‘స్థానిక భాష నేర్చుకోవాల్సిందే’: ఆటో, టాక్సీ డ్రైవర్లకు నేర్చుకునే గడువును ఏడాదిపాటు పెంచిన మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్ర, మరాఠీ, డ్రైవర్లు, స్థానిక భాష

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, అల్పేష్ కర్కారే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

స్థానిక భాషను నేర్చుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ తెచ్చిన కొత్త నిబంధన నిరసనలకు దారితీయడంతో, టాక్సీ డ్రైవర్లకు, ఆటో-రిక్షా డ్రైవర్లకు మరో ఏడాది గడువు ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం.

మహారాష్ట్రలోని రవాణా అధికారులు ఆగస్టు 20న రాష్ట్ర అధికారిక భాష మరాఠీలో డ్రైవర్లు ప్రజలతో చిన్నచిన్న విషయాల గురించి మాట్లాడగలుగుతున్నారా లేదా అన్నదాన్ని టెస్ట్ చేసి చూశారు.

ఈ పరీక్షలో విఫలమైన వారికి భాష నేర్చుకునేందుకు ఒక నెల గడువు ఇచ్చారు. అప్పటికీ రాకపోతే, వారి లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా రద్దు చేయడం వంటి పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

డ్రైవర్లకు, ప్రయాణికులకు మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచేందుకు, సురక్షితమైన ప్రయాణాల కోసం ఈ నిబంధన తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

కానీ, ఈ నిబంధనపై డ్రైవర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మరాఠీని నేర్చుకుంటున్న డ్రైవర్లు తమ జీవనోపాధిని కోల్పోకూడదని ఆ సంఘం వాదించింది. పని కోసం చాలామంది డ్రైవర్లు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు వలస వచ్చారు. వారిలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వారూ ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నిరసనల నేపథ్యంలో డ్రైవర్లు మరాఠీ నేర్చుకోవడానికి మరో ఏడాది గడువు ఇస్తున్నట్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ గతవారం ప్రకటించారు. ఈ డ్రైవర్లలో చాలామంది ఏళ్ల తరబడి విద్యా వ్యవస్థకు దూరంగా ఉండిపోయారని, వారికి మరింత సమయం అవసరమని చెప్పారు. ఈ ఏడాది సమయంలో డ్రైవర్లు మరాఠీ నేర్చుకుంటారని ఆశిస్తున్నామని, ఆ తర్వాత మరింత గడువు ఉండదని రాష్ట్ర రవాణా మంత్రి ప్రతీప్ సార్నాయక్ తెలిపారు.

మహారాష్ట్రలో సుమారు 9,79,000 ఆటో-రిక్షాలకు, టాక్సీలకు పర్మిట్లు ఉన్నాయి. వాటిలో సగం ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఈ పొడిగింపు, ఉపాధిని కోల్పోతామేమోనని ఆందోళన చెందిన డ్రైవర్లకు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.

''మా లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తే ఎలా అని మేం భయపడ్డాం. మా రోజువారీ ఆదాయం ప్రభావితమవుతుంది కదా అని ఆందోళనకు గురయ్యాం. ఇప్పుడు మాకు కాస్త ఉపశమనంగా ఉంది'' అని ముంబయికి చెందిన టాక్సీ డ్రైవర్ లక్ష్మణ్ పాండే అన్నారు.

మహారాష్ట్ర, మరాఠీ, డ్రైవర్లు, స్థానిక భాష

ఫొటో సోర్స్, Getty Images

అయితే, భాష, వలసలు, ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు దశాబ్దాలుగా రాజకీయాలను ప్రభావితం చేస్తూ వస్తున్న మహారాష్ట్రలో ఈ వివాదం మళ్లీ పాత చర్చను తెరపైకి తెచ్చింది.

''ఈ అంశం కేవలం డ్రైవర్లకు, ప్రయాణికులకు మధ్య కమ్యూనికేషన్‌కు సంబంధించినదే కాదు. ఇది మరాఠీ ఐడెంటిటీ, వలస, ఉపాధికి సంబంధించినది'' అని జర్నలిస్టు, రచయిత, రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్ అకోల్కర్ అన్నారు.

