కాకపోయినా శుక్రవారం విడుదలైన ఫైళ్లు కచ్చితంగా సంచలనం రేపాయనీ, మరిన్ని ఫైళ్ల కోసం తాను ఎదురు చూస్తున్నట్లు ఎగే చెప్పారు.

"గతంలో అనేకమంది అధ్యక్షులు ఈ పని చేద్దామని అనుకున్నారు. అయితే వాళ్లు దీన్ని అడ్డుకున్నారా లేదా వద్దులే అనుకున్నారా అనేది నాకు తెలియదు" అని ఆయన అన్నారు.

అయితే దీని గురించి ట్రంప్ ఆందోళన చెందడం లేదని తాను భావిస్తున్నానని చెప్పారు.

ఈ సమాచారం ఎవరు విడుదల చేసినా యూఎఫ్ఓ కమ్యూనిటీలో కొంతమంది దీనిపై సందేహపడతారు.

ఈ కమ్యూనిటీలో సర్వే చేస్తే "దాదాపు 20శాతంమంది ఇది బూటకపు ప్రచారం అని, తప్పుదారి పట్టిస్తున్నారని చెబుతారు" అని ఎగే అభిప్రాయపడ్డారు.

"వాళ్లలో ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని నమ్మరని అనుకుంటున్నా. గ్రహాంతరవాసులు మన మధ్య నివసిస్తున్నారు. ప్రభుత్వం వాళ్లతో ఒప్పందం చేసుకుందని కొంతమంది భావిస్తున్నారు" అని ఎగే చెప్పారు.

శుక్రవారం విడుదల చేసిన ఫైళ్లను అనేకమంది విశ్లేషించారు.

"విడుదల చేసిన చిత్రాలలో దృశ్యాలను కుదించారు. అందులో లోపాలున్నాయి. వాటి పరిమాణం, సందర్భం సరిగ్గా లేదు. వాటిని గుర్తించడం కష్టంగా ఉంది" అని యూఎఫ్ఓ గ్రూపు సభ్యుడొకరు మెసేజ్ చేశారు

"వాటిలో కొన్ని ప్రత్యక్షంగా చిత్రీకరించినవి కాకుండా, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పునర్నించినవిగా కనిపిస్తున్నాయి" అని ఆయన తన సందేశంలో రాశారు.

"ఇది నిజాన్ని బయట పెట్టడం మాదిరిగా కాకుండా, డ్రామాలా కనిపిస్తోంది" అని ఆయన తన మెసేజ్‌లో పేర్కొన్నారు.

విడుదల చేసిన పత్రాల్లోని ఆధారాలు, ఫైల్స్ కొంతమంది సందేహాజీవుల్ని సంతృప్తి పరచలేవని లొపెరెనా చెప్పారు.

"ప్రతీదాన్ని వ్యతిరేకించేవారు ఎప్పుడూ ఉంటారు. వీటిని అర్థం చేసుకోలేని వాళ్లు కొందరుంటే, వీటికి ఆధారాలు కావాలని అడిగేవాళ్లు మరి కొందరు ఉంటారు" అని ఆమె అన్నారు.

యూఎఫ్ఓల గురించి త్వరలో మరింత స్పష్టమైన, కచ్చితమైన ఆధారం లభిస్తుందని ఆమెతో పాటు మరికొందరు ఆశతో ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)