ఇరాన్ నుంచి అమెరికా అసలు ఏం కోరుకుంటోంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఎనా ఫాగే
- హోదా, బీబీసీ ప్రతినిధి, వాషింగ్టన్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
హార్ముజ్ జలసంధి తెరిచే ఉందని ఇరాన్ బహిరంగంగా ప్రకటించాలని, అలాగే వాణిజ్య నౌకలపై కాల్పులు ఆపేస్తామని హామీ ఇవ్వాలని అమెరికా కోరుతుంది.
నౌకలపై కాల్పులు జరపడం పొరపాటు అని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సలహాదారులతో ఇరాన్ రహస్యంగా అంగీకరించిందంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులను ఉటంకిస్తూ అమెరికా మీడియా పేర్కొంది.
అయితే, దీనికి కారణం తమ నియంత్రణలో లేని తిరుగుబాటు గ్రూప్‌లలో ఒక దాని పని అని ఇరాన్ పేర్కొన్నట్లు నివేదికలు చెప్పాయి.
హార్ముజ్ జలసంధి విషయంలో ఈ వారం జరిగిన ఘర్షణలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వాషింగ్టన్ పేర్కొన్నప్పటికీ.. ఇరువర్గాలు చర్చలు కొనసాగించేందుకు అంగీకరించాయని ట్రంప్ చెప్పారు.

‘ఇరాన్ తప్పును ఒప్పుకోవాలి, లేదంటే పర్యవసానాలను ఎదుర్కోవాలి’
జూన్ నెలలో అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం కింద, వాణిజ్య నౌకలు ప్రయాణించేందుకు సురక్షిత మార్గాన్ని కల్పించడానికి కూడా ఇరాన్ అంగీకరించింది.
వాణిజ్య నౌకలపై కాల్పులు జరపడం ద్వారా తప్పుడు మార్గంలో పయనించే ఒక వర్గం (తీవ్రవాద బృందం) చర్చలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఇరాన్ చెప్పినట్లు, సీనియర్ అమెరికా అధికారులు బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్‌కు తెలిపారు.
"ఆ తర్వాత వారు (ఇరానియన్లు) చర్చల వద్దకు తిరిగి వచ్చి, 'మేం తప్పు చేశాం. చర్చలను కొనసాగిద్దాం' అని చెప్పారు" అని ఒక అధికారి సీబీఎస్ న్యూస్‌కు చెప్పారు.
శుక్రవారం రిపోర్టర్లతో జరిగిన సమావేశంలో.. హార్ముజ్ జలసంధి తెరిచే ఉందని, వాణిజ్య నౌకలపై కాల్పులు నిలిపివేస్తున్నట్లు తెలుపుతూ ఒక ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ నాయకత్వానికి ఒక సందేశం పంపినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
ఈ సమాచారాన్ని చాలా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
''ఇరానియన్లు ఈ ప్రకటన చేయాలి.. లేదంటే వారు ఎదుర్కోబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి'' అని అమెరికా అధికారులు అన్నట్లు రాయిటర్స్ పేర్కొంది.
అలాగే, నౌకలపై దాడి చేయడం తమ తప్పని ఇరాన్ బహిరంగంగా ఒప్పుకోవాలని వైట్‌హౌస్ కూడా కోరుకుంటోందని సీబీఎస్ రిపోర్టు తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఒమన్‌లో జరిగే చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియోతో పాటు, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్తో సహా మధ్యప్రాచ్య చర్చలలో ఇద్దరు కీలకమైన వ్యక్తులు నేతృత్వం వహిస్తారు.
ఇదిలా ఉండగా, ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలను సులభతరం చేయడంపై చర్చించేందుకు ఖతార్ ప్రతినిధి బృందం శుక్రవారమే ఇరాన్‌కు చేరుకుంది.
"మన చర్చలను కొనసాగించాలని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అభ్యర్థించింది" అని ట్రంప్ శుక్రవారం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
"మేం దీనికి అంగీకరించాం, కానీ కాల్పుల విరమణ ఇప్పుడు ముగిసిందని అమెరికా వారికి పూర్తి స్పష్టంగా చెప్పింది" అని తెలిపారు.
గతవారం మొదట్లో గల్ఫ్ ప్రాంతంలో ఘర్షణలు మొదలైన తర్వాత శుక్రవారం కొత్తగా ఎలాంటి దాడులు జరగలేదు.
జూన్‌లో రెండు దేశాల మధ్య మధ్యంతర ఒప్పందంపై సంతకాలు జరిగినప్పటి నుంచి అమెరికా, ఇరాన్ మధ్యలో అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణగా గతవారం మొదట్లో జరిగిన ఘర్షణలు నిలిచాయి.
అమెరికా సిఫార్సు చేసిన సముద్ర మార్గంలో ఒమన్‌కు వెళ్తున్న మూడు నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు.
తమ జలాలలోంచి వెళ్లే ప్రత్యేక మార్గమే ఏకైక 'సురక్షిత' మార్గమని ఇరాన్ పదేపదే చెబుతోంది.
ఒప్పందంలో హార్ముజ్ భవితవ్యం
కాల్పుల విరమణను కొనసాగించే లక్ష్యంతో, అన్ని చోట్లా ఈ సంక్షోభాన్ని ముగించే ఉద్దేశ్యంతో అమెరికా-ఇరాన్ మధ్య గత నెలలో 14 పాయింట్ల ఎంఓయూ కుదిరినప్పుడు ఈ చర్చలలో కాస్త పురోగతి కనిపించింది.
ఈ ఒప్పందం కింద.. హార్ముజ్ జలసంధి భవిష్యత్‌ను నిర్ణయించేందుకు, సముద్ర రవాణా సేవలకు కావాల్సిన ఏర్పాట్లకు ఇతర గల్ఫ్ దేశాలతో ఇరాన్, ఒమన్‌లు చర్చలు జరపాల్సి ఉంది.
సంఘర్షణ సమయంలో, హార్ముజ్ జలసంధిపై తన సార్వభౌమాధికారాన్ని నొక్కి చెప్పడానికి ఇరాన్ ప్రయత్నించింది.
దీని కింద, అది "పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ"ని స్థాపించి, "సురక్షిత ప్రయాణ అనుమతులు" జారీ చేస్తామని పేర్కొంది.
అమెరికాతో కుదిరిన కొత్త ఒప్పందం ప్రకారం, హార్ముజ్ జలసంధిని చివరికి ఇరాన్, ఒమన్‌ల సమన్వయంతో నిర్వహిస్తారని ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ నివేదించింది.
ఈ జలమార్గంలో ప్రయాణించే ఓడలపై విధించే "సేవా రుసుము" కూడా ఇందులో చేర్చే అవకాశం ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