ఆ ఉద్రిక్తతలు మహారాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచే ఉన్నాయి. మరాఠీ మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని సాగించిన సుదీర్ఘ పోరాటం తర్వాత, 1960లో ఈ రాష్ట్రం ఏర్పడింది.

భారత ఆర్థిక కేంద్రంగా ముంబయి అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. ఉపాధి వెతుక్కుంటూ దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వలసదారులను తరతరాలుగా అది ఆకర్షించింది.

మరాఠీ మాట్లాడే వారికి ఉద్యోగాలు, అవకాశాల గురించిన వాదనలతో భాష అంతకంతకూ పెనవేసుకుపోయింది. వలసదారుల వల్ల మరాఠీ మాట్లాడేవారు ఉద్యోగాలు కోల్పోతున్నారని వాదిస్తూ.. మరాఠీ జాతీయవాదంలో బలపడిన ప్రాంతీయ రాజకీయ పార్టీ శివసేన, "సన్స్ ఫర్ సాయిల్" అనే నినాదంతో 1966లో ఏర్పాటైంది.

మహారాష్ట్రలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తులలో ఒకటిగా ఇది ఎదిగింది. మరాఠీ అస్తిత్వం ఈ పార్టీ ప్రధానాకర్షణలో ఒకటి.

ప్రస్తుతం మహారాష్ట్రలో ఫడణవీస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ, 2022లో చీలిపోయిన శివసేనలోని ఒక వర్గం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలో ఉన్నాయి. మరొక ప్రాంతీయ పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కూడా మరాఠీ ప్రయోజనాల కోసం గళమెత్తింది.

ఒక రాష్ట్రానికి వలస వెళ్లే వారు అక్కడి స్థానిక భాషను కొంతవరకు నేర్చుకోవాలని ఆశించడం సహేతుకమేనని అకోల్కర్ అన్నారు. కానీ ఆయన దానికి, దాని చుట్టూ జరిగే రాజకీయాలకు మధ్య ఒక వ్యత్యాసం ఉందన్నారు.

''రాజకీయ పార్టీలు భాష విషయంలో చూపే తీవ్రతను సాధారణ ప్రజలు ఎప్పుడూ ప్రదర్శించరు'' అని చెప్పారు. రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నప్పుడు పార్టీలు తరచూ ఈ అంశాన్ని లేవనెత్తుతుంటాయని అన్నారు.

మరాఠీ భాషను ప్రమోట్ చేసే మరాఠీ అభ్యాస్ కేంద్ర అధ్యక్షుడు, రాజకీయ విశ్లేషకుడు దీపక్ పవార్.. ఈ విషయంలో తన వాదనను వినిపించారు.

‘‘ఏళ్ల తరబడి మహారాష్ట్రలో ఉంటున్న వ్యక్తులకు మరాఠీ భాష విషయంలో కనీసం బేసిక్ నాలెడ్జ్‌ అయినా ఉండాలి’’ అని దీపక్ పవార్ అన్నారు.

ఒక రాష్ట్రంలో చాలాకాలంగా నివసిస్తూ, అక్కడ పనిచేస్తూ స్థానిక భాషను నేర్చుకోవడానికి నిరాకరించడం "భాషాపరమైన అహంకారం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

కర్ణాటకతో సహా ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి భాషా పరమైన ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. చాలామంది వలసదారులు హిందీ లేదా ఇంగ్లిష్‌ సాయంతో నెగ్గుకు రాగలమని నమ్ముతుండటంతో, తమ స్థానిక భాష కన్నడ ప్రాముఖ్యత కోల్పోతోందని భాషాభిమానులు భయపడుతున్నారు.

డ్రైవర్లు మరాఠీ చదవడం, రాయడం, లేదా అనర్గళంగా మాట్లాడటం లాంటివి చేయాల్సిన పని లేదని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

రాష్ట్ర మోటార్ వెహికల్ నిబంధనలలో చేసిన మార్పుల ప్రకారం, వారికి ఆ భాషపై "ప్రాథమిక పరిజ్ఞానం" ఉంటే చాలంటోంది.

పని సమయంలో డ్రైవర్లకు అవసరం పడే మరాఠీ పదాలను, వాక్యాలను నేర్పించేందుకు ప్రభుత్వం అధికారిక తరగతులను నిర్వహిస్తోంది. ప్రయాణికులు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అడగడం, ధరను చర్చించడం లేదా దారి చెప్పడం వంటివి మరాఠీ భాషలో నేర్పిస్తోంది.

సుమారు 1,66,000 మంది డ్రైవర్లు ఈ శిక్షణను పూర్తి చేశారు. మౌఖిక పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర రవాణా విభాగం తెలిపింది. దీనిని నేర్చుకున్న వారిలో 58 ఏళ్ల ఆటో-రిక్షా డ్రైవర్ మునావర్ షేఖ్ ఒకరు.

ముంబయి సమీపంలోని థానేలో ఉన్న ఒక శిక్షణా కేంద్రంలో నాలుగు రోజుల పాటు, ఆయన, ఇతర డ్రైవర్లు తరచూ ఉపయోగించే 16 ప్రశ్నలను, వాక్యాలను నేర్చుకున్నారు.

వీటిలో ‘మీరు ఎక్కడికి వెళ్లాలి?’, ‘ఆందోళన చెందకండి’, ‘మీటర్ ప్రకారమే చార్జీ ఉంటుంది’ వంటివి ఉన్నాయి.

చివరికి వారు మౌఖిక పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో పాసైనవారికి సర్టిఫికేట్ వస్తుంది. తనిఖీ సమయంలో రవాణా అధికారులకు ఈ సర్టిఫికేట్‌ను చూపించవచ్చు.

ప్రయాణికులతో ప్రాథమిక సంభాషణలు జరపడానికి సరిపడా మరాఠీని ఆ కోర్సు తనకు నేర్పించిందని షేఖ్ చెప్పారు. కానీ, కొంతమంది డ్రైవర్లకు నేర్చుకోవడానికి సమయం దొరకడం లేదని ఆయన అన్నారు.

మహారాష్ట్ర, మరాఠీ, డ్రైవర్లు, స్థానిక భాష

ఫొటో సోర్స్, Getty Images

ముంబయిలోని టాక్సీ డ్రైవర్ అజయ్ సింగ్‌కు మరాఠీ నేర్చుకోవాలని ఉంది. కానీ, రోజంతా వర్క్ చేయడం వల్ల ఈ క్లాస్‌లకు వెళ్లడానికి సమయం దొరకడం లేదు.

''పొద్దున లేచిన దగ్గర్నుంచి, అర్ధరాత్రి వరకు మేం డ్రైవ్ చేయాలి. లేదంటే, మాకు తినడానికి తిండి ఉండదు'' అని చెప్పారు. ''రోజులో కొన్ని గంటలు ఈ క్లాస్‌లకు వెళ్తే.. నాకు ఆర్థికంగా కష్టమవుతుంది'' అన్నారు.

సింగ్ రోజుకు రూ.1500 నుంచి రూ.2000 మధ్యలో సంపాదిస్తున్నారు. కొన్ని రోజులు ఆదాయం కోల్పోయినా.. అద్దె చెల్లించడానికి, పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించడానికి కష్టమవుతుందని భయపడుతున్నారు.

దానికి బదులుగా, ఆయన పని చేస్తూనే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మరాఠీ రేడియో స్టేషన్లను వినడం, మరాఠీ మాట్లాడే ప్రయాణికులతో మాటలు ప్రాక్టీస్ చేయడం వంటివి చేస్తున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన ఏడాది అదనపు గడువు ఎంతో విలువైనదని లఖన్ పాండే అనే మరో డ్రైవర్ అన్నారు. మరాఠీ నేర్చుకోవడాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, దానికి తగినంత సమయం మాత్రమే కోరుకున్నానని ఆయన చెప్పారు.

"మేం ఇక్కడే నివసిస్తున్నాం, ఇక్కడే పనిచేస్తున్నాం. కాబట్టి కచ్చితంగా మరాఠీ నేర్చుకోవాలి" అని ఆయన అన్నారు.

"మా జీవనోపాధికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా, దాన్ని నేర్చుకోవడానికి మాకు తగిన సమయం ఇవ్వండి" అని కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)